కృష్ణ

నేటి నుండి యక్షగానాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూచిపూడి: నాట్య క్షేత్రం కూచిపూడిలో కూచిపూడి నాట్యారామం, కేంద్ర సంగీత నాటక అకాడమిల సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, నర్తనంల పర్యవేక్షణలో వారం రోజుల పాటు శ్రీ సిద్ధేంద్రయోగి కూచిపూడి కళాపీఠంలో కూచిపూడి యక్షగాన మహోత్సవాలు నిర్వహణకు యావత్తు కూచిపూడి గ్రామం సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంది. వారం రోజులుగా పాటు జరిగే యక్షగాన మహోత్సవాలు సందర్భంగా గ్రామంలో జిల్లా కలెక్టర్ బాబు.ఎ చొరవతో రహదారి విస్తరణ జరిగిందన్నారు. ఆర్టీసి ఎండి నండూరి సాంబశివరావు అవనిగడ్డ, మచిలీపట్నం, గుడివాడ డిపోల నుండి నాట్య ప్రదర్శనలకు ముందుగా, చివరకు కళాభిమానుల సౌకర్యార్ధం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు.
యక్షగానాలు
23న పసుమర్తి రామలింగశాస్ర్తీ బృందంచే శశిరేఖా పరిణయం, వేదాంతం రాధేశ్యాం బృందం గొల్లకలాపం, 24న వేదాంతం రాఘవ, వేదాంతం వెంకట నాగ చలపతి బృందం భామాకలాపం, చింతా రవిబాలకృష్ణ మోహినీ బస్మాసుర, చింతా రామ్మూర్తి రాఘవేంద్ర వైభవం నృత్య రూపకం, 25న వేదాంతం సత్యనృసింహ శాస్ర్తీ పార్వతీ కళ్యాణం, పసుమర్తి వెంకటేశ్వర శర్మ, పసుమర్తి శ్రీనివాసశర్మ బృందం మహిషాసురమర్ధని, భాగవతుల వెంకట రామశర్మ భగవద్గీత నృత్య రూపకం, 26న భాగవతుల శేతురాం రామనాటకం, పసుమర్తి రామలింగశాస్ర్తీ, గజాననీయం, 27న శ్రీహరి రామమూర్తి మోహినీ భస్మాసుర, పసుమర్తి రత్తయ్య శర్మ ఉషా పరిణయం, ఎబి బాలకొండలరావు లలితా బండాసుర చరితం నృత్యరూపకం, 28న డా. వేదాంతం రామలింగశాస్ర్తీ నర్తన శాల, పసుమర్తి శేషుబాబు, మోహనీ రుక్మాంగద, 29న వేదాంతం వెంకట నాగ చలపతి భక్త ప్రహ్లాద, ఏలేశ్వరపు శ్రీనివాసులు వినాయక విజయం ప్రదర్శిస్తారు. రాష్ట్ర ఐటి, భాషా, సాంస్కృతిక శాఖామాత్యులు పల్లెరఘునాధరెడ్డి, రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, పామర్రు శాసనసభ్యురాలు ఉప్పులేటి కల్పన, రాష్ట్ర హౌసింగ్ బోర్డు ఛైర్మన్ వర్మ రామయ్య తదితర ప్రముఖుల జ్యోతి ప్రజ్వలనతో యక్షగాన ప్రదర్శనలు ప్రారంభమవుతాయన్నారు. భాగవతుల సీతారామ శర్మ జ్యోతి ప్రజ్వలనతో మంగళవారం ఉదయం ప్రదర్శనాపూర్వక ప్రసంగాలు, నాట్య సదస్సులు ప్రారంభమవుతాయన్నారు.

కదం తొక్కిన అగ్రిగోల్డ్ బాధితులు
* న్యాయం కోసం కలెక్టరేట్ ఎదుట ధర్నా
* సంఘీభావం తెలిపిన బిజెపి, వైసిపి, సిపిఎం
ఆంధ్రభూమి బ్యూరో
మచిలీపట్నం, ఫిబ్రవరి 22: జిల్లా కేంద్రం మచిలీపట్నంలో సోమవారం అగ్రిగోల్డ్ బాధితులు కదం తొక్కారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ పట్టణ పుర వీధుల్లో భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా చేశారు. బడుగు జీవుల సొమ్మును కాజేసి బోర్డు తిప్పేసిన యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీరి ఆందోళనకు బిజెపి, వైసిపి, సిపిఎం పార్టీల నాయకులు సంఘీభావం తెలిపారు. బిజెపి నాయకులు పంతం వెంకట గజేంద్రరావు, వైసిపి నాయకుడు మారుమూడి విక్టర్ ప్రసాద్, సిపిఎం పట్టణ కార్యదర్శి కొడాలి శర్మ బాధితుల పక్షాన నిలబడి ఆందోళనలో పాల్గొన్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకు ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. కోనేరుసెంటరు నుండి కలెక్టరేట్ వరకు నిర్వహించిన ర్యాలీలో వందలాది మంది అగ్రిగోల్డ్ బాధితులు పాల్గొని పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు గిరికుమార్, ఉపాధ్యక్షులు యండి రహ్మాన్, కార్యదర్శి శ్రీనివాస్, కోశాధికారి ఈశ్వర కుమార్, సభ్యులు సత్య శ్రీనివాస్, శేషు, జగన్ తదితరులు పాల్గొన్నారు.

