శ్రీకాకుళం

రాజీయే రాజమార్గం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, ఫిబ్రవరి 11: రాజీ మార్గమే రాజమార్గమని జిల్లా కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం పేర్కొన్నారు. శనివారం జాతీయ లోక్‌అదాలత్ సందర్భంగా జిల్లా కోర్టులో లోక్‌అదాలత్‌కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారతప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యవస్థపై ఆధారపడి ఉందన్నారు. సామాన్యునికి సమన్యాయాన్ని కోర్టులు న్యాయవ్యవస్థ ద్వారా అందిస్తాయని తెలిపారు. కోర్టు కేసులు న్యాయాన్ని అందించడంలో చాలా జాప్యంతో 1986లో అల్డర్నేట్ డిప్యూట్ రిసల్యూషన్ చేశారని తెలిపారు. ఇరువర్గాల అంగీకార ఆమోదంతో పరిష్కారం చౌకగా ఖర్చురహితంగా నేషనల్ లోక్ అదాలత్ న్యాయాన్ని అందిస్తోందన్నారు. దీంతో సమయం ఖర్చు ఆదా అవుతాయని తెలిపారు. జిల్లా జడ్జి వి.బి నిర్మలగీతాంబ మాట్లాడుతూ ఈ లోక్‌అదాలత్‌లో ఎక్కువ కేసులను పరిష్కరించుకోవడానికి అన్ని కోర్టుల్లో బెంచ్‌లు ఏర్పాటు చేశామని తెలిపారు. ఇరువర్గాలు స్వచ్ఛందంగా వస్తే రాజీపడటమే మంచిమార్గమని తెలిపారు. కోర్టు ఫీజు కూడా వారికి ఇస్తామన్నారు. ఈ జడ్జిమెంట్ సవిల్ డిక్రీతో సమానమని తెలిపారు. ఎస్పీ జె.బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ లోక్‌అదాలత్ ద్వారా మున్ముందు ఎటువంటి సమస్యలు ఏర్పడవని తెలిపారు. గ్రామాల్లో శాంతి నెలకొని జిల్లాలో ప్రశాంత వాతావరణంతో విలసిల్లుతుందని తెలిపారు. కాబట్టి పట్టుదలను మానుకొని రాజీపడాలని సూచించారు. అనంతరం లారీ ప్రమాదంలో తలదెబ్బతిన్న బడియా దినేష్‌కుమార్‌కు హెచ్‌డిఎఫ్‌సి కంపెనీ నుండి ఇన్సూరెన్స్ కింద 4లక్షల రూపాయలు అందించి లోక్‌అదాలత్‌లో లారీయజమాని, దినేష్‌కుమార్‌లు రాజీ కుదుర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ మెంబర్ పివి రమణారావు, అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి పి రాజేంద్రప్రసాద్, సిట్టింగ్ జడ్జిలు వై శ్రీనివాసరావు, కె నాగమణి, అడ్వకేట్ మెంబర్ సరళకుమారి, మంత్రి వెంకటస్వామి, పారాలీగల్ వాలంటీర్స్ పాల్గొన్నారు.
