కృష్ణ

లక్షా 90వేల మంది లబ్ధిదారులకు 22 కోట్లు జమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 4: జిల్లాలో ఐదు రోజుల్లో వివిధ పథకాల లబ్ధిదారులకు రూ. 22 కోట్లను లక్షా, 90వేల మంది ఖాతాదారులకు జమ చేయటం జరిగిందని జిల్లా కలెక్టర్ బాబు ఎ భారత ప్రభుత్వ ఆర్థిక సేవా విభాగం అధికారులకు తెలిపారు. ఢిల్లీ నుండి భారత ప్రభుత్వ ఆర్థిక సేవా విభాగం అధికారులు దేశ వ్యాప్తంగా జన్‌ధన్ బీమా యోజనపై బ్యాంకర్లు, అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో బుధవారం నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బాబు ఎ మాట్లాడుతూ జిల్లాలో ఐదు రోజుల్లో జాతీయ ఉపాధి హామీ కూలీలు, పింఛన్‌దారులు, ఉపకారవేతన లబ్ధిదారులైన లక్షా, 90వేల ఖాతాలకు రూ. 22 కోట్లను జమ చేశామని కలెక్టర్ వివరించారు. జిల్లాలో చౌకధరల దుకాణాల్లో ఇ-పోస్ విధానం ద్వారా లబ్ధిదారులకు నిత్యావసర వస్తువులను సరఫరా చేస్తున్నామన్నారు. ఈ విధానంలో లబ్ధిదారుల వేలిముద్రలుకాని, ఐరిష్ ద్వారా కాని గుర్తించి నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తున్నామన్నారు. బ్యాంకుల ద్వారా పంపిణీ చేస్తున్న లబ్ధిదారుల్లో సుమారు 20 శాతం వృద్ధులైనందున ఐరిష్ కాని, వేలిముద్రలు ద్వారా కాని పింఛన్‌ను పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆర్థిక సేవా విభాగం అధికారులను కలెక్టర్ కోరారు. వీడాయో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌తోపాటు డిఆర్‌డిఎ పిడి డి చంద్రశేఖరరాజు, ఎల్‌డిఎం జి వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు.

సావిత్రికి ఎవరూ లేరు సాటి
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, మే 4: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కథానాయకులే రాజ్యమేలుతున్న రోజుల్లో సావిత్రి తన మహానటనతో ప్రత్యేకత సృష్టించుకుందని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సమాచార హక్కు చట్టం కమిషనర్ ముత్తంశెట్టి విజయనిర్మల అన్నారు. మహానటి సావిత్రి కళాపీఠం సాహిత్య, సాంస్కృతిక సంక్షేమ సంఘం ప్రతి ఏటా ప్రదానం చేస్తున్న జాతీయ పురస్కారం-2015ను ఆమె అందుకున్నారు. గాంధీనగర్‌లోని ఫిలిం ఛాంబర్ హాలులో బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. మహిళా లోకానికి వనె్న తెచ్చిన నటీమణిగా, ఎందరికో స్ఫూర్తిప్రదాతగా నిలిచారని శ్లాఘించారు. ఆమె ఏనాడూ అంగ ప్రదర్శన చేయలేదని కేవలం తన నటన ద్వారానే తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని స్వతం చేసుకున్నారని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి అన్నారు. మహానటి సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి మాట్లాడుతూ తన తల్లిపేరుతో కార్యక్రమాలను నిర్వహిస్తున్న కళాపీఠం వ్యవస్థాపక అధ్యక్షురాలు పరుచూరి విజయలక్ష్మి తన కుటుంబ సభ్యురాలితో సమానమని ఉద్వేగంగా అన్నారు. సంస్థ గౌరవాధ్యక్షులు ప్రబల శ్రీనివాస్ మాట్లాడుతూ కళాకారులకు కులమతాలు, రాజకీయాలు ఆపాదించవద్దన్నారు. సేవా కార్యక్రమాలు నిర్వహించిన వారిని ఎంపిక చేసి మాత్రమే పురస్కారాలు అందజేస్తున్నామని చెప్పారు. పురస్కార ప్రదానోత్సవ కమిటీ అధ్యక్షురాలు గంటా స్వరూపాదేవి మాట్లాడుతూ సమాజంలో ఎందరికో సూర్తినిచ్చిన వ్యక్తులను గౌరవించడం ద్వారా మరికొందరు సేవా మార్గంలో నడిచేందుకు ముందుకు వస్తారన్నారు. 2016 పురస్కారాన్ని ఆంధ్రప్రదేశ్ కాపు కార్పొరేషన్ ఛైర్మన్ చలమలశెట్టి రామానుజయ ఇదే వేదికపై స్వీకరించారు. పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు, ప్రముఖ నర్తకి హిమాన్సి చౌదరి, మాజీ మేయర్ ముత్తంశెట్టి రత్నబిందు, మాసాబత్తుల శ్రీనివాసరావు, వేముల హజరత్తయ్య గుప్తా, నరహరిశెట్టి శ్రీహరి, తోట కృష్ణకిషోర్, దూపాటి శ్రీదేవి ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

రైల్వేకోర్టులో 33 మందికి జరిమానా
విజయవాడ (రైల్వేస్టేషన్), మే 4: రైల్వేస్టేషన్ ప్రాంతంలోని నిషేధించిన ప్రదేశంలో ద్విచక్రవాహనాలు పార్కింగ్ చేసి ప్రయాణికుల రాకపోకలకు తీవ్ర అంతరాయం కల్పించిన ముగ్గురిని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు (ఆర్‌పిఎఫ్) ఎస్సై రామయ్య పట్టుకుని బుధవారం రెండవ మెట్రోపాలిటన్ రైల్వే మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచగా జడ్జి ఎ.రామచంద్రరావు ఒక్కొక్కరికి మూడు వందల రూపాయలు జరిమానా విధించారు. అలాగే రైల్వేస్టేషన్‌లో నిషేధించిన ప్రదేశంలో పొగతాగుతున్న ముఫై మందిని ఎస్సై సురేష్ పట్టుకుని రైల్వే కోర్టులో హాజరుపరచగా జడ్జి మూడువేల రూపాయలు జరిమానా విధించారు.

పుష్కరాల్ని విజయవంతం చేద్దాం...
* వివిధ శాఖల అధికార్లకు కలెక్టర్ బాబు.ఎ పిలుపు
జగ్గయ్యపేట రూరల్, మే 4: కృష్ణా పుష్కరాలను విజయవంతం చేసేలా అధికారులు అందరూ సమష్టిగా పాటుపడాలని జిల్లా కలెక్టర్ బాబు.ఎ అన్నారు. బుధవారం మండలంలోని ముక్త్యాల, కోటిలింగాల, వేదాద్రి క్షేత్రాల్లో పర్యటించిన ఆయన దేవాలయాలను, పుష్కర ఘాట్‌లను పరిశీలించారు. ముక్త్యాలలో కృష్ణానది ఉత్తర వాహినిగా ప్రవహిస్తున్నందున ప్రజలు ఎక్కువ మంది స్నానాలు ఆచరించడానికి వచ్చే అవకాశం ఉందని, దానికి తగినట్లుగా ఏర్పాట్లు అన్ని ఉండాలని ఆదేశించారు. ముక్త్యాల గ్రామంలో పలు వీధులను పరిశీలించిన ఆయన వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేక స్థలాన్ని కేటాయించాలని, వీధులన్నీ విశాలంగా తీర్చిదిద్దాలన్నారు. పుష్కర ఘాట్‌లను విశాలంగా నిర్మించి లక్షలాది యాత్రికులకు సరిపడా సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, ఎక్కడా ఎలాంటి ప్రమాదాలకు తావులేకుండా చర్యలు చేపట్టాలన్నారు. గ్రామంలోని ప్రైవేటు స్థలాన్ని వారిని సంప్రదించి పుష్కరాల సమయంలో ఉపయోగించుకునేలా