వైభవంగా ప్రారంభమైన తిరుపతమ్మ పెద్ద తిరునాళ్ల
పెనుగంచిప్రోలు, ఫిబ్రవరి 22: అమ్మాశరణం, తిరుపతమ్మ అన్న నామసంకీర్తనతో పెనుగంచిప్రోలు సోమవారం మారుమోగింది. స్థానిక శ్రీగోపయ్య సమేత శ్రీతిరుపతమ్మ అమ్మవారి పెద్ద తిరునాళ్ల మహోత్సవాలు సోమవారం ప్రారంభమైయ్యాయి. ముందుగా ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎం రఘునాధ్, భక్తజన సేవా కమిటీ సభ్యులు కర్ల వెంకట నారాయణ వేదపండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉదయం 5.52గంటలకు అఖండ జ్యోతి స్థాపన, హోమ గుండ ప్రజ్వలన ద్వారా తిరునాళ్ల మహోత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం గత 40రోజులుగా తిరుపతమ్మ దీక్ష నిర్వహించిన స్వాములు గురుస్వాముల ఆధ్వర్యంలో తిరుముడి కట్టించుకొని శిరస్సుపై ధరించి గ్రామంలో మంగళ వాయిద్యాలతో నృత్యాలు చేస్తూ ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి తిరుముడి సమర్పణ చేశారు. తిరుముడి సమర్పించిన భక్తులకు మునే్నటి అవతల ఉన్న వైపిఆర్ గార్డెన్‌లో భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్, ఇఒ రఘునాధ్, భక్తజన సేవా కమిటీ సభ్యులు కర్ల వెంకట నారాయణలు ప్రారంభించి సుమారు 20వేల మందికి అన్నదానం నిర్వహించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు నిర్వహించారు. కాగా అమ్మవారికి తిరుముడి సమర్పించేందుకు దీక్షా స్వాములు ఆదివారం రాత్రే గ్రామానికి చేరుకొని పలు ఆలయాల్లో విడిది చేసి తెల్లవారుజామునే దేవస్థానం అధికారులు ఏర్పాటు చేసిన జల్లు స్నానాల వద్ద స్నానాలు చేసి తిరుముడి సమర్పణలో పాల్గొన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డిఎస్‌పి రాదేష్ మురళి ఆధ్వర్యంలో సిఐ లచ్చునాయుడు పర్యవేక్షణలో బందోబస్తు నిర్వహించారు. అలాగే పెద్ద సంఖ్యలో భక్తులు గ్రామానికి చేరుకోవడంతో శానిటేషన్ సమస్య ఏర్పడకుండా స్థానిక పంచాయతీ ఆధ్వర్యంలో ప్రత్యేక కూలీల ద్వారా శానిటేషన్ పనులను నిర్వహించారు.
మాగపౌర్ణమి పుణ్యస్నానాలుకు పోటెత్తిన భక్తులు
కృత్తివెన్ను, ఫిబ్రవరి 22: మాగపౌర్ణమిని పురస్కరించుకుని భక్తులు అధిక సంఖ్యలో పుణ్యస్నానాలు ఆచరించారు. సోమవారం మండల పరిధిలోని పెదగొల్లపాలెం బీచ్ తెల్లవారుజాము నుండే భక్తులతో కిటకిటలాడింది. నాగపౌర్ణమి సోమవారం రావటంతో పశ్చిమగోదావరి జిల్లా నుండి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. భక్తులకు అసౌకర్యాలు కలుగకుండా సర్పంచ్ భస్వాని బంగార్రాజు ఏర్పాట్లు చేశారు. ఎస్‌ఐ లోవరాజు ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు నిర్వహించారు.
తపాలా కార్యాలయ నిర్మాణానికి రూ.4.14కోట్లు
మచిలీపట్నం (కల్చరల్), ఫిబ్రవరి 22: పట్టణంలో మున్సిపల్ పార్కు ఎదురుగా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఖాళీ స్థలంలో పటిష్టమైన ప్రధాన తపాలా కార్యాలయాన్ని నిర్మించాలని స్థానిక న్యాయవాది ఎం సాయిరామ్ సోమవారం ఒక ప్రకటనలో కోరారు. తపాలా కార్యాలయాన్ని రూ.4కోట్ల 14లక్షల 72వేల 100 వ్యయంతో నిర్మించడానికి పోస్టల్ డైరెక్టరేట్ పరిపాలనా అనుమతులను 2015 సంవత్సరం నవంబరు 3వ తేదీన ఇచ్చిందని తెలిపారు. ప్రజల సౌకర్యార్ధం వెంటనే టెండర్ల ప్రక్రియను ప్రారంభించి బిల్డింగ్ పనులు పూర్తి చేయాలని ఆయన కోరారు.
కమనీయం వెంకటేశ్వరుని కల్యాణం
మైలవరం, ఫిబ్రవరి 22: ద్వారకా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దత్తత దేవాలయమైన మైలవరంలో వేంచేసియున్న వెంకటేశ్వర స్వామి వారి తిరుకల్యాణ మహోత్సవాల సందర్భంగా ఆదివారం రాత్రి స్వామి వారి కల్యాణం కమనీయంగా, కన్నుల పండువగా జరిగింది. స్థానిక వెంకటేశ్వర స్వామి వారి దేవాలయ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంలో స్వామి వారి కల్యాణాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ద్వారకా తిరుమల నుండి విచ్చేసిన వేద పండితులు, అర్చక స్వాములు స్వామి వారి కల్యాణాన్ని వేద మంత్రోచ్ఛారణలతో శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామి వారి కల్యాణాన్ని తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాలనుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు.