తమిళనాడులో రాజకీయ అస్థిరతకు
కేంద్రమే కారణం
* సిపిఐ కార్యదర్శి నారాయణ
పలాస, ఫిబ్రవరి 11: తమిళనాడులో రాజకీయ అస్థిరతకు కారణం కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వమేనని సిపిఐ జాతీయ నాయకుడు నారాయణ ధ్వజమెత్తారు. శనివారం మండలంలోని కంబిరిగాం భూపోరాట విజయోత్సవాల్లో భాగంగా కంబిరిగాం పరిసరాలను పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడారు. ఇప్పటి వరకు ప్రజాస్వామ్యంలో తమిళనాడులో జరుగుతున్న సంఘటనలు ఎప్పుడూ చూడలేదని, ఇందుకు అక్కడి గవర్నర్‌ను కేంద్ర ప్రభుత్వం పావుగా వాడుకొని రాజకీయ అస్థిరతకు పాల్పడుతోందన్నారు. గవర్నర్ విద్యాసాగర్ న్యాయనిపుణుడు అని, ఎంతో రాజకీయ పరిణితి వున్న వ్యక్తి అని తెలిపారు. కంబిరిగాం జమీందారీ భూములకు ఇనామ్ చట్టం కాకుండా ల్యాండ్ సీలింగ్ చట్టపరిధిలోకి తీసుకువచ్చి సాగు చేసిన రైతులకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఇందుకు జమీందారీపై చీటింగ్ కేసు నమోదు చేయాలన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన కోర్టును తప్పుడుద్రోవ పట్టిస్తున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులు నుంచి భూములను బలవంతంగా లాక్కోవడం పెద్ద తప్పిదమని, దీనిని అడ్డుకుంటే కమ్యూనిస్టులు అభివృద్ధికి నిరోధికులు అని చెప్పడం హాస్యాస్పదమన్నారు. భూసేకరణ చట్టంలో భాగంగా సారవంతమైన భూములను రైతులకే విడిచిపెట్టాలని డిమాండ్ చేసారు. శ్రీకాకుళం జిల్లాలో పచ్చనిపొలాలను చూసి ప్రభుత్వాలు కళ్లులో నిప్పులు పోసుకొని కార్పొరేట్ వ్యక్తులకు అంటగట్టేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. అనంతరం కంబిరిగాం భూములను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.వి.సత్యానారాయణమూర్తి,జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, జిల్లా రైతు సంఘం నాయకులు చాపర సుందరలాల్, వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు వెంకటరావు, ఎ ఐ వై ఎఫ్ జిల్లా కార్యదర్శి ఎం.యుగంధర్, వెంకటరావు, బమ్మిడి సంతోష్, కేదారిపురం సర్పంచ్ ఫల్గుణరావు, రైతులు పాల్గొన్నారు.

సిక్కోలుకు బాస్ లోకేష్!

అస్త్తవ్యస్తంగా పార్టీ కార్యకలాపాలు
అధిష్ఠానానికి నివేదికలు
టిడిపి హైకమాండ్ సీరియస్
(ఆంధ్రభూమి బ్యూరో -శ్రీకాకుళం),
క్రమశిక్షణకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచి కేడర్‌లో ఆత్మస్థైర్యం నింపే టిడిపి కార్యకలాపాలు జిల్లాలో అస్తవ్యస్తంగా మారాయి. ప్రభుత్వంలో ఉన్న ఈ పార్టీ ముఖ్యనేతలు కూడా ఎవరికి వారే యమునాతీరు అన్న చందంగా జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించకపోవడంతో చంద్రబాబు పనితీరు బూడిదలో పోసిన పన్నీరు మాదిరిగా తయారైందని ఆ పార్టీ నేతలు బహిరంగంగా విమర్శిస్తున్నారు. పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్న నేతలు ఎమ్మెల్యేలు, మంత్రులుగా పదవులు పొందేసరికి పార్టీ కేడర్‌ను విస్మరించేలా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లాపై ఉన్న మమకారంతో కింజరాపు కుటుంబానికి