కృష్ణ

బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసినది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని పిసిసి అధ్యక్షులు రఘువీరారెడ్డి అన్నారు. డా. బిఆర్ అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రఘువీరారెడ్డి నేతృత్వంలో నిర్వహిస్తున్న దళిత, ఆదివాసి, బిసి, మైనార్టీల సామాజిక, న్యాయ సాధికారత యాత్ర గురువారం పట్టణానికి చేరుకుంది. ఈ సందర్భంగా స్థానిక కోనేరుసెంటరులో నిర్వహించిన బహిరంగ సభలో రఘువీరారెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశాలలో ఒకటైన భారతదేశంలో పటిష్ఠమైన రాజ్యాంగం ఉందన్నారు. పటిష్ఠమైన రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ చిరస్మరణీయులన్నారు. ప్రజాస్వామ్యంలో కుల, మత, ప్రాంతాలకు అతీతంగా దేశ సంపత్తి అందరికీ సమానంగా చెందాలని, అందరికీ సమాన హక్కులు ఉండాలని, నెహ్రూ, గాంధీల ఆకాంక్షల మేరకు అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారన్నారు. జపాన్, అమెరికాల సరసన భారత్ నిలవడానికి కారణం అంబేద్కర్ అన్నారు. రాజ్యాంగానికి అనుగుణంగానే కాంగ్రెస్ ప్రభుత్వం పయనించిందన్నారు. నేడు బిజెపి, టిడిపిలు రాజ్యాంగం ప్రకారం నడుచుకోవడం లేదన్నారు. ఆదివాసి, మైనార్టీ, బిసిల వ్యతిరేకులుగా, బలహీనవర్గాల కంటకులుగా మారారన్నారు. ఆ పార్టీలు సొంత ఎజెండాలతో ముందుకు పోతున్నాయన్నారు. తమ హయాంలో ప్రతి రోజూ పట్టణ ప్రజలకు మంచినీరు అందించామన్నారు. జిల్లా కేంద్రం మచిలీపట్నంలో నాలుగు రోజులకు ఒక సారి మంచినీరు ఇస్తుంటే గ్రామీణ ప్రజల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలు ఏమయ్యాయన్నారు. పోర్టు నిర్మాణానికి 500 ఎకరాలు చాలంటే వెయ్యి ఎకరాలు కావాలని, తరువాత 33వేల ఎకరాలు కావాలని కాలయాపన చేస్తున్నారన్నారు. మచిలీపట్నం డెవలప్‌మెంట్ అధారటీకు లక్షన్నర ఎకరాలు సేకరిస్తామన్నారు. ఈ ఎకరాలు అత్తసొమ్ము అల్లుడికి దానం చేసినట్లు జపాన్, సింగపూర్, చైనా వారికి కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారన్నారు. వికలాంగుల పోస్టులు భర్తీ చేయలేదన్నారు. కంట్రీ బ్యూటరీ పెన్షన్‌ను రద్దు చేయాలని లక్షన్నర మంది ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారన్నారు. 40 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులు, వేలాది మంది ఏజెంట్ల సమస్యలను పట్టించుకోకపోవడం వల్ల వారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని విచారం వ్యక్తం చేశారు. యాజమాన్యం తమ ఆస్తులను భద్రం చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నారని, హాయిల్యాండ్‌ను సొంతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికలకు ముందు బుడగ జంగాలను ఎస్సీలలో చేరుస్తామని ఇచ్చిన వాగ్దానాన్ని విస్మరించి వారు ప్రశ్నిస్తే పోలీసుల లాఠీలతో కొట్టించారన్నారు. ఎస్సీలకు రూ.175 కోట్లు సబ్సిడీగా కేటాయించి రూ.15కోట్లు, ఎస్టీలకు రూ.206 కోట్లు సబ్సిడీగా కేటాయించి రూ.23కోట్లు, మైనార్టీలకు రూ.52కోట్లు కేటాయించి