వైభవంగా శ్రీనివాసుని కల్యాణం
కైకలూరు, ఫిబ్రవరి 22: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో సోమవారం కైకలూరు టౌన్‌హాలులో నిర్వహించిన శ్రీనివాస కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. భారీ సెట్టింగులతో మిరుమిట్లు గొలిపే కాంతులతో టౌన్‌హాలు ప్రాంగణం కళకళలాడింది. సుమారు 5వేల మంది భక్తులు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితర ప్రముఖులు కల్యాణోత్సవంలో పాల్గొని వీక్షించారు. టిటిడి ఇన్‌చార్జి, కైకలూరు కల్యాణోత్సవ ప్రత్యేకాధికారి ఎల్.సుబ్బారాయుడు ఆధ్వర్యంలో బాలాజీ సాయికృష్ణ అర్చక బృందంతో వేదమంత్రోచ్ఛారణలతో ప్రాంగణమంతా గోవిందనామ స్మరణతో మార్మోగింది. ఎంపి మాగంటి వెంకటేశ్వరరావు (బాబు), మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ, మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్‌రావు, కృష్ణా గ్రంథాలయ చైర్మన్ ఈడ్పుగంటి వెంకట్రామయ్య, వైసిపి నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు, టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు సయ్యపురాజు గుర్రాజు, టిడిపి జిల్లా తెలుగు యువత ప్రధాన కార్యదర్శి పూలారాజీ, తహశీల్దార్ కె.నారాయణరెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షులు గురజాడ ఉదయశంకర్, న్యాయవాదులు తదితర ప్రముఖులు పాల్గొని తిలకించారు. శ్యామలా సౌండ్ సిస్టం బొప్పన శివకుమార్, సాంబ సోదరులు ఈ కల్యాణోత్సవానికి ఆర్ధిక సాయం అందించి స్వీయ ఖర్చులతో, సెట్టింగ్‌లను ఏర్పాటుచేశారు. వారి తల్లిదండ్రులు బొప్పన శేషగిరిరావు, నాగేంద్రమ్మలు కల్యాణోత్సవంలో పీఠంపై కూర్చున్నారు.

విఎంసి బడ్జెట్ రూ.1600 కోట్ల
* కౌన్సిల్ ఏకగ్రీవ ఆమోదం
* అధికార, విపక్షాల మధ్య రసవత్తరంగా సాగిన చర్చ
* విపక్షాల సవరణకు అధికార పక్షం అంగీకారం
* 756 కోట్ల నుంచి 1600 కోట్లకు పెరిగిన బడ్జెట్ గణాంకాలు
* మెట్రోకు రూ. 80 కోట్లు కేటాయించిన విఎంసి
* హాపీ సండేల నిర్వహణకు నిధుల కేటాయింపు
విజయవాడ (కార్పొరేషన్), ఫిబ్రవరి 22: విజయవాడ నగరపాలక సంస్థ 2016-17 ఆర్థిక సంవత్సరానికి గాను 1600 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌కు కౌన్సిల్ ఏకగ్రీవ ఆమోదం లభించింది. కౌన్సిల్ చరిత్రలో మొట్టమొదటిసారిగా జరిగిన బడ్జెట్ ఏకగ్రీవ ఆమోదంలో నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్ రాజకీయ చతురత స్పష్టంగా కనిపించింది. బడ్జెట్ అంశాలపై అధికార, విపక్షానికి మధ్య చర్చ రసవత్తరంగా సాగినా అధికార పక్షానిదే పై చేయిగా కనిపించింది. సిపిఐ ఎమ్మెల్సీ చంద్రశేఖరరావు, తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌లు కౌన్సిల్‌లో ప్రత్యేక ఆకర్షణగా కనిపించారు. అలాగే సిపిఎం ఫ్లోర్ లీడర్ జి ఆదిలక్ష్మీ, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ బండి నాగేంద్ర పుణ్యశీల, వైసిపి కార్పొరేటర్ చందన సురేష్‌తోపాటు ఒకరిద్దరు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు కూడా బడ్జెట్ నిధుల కేటాయింపులో చేసిన సవరణలు చేశారు. వారి సవరణలకు అనుగుణంగా చర్యలు తీసుకొంటామని మేయర్ శ్రీ్ధర్ ప్రకటించారు. విపక్షాల సవరణలను స్వీకరించినందున అభ్యంతరాలేవి లేనట్టుగా బావించి బడ్జెట్‌ను ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నట్టు ప్రకటించారు. ఇదిలావుండగా గత 2015-16 ఆర్థిక సంవత్సరానికి గాను కేవలం 756 కోట్లకే పరిమితమైన విఎంసి వార్షిక బడ్జెట్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 1600 కోట్లకు చేరుకుంది. రెవెన్యూ ఆదాయం 486.32 కోట్లు, కాపిటల్ ఆదాయం 1079.26 కోట్లు, డిపాజిట్లు