మంత్రి, ఎంపి వంటి కీలక పదవులు అప్పగించగా కిమిడి కుటుంబాన్ని కూడా అగౌరవపర్చకుండా పొరుగు జిల్లాలో మంత్రి నందమూరి-నారా కుటుంబాల తరువాత ఆ పార్టీ అధ్యక్షపీఠాన్ని ఎచ్చెర్ల ఎమ్మెల్యే కళావెంకటరావుకు అప్పగించించిన విషయం తెలిసిందే. ఇంతటి ఉన్నతిని పొందిన నేతలు కలసి జిల్లా సమస్యలపై ఏ రోజూ సమీక్షించిన దాఖలాలు లేవనే చెప్పాలి. దీని ప్రతిఫలమే వంశదార ఫేజ్-2, స్టేజ్-2 పనులకు ఆటంకంగా మారడం నిర్వాసితులు రచ్చకు దిగడం సాక్షాత్తు సీఎం చంద్రబాబు క్షమాపణ కూడా చెప్పిన విషయాన్ని తమ్ముళ్లు గుర్తు చేస్తున్నారు. వంశదార నిర్వాసితుల సమస్య తీవ్రరూపం దాల్చడానికి మంత్రి అచ్చెన్న, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కళాయే కారణమని భావించి వీరిద్దరిపై సీరియస్ అయిన విషయం నేటికీ ఆ పార్టీలో చర్చ కొనసాగుతుంది. ఇదిలా ఉండగా జిల్లాలో పార్టీ కార్యకలాపాలు కూడా అధ్వాన్నంగా ఉన్నాయని జూనియర్‌గా ఉన్న పార్టీ జిల్లా అధ్యక్షురాలు గౌతుశిరీష సమర్థవంతంగా నిర్వహించలేకపోతున్నారన్న విషయాన్ని ఆలస్యంగా అధిష్ఠానం దృష్టికి వచ్చినట్లు సమాచారం. ప్రభుత్వ పనితీరు, పార్టీ పరిస్థితిపై ఇటీవలి టిడిపి కేంద్ర పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ప్రైవేటు ఇంటలిజెన్స్ ద్వారా శ్రీకాకుళం తాజా రాజకీయ పరిణామాలపై నివేదికలు తెప్పించుకున్నట్లు భోగట్టా. ఇక్కడ ప్రతికూల పరిస్థితులు చక్కదిద్దేందుకు చర్యలు తీసుకోకుంటే భవిష్యత్‌లో గొప్ప నష్టం జరిగే ప్రమాదం పొంచి ఉందని లోకేష్ రంగంలో దిగి పార్టీ పూర్వవైభవానికి వేగం పెంచినట్లు వినికిడి. టెక్కలి నియోజకవర్గ కేంద్రంలో కొంతమంది కేడర్ మంత్రి అచ్చెన్న మోనార్ఖులా వ్యవహరిస్తున్నారని రహస్య సమావేశాలు ఏర్పాటు చేసి సొంత అజెండాను అమలు చేసే పనిలో ఉండటం అధిష్ఠానం దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది. ఎచ్చెర్ల ఎమ్మెల్యే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కిమిడి కళావెంకటరావు నియోజకవర్గానికి దూరంగా ఉండటం వలన కేడర్, కార్యకర్తలు అసంతృప్తికి లోనౌతున్నట్లు నివేదికల్లో తేటతెల్లమైనట్లు విశ్వసనీయంగా తెలిసింది. కళా కొంతమందికి బాధ్యతలు అప్పగించడం వలన అనేకమంది వ్యతిరేకంగా ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు అమరావతికి సమాచారం అందించినట్లు విశ్వశనీయ వర్గాల భోగట్టా. సీనియర్ ఎమ్మెల్యే గౌతు శ్యాంసుందరశివాజీ, పలాస మున్సిపల్ చైర్మన్ కోత పూర్ణచంద్రరావుల మధ్య ప్రచ్ఛన్నయుద్ధం కొనసాగడమే కాకుండా వివాదాలు తారాస్థాయికి చేరినట్లు నివేదికలు తేటతెల్లం చేయడంతో చైర్మన్‌తో భేటి అయి అక్కడ పరిస్థితులను యువనేత తెలుసుకున్నట్లు సమాచారం. ఇచ్ఛాపురం ఎమ్మెల్యే అశోక్ జూనియర్ కావడంతో సోంపేట సొంత మండలం శివాజీ కావడం వలన ఈయన జోక్యం మితుమీరుతోందని అధిష్ఠానం వద్ద నివేదికలు ఉన్నట్లు తెలుస్తోంది. పాలకొండ నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలు తారాస్థాయికి చేరుకున్న విషయం అందరికీ తెలిసిందే. శ్రీకాకుళం నియోజకవర్గం విషయానికొస్తే ఎం.