చూసుకోవాలని అధికారులకు సూచించారు. జల్లు స్నానాలు, స్ర్తిలు దుస్తులు మార్చుకునే గదులు వంటివి ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలన్నారు. ప్రధానంగా పారిశుద్ధ్యం విషయంలో శ్రద్ధ వహించాలన్నారు. కోటిలింగాల సమీపంలో నిర్మాణం తలపెట్టిన ఘాట్‌ను పరిశీలించి అవసరమైతే దేవాదాయ శాఖ నిధులతో ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కోటిలింగాల క్షేత్రాన్ని ప్రత్యేకంగా పార్కింగ్‌కు నిర్ణయించాలని, ఆ ప్రాంతాన్ని మొత్తం చదును చేసి వాహనాల రాకపోకలకు ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేయాలన్నారు. తదుపరి వేదాద్రి క్షేత్రాన్ని పరిశీలించిన ఆయన గతంలోని పుష్కర ఘాట్‌లను పరిశీలించి అదనపు ఘాట్‌లపై అధికారులతో చర్చించారు. అవసరం లేని నిర్మాణాలను పడగొట్టి విశాలంగా తీర్చిదిద్దాలని దేవాదాయ శాఖ అధికారులకు సూచించారు. దేవాదాయ శాఖ కమిషనర్‌ను సంప్రదించి ఆలయంలో ప్రత్యేక నిర్మాణాలను చేపట్టాలన్నారు. కాగా బందోబస్తు చర్యలపై ఎస్పీ విజయకుమార్ స్థానిక అధికారులకు పలు సూచనలు చేశారు. కలెక్టర్‌తో పాటు ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్, సబ్ కలెక్టర్ సృజన, డిఎస్పీ ఉమామహేశ్వరరావు, సిఐ లచ్చునాయుడు, తహశీల్దార్ అనిల్ జన్నిసన్, ఎండిఒ జయచంద్ర, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి
కంచికచర్ల, మే 4: జాతీయ రహదారిపై పరిటాల సమీపంలో బుధవారం తెల్లవారుఝామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. సేకరించిన సమాచారం ప్రకారం.. కంచికచర్లకు చెందిన లారీ క్లీనర్లు కంభంపాటి గోపి(19), బత్తుల హర్షవర్థన్(20) బైక్‌పై విజయవాడ వెళ్లి తిరిగి వస్తుండగా పరిటాల సమీపంలో ఎదురుగా వెళుతున్న లారీ మరమ్మతులకు గురై షడన్ బ్రేక్ వేయడంతో వెనుక నుండి వీరి బైక్ లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వారు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

చారిత్రక వైభవానికి పునరుజ్జీవనం
* గణపతి దేవునికి అంకితం
* ఉప సభాపతి బుద్ధప్రసాద్
నాగాయలంక, మే 4: చారిత్రక వైభవానికి పునరుజ్జీవనం కలిగించటం ద్వారా గణపతిదేవుని మహత్మ్యాన్ని పొందే వీలు ఏర్పడిందని శాసనసభ ఉప సభాపతి, అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ అన్నారు. మండలంలోని గణపేశ్వరం గ్రామంలో బుధవారం శ్రీ దుర్గా గణపేశ్వర స్వామివారి సన్నిధిలో ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం ఆయన మాట్లాడుతూ కాకతీయుల కాలం నాటి ఆధ్యాత్మిక గురుతులకు అప్పటి సైన్యాధిపతి జాయప సేనాని మూలకారకులని చెప్పారు. నాటి సంకుల సమరంలో కయ్యానికంటే వియ్యమే మేలని తలంచిన జాయప సేనాని ఈప్రాంతం వారితో బంధుత్వం కలుపుకున్నట్లు చరిత్ర చెబుతోందన్నారు. విజయవాడలో ప్రసిద్ధి గాంచిన శ్రీ కనకదుర్గ ఆలయం తరువాత గణపేశ్వరంలోని శ్రీ దుర్గా గణపేశ్వర స్వామి ఆలయం అంతటి ప్రాముఖ్యత పొందిందన్నారు. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో కొలువైన అమ్మవారు, అయ్యవారు మహిమాన్వితులని, భక్తుల విశ్వాసాలకు ప్రతీకగా నేటికీ పూజలందుకుంటున్నారని చెప్పారు. కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని ఆలయ అభివృద్ధికి రూ.27లక్షలు నిధులు మంజూరు చేసినట్లు ఆయన వెల్లడించారు. తరతరాలుగా దివిసీమ ప్రాంత ప్రజలకు ఇలవేల్పుగా శ్రీ దుర్గా గణపేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి తనవంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని బుద్ధప్రసాద్ హామీ ఇచ్చారు. ఏపి విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ ఛైర్మన్ గ్రంధి భవానీప్రసాద్ మాట్లాడుతూ తన బాల్యదశ తాత గారి నేతృత్వంలో తలగడదీవి, గణపేశ్వరంలోనే గడిపానని, తన తల్లికి ఇష్టదైవమైన భవానీ పేరునే తన పేరుగా పెద్దలు పెట్టారని తెలిపారు. అప్పటి నుంచి తాను అమ్మవారి భక్తునిగా ఆమెకు సేవ చేసుకుంటున్నానన్నారు. తాను ఈ స్థాయికి చేరుకునేందుకు కారకులైన ఈప్రాంత ప్రజలకు రుణపడి ఉంటానని గ్రంధి చెప్పారు. ఆలయ నిర్వహణాధికారి టివివి మోహనరావు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి అటు ప్రభుత్వ సహకారాన్ని, ఇటు దాతల దాతృత్వాన్ని స్వీకరిస్తూ వివిధ కార్యక్రమాలను చేపడుతున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశీక ధర్మకర్త మండల రామకృష్ణ ప్రసాద్, పాలపర్తి శ్యామలానందప్రసాద్, ఎఎంసి ఛైర్మన్ మండవ బాలవర్ధనరావు, ఎంపిపి సజ్జా గోపాలకృష్ణ, ఎంపిటిసి తలశిల స్వర్ణలత, సర్పంచ్ దాసి జీవరత్నం, తదితరులు పాల్గొన్నారు.

అర్చక సేవలలో ఆగమశాస్త్రాలదే తుది నిర్ణయం
* మంత్రి వ్యాఖ్యలు దురదృష్టకరం
గుడివాడ, మే 4: దేవాలయాల నిర్వహణ, అర్చక సేవల విషయంలో ఆగమశాస్త్రాలదే తుది నిర్ణయమని, దీన్ని వ్యతిరేకించే అధికారం ఎవరికీ లేదని అర్చక సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఘంటసాల పద్మనాభశర్మ అన్నారు. హిందూ మత సంరక్షణకు, హైందవ సాంప్రదాయ వేద ధర్మాలకు బిజెపి కట్టుబడి ఉందని చెప్పుకొస్తున్న ఆ పార్టీ నాయకులు రాష్ట్ర దేవాదాయశాఖా మంత్రి పి మాణిక్యాలరావు వ్యాఖ్యలపై స్పందించాలన్నారు. బుధవారం స్థానిక పామర్రు రోడ్డు హరినారాయణపురంలోని బ్రాహ్మణ సేవాసమితి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. అర్చకులుగా బ్రాహ్మణులే కావాల్సిన అవసరం లేదని మంత్రి మాణిక్యాలరావు చేసిన వ్యాఖ్యలు సరికావన్నారు. సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి అగ్నిహోత్రం ఫణిగోపాల్ మాట్లాడుతూ రాజ్యాంగం మతస్వేచ్ఛకు రక్షణ కల్పించిందని, 25, 26, 27, 28 అధికరణలు మతస్వేచ్ఛ గురించి స్పష్టంగా పేర్కొన్నాయన్నారు. ఇటీవల తమిళనాడులో శివాచార్యుల కేసులో మతశాఖల స్వాతంత్య్రాన్ని, ఆగమశాస్తల్ర ప్రామాణికతను సుప్రీంకోర్టు స్పష్టంగా