కర్నూల్

శ్రీశైలంలో భక్తులకు లోటు రానివ్వద్దు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం, జనవరి 21: దేవస్థానంకు వచ్చే భక్తుల వసతి, దర్శన విషయాల్లో ఎటువంటి లోటుపాట్లు రానివ్వకుండా చూడాలని రాష్ట్ర శాసనసభ వెనుకబడిన తరగతుల సంక్షేమ సంఘం అధ్యక్షులు గుండుమల తిప్పేస్వామి, సభ్యులు రమణమూర్తి, పీరుకుంట విశ్వప్రసాదరావు అన్నారు. గురువారం శ్రీశైల మల్ల దర్శనార్థం వచ్చిన బిసి సంక్షేమ కమిటీ అధ్యక్షులు, సభ్యులు శ్రీశైలం దేవస్థానం పరిపాలన సమావేశ మందిరంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా దేవస్థానంలో వెనుకబడిన తరగతుల వారి విషయంపై ప్రత్యేకంగా చర్చించారు. అనంతరం దేవస్థానంలో జరుగుతున్న అభివృద్ధి పనులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షులు తిప్పేస్వామి మాట్లాడుతూ దేవస్థానంలో రోడ్లు సరిగ్గా లేవని, నీటి సమస్య ఎక్కువగా ఉందని, వీటిని అధికమించేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని ఆలయ అధికారులకు సూచించారు. సభ్యులు మాట్లాడుతూ కాంట్రాక్టర్ చేతుల్లో దేవస్థానం అధికారులు ఉన్నట్లు నత్తనడక పనులు సాగుతున్నాయని, అధికారులు నిర్లక్ష్యం వీడి కాంట్రాక్టర్ అధికారి చేతుల్లో ఉండేలా, నాణ్యత లోపించకుండా త్వరితగతిన పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. సంవత్సర ఆదాయం, దేవస్థానంలో వెనుకబడిన తరగతుల శాతాన్ని పూర్తి సమాచారాన్ని అందించాలన్నారు. దేవస్థానం అధికారులు అందించిన సమాచారం సంతృప్తికరంగా లేదని వ్యక్తపరిచారు. అదే విధంగా ఆదాయం ఎక్కువ ఉండి కూడా దేవస్థానం అభివృద్ధి సరిగ్గా జరగలేదన్నారు. డిపాజిట్లు, బంగారు గురించి అడిగి తెలుసుకున్నారు. సత్రాల నియామకంలో ఒకే సత్రానికి రెండుమూడు చోట్ల స్థలాలు కావాలని కోరినట్లు కమిటీ దృష్టికి వచ్చిందని, దేవస్థానం అభివృద్ధి దృష్ట్యా ఒకచోట మాత్రం సత్రాలకు ఒకేపేరుతో స్థలం కేటాయించాలే తప్ప అదే పేరుతో స్థలం కేటాయించడం సమంజసం కాదని, ఈవిషయం దేవస్థానం అధికారులు దృష్టిలో ఉంచుకుని అన్ని విభాగాల అధికారులు శక్తివంచన లేకుండా దేవస్థానం అభివృద్ధికి కృషిచేయాలన్నారు. అనంతరం స్థానికంగా కొంతమంది కమిటీ సభ్యులకు పలు సమస్యలపై ఫిర్యాదులు అందించారు. ఈకార్యక్రమంలో జెసి రామస్వామి, దేవస్థానం ఇఓ సాగర్‌బాబు, జెఇఓ హరినాథరెడ్డి, ఆలయ జెఇఓలు, డిఇలు, సిఐ చక్రవర్తి, ఎస్‌ఐలు, తదితర అధికారులు పాల్గొన్నారు.
మల్లన్న సేవలో శాసనసభ బిసి కమిటీ సభ్యులు
శ్రీశైలం మహాక్షేత్రంలో శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను రాష్ట్ర శాసనసభ వెనుకబడిన తరగతుల సంక్షేమ సంఘం అధ్యక్షులు గుండుమల తిప్పేస్వామి, స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వీరికి ఆలయ రాజగోపురం వద్ద ఆలయ ఇఓ సాంప్రదాబద్దంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామివార్లకు అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చనలు ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి ఆశీర్వచన మండపంలో కమిటీ సభ్యులకు ఆలయ అర్చక వేద పండితులు ఆశీర్వదించి స్వామి అమ్మవార్ల ప్రసాదాలను అందించారు. ఆలయ అధికారులు కమిటీ సభ్యులను శేష వస్త్రాలతో సత్కరించారు.