మరియు అడ్వాన్స్‌గా 49.08 కోట్లను కలుపుకొని మొత్తం 1614.66 కోట్ల ఆదాయానికి ఖర్చులకు గాను రెవెన్యూ ఖర్చు 360.62 కోట్లు, కాపిటల్ ఖర్చు 1143.62 కోట్లు, లోన్ రీపేమెంట్లు 48.53 కోట్లు, డిపాజిట్లు మరియు అడ్వాన్స్‌లు 49.08 కోట్లను కలుపుకొని మొత్తం 1601.85 కోట్లుగా ఖర్చు చూపించారు. ప్రస్తుత బడ్జెట్‌లో మెట్రో రైలు కోసం 80 కోట్లను కేటాయించడం విశేషం. కుక్కలు, కోతులు తదితర జంతువుల నివారణ తోపాటు సైంటిఫిక్ డంపింగ్ యార్డుకు నిధుల కేటాయింపులు చేశారు. తొలుత సభ ప్రారంభం కాగానే జనవరి 30న మరణించిన మాజీ గవర్నర్ కెవి కృష్ణారావు, సియాచీన్ మంచు పర్వతాల్లో ఈనెల 3న మృతి చెందిన 10 మంది సైనికులకు విఎంసి కౌన్సిల్ సంతాపాన్ని ప్రకటిస్తూ తీర్మానించారు. సుమారు ఆరున్నర గంటలపాటు సుధీర్ఘంగా జరిగిన కౌన్సిల్ సమావేశంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ ఫ్లోర్ లీడర్ బండి నాగేంద్ర పుణ్యశీల సుమారు 67 అంశాలపై గంటన్నర పాటు అధికారపక్షంపై ప్రశ్నల వర్షం కురింపించారు. అలాగే సిపిఎం ఫ్లోర్ లీడర్ ఆదిలక్ష్మీ పలు అంశాలపై సవరణ ప్రతిపాదనలు చేశారు. ఇదిలావుండగా బడ్జెట్ చర్చలో పాల్గొన్న సిపిఐ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలంటూ పట్టుపట్టిన విషయంలో కొద్దిసేపు అధికార, విపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటుచేసుకోవడం గమనార్హం. ఈ సమయంలో 21వ డివిజన్ టిడిపి కార్పొరేటర్ నెలిబండ్ల బాలస్వామి ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌ను ‘సోది చెప్పందంటూ’ చేసిన వ్యాఖ్యలు సభలో పెద్ద దుమారం లేపింది. ఎమ్మెల్సీకి అధికార పక్షం ఇచ్చే గౌరవ మర్యాదలివేనా అంటూ విపక్షాలు ఎదురుదాడికి దిగడంతో ఇరువర్గాల మద్య వివాదానికి దారితీసినా మేయర్ చాకచక్యంగా దానిని సమసిపోయేలా వ్యవహరించారు.

ముగిసిన కాంగ్రెస్ పార్టీ
రాష్టస్థ్రాయి శిక్షణ తరగతులు
* అంకెలుగారడిలో చంద్రబాబు స్పెషలిస్టు
* ప్రత్యేక హోదాపై 700 మంది ఎంపిలకు లేఖలు
* తెలుగుదేశం కార్యకర్తల జేబులు నింపటానికే జన్నభూమి కమిటీలు
* పిసిసి ఛీఫ్ రఘువీరా ధ్వజం
పటమట, ఫిబ్రవరి 22: ఆంధ్ర లయోలా కళాశాల పక్కన ఎగ్జిక్యూటివ్ క్లబ్‌లో రెండు రోజులుగా జరుగుతున్న రాష్ట్ర స్థాయి కాంగ్రెస్ మాస్టర్ ట్రైనీస్ తరగతులు సోమవారం సాయంత్రంతో దిగ్విజయంగా ముగిశాయి. అనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మాట్లాడుతూ కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు ప్రభుత్వం రెండు అంకెల వృద్ధిరేటు సాధించిందని చెప్పుకుంటుందని కానీ చంద్రబాబు అంకెలు గారిడి చేయటంలో స్పెషలిస్టుగా ఆయన అభివర్ణించారు. ఎందుకంటే తెలుగుదేశం ప్రభ్వుం సంక్రాంతి చంద్రన్న కానుక పంపిణీలో 15 లక్షల లక్షలు కుటుంబాలు వలసలు పోయాయి కనుక సంక్రాంతి చంద్రన్న కానుక తీసుకోలేకపోయారని చెప్పిన ప్రభుత్వం ఇదేనా రెండు అంకెల వృద్ధి సాధించటం అని చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా సాధించడంలో చంద్రబాబు విఫలమయ్యారని, ప్రత్యేక హోదా సాధించడానికి కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ అన్ని పార్టీలకు సంబంధించిన 700 మంది లోకసభ, రాజ్యసభ సభ్యులకు పిసిసి తరుపున సోమవారం సాయంత్రం మెయిల్ ద్వారా లేఖలు పంపింటం జరిగిందన్నారు. రాష్ట్ర విభజన సమయంలో వెంకయ్యనాయుడు, చంద్రబాబు 5ఏళ్లుకాదు 10, 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేసి, నేడు నోరుమెదపటం లేదని విమర్శించారు. మోడి, వెంకయ్యనాయుడు, చంద్రబాబునాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కటి అమలు చేయకుండా ప్రజలను ఘరంగా మోసం చేస్తున్నారన్నారు. రాష్ట్ర