పి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అనుచరులను ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి పక్కన పెడుతున్నారన్న నిజాలు నివేదికల రూపంలో అధిష్ఠానానికి అందినట్లు భోగట్టా. నరసన్నపేట నియోజకవర్గం ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి కేడర్‌ను పక్కన పెట్టి విపక్ష నేతలకు పనులు చేస్తున్నారని ఇటువంటి క్రమశిక్షణా రాహిత్య చర్యలను పార్టీ పెద్దలు చక్కదిద్దడంలో వెనుకబడ్డారు. ఇందుకు భిన్నంగా పాతపట్నం నియోజవర్గం లేదు. అక్కడ కూడా ఇటీవల పార్టీలోనికి వచ్చిన కలమట వెంకటరమణ ఆదినుంచి జెండాను నమ్ముకుని ఉన్న కేడర్ మధ్య అంతరాలు కొనసాగుతూ వస్తున్నట్లు ఇంటలిజెన్స్ వర్గాలు ఇచ్చిన నివేదికలు స్పష్టంచేస్తున్నట్లు తెలిసింది. రాజాం నియోజకవర్గం ఇంఛార్జ్‌గా వ్యవహరిస్తున్న ఎమ్మెల్సీ కావలి ప్రతిభాభారతి సీనియర్ అయినప్పటికీ అక్కడ కేడర్ కొంతమంది కళా పంచన చేరి గ్రూపు రాజకీయాలు నెరుపుతున్నారని వాస్తవాలు నివేదికల రూపంలో అధినాయకత్వానికి చేరాయి. ఇటువంటి పరిస్థితులను చక్కదిద్దకుంటే త్వరలో జరగనున్న శ్రీకాకుళం కార్పొరేషన్ , రాజాం మున్సిపల్ ఎన్నికలలో అధికార పార్టీకి ప్రతికూల ఫలితాలు ఉంటాయని హైకమాండ్ భావిస్తోంది. శ్రీకాకుళం టిడిపిలో గ్రూపు రాజకీయాలు సద్దుమనిగేలా పార్టీ, ప్రభుత్వ ఇమేజ్‌ను పెంచేలా యువనేత లోకేష్ ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇక్కడ నేతల సొంత అజెండాలు పక్కన పెట్టి అభివృద్ధే లక్ష్యంగా సమిష్ఠిగా ముందుకు సాగడమే ప్రధానాంశంగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకొని వాటికి అనుగుణంగా నాయకుల అభిప్రాయాలు తీసుకొని పార్టీ బలోపేతానికి సరికొత్త నిర్ణయాలు తీసుకునే విధంగా లోకేష్‌బాబు ఇక్కడ నేతలపై దృష్టి పెట్టినట్లు సమాచారం. ఇదే జరిగితే ఇక్కడ ముఖ్యనేతలు డమీగా మారడం ఖాయం.
అన్నదమ్ముల మధ్య భూ తగాదా
*తుపాకీతో ఒకరి కాల్చివేత
*బాధితుని పరిస్థితి విషమం
ఆమదాలవలస, ఫిబ్రవరి 11: మండలంలోని గాజులకొల్లివలస పంచాయతీ, సంగమైకొండ దిగువ నివసిస్తున్న గేదల హరికృష్ణపై హత్యాయత్నం జరిగింది. శనివారం రాత్రి సుమారు తొమ్మిది గంటల ప్రాంతంలో హరికృష్ణ పెద్దనాన్న కొడుకు, బిఎస్‌ఎఫ్ కానిస్టేబుల్ అయిన సూర్యనారాయణ హరికృష్ణపై తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో హరికృష్ణ తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు అందించిన వివరాలివి. సైలాడ గ్రామంలో ఉన్న సుమారు రెండెకరాల పంట భూమికి సంబంధించి ఇరువురి అన్నదమ్ముల మధ్య వివాదం ఉంది. ఇది చినికి చినికి గాలివానగా మారి ఘర్షణకు దారితీసింది. మార్కెట్‌కు వెళ్ళిన హరికృష్ణ ఇంటికి తిరిగివస్తుండగా, మార్గమధ్యలో మాటువేసిన సూర్యనారాయణ తుపాకీతో ఒక్కసారిగా హరికృష్ణపై కాల్పులు జరిపాడు. దీంతో హరికృష్ణ తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుని స్థానికులు ఆస్పపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని, నిందితుడు పరారీలో ఉన్నాడని ఎస్‌ఐ వాసుదేవరావు విలేఖర్లకు తెలిపారు.