జన్మభూమి అర్జీలు అప్‌లోడ్ చేయండి
* కలెక్టర్ విజయమోహన్
కర్నూలు ఓల్డ్‌సిటీ, జనవరి 21:3వ విడత జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో స్వీకరించిన దరఖాస్తులను ఈ నెల 25వ తేదీలోగా కంప్యూటర్‌లో అప్‌లోడ్ చేయాలని కలెక్టర్ సిహెచ్.విజయమోహన్ ఎంపిడిఓలను ఆదేశించారు. కలెక్టర్ గురువారం జన్మభూమి విజ్ఞప్తులు, జాతీయ ఓటర్ల దినోత్సవం ఏర్పాట్లపై కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జన్మభూమి అర్జీలను అప్‌లోడ్ చేయడంలో ఆస్పరి, చాగలమర్రి, పెద్దకడుబూరు, తుగ్గలి, పత్తికొండ, బేతంచర్ల, గడివేముల, కోసిగి, కౌతాళం, మిడ్తూరు, సంజామల, కోడుమూరు, రుద్రవరం, పాణ్యం, దేవనకొండ మండలాలు వెనుకబడి ఉన్నాయన్నారు. అలాగే నంద్యాల, గూడూరు, నందికొట్కూరు, డోన్ మున్సిపాలిటీల్లో కూడా ప్రగతి లేదని ఇకనైనా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఈ మూడు నెలల్లో పూర్తి చేయాలని సూచించారు. ప్రధానంగా రేషన్ కార్డులు, ఇంటి స్థలాలు, గృహాలు, పింఛన్ల దరఖాస్తులను ఎండార్స్‌మెంట్ చేయాలన్నారు. ప్రభుత్వ స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సినందున సంబంధిత దరఖాస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని తెలిపారు. మీ కోసం కార్యక్రమంలో స్వీకరించిన దరఖాస్తులు అధిక స్థాయిలో పెండింగ్‌లో ఉన్నాయని వాటిని కూడా త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. ఈ నెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా బూత్, నియోజకవర్గ స్థాయిలో సమావేశాలు నిర్వహించి ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. స్వచ్ఛంద సేవా సంస్థలు, యువజన సంఘాలు, కుల సంఘాలు, విద్యాసంస్థలు అందరినీ భాగస్వాములను చేసి 2కె రన్, ర్యాలీలు నిర్వహించాలన్నారు. ఓటు ప్రాధాన్యతపై విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు, నిర్వహించడంతో పాటు నూతనంగా నమోదైన ఓటర్లను సన్మానించాలన్నారు. నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ నమోదులో కూడా వెనుకబడి ఉందన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డిఆర్‌ఓ గంగాధర్‌గౌడ్, సిపిఓ ఆనంద్‌నాయక్, నగర కమిషనర్ రవీంద్రబాబు, తదితరులు పాల్గొన్నారు.
గణతంత్ర వేడుకలు
ఘనంగా నిర్వహించాలి
* కలెక్టర్ విజయమోహన్
కర్నూలు, జనవరి 21:్భరత గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధ చేసుకోవాలని కలెక్టర్ సిహెచ్ విజయమోహన్ అన్ని శాఖల ఉన్నతాధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశ భవనంలో గురువారం గణతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలీసు పరేడ్ మైదానంలో జాతీయ పతాక ఆవిష్కరణకు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. మైదానంలో అవసరమైన ప్రదేశాల్లో షామియానాలు, ప్రజలు కూర్చొని కార్యక్రమాలు తిలకించేందుకు కుర్చీలు, ఎగ్జిబిషన్ స్టాల్స్ ఏర్పాటు చేయాలన్నారు. అలాగే ప్రజాప్రతినిధులు, ఇతర ప్రముఖులకు ఆహ్వాన పత్రాలు పంపిణీ చేయాలని డిఆర్‌ఓ, ఆర్డీఓలను ఆదేశించారు. పాఠశాల విద్యార్థులను మైదానానికి తీసుకురావడంతో పాటు వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని డిఇఓను ఆదేశించారు. జాతీయ పతాక ఆవిష్కరణ వేదికకు పెయింటింగ్ వేసి అందంగా అలంకరించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలోని అన్ని ప్రధాన శాఖల అభివృద్ధి కార్యక్రమాల సంక్షిప్త నివేదికను క్రోడీకరించి సందేశ కాపీని సిద్ధం చేయాలని డిప్యూటీ కలెక్టర్‌ను ఆదేశించారు. పరేడ్ మైదానాన్ని పరిశుభ్రంగా ఉంచడంతో పాటు తాగునీటి వసతి కల్పించాలని నగరపాలక సంస్థ కమిషనర్‌ను ఆదేశించారు. విధులు, ఉత్తమసేవలు అందించిన ఉద్యోగులు, అధికారులకు ప్రశంసా పత్రాలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని డిఆర్‌ఓను ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ సంక్షేమశాఖలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, రుణాల పంపిణీకి ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. డిఆర్‌డిఎ, మెప్మా ప్రాజెక్టు, వికలాంగుల సంక్షేమశాఖ, వ్యవసాయశాఖ, సంబంధితశాఖల లబ్ధిదారులకు మంజూరైన యూనిట్స్ పంపిణీకి ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. గణతంత్య్ర దినవోత్సవం రోజున నగరాన్ని ఒక పండుగ తరహాలో అందంగా తీర్చిదిద్దాలని నగరపాలక సంస్థ కమిషనర్‌ను ఆదేశించారు. మైదానం దగ్గర ప్రథమ చికిత్సకు అసరమైన మందుల కిట్ ఏర్పాటు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణిని ఆదేశించారు. సమావేశంలో డిఆర్‌ఓ గంగాధర్‌గౌడ్, పోలీసు, రెవెన్యూ అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
కార్మికులను వేధిస్తే సహించేది లేదు
* ఏఐటియుసి జిల్లా గౌరవాధ్యక్షుడు ప్రభాకర్
కర్నూలు సిటీ, జనవరి 21:రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల్లో ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు పద్ధతిన పని చేసే కార్మికులను వేధిస్తే సహించేది లేదని ఏఐటియుసి జిల్లా గౌరవాధ్యక్షుడు పి.ప్రభాకర్ హెచ్చరించారు. నగరంలోని ఏఐటియుసి కార్యాలయంలో గురువారం నగర అధ్యక్షుడు వెంకటేష్ అధ్యక్షతన నగర సమితి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిజెపి, టిడిపి ఎన్నికల సమయంలో కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్ చేస్తామని వాగ్దానం చేసి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టడానికి ప్రయత్నం చేయటం దారుణమన్నారు. హౌసింగ్ కార్పొరేషన్‌లో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులను తొలగించడం సరికాదన్నారు. పెంచిన వేతనాలను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శాంతియుతంగా నిరసన చేస్తున్న అంగన్‌వాడీలను తొలగించాలని జీఓను జారీ చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ప్రస్తుతం ఎన్‌టిఆర్ వైద్య సేవా పథకంలో పని చేస్తున్న వైద్య మిత్రలను తొలగించడానికి ప్రయత్నం చేస్తుందన్నారు. ఇకనైనా ప్రభుత్వాలు తమ వైఖరి మార్చుకోవాలని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా కార్యదర్శి మునెప్ప, సిపిఐ నగర కార్యదర్శి రసూల్, బీసన్న, మధు, వినయ్, నరసింహులు, రహిమాన్, ఈశ్వర్, రాజు, గణేష్, తదితరులు పాల్గొన్నారు.
కోడుమూరు తమ్ముళ్లలో వర్గపోరు!
* బలహీనపడుతున్న టిడిపి..
కోడుమూరు, జనవరి 21:కోడుమూరు తెలుగుదేశం పార్టీలో వర్గపోరు రాజకీయాలతో రోజురోజుకీ పార్టీ బలహీనపడుతోందన్న వాదనలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. పరిస్థితి ఇదేవిధంగా కొనసాగితే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కోడుమూరు అసెంబ్లీపై పచ్చజెండా ఎగుర వేయడం కలగా మిగిలిపోయే పరిస్థితులు ఉన్నాయని తెలుస్తోంది. రాష్ట్రంలో టిడిపి ఆవిర్భావం నాటి నుంచి గత అసెంబ్లీ ఎన్నిల వరకూ కోడుమూరు అసెంబ్లీ గడ్డపై ఆ పార్టీ పట్టు సాధించలేక చతికిలపడుతున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రతి ఎన్నికల్లో టిడిపిని కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిస్తున్న విషయం విదితమే. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీతో తలపడిన టిడిపి మరోసారి పరాజయం పాలైంది. ఇలా ప్రతి ఎన్నికల్లో పరాజయం పాలవుతున్న కోడుమూరు అసెంబ్లీ స్థానం స్వయానా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకే సవాల్‌గా మారింది. ప్రస్తుతం రాష్ట్రంలో టిడిపి అధికారంలో ఉన్న తరుణంలోనైనా కోడుమూరు నియోజకవర్గంలో పచ్చజెండా రెపరెపలాడించాలనే ప్రధాన లక్ష్యంతో టిడిపి అధిష్ఠానం మల్లగుల్లాలు పడి కోడుమూరు నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసేందుకు సర్దుబాటు చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే.