విభజన సమయంలో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ విభజన చట్టంలో ఇచ్చిన హామీలను మోడి ప్రభుత్వం అమలుచేయకపోవటంతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షరాలు సోనియాగాంధీ విజభన హామీలు అమలు చేయాలని రెండు సార్లు మోడి ప్రభుత్వానికి లేఖలు రాయటం జరిగిందని, అలాగే రాహూల్ గాంధీ కూడా ఈ అంశంపై ఒకసారి లేఖ రాసినా కేంద్రప్రభుత్వం నుండి స్పందన రాలేదని ఆయన మండిపడ్టారు. మన్మోహన్ సింగ్ వ్యక్తిగతంగా కాకుండా విభజన అంశాలు ప్రధాని మంత్రి హోదాలో ఇచ్చినా మోడిప్రభుత్వం అమలు చేయకుండా నాటకం ఆడుతుందన్నారు. చంద్రబాబు రైతులకి 6వేలు కోట్ల రూపాయలు బకాయలు చెల్లించకుండా మోసం చేస్తున్నారని, అలాగే ధరలు నియంత్రణ కోసం 5వేల కోట్లు కేటాయిస్తామని చెప్పిన చంద్రబాబు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదన్నారు. దళితుల ఇళ్ల నిర్మాణానికి ఒక రూపాయి కూడా బిల్లులు చెల్లించటం లేదని తెలిపారు. చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్ని ఒక్కటైన అమలు చేశారా అని ప్రశ్నించారు. చంద్రబాబునాయుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జేబులు నింపటానికే జన్మభూమి కమిటీలు వేశారని, అవి జన్నభూమి కమిటీలు కాదని, దగుల్భాజీ కమిటీలని ధ్వజమెత్తారు. రెండు రోజులపాటు 70 మందికి శిక్షణ ఇచ్చామని, త్వరలో 175 నియోజకవర్గాలలో 15వేల మందికి శిక్షణ ఇచ్చి మండల, గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేసి, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి నాయకులులేని లోటును కొత్తగా శిక్షణ ఇచ్చిన నాయకులతో భర్తీచేస్తామని చెప్పారు. ఈ శిక్షణ తరగతులలో ట్రైనీలకు స్వాతంత్య్రం రాకపూర్వం, వచ్చిన తరువాత కాంగ్రెస్ పార్టీ చరిత్ర, కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు, అమలు చేసిన తీరు, యువతకు, విద్యార్థులకు, మహిళలకు అందించిన పథకాలు గురించి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశానికి అందించిన సేవలను, రాష్ట్ర పునర్విభజ చట్టం తదితర అంశాలై కూలషంగా చర్చింటం జరిగిందన్నారు. ఈ సమావేశంలో అర్బన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లాది విష్ణు, జిల్లా అధ్యక్షుడు కడియాల బుచ్చిబాబు, నరహరశెట్టి నరసింహారావు రాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొన్నారు.

టిడిపిలోకి జలీల్‌ఖాన్ జంప్
* పశ్చిమలో జలీల్ వైపు వెళ్లే కార్పొరేటర్లు ఎంతమంది
* కార్పొరేటర్లతో మంతనాలు జరుపుతున్న మేయర్ శ్రీ్ధర్
విజయవాడ (కార్పొరేషన్), ఫిబ్రవరి 22: విజయవాడ నగర పశ్చిమ నియోజకవర్గంలోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ కార్పొరేటర్లు పలువురు తెలుగుదేశం పార్టీలోకి జంప్ అయ్యారు. సోమవారం రాత్రి సిఎం చంద్రబాబు నాయుడి నివాసంలో మరో వైసిపి ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, ఆయన కుమార్తె ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, మరి కొంతమంది అనూయాయులతో కలిసి టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ వాడీ వేడిగా జరిగిన విఎంసి వార్షిక బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్‌తోపాటు కార్పొరేటర్ల జంప్ విషయాలు కౌన్సిల్ పరిసరాలను మరింత వేడెక్కించాయి. విజయవాడ నగరానికి ఉన్న ఏకైక వైసిపి ఎమ్మెల్యేగా ఉన్న జలీల్‌ఖాన్ తెలుగుదేశం పార్టీలోకి చేరడంతో ఆయనకు మద్దతుగా వైసిపి కార్పొరేటర్లు ఎంతమంది జంప్ అవుతున్నారన్న విషయంపై పలురకాల ఊహాగానాలు వెల్లువెత్తాయ. జలీల్ తనకు అత్యంత సన్నిహితంగా ఉండే కార్పొరేటర్లతో స్వయంగా ఫోన్ మంతనాలు చేశారు. టిడిపిలోకి