వేగవంతంగా ఉపాధి పనులు
మార్చి మాసాంతానికి
2.5లక్షల మందికి పనులు కల్పించాలి
కలెక్టర్ లక్ష్మీనృసింహం

ఎచ్చెర్ల, ఫిబ్రవరి 11: ఉపాధి హామీ పథకం పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పి లక్ష్మీనృసింహం ఆదేశించారు. అల్లినగరం గ్రామంలో ఉపాధి హామీ పనులను శనివారం ఆయన పరిశీలించి జాబ్‌కార్డుదారులను ఎంత వేతనం వస్తోందని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం 152 రూపాయలు రోజువారీ చెల్లిస్తున్నామని అయితే 190 రూపాయలకు ప్రభుత్వం పెంచిందని ఈ మొత్తం గిట్టుబాటయ్యేలా పనులు జరిపించాలని ఆదేశించారు. జిల్లాలో ఫిబ్రవరి 15 నాటికి 1.50లక్షల మందికి ఉపాధి పనులు కల్పించాలని లక్ష్యంగా నిర్ణయించామన్నారు. మార్చి మాసాంతానికి 2.50లక్షల మందికి తక్కువ లేకుండా పనులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎచ్చెర్ల మండలంలో ప్రస్తుతం 2200మంది పనిచేస్తున్నట్లు డుమా ఏపిడి పంచాది రాధ కలెక్టర్‌కు తెలిపారు. ఈనెల 15 నాటికి 6వేల మంది పనుల్లో ఉండే విధంగా వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పనులు చేసిన చోట ప్రథమ చికిత్సకిట్టు, తాగునీరుతోపాటు టెంట్లు ఏర్పాటు చేయాలన్నారు. పనివేళలు మార్చి ఉదయం 7గంటల నుండి 10గంటల వరకు మధ్యాహ్నం 4 నుండి 7గంటల వరకు పనులు జరిపించాలని సూచించారు. ఎచ్చెర్ల, రణస్థలం మండలాల్లో భూగర్భజలాలు అడుగంటిపోవడం వలన పంటసంజీవినీలు నిర్మించాలని ఇందుకు తగిన విధంగా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఎంపిడివో మిశ్రో, ఏపివో సత్యన్నారాయణ, ఏఇ సురేష్, మాజీ సర్పంచ్ మాడుగుల మురళీధరబాబా, సర్పంచ్ బాషా అమ్మాజీ, ఉరిటి భార్గవప్రసాద్ తదితరులు ఉన్నారు.