రూ.2కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు. ఎన్నికల సమయంలో బారెడంతచెప్పి బడ్జెట్‌లో మూరెడంత కేటాయించి చివరకు ఇచ్చేది బెత్తడంత అన్నారు. ప్రశ్నిస్తే దేశ ద్రోహులు అంటూ, ప్రశ్నిస్తే సబ్సిడీలు ఇవ్వమని భయపెడుతున్నారన్నారు. టిడిపి, వైఎస్‌ఆర్ పార్టీలు కుటుంబ పాలనకు పరిమితమవుతున్నాయన్నారు. చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి, టిడిపి అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఒక సిక్కు మైనార్టీ వర్గానికి చెందిన మన్మోహన్‌సింగ్, పివి నరసింహారావు ప్రధాని కాగలిగారన్నారు. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా దామోదరం సంజీవయ్య నియమించబడ్డారన్నారు. కాంగ్రెస్ పార్టీ అందరిదీ, అందరికీ అవకాశం ఉంటుందన్నారు. దళిత, ఆదివాసి, బిసి, మైనార్టీలు, బలహీన వర్గాల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ పదవి ఉన్నా, లేకపోయినా పోరాటం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రులు జెడి శీలం, పనబాక లక్ష్మి, మాజీ ఎమ్మెల్యేలు విష్ణు, కనుమూరి బాపిరాజు, దేవినేని అవినాష్, పిసిసి కార్యదర్శులు మిరియాల రామకృష్ణ, బాబూరావు, లింగపల్లి ఫ్రాన్సిస్, రాధికామాదవి, డిసిసి ప్రెసిడెంటు కడియాల బుచ్చిబాబు, పిసిసి జనరల్ సెక్రటరీ నరహరిశెట్టి నరసింహారావు, నియోజకవర్గ ఇన్‌ఛార్జి చలమలశెట్టి ఆదికిరణ్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అబ్దుల్ మతీన్, మీసాల రాజేశ్వరరావు, మత్తి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థి దుర్మరణం
గన్నవరం, మార్చి 24: గన్నవరం విమానాశ్రయం ప్రధాన ముఖ ద్వారం ఎదుట ఐదో నెంబర్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో పాలిటెక్నిక్ విద్యార్థి దుర్మరణం పొందిన దుర్ఘటన గురువారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం గూడవల్లి గ్రామానికి చెందిన కందిపప్పు గణేష్ (18) తేలప్రోలు గ్రామంలోని ఇంజనీరింగ్ కళాశాలలో పాలిటెక్నిక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. కళాశాలకు వెళ్ళేందుకు గూడవల్లి నుండి బయలుదేరి రహదారిపై బైక్‌ను లిఫ్ట్ అడిగాడు. జక్కులనెక్కలం గ్రామానికి చెందిన పి షడ్రక్ తన బైక్‌పై గణేష్‌ను ఎక్కించుకుని గన్నవరం వస్తుండగా ఎయిర్‌పోర్టు మెయిన్‌గేట్ వద్దకు రాగా ఎదురుగా వస్తున్న కారును ఢీ కొనడంతో గణేష్ రోడ్డుపై పడిపోయాడు. అదే సమయంలో గన్నవరం నుంచి విజయవాడ వైపుకు వస్తున్న ఆర్టీసీ బస్సు గణేష్‌ను ఢీకొనడంతో అతడికి బలమైన కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ నడుతున్న షడ్రక్ కాలికి బలమైన గాయాలు తగలడంతో గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గణేష్ మరణవార్త తెలుసుకున్న సహచర విద్యార్థులు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని విషాధసముద్రంలో మునిగిపోయారు. గన్నవరం సిఐ అహ్మద్ అలీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ప్రజలను దగా చేసిన టిడిపి