వచ్చేందుకు సంసిద్ధంగా ఉన్న వైసిపి కార్పొరేటర్లతో నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్‌తోపాటు పశ్చిమ టిడిపి కార్పొరేటర్ యేదుపాటి రామయ్య తదితరులు మంతనాలు జరిపారు. అయితే పార్టీ మారితే ‘ఏంటి సంగతి’ అన్న విషయాలపై కూడా వైసిపి కార్పొరేటర్లు సమాలోచనలు జరుపుతున్నారన్నది బహిరంగ రహస్యమే. ప్రధానంగా గత ఎన్నికల్లో అసెంబ్లీకి స్థానాన్ని కైవశం చేసుకున్న వైనంతో విఎంసి కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ పదవిని కూడా అధిష్టానం పశ్చిమానికే కేటాయింపునకు మొగ్గు చూపింది. అయితే ప్రస్తుతం చోటుచేసుకొన్న రాజకీయ మార్పు పరిణామాలతో పశ్చిమాన కార్పొరేటర్ల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. ఇప్పటివరకూ ఫ్లోర్ లీడర్ బండి నాగేంద్ర పుణ్యశీలకు కొమ్ము కాసిన జలీల్‌ఖాన్ పార్టీ మార్పు కొంత ఇబ్బందికరంగానే కనిపిస్తోంది. ప్రస్తుత ఎపిసోడ్‌లో జంపింగ్ జిలానీ కార్పొరేటర్ల పేర్లపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

రెండో బడ్జెట్ ప్రవేశపెట్టడం నా అదృష్టం
విజయవాడ (కార్పొరేషన్), ఫిబ్రవరి 22: వరుసగా రెండవ ముసాయిదా బడ్జెట్‌ను కౌన్సిల్‌కు తీసుకురావడం నా అదృష్టమంటూ మేయర్ కోనేరు శ్రీ్ధర్ వ్యాఖ్యానించారు. తొలుత బడ్జెట్‌పై ప్ర సంగించిన అనంతరం ఆయన మాట్లాడుతూ గత పాలకులు వ్యవహరించిన అనాలోచిత విధానాల వలన విఎంసి రూ.450 కోట్ల అప్పుల పాలవ్వడమే కాకుండా విఎంసి ఆస్తులను సైతం తాకట్టుపెట్టి ఘోరంగా దివాళా తీసిన వైనం నుంచి తెలుగుదేశం పార్టీ పాలనలో ఇప్పుడిప్పుడే తేరుకొని అప్పుల భారాల నుంచి ఉపశమనం పొందుతూ అభివృద్ధి బాటన పయనిస్తున్నామన్నారు. జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం పథకం ముగుస్తున్నా ఆ పథకం తాలుకూ భారాలు ఇంకా వెంటాడుతున్నాయన్నారు. 59 డివిజన్ల కార్పొరేటర్లు సూచించిన రోడ్లు, డ్రైయిన్లు తదితర అభివృద్ధి పనుల నిర్వహణకై ఒకొక్కరికీ 15లక్షల చొప్పున మొత్తం 9 కోట్లను కేటాయిస్తున్నామన్నారు. రెవెన్యూ ఆదాయం తోపాటు క్యాపిటల్ ఆదాయంతో నగరాన్ని సమగ్ర అభివృద్ధిపర్చేందుకు గాను కేంద్ర ప్రభుత్వం నుంచి స్ట్రామ్ వాటర్ ప్రాజెక్టు కింద 462 కోట్ల రూపాయలను గ్రాంటుగా సాధించడం జరిగిందన్నారు. అలాగే రాబోయే కృష్ణా పుష్కరాలకు గాను చేపట్టాల్సిన పనుల నిమిత్తం 350 కోట్లను సాధించుకొన్నామన్నారు. పుష్కర గ్రాంటును క్యాపిటల్ బడ్జెట్‌లో పొందుపర్చామన్నారు. బుడమేరు వరద ముంపు నివారణ చర్యల కింద మరో 47.52 కోట్లతో ఆయా పనులను చేపడుతున్నట్టు తెలిపారు. ఎస్టీ, ఎస్సీ సబ్‌ప్లాన్ కింద ఆయా ప్రాంతాల్లో వౌలిక వసతుల కల్పనకై వార్డు కమిటీ తీర్మానాల అమలుకు 19.74 కోట్ల బడ్జెట్ నిధులు కేటాయిస్తున్నామన్నారు. ఇవికాకుండా మరో 22 కోట్ల రూపాయల అంచనాలను సిద్ధం చేశామన్నారు. మంచినీటి సరఫరా మెరుగుకై 14వ ఆర్థిక సంఘం నుంచి 11.89 కోట్లను రాబట్టడం జరిగిందన్నారు. వీధి బాలల సంక్షమం, ఇళ్లులేని నిరాశ్రయులు, మహిళా వికాస కేంద్రాలు, మైనార్టీల సంక్షేమం కోసం ప్రత్యేకంగా నిధులను కేటాయించామన్నారు. సిఆర్‌డిఎ నిధులతో బెంజిసర్కిల్ నుంచి రామవరప్పాడు వరకూ మరియు కనకదుర్గమ్మ వారథి వరకూ గ్రీనరీని అభివృద్థి చేశామన్నారు. నూతన పార్కుల ఏర్పాటు, కాల్వగట్ల సుందరీకరణ, ఉద్యానవనాలు, రోడ్డు సైడ్ మార్జిన్లలో గ్రీనరీలను అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నామన్నారు. రాష్ట్ర రాజధాని నగరంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చి సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించామని తెలుపుతూ సభ్యులందరూ బడ్జెట్‌ను ఆమోదించాలని మేయర్ శ్రీ్ధర్ కోరారు.