తెలియజేసిందన్నారు. సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి మామిళ్ళపల్లి నాగేంద్రరావు మాట్లాడుతూ మంత్రి మాణిక్యాలరావు వ్యాఖ్యలు అర్చకులను, హిందూ మతాన్ని కించపర్చినట్టుగా ఉన్నాయని, వెంటనే ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలన్నారు. ఈ సమావేశంలో డివిజన్ కార్యదర్శి భారతుల రమణ, బ్రాహ్మణ సేవాసమితి అధ్యక్షురాలు భాగవతుల ఉమామహేశ్వరి, నాయకులు మొక్కపాటి సూర్య, వైవి గోపాల్, వి చిట్టి, స్వర్ణ నాగభూషణం, సాతులూరి అనిల్‌కుమార్, బాలసుబ్రహ్మణ్యం, ఘంటసాల సుబ్రహ్మణ్య ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

రాజధానిలో అక్రమాలపై
ప్రధాని మోదీ దృష్టి
* కేంద్రంపై టిడిపి విమర్శలు అర్థరహితం
* బిజెపి నాయకుల స్పష్టీకరణ
అవనిగడ్డ, మే 4: రాష్ట్ర ప్రభుత్వ అక్రమాలపై ప్రధాని నరేంద్ర మోదీ దృష్టి సారించారని స్థానిక బిజెపి నాయకులు కె శ్రీమన్నారాయణ, చన్నగిరి ఆంజనేయులు, చిట్టా ప్రసాద్, బోగాది చంద్రశేఖర్ పేర్కొన్నారు. బుధవారం వారు విలేఖర్లతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలోని అవినీతిపరులు అన్యాయంగా బిజెపిపై విమర్శలు చేస్తున్నారని వారు తీవ్రంగా గర్హించారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రెండేళ్ల కాలంలో అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం 90వేల కోట్ల రూపాయలు విడుదల చేసిందని పేర్కొన్నారు. వాటికి తగిన లెక్కలు చూపకుండానే ఇంకా నిధులు కావాలంటూ కేంద్రాన్ని డిమాండ్ చేయడం, అక్రమార్కులు విమర్శలు చేయటం తీవ్ర అభ్యంతరకరమని వారు నిరసన వ్యక్తం చేశారు. ప్రధానంగా రాజధాని నగరం అమరావతి నిర్మాణ విషయంలో నిబంధనలను గాలికి వదిలేసి కొన్ని కంపెనీలు, వ్యక్తులకు మాత్రమే ప్రయోజనం కలిగేలా జరుగుతున్న వ్యవహారాలపై ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి సారించారన్నారు. తాజాగా ప్రధాని అమరావతికి సంబంధించిన భూ సమీకరణ నివేదికలు తెప్పించుకున్నారని వెల్లడించారు. అమరావతిలో అధికార పార్టీకి చెందిన మంత్రులు, పార్టీ నాయకులు, ఇతర ప్రజాప్రతినిధులు భారీగా భూములు కొన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయన్నారు. దీనికి సంబంధించి చాలావరకు పక్కా ఆధారాలు కూడా ప్రధాని వద్ద ఉన్నాయని వారు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎక్కడ రాజధాని వస్తుందో ముందుగానే తెలుసుకొని రైతుల నుంచి కారుచౌకగా వేలాది ఎకరాలను రాజకీయ నాయకులు చేజిక్కించుకున్న వైనంపై ప్రధాని వివరాలు సేకరిస్తున్నారన్నారు. దీంతో రైతులు అతి తక్కువ ధరకే భూమిని కోల్పోగా, రాజకీయ నాయకులు భారీగా ప్రయోజనం పొందారని వారు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వంపై ఇకనైనా విమర్శలు మానుకోవాలని, లేనిపక్షంలో పార్టీ పరంగా దీటుగా సమాధానం చెప్పాల్సి వస్తుందని బిజెపి నాయకులు హెచ్చరించారు.

