కర్నూల్

పోటాపోటీగా ధర్మపోరాట దీక్షలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల, ఏప్రిల్ 20: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన పుట్టిన రోజును లెక్కచేయకుండా రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు సాధించేందుకు చేపట్టిన ధర్మపోరాట దీక్షకు ఆళ్లగడ్డతోపాటు మరికొన్ని చోట్ల తెలుగు తమ్ముళ్లు పోటా పోటీ దీక్షలు నిర్వహించారు. ధర్మపోరాట దీక్షలో తెలుగుతమ్ముళ్ల మధ్య ఐకమత్యం కొరవడి పోటాపోటీ దీక్షలకు కర్నూలు జిల్లా వేదికైంది. మొదటి నుండి ఆళ్లగడ్డ నియోజకవర్గంలో పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియకు టీడీపీ నాయకులు ఏవీ సుబ్బారెడ్డికి మధ్య తీవ్రమైన విబేధాలు చోటు చేసుకున్న విషయం విధితమే. అయితే రాష్టమ్రంతా ధర్మపోరాట దీక్షలు ముఖ్యమంత్రికి సంఘీభావంగా ఏర్పాటు చేసుకున్నప్పటికీ తెలుగు తమ్ముళ్ల మధ్య విబేధాలు బట్టబయలు అయ్యాయి. ఆళ్లగడ్డలో మంత్రి భూమా అఖిలప్రియ తన స్వగృహం వద్ద ధర్మ పోరాట దీక్షలో పాల్గొనగా, అదే పట్టణంలోని ఏవీ సుబ్బారెడ్డి స్వగృహం వద్ద ఆయన కూడా ధర్మపోరాట దీక్షలో పాల్గొన్నారు. ఏవీ సుబ్బారెడ్డి చేపట్టిన ధర్మపోరాట దీక్షకు తెలుగుదేశం పార్టీ నాయకులు, శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరై తమ సంఘీభావం తెలిపారు. అటు భూమా అఖిలప్రియ దీక్షా శిబిరం వద్ద కూడా ఆమె మద్దతుదారులు, నాయకులు, టీడీపీ శ్రేణులు భారీగా హాజరయ్యారు. అదేవిధంగా కోడుమూరు నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే మణిగాంధీ ఒకచోట, విష్ణువర్థన్‌రెడ్డి మరోచోట దీక్షా శిబిరంలో పాల్గొన్నారు. ఇక కర్నూలు నగరంలో గురువారం నుండి జడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్ దీక్షా శిబిరం ఏర్పాటు చేసి దీక్షలో పాల్గొనగా శుక్రవారం ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఒక చోట, రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ ఆధ్వర్యంలో మరోచోట ధర్మపోరాట దీక్షలో పాల్గొన్నారు. దీంతో జిల్లాలో తెలుగుదేశం పార్టీలో విబేధాలు తారాస్థాయికి చేరుకున్నాయని, వీటిని అధిష్టానం మొగ్గదశలోనే సర్దుబాటు చేయని పక్షంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగు తమ్ముళ్లు సీటు కోసం పోటీ ఏర్పడక మానదు. మొత్తం మీద కర్నూలు జిల్లాలో ధర్మపోరాట దీక్ష కొన్ని నియోజకవర్గాల్లో పోటా పోటీ శిబిరాలు ఏర్పాటు చేసుకొని తమ బల ప్రదర్శనను చాటుకొనే ప్రయత్నం చేశారు. ఇప్పటికే ఆళ్లగడ్డ, నంద్యాల అసెంబ్లీ పరిధిలో తెలుగుదేశం పార్టీలో తెలుగు తమ్ముళ్లు పోటా పోటీగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. నంద్యాలలో సిట్టింగ్ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డికి పోటీగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల శ్రీ్ధర్‌రెడ్డి తనదైన శైలిలో సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటూ సొంత నిధులతో కొన్ని కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కాగా సందట్లో సడేమియా అన్న చందంగా మండలి చైర్మన్ ఎన్‌ఎండీ ఫరూక్ తనయుడు ఎన్‌ఎండీ ఫిరోజ్ కూడా నంద్యాలలో భారీ సంఖ్యలో ఉన్న ముస్లిం మైనార్టీలకు తానే నాయకుడినంటూ తనదైన శైలిలో టీడీపీ కార్యక్రమాలు వేర్వేరుగా చేసుకుంటూ పోతున్నారు.

కోడుమూరులో వేర్వేరుగా ధర్మ పోరాట దీక్షలు
కోడుమూరు : ప్రత్యేక హోదా కోసం సీఎం చంద్రబాబు సారథ్యంలో శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ధర్మ పోరాట దీక్షలు కోడుమూరులో కూడా ప్రారంభమయ్యాయి. అయితే ఇక్కడి టీడీపీ శ్రేణులు హోదా పోరాటాలను వేర్వేరుగా చేయడం గమనార్హం. స్థానిక పాతబస్టాండ్ ప్రాంగణంలో ఎమ్మెల్యే ఎం.మణిగాంధీ, నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి డి.విష్ణువర్ధన్‌రెడ్డి వర్గాలు వేర్వేరుగా ధర్మ పోరాట దీక్ష శిబిరాలు ఏర్పాటు చేయడం చర్చకు దారితీసింది. రెండు వర్గాల నేతలు తలపెట్టిన దీక్షలను విజయవంతం చేసేందుకు ఆ పార్టీ శ్రేణులు పాతబస్టాండ్ కూడలిలో అడుగడుగునా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి పసుపుమయం చేశారు. ధర్మపోరాట దీక్షతో కోడుమూరు టీడీపీలో నెలకొన్న వర్గపోరు రాజకీయాలు మరోసారి రచ్చకెక్కాయి. రెండు వర్గాలు వేర్వేరుగా దీక్షలను కొనసాగించినా తమ పోరాటం ప్రత్కేక హోదా కోసమే అని ఆయా వర్గాలు గొప్పగా చెప్పుకోవడం శోచనీయం. ఇదిలా ఉండగా అధికార టీడీపీ చేస్తున్న ప్రత్యేక హోదా పోరుకు పలు ప్రజా సంఘాలు, మేధావులు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థి సంఘాలు, ఎమ్మార్పీఎస్ మద్దత్తు ఇచ్చేందుకు సందిగ్ధంలో పడ్డారు. ఇక్కడ నిర్వహించిన రెండు శిబిరాల్లో ఏ శిబిరానికి వెళ్లి మద్దతు ఇవ్వాలనే ఆలోచనతో ముందుకు రాలేదు. ప్రత్యేక హోదా, విభజన చట్టాల హామీలను మరచిన బీజేపీ ప్రభుత్వ పాలనను ఎండగట్టేందుకు ఇటు అధికార పార్టీ, అటు ఆంధ్ర రాష్ట్రంలోని విపక్షాలు, ప్రజలంతా ఒకే నినాదం, ఒకటే మాటగా పోరాటాలకు నడుం బిగించారు. ఈ పోరాటంలో అందరి నోటా హోదాను సాధించుకోవడమే. కానీ కోడుమూరులో జరిగిన ధర్మపోరాట దీక్ష ఆయా వర్గాల నాయకులు తమ సత్తా చాటుకునేందుకే వేదిక చేసుకున్నట్లు తెలుస్తోంది.