నికర ఆదాయంలో 40శాతం
మురికివాడల అభివృద్ధికి కేటాయింపు
విజయవాడ (కార్పొరేషన్), ఫిబ్రవరి 22: మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ జివోనెంబర్ 619ను అనుసరించి 2016-17 డ్రాఫ్ట్ బడ్జెట్‌ను రూపొందించామని విఎంసి కమిషనర్ వీరపాండియన్ పేర్కొన్నారు. సోమవారం జరిగిన బడ్జెట్ కౌన్సిల్ సమావేశంలో సభ్యులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ విఎంసిలో స్టేట్ మున్సిపల్ అకౌంటింగ్ మ్యాన్యువల్ (ఎస్‌ఎంఎఎం) ప్రకారం అక్రూయల్ బేస్డ్ అకౌంటింగ్ సిస్టమ్ ప్రవేశపెట్టామన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం విఎంసి నికర ఆదాయంలో 40శాతం నిధులను మురికివాడల అభివృద్ధి తోపాటు 15, 7.5, 5 శాతం చొప్పున ఎస్సీ, ఎస్టీ, మహిళా శిశు సంక్షేమాలను దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ కేటాయింపులు చేశామన్నారు. స్ట్రీట్ ఫర్నీచర్ పద్ధతి ప్రవేశపెట్టుట, వీధుల్లో వ్యాపారం చేసుకునే చిరువ్యాపారులకు గుర్తింపుకార్డుల మంజూరుతో క్రమబద్దీకరిస్తున్నామన్నారు. ఇ-టాయ్‌లెట్స్, బయో టాయ్‌లెట్స్ నిర్మాణాలకు నిధులు కేటాయించామని వీరపాండియన్ తెలిపారు. నగర పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో నడక దారుల ఏర్పాటు, అభివృద్ధి, 100శాతం యుజిడి నిర్వహణతో ఖజానా ఆదాయం పెంపునకు చర్యలు తీసుకొంటున్నామన్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం అభివృద్ధికి 4 కోట్లను కేటాయించామన్నారు. అంతేకాకుండా నగర ప్రజలందరికీ నాణ్యమైన, ఆరోగ్యవంతమైన కూరగాయలు ఇతర ఆహార పదార్థాలను విక్రయించేందుకు గాను విఎంసి నిర్వహణలో అవసరమైన చోట్ల రైతు బజార్ల ఏర్పాటు, నగర ప్రజలందరికీ ప్రతి ఆదివారం నాడు ఆరోగ్యవంతమైన వాతారణంలో ఆనందకరమైన రోజుగా గడిపేందుకు గాను హ్యాపీ సండే పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించేందుకు విఎంసి తొలిసారిగా బడ్జెట్‌లో నిధులు కేటాయించామన్నారు. ప్రజలందరికీ ఒకేచోట పౌర సేవలందించేందుకు ఇ-గవర్నెన్స్‌ను పూర్తిస్థాయిలో అమలుచేస్తామన్నారు. నగరంలోని వివిధ స్టేడియంలను అభివృద్ధి చేస్తున్నట్టు తెలుపుతూ అన్ని వర్గాల ప్రజలకు సంతృప్తికరంగా ఉండే విధంగా నిధులు కేటాయించామని కమిషనర్ వీరపాండియన్ సభ్యులకు వివరించారు.

డిసిసి నేత బుచ్చిబాబుకు
పిసిసి చీఫ్ రఘువీరా సత్కారం
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, ఫిబ్రవరి 22: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలనే వ్యూహరచనలో భాగంగా పిసిసి అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో స్థానిక ఎగ్జిక్యూటివ్ క్లబ్‌లో తొలిసారి రెండు రోజులుగా జరిగిన శిక్షణ తరగతులు సోమవారం సాయంత్రంతో విజయవంతంగా ముగిశాయి.
ఈ రెండురోజుల తరగతుల నిర్వహణకు సభా ప్రాంగణాన్ని సమకూర్చటంతో పాటు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ప్రతినిధులకు భోజన వసతి సౌకర్యాలు సమకూర్చడంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కడియాల బుచ్చిబాబు ఎంతగానో శ్రమించి సఫలీకృతులయ్యారు. పైగా రాష్ట్రంలో ఇతర జిల్లాల కంటే ఎంతో మెరుగ్గా కృష్ణా జిల్లాలో కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో తీవ్రంగా శ్రమిస్తున్నందున పిసిసి అధ్యక్షులు రఘువీరారెడ్డి బుచ్చిబాబును ప్రశంసించారు. అంతేకాకుండా ముగింపు సభలో శాలువా కప్పి సత్కరించారు. ప్రతినిధులంతా హర్షధ్వానాలు వ్యక్తం చేశారు.

మార్చి 4న వేలంపాట
ఇంద్రకీలాద్రి, ఫిబ్రవరి 22: దేవాదాయ ధర్మాదాయశాఖకు చెందిన నిడుముక్కల సుబ్బరాయుడు రామాజనుకూటంనికి చెంది నల్లమందు సందులో ఉన్న రెండు దుకాణాలకు అద్దెకు ఇచ్చేందుకు మార్చి 4న ఉదయం 11గంటలకు రామాజకూటంలో దేవాదాయ ధర్మాదాయశాఖ అధికారుల సమక్షంలోబహిరంగ వేలంపాట నిర్వహిస్తున్నట్లు ఇవో ఒక ప్రకటనలో తెలిపారు. ఈవేలంపాటలో పాల్గొనేవారు 50వేల డిపాజిట్ చెల్లించి పాల్గొనాల్సిందిగా ఇవో తెలిపారు. పూర్తి వివరాల కోసం కార్యాలయంలో సంప్రదించవల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

నగర వైకాపాలో ప్రకంపనలు!