ఉద్యమ స్ఫూర్తితో ఇంకుడు గుంటలు తవ్వాలి
* జెడ్పీ ఛైర్‌పర్సన్ అనూరాధ
గుడ్లవల్లేరు, మే 4: భూగర్భ జలాలు రోజురోజుకూ అడుగంటటంతో ప్రభుత్వం ఇంకుడు గుంటల తవ్వకాన్ని ఉద్యమంగా ముందుకు తెచ్చిందని జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ గద్దె అనూరాధ అన్నారు. బుధవారం స్థానిక అంబేద్కర్ నగర్‌లో రూ.22 లక్షలతో నిర్మించిన సిసిరోడ్డును ఆమె ప్రారంభించారు. టిడిపి మండల అధ్యక్షులు కొసరాజు బాపయ్య చౌదరి ఇంటి పెరటిలో ఇంకుడు గుంట తవ్వకం పనులు ఆమె ప్రారంభించి కంకర రాళ్లు వేశారు. అనంతరం రూ.30 లక్షలతో నిర్మించిన శ్రీశక్తి భవనాన్ని ఆమె ప్రారంభించారు. ఈసందర్భంగా అనూరాధ మాట్లాడుతూ ఇంకుడు గుంటలను ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, ఇంటి పెరట్లో తవ్వాలని పిలుపునిచ్చారు. 15రోజుల్లో వర్షాలు ప్రారంభం అవుతాయని, ఈలోపు ప్రతిఒక్కరూ ఇంకుడు గుంటలు తవ్వాలని ఆమె కోరారు. రాష్ట్రం లోటు బడ్జెట్‌లో ఉన్నా ప్రభుత్వం మహిళా అభివృద్ధిని మరువలేదన్నారు. శ్రీశక్తి భవనాల్లో మహిళలు వృత్తి శిక్షణ తరగతులు నిర్వహించుకోవాలన్నారు. అనంతరం స్థానిక పిహెచ్‌సిని ఆమె పరిశీలించారు. పిహెచ్‌సి ఛైర్మన్ చాపరాల రాజేశ్వరరావు మాట్లాడుతూ ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసుకుని ఛైర్మన్‌గా తాను ఎన్నికై ప్రమాణస్వీకారం చేసినప్పటికీ తన విధివిధానాలు ఇంత వరకు తెలియ చేయలేదన్నారు. ఆసుపత్రి రోగులకు ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ బాగు చేసేందుకు పిహెచ్‌సిలో మెయింటెనెన్స్ నిధులు లేవన్నారు. స్పందించిన అనూరాధ డిఎంహెచ్‌ఓ నాగమల్లేశ్వరితో ఫోన్‌లో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. సర్పంచ్ వల్లభనేని వెంకట సుబ్బారావు మాట్లాడుతూ ఫిల్టర్ బెడ్ అధ్వానంగా ఉందని తెలిపారు. జెడ్పీ నుంచి 50 శాతం నిధులు మంజూరు చేయనున్నట్లు అనూరాధ తెలిపారు. అనంతరం స్థానిక పిఎసిఎస్‌లో ఇంకుడు గుంటను తవ్వారు. అలాగే డ్వాక్రా మహిళలకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉపాధ్యక్షురాలు శాయన పుష్పవతి, ఎస్‌పిహెచ్‌ఓ రమాదేవి, ఎంపిపి కొసరాజు విజయభారతి, మాజీ ఎఎంసి ఛైర్మన్ కొసరాజు వెంకటాద్రి చౌదరి, పిఎసిఎస్ అధ్యక్షులు పి రవికుమార్, తహశీల్దార్ ఆత్మకూరి మధుసూధనరావు, పి వెంకట్రావు, తదితరులు పాల్గొన్నారు.