కృష్ణ

వసతి గృహాలపై వేటు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, మార్చి 29: జిల్లాలో సంక్షేమ హాస్టళ్ల మూసివేతకు రంగం సిద్ధమవుతోంది. విలీనం పేరుతో సాంఘిక సంక్షేమ, వెనుకబడిన తరగతులు, గిరిజన వసతి గృహాలను విడతల వారీగా మూసివేసేందుకు ప్రభు త్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా గత ఏడాది 26 వసతి గృహాలను మూసివేసిన ప్రభుత్వం ఈ ఏడాది మరో 68 వసతి గృహాలను మూసివేసేందుకు సంసిద్ధమైంది. దీనిలో సాంఘిక సంక్షేమ శాఖకు సంబంధించి 33 వసతి గృహాలు, వెనుకబడిన తరగతులకు సంబంధించి 18, గిరిజన సంక్షేమ శాఖకు సంబంధించి 15 వసతి గృహాలు ఉన్నాయి. వీటిలో 33 ప్రైవేట్ భవనాల్లో కొనసాగుతుండగా మరో 35 ప్రభుత్వ భవనాల్లో నడుస్తున్నాయి. వీటి పరిధిలో మొత్తం 2560 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీటి స్థానంలో ఎలాంటి వసతులు లేని రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. దీనిపై విద్యార్థి సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రుల నుండి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం మూసివేస్తున్న వసతి గృహాల్లో కొన్నింటికి బోర్డులు మార్చి రెసిడెన్షియల్ పాఠశాలలుగా చేయడానికి అధికారులు సిద్ధపడుతున్నారు. రెసిడెన్షియల్ పేరుతో కొన్ని వసతి గృహాలను విలీనం చేయటం వల్ల వసతులు లేని భవనంలో విద్యార్థుల సంఖ్య పెరిగి అసౌకర్యానికి గురయ్యే అవకాశం ఉంది. దీంతో పాటు ఉద్యోగులను ఇంటికి పంపించే ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయా ప్రాంతాల్లోని విద్యార్థుల సంఖ్యను బట్టి వసతి గృహాలను కుదించడం వల్ల సంక్షేమాధికారులకు పనిలేదనే సాకు చూపి వారిని ఇంటికి పంపే ఆలోచన ప్రభుత్వం చేస్తోంది. అలాగే ఉన్న ఖాళీలను భర్తీ చేయకుండా సంవత్సరాల తరబడి ఇన్‌చార్జ్‌లతో కాలం గడుపుతూ వస్తున్న ప్రభుత్వానికి రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటుతో రెండు విధాలుగా లాభం చేకూరే అవకాశం ఉందని విద్యావేత్తలు అంటున్నారు. గత సంవత్సరం సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలో జిల్లాలో 26 వసతి గృహాలను మూసివేశారు. వాటిలో పనిచేసే అధికారులు, ఉద్యోగులకు నేటికీ ఎక్కడా పోస్టింగ్ ఇచ్చిన దాఖలాలు లేవు. ఇందులో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు అందుతున్నప్పటికీ ప్రైవేట్ విధానంపై విధులు నిర్వహిస్తున్న కుక్‌లు, కామాటీల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఈ సంవత్సరకాలం నుండి వారికి ఎలాంటి వేతనం రాక ఆయా కుటుంబాలు రోడ్డునపడ్డాయి. మళ్లీ ఈ ఏడాది 68 వసతి గృహాలను మూసివేస్తే ఆయా ఉద్యోగులను ఎక్కడ భర్తీ చేస్తారో అర్థంకాని పరిస్థితి నెలకొంది. ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టి కాంట్రాక్టు పద్ధతిపై పనిచేసే వారి నోళ్లు కొట్టి పిల్లలకు ఎలాంటి వసతులు లేకుండా రెసిడెన్షియల్ విధానాన్ని తీసుకురావడం వల్ల ప్రభుత్వం లబ్ధిపొందాలని చూస్తోంది. ఉన్న హాస్టళ్లను మూసివేసి రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేయడమేమిటంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.
ఆటోను ఢీకొన్న స్కూల్ బస్సు
* 10 మంది విద్యార్థులకు గాయాలు
* ఇద్దరి పరిస్థితి విషమం
పెనుగంచిప్రోలు, మార్చి 29: మండలంలోని వెంగనాయకునిపాలెం వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పదవ తరగతి పరీక్షలు రాస్తున్న పది మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో విజయవాడ తరలించారు. మండలంలోని శనగపాడుకు చెందిన కొళ్లికొళ్ల జిల్లా పరిషత్ హైస్కూల్ పదవ తరగతి విద్యార్థినీ విద్యార్థులు మంగళవారం పెనుగంచిప్రోలు జిల్లా పరిషత్ హైస్కూల్‌లో పరీక్ష రాసి ఆటోలో స్వగ్రామానికి వెళుతుండగా వెంగనాయకునిపాలెం వద్ద నందిగామలోని ఒక ప్రైవేటు స్కూల్ బస్సు ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటో పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో అన్నాచెల్లెలు పోనంగి శివ పుల్లారావు, శివపార్వతిలతో పాటు మరో 8 మంది విద్యార్థినీ విద్యార్థులు గాయపడ్డారు. వీరిని అంబులెన్స్‌లో నందిగామకు తరలించారు. పుల్లారావు, శివపార్వతిల పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో విజయవాడ తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.