ఇంద్రకీలాద్రి, ఫిబ్రవరి 22: నగరంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యునిగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ నేత జలీల్ ఖాన్ సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతులమీదుగా మెడలో పసుపుకండువా వేయించుకొని వైకాపా అధినేత జగన్‌కు, పార్టీ కేడర్‌కు షాకిచ్చారు. ఆయన పార్టీ మారటం నగర వైకాపాలో ప్రకంపనలు సృష్టించింది. గత కొద్దిరోజులుగా జలీల్ ఖాన్ అధికార తెలుగుదేశం పార్టీలో చేరేందుకు మొగ్గు చూపుతున్నట్లు పుకార్లు షికారు చేయటం తెలిసిందే. దీనిపై వస్తున్న విమర్శలను సైతం జలీల్ ఖాన్ తిప్పికొట్టకుండా వౌనంగానే ఉండటంతో పార్టీ మారటం తథ్యమని స్వయంగా ఆయన సన్నిహితులు కూడా అంగీకరిస్తూ వచ్చారు. జలీల్ ఖాన్ వౌనంగా ఉంటూనే జిల్లాకు చెందిన మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో రహస్య మంతనాలు సాగించారు. తన ఇంటికి వచ్చిపోయేవారి సలహాలు తీసుకున్న జలీల్ ఖాన్ చివరికి సోమవారం సాయంత్రం పసుపు కోటలోకి మారారు. తొలుత కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికైన జలీల్ ఖాన్ అప్పటి పిసిసి అధ్యక్షుడు శ్రీనివాస్‌తో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకొని నగర కాంగ్రెస్ అధ్యక్ష పదవిని సైతం చేపట్టారు. తర్వాత కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి తెలుగుదేశం పార్టీలో చేరారు. తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి మారారు. అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డితో అత్యంత సన్నిహితంగా ఉండేవారు. కానీ లగడపాటి రాజగోపాల్‌తో రాజకీయ విభేదాల కారణంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా స్వతంత్య్ర అభ్యర్థిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. కొన్ని నెలలపాటు క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండి కేవలం వ్యాపారానికే పరిమితమయ్యారు. వైఎస్ జగన్ పార్టీ పెట్టిన వెంటనే వైకాపాలోకి ప్రవేశించి అర్బన్ అధ్యక్ష పదవి చేపట్టారు. పార్టీ కార్యక్రమాల్లో అత్యంత చురుకైన పాత్ర పోషించి వైఎస్ జగన్‌తో కలిసి ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్యెల్యే హోదా కంటే అధికార పార్టీ నాయకునిగా ఉండేందుకే జలీల్ ఖాన్ ఆసక్తి చూపటం సోమవారం పార్టీ మారటానికి ముఖ్య కారణమని ఆయన సన్నిహితులు అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొన్ని విషయాల్లో స్పష్టమైన హామీలు ఇవ్వటం వల్లనే జలీల్ ఖాన్ అధికార పార్టీలోకి వెళ్లినట్లు ఆయనకు అత్యంత సన్నిహితుడు ఒకరు తెలిపారు.

వైభవంగా శ్రీవారి తెప్పోత్సం
ఇంద్రకీలాద్రి, ఫిబ్రవరి 22: పవిత్ర కృష్ణనదీలో సోమవారం సాయంత్రం శ్రీవారి తెప్పోత్సవ కార్యక్రమం కన్నుల పండుగా జరిగింది. పాతబస్తీ శ్రీవేంకటేశ్వరస్వామివారి దేవస్థానంలో కొలువైన శ్రీవారి బ్రహోత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం వందలాది భక్తులు వీక్షిస్తుండగా శ్రీవారి తెప్పోత్సవ కార్యక్రమం జరిగింది. వార్షిక బ్రహోత్సవాలు సందర్భంగా సర్వ ఆభరణథాలు ధరించి శ్రీదేవి, భూదేవి సమేతంగా కృష్ణనదీలో సంధ్యసమయాన స్వామివారు నదీవిహారం చేస్తూ భక్తులకు దర్శనం మిచ్చారు. సంప్రదాయ ప్రకారం మూడు సార్లు స్వామి వాహనం నదీలో జలప్రదక్షణ చేసింది.
ఇవో శిరపరపు హేమలతాదేవి ఆదేశాల మేరకు ఆలయ అర్చకులు పుష్పాలతో స్వామి పల్లకిని లంకరించి ఉత్సవ మూర్తులను ఉంచి పాతబస్తీ వీధులు గుండా ఊరేగింపుగా పుష్కర ఘాట్‌కు తీసుకొచ్చారు. విద్యుత్‌లైట్ల మధ్యలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఒక అసనంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారిని ఉంచారు. వందలాది మంది భక్తులు వీక్షిస్తుండగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దేవాదాయధర్మాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ సిహెచ్ దుర్గా ప్రసాద్, తనిఖీ అధికారి ఎ సుజన్, అర్బన్ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు కొనగళ్ళ విద్యాధరరావు,శింగంశెట్టి పెద బ్రహ్మం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉదయం స్వామికి అవభృధోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.