ఇందులో భాగమే పార్టీలో చేరిన డి.విష్ణువర్ధన్‌రెడ్డికి కోడుమూరు నియోజకవర్గ ఇన్‌చార్జిగా బాధ్యతలు అప్పగించి పార్టీని బలోపేతం చేసేందుకు అధిష్ఠానం శ్రీకారం చుట్టిందని ప్రచారంలో ఉంది. అయితే ఇదివరకూ కోడుమూరు నియోజకవర్గంలో ఉన్న ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తికి ఆయా మండలాల్లో దీటైన క్యాడర్ ఉందన్న విషయం తెలిసిందే. ఈ నియోజకవర్గంలో ఇటు కెఇ వర్గం, అటు విష్ణు వర్గాలకు ఆయా గ్రామాల్లో మంచి పట్టు ఉంది. కాగా ఈ రెండు వర్గాల మధ్య ఇటీవల కాలంలో పొరపచ్చాలు లేవలెనెత్తాయి. ప్రస్తుతం కోడుమూరు నియోజవర్గంలో ఇన్‌చార్జి డి.విష్ణువర్ధన్‌రెడ్డికి చెందిన వర్గమే పార్టీ కార్యక్రమాల్లో దూసుకుపోతుంది. దీంతో కెఇ వర్గానికి ఈ దూకుడు మింగుడు పడటం లేదు. పార్టీ కార్యక్రమాలకు, ప్రభుత్వ పథకాలపై కూడా కెఇ వర్గానికి అందకుండా చూస్తున్నారని, కెఇ వర్గాన్ని దూరం చేస్తున్నారని ఆయా గ్రామాల్లో ఒక వర్గంలో ముసలం ఏర్పడింది.
దీంతో రెండు వర్గాల మధ్య గ్రూపు రాజకీయాలు పేట్రేగిపోతున్నాయి. ఇలాగైతే కోడుమూరు నియోజకవర్గంలో టిడిపి మనుగడ సన్నగిల్లే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పార్టీని బలోపేతం చేయాలని టిడిపి రాష్ట్ర నేతలు ఆదేశిస్తే ఇక్కడ మాత్రం కేవలం ఒక వర్గం నేత హల్‌చల్ సాగుతోంది. ఇలాగైతే కోడుమూరు అసెంబ్లీ గడ్డపై 2019 ఎన్నికల్లో ఏ మేరకు ప్రతి పక్ష పార్టీలతో ఎదుర్కొంటుందో ప్రశ్నార్థకమే.
ఓటు హక్కు నమోదుపై
ప్రజల్లో చైతన్యం పెంపొందించాలి
* కలెక్టర్ విజయమోహన్
కర్నూలు, జనవరి 21:ఓటు హక్కు నమోదు, వినియోగంపై ప్రజల్లో చైతన్యం పెంపొందించాలని కలెక్టర్ సిహెచ్ విజయమోహన్ అధికారులకు సూచించారు. ఈ నెల 25వ తేదీ నిర్వహించచున్న జాతీయ ఓటర్ల దినోత్సవంపై గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ భవనంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కలెక్టరేట్ నుంచి ర్యాలీ, 3కె, 5కె రన్, వ్యాసరచన పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా సోమవారం 9.30 గంటలకు కలెక్టరేట్ నుంచి 3కె రన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 3కె రన్ కలెక్టరేట్ నుంచి బుధవారపేట మీదుగా రాజ్‌విహార్ సెంటర్ నుంచి అవుట్‌డోర్ స్టేడియం చేరుతుందన్నారు. ఆ రన్‌లో పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, మెడికల్, ఇంజినీరింగ్ విద్యార్థులు, ఎన్‌సిసి విద్యార్థులు, పోలీసులు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో డిఆర్‌ఓ గంగాధర్‌గౌడ్, డిఆర్‌డిఎ పిడి రామకృష్ణ, జిల్లా క్రీడల అధికారి సత్యనారాయణ, నగరపాలక సంస్థ కమిషనర్ రవీంద్రబాబు, డిఇఓ రవీంద్రనాథరెడ్డి, కర్నూలు ఆర్డీఓ రఘుబాబు, తదితరులు పాల్గొన్నారు.