పెడన, మార్చి 24: తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలను విస్మరించి ప్రజలను దగా చేసిందని కేంద్ర మాజీ మంత్రి జెడి శీలం ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దళిత, ఆదివాసి, బిసి, మైనార్టీల సామాజిక సాధికారిత యాత్ర పెడన పట్టణంలో గురువారం నిర్వహించారు. తొలుత నాయకులు, కార్యకర్తలు పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రం దగ్గర నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు పాదయాత్ర జరిగింది. మహాత్మగాంధి, అంబేద్కర్ విగ్రహాలకు నాయకులు బస్టాండు సెంటరులో పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎస్సీ, ఎస్సీ, బిసి, మైనార్టీలకు రుణాలు మంజూరు చేసే విషయంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. ఈ నిధులను దారిమళ్ళించి ఆయా వర్గాలకు తీరని అన్యాయం చేసిందని ఆరోపించారు. ప్రభుత్వంలో ఎస్టీ, మైనార్టీలకు కూడా న్యాయం జరగలేదని ఆరోపించారు. మాజీ ఎంపి కనుమూరి బాపిరాజు మాట్లాడుతూ ప్రభుత్వం మీద ప్రజలు పెట్టుకున్న నమ్మకాలు వమ్మయ్యాయన్నారు. వర్గాలకు అతీతంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరికీ న్యాయం జరిగిందని వివరించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే విషయంలో ప్రభుత్వం మీన మేషాలు లెక్కిస్తుందని, ఇందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భవిష్యత్తులో ప్రజల నుంచి తగిన విధంగా మూల్యం చెల్లించుకోనున్నారని హెచ్చరించారు. రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రత్యేక హోదాను సాధించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తొలుత పిహెచ్‌సి వద్ద నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఎస్‌వి రాజు ఆధ్వర్యంలో పిసిసి కార్యదర్శులు బూరగడ్డ అశోక్ కుమార్, పిన్నింటి విశే్వశ్వరరావు, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యక్కల నాగేశ్వరరావు, షేక్ మస్తాన్, స్థానిక నాయకులు నందం శ్రీను, ఆకురాతి జనార్ధనరావు, కట్టా నాంచారయ్య, కృత్తివెన్ను, బంటుమిల్లి, గూడూరు మండలాల నాయకులు పాల్గొన్నారు.
వైభవంగా శ్రీనివాస హవనల పూర్ణాహుతి
కూచిపూడి, మార్చి 24: ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన పెదముత్తేవి శ్రీకృష్ణాశ్రమంలో గత 45 రోజులుగా అత్యంత పవిత్రంగా నియమనిష్టలతో నిర్వహిస్తున్న శ్రీనివాస హవనలకు గురువారం పూర్ణాహుతి నిర్వహించారు. ముముక్షుజన మహాపీఠాధిపతులు శ్రీ ముత్తీవి సీతారాం, కమల దంపతులు, గౌరాకృష్ణ దంపతులు భక్తుల వాసుదేవ నామస్మరణలు, రామనామ సంకీర్తన, పండితుల వేద మంత్రాల మధ్య శ్రీనివాస హోమాలకు పూర్ణాహుతిని నిర్వహించారు. ఉదయం ఆశ్రమంలోని దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు అనంతరం విష్ణుసహస్రనామం, శ్రీసూక్తం, పురుష సూక్తం, హనుమత్ విభూది, హనుమాన్ చాలీసా, నిత్యానుష్ఠానంలను భక్తిశ్రద్ధలతో పారాయణ చేశారు. పూర్ణాహుతి అనంతరం యతీంద్ర సేవా సమితి సభ్యులు, ఆశ్రమ సన్నిధి కార్యదర్శి తుర్లపాటి రాధాకృష్ణమూర్తి, తుర్లపాటి ఆనంద్, ఆత్మకూరి లక్ష్మణదాసు పర్యవేక్షణలో భక్తులకు అన్నసమారాధన నిర్వహించారు.