సహస్ర పుస్తక ఆవిష్కరణకర్త
కారా మాస్టారుకు ఘన సన్మానం
ఆంధ్రభూమి బ్యూరో
శ్రీకాకుళం, ఫిబ్రవరి 11: సహస్ర పుస్తక ఆవిష్కరణ కర్తగా కారామాస్టారును అభివర్ణిస్తూ దుస్సాలువాతో సన్మానించారు. నగరంలోని విశాఖ ఏ కాలనీలోని కథానిలయం 20వ వార్షికోత్సవం సందర్భంగా శనివారం స్వీయ పరిచయాలు ఈదురు సుబ్బయ్య సాహితీపీఠం, నెల్లూరివారిచే కాళీపట్నం రామారావు మాస్టారును సత్కరించారు. అనంతరం అతిథులతో ఇష్టాగోష్టి నిర్వహించారు. కొండవలస శ్రీనివాసరావు రచించిన రేలువీడని నక్షత్రం కథాసంపుటి, కలిప్రభావం వ్యాససంకలనం, సర్వోదయ నవల, పాలకొల్లు రామలింగస్వామి రచించిన కౌకు దెబ్బలు కథాసంపుటిని కారామాస్టారు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్‌వి కథారచయిత గంగరాజు, దాసరి రామచంద్రరావు, రవీంద్ర, డాక్టర్ వివిఏ రామారావునాయుడు, మధురాంతకం నరేంద్ర, విమల, శ్రీవిరించి రచయితలు, కవులు, సాహిత్య అభిమానులు పాల్గొన్నారు. ఈసందర్భంగా కారామాస్టారు మాట్లాడుతూ కథానిలయం ఏర్పాటు చేసి 20 సంవత్సరాలు పూర్తయిందని 800 పుస్తకాలతో ప్రారంభమైన కథానిలయంలో లెక్కలేనన్ని పుస్తకాలు ఉన్నాయని తెలియజేశారు. మహానుభావులు రాసిన కథలు కథానిలయంలో ఉన్నట్లు తెలియజేశారు. అందరి సహకారంతో ఈ కథానిలయం అభివృద్ధి చెందిందని తెలుగు కథ రాసే ప్రతీవారు ఈ కథానిలయంపై దృష్టి సారిస్తారన్నారు. రీసెర్చ్ చేసిన వారు కూడా ఇక్కడకు వస్తున్నట్లు స్పష్టంచేశారు.
విద్య సామాజిక, ఆర్థిక మార్పులను నిర్దేశిస్తుంది
* విద్యా వేత్త చుక్కా రామయ్య
శ్రీకాకుళం(రూరల్), ఫిబ్రవరి 11: విద్య ద్వారా సామాజిక ఆర్థిక మార్పులు జరిగి దేశ అభివృద్ధిని నిర్ధేశిస్తుందని విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కృషి చేయాలని దాని ద్వారా విజ్ఞాన దాయిక, ఆరోగ్య దాయిక ఆర్థిక అంతరాలు లేని సమాజ నిర్మాణ నిర్మాణానికి కృషి చేయాలని విద్యావేత్త మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య పిలుపునిచ్చారు. శనివారం స్థానిక అంబేద్కర్ ఆడిటోరియంలో గరిమెళ్ల అధ్యయన వేదిక ఆధ్వర్యంలో విద్యారంగం పరిణామాలు అనే అంశంపై సెమినార్ జరిగింది. సెమినార్‌కు ప్రజాసంఘాల ఐక్యవేదిక నాయకులు వి.జి.కెమూర్తి అధ్యక్షత వహించారు. ఈసందర్భంగా చుక్కా రామయ్య మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం చేపట్టిన డి మానటైజేషన్, నగదురహిత బదిలీలు ఆర్థిక సంక్షోబానికి దారితీశాయన్నారు. ప్రభుత్వ విద్యారంగం గత 30 సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురికావడంతో ప్రైవేటీకరణకు దారి తీస్తుందని తెలిపారు. అమర్తసేన్ వంటి ఆర్థిక శాస్రేవేత్తలు, మేదావులు చేసిన సూచనలను ప్రభుత్వాలు పెడచెవిన పెట్టడం సరికాదని తీవ్రంగా విమర్శించారు. ప్రజా ఉద్యమాల ద్వారా ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని అందుకు ప్రజలు పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్రా గ్రాడ్యూట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏ.అజశర్మ, ప్రొఫెసర్ విష్ణుమూర్తి, డాక్టర్ అప్పారావు, గొంటి గిరిధర్, ఎస్.కిషోర్‌కుమార్, ప్రధాన ఆదినారాయణ, రెడ్డి మోహనరావు, పి.అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే కిడ్నీ మరణాలు
* సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ
వజ్రపుకొత్తూరు, ఫిబ్రవరి 11: ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధులు మరణాలకు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణమని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ అన్నారు. శనివారం ఉద్దానం రామకృష్ణాపురంలో కిడ్నీ బాధితులతో మాట్లాడారు. కిడ్నీ వ్యాధిగ్రస్థులు గ్రామంలో 71 మంది వరకు ఉన్నారని ఆశా కార్యకర్త కె కృష్ణవేణి రికార్డులను చూపించారు. ఇంతగా వ్యాధిగ్రస్తులు ఉంటే ప్రభుత్వం కళ్లు మూసుకుందా? ప్రభుత్వం మొద్దునిద్ర వీడితేనే పరిష్కారం లభిస్తుందన్నారు. కిడ్నీ వ్యాధులు ప్రబలడానికి మూలాలు తెలుసుకోకుండా డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటుతోనే ప్రభుత్వం కాలక్షేపం చేస్తోందన్నారు. ప్రభుత్వం ఎవరో వచ్చి కదిలిస్తే కదులుతుంది లేదంటే మొద్దు నిద్ర పోతుంది అని ఎద్దేవా చేశారు. ఏదో చేస్తున్నామని బాధితుల్లో భ్రమలు కల్పించడం మానుకొని కిడ్నీ వ్యాధుల నివారణకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. ఆయనతో పాటు సిపిఐ రాష్ట్ర సహాయకార్యదర్శి జెకె సత్యనారాయణమూర్తి, జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, చాపర సుందరలాల్, డాక్టర్ డి జీవితేశ్వరరావు, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ బి సంతోష్‌కుమార్ ఉన్నారు.
ఆదర్శవంతుడు దీనదయాల్ ఉపాధ్యాయ
* బీజేపి రాష్ట్ర కార్యదర్శి వేణుగోపాలం

ఎచ్చెర్ల, ఫిబ్రవరి 11: భారతీయ జన్‌సంఘ్ వ్యవస్థాపకులు రాజనీతజ్ఞులు పండిట్ దీనదయాల్ ఉపాధ్యాయను ఆదర్శంగా తీసుకోవాలని బీజేపి రాష్ట్ర కార్యదర్శి పైడి వేణుగోపాలం పిలుపునిచ్చారు. దీనదయాల్ ఉపాధ్యాయ శతజయంతి సందర్భంగా కుశాలపురం పంచాయతీ పరిధిలోని ఓ కళ్యాణ మండపంలో శనివారం వర్థంతిని నిర్వహించారు. తొలుత దీనదయాల్ చిత్రపటానికి పూల మాల వేసి అంజలి ఘటించారు. ఇటువంటి మహానీయుల ఆశయాలకు అనుగుణంగా బీజేపిని బలోపేతం చేయాల్సిన కర్తవ్యం అందరిపై ఉందన్నారు. బీజేపి ఏడాది పొడువున కార్యక్రమాలను నిర్వహిస్తుందని ఇందులో పార్టీ శ్రేణులు భాగస్వామ్యం కావాలన్నారు. నీతి నిజాయితీగా వ్యవహరించి ఆర్థిక శాస్త్రాన్ని చదవకపోయినా సరికొత్త ఆర్థిక వ్యవస్థను రూపొందించిన దీన్‌దయాల్ బాటలో ప్రధాని మోదీ పయణిస్తున్నారని గుర్తు చేశారు. ఈకార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మారుపెల్లి రాజు, సంపతిరావు నాగేశ్వరరావు, వెంకటరమణ , చంద్రరావు తదితరులు పాల్గొన్నారు. అలాగే చిలకపాలెం కేంద్రంగా దీన్‌ధయాల్ ఉపాధ్యాయ వర్థంతిని ఆ పార్టీనాయకులు సువ్వారి వెంకటసన్యాసిరావు, తమ్మినేని గోవిందరావు తదితరులు నిర్వహించారు.