కృష్ణ

తప్పు చేసినట్టు రుజువు చేస్తే మూకుమ్మడిగా రాజీనామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), మే 14: కేవలం రాజకీయ లబ్ధికోసమే సిపిఎం, సిపిఐ నేతలు తమ అధ్యయన యాత్రపై లేనిపోని విమర్శలు చేసి కాలం గడుపుతున్నారని, యాత్రలో కార్పొరేటర్లు ఎవరైనా తప్పు చేశారని రుజువు చేస్తే యాత్రకు వెళ్లిన వారందరం రాజీనామా చేస్తామని, రుజువు చేయలేని పక్షంలో తమ తప్పును ఒప్పుకొని నగర ప్రజలకు వామపక్షాల నేతలు క్షమాపణలు చెప్పాలని నగర డెప్యూటీ మేయర్ గోగుల రమణారావు, టిడిపి ఫ్లోర్ లీడర్ గుండారపు హరిబాబు పేర్కొన్నారు. అధ్యయన యాత్రపై వామపక్ష నేతలు సిపిఎం నగర కార్యదర్శి దోనేపూడి కాశీనాథ్, సిపిఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ చేసిన విమర్శల నేపథ్యంలో యాత్రను ముగించుకొని శుక్రవారం రాత్రికి నగరానికి చేరుకొన్న కార్పొరేటర్లు శనివారం సాయంత్రం కౌన్సిల్ హాల్లోని టిడిపి ఛాంబర్‌లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్ మాట్లాడుతూ అధికార టిడిపి పాలనపై జరుగుతున్న అభివృద్ధిని ఓర్వలేకే వామపక్షాలు అర్ధరహిత విమర్శలు చేస్తున్నాయని, వారి పాలనలో చేసినట్టుగా తాము ఎటువంటి అడ్డగోలు పనులకు పాల్పడలేదని స్పష్టం చేశారు. డెప్యూటీ మేయర్ గోగుల రమణారావు మాట్లాడుతూ తాము కేవలం అధ్యయన యాత్ర మాత్రమే చేశామని, వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ పాలనలో జరిగినట్టుగా విహార యాత్రల మాదిరిగా తాము ఎటువంటి అనైతిక చర్యలకు పాల్పడలేదని ఉద్ఘాటిస్తూ ధైర్యం ఉంటే తాము చేసిన తప్పేమిటో సత్వరమే రుజువు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కార్మికుల శ్రేయస్సు కోసమే తాము పోరాటాలు చేసేదంటూ ప్రగల్బాలు చేసే ఆయా వామపక్ష నేతలు పారిశుద్ధ్య కార్మికులకు తాము జీతాలు పెంచితే ఒకొక్కరి వద్ద వెయ్యి రూపాయలను డొనేషన్ల పేరిట లంచాలు వసూలు చేసిన ఘనత వారిదని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం కార్పొరేటర్లుగా గెలిచిన వారిలో 10 మంది తప్పించి మిగతా వారందరూ నూతనంగా గెలుపొందిన వారేనని, దేశంలోని ఇతర కార్పొరేషన్లలో జరిగే పనితీరుకు, మన కార్పొరేషన్‌లో జరిగే పనితీరుకు గల వ్యత్యాసంతోపాటు మన నగరంలో ఏయే కార్యక్రమాలు చేపట్టాలన్న అవగాహన కోసమే దేశంలో ప్రాముఖ్యత గల ఏడు కార్పొరేషన్ల పర్యటన చేపట్టామన్నారు. గతంలో కూడా 1999లో వామపక్షాలు, 2008లో కాంగ్రెస్ పార్టీ పాలనలో కూడా అప్పటి కార్పొరేటర్లు విజ్ఞాన యాత్రలు చేపట్టిన విషయాన్ని పక్కన పెట్టి టిడిపి ఒక్కటే ఏదో దుబారా చేస్తున్నట్టు లేనిపోని విమర్శలు చేయడం సరికాదన్నారు. అలాగే యాత్రలో భాగంగా పూణేలో పోలీసులు టిడిపి కార్పొరేటర్లను అదుపులోకి తీసుకున్నారంటూ అన్న విషయంతోపాటు 25వ డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావుపై తోటి ప్రయాణికురాలిపై అనుచితంగా ప్రవర్తించారంటూ ఎయిర్ ఫోర్స్ అధికారులకు ఫిర్యాదు చేశారంటూ వచ్చిన ఆరోపణల్లో కూడా ఎటువంటి వాస్తవం లేదని, ఫిర్యాదు చేసిన విషయం తెలియదు కానీ ఎయిర్ ఫోర్స్ అధికారులు మాత్రం జరిగిన ఘటనపై వివరణ అడగగా రాతపూర్వకంగా ఇచ్చానే కానీ ఎటువంటి అనైతిక చర్యలకు పాల్పడ లేదని స్పష్టం చేశారు. ఈవిషయంలో తాము ఎటువంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నామన్నారు. టిడిపి ఫ్లోర్ లీడర్ గుండారపు హరిబాబు మాట్లాడుతూ కేవలం అధ్యయన యాత్రకు వెళ్లిన తమపై మీడియాలో అవాస్తవ కథనాలను సృష్టించి అల్లరి చేసిన వామపక్ష నేతలు దోనేపూడి శంకర్, దోనేపూడి కాశీనాథ్ నిజ నిజాలను తెలుసుకోకుండా మాట్లాడటం అప్రజాస్వామికమన్నారు. గతంలో కార్పొరేటర్లుగా పనిచేసిన వారు కూడా యాత్రలకు వెళ్లారని, అప్పట్లో వారి చేసినట్టుగా అందరూ చేశారని ఊహించుకోవడం సరికాదన్నారు. తమపై వారు చేసిన విమర్శలను వారి విజ్ఞతలకే వదిలేస్తున్నామని, రాజకీయాలకతీతంగా ప్రతిపక్ష వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు కూడా యాత్రలో ఉన్నారన్న విషయాన్ని గుర్తించాలన్నారు. అధికార పక్షం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశానికి హాజరైన ప్రతిపక్ష వైసిపి కార్పొరేటర్ బొప్పన భవకుమార్ మాట్లాడుతూ తమ అధ్యయన యాత్ర వలన ఎంతో నేర్చుకున్నామని, నగరంలో చేపట్టాల్సిన అనేక అభివృద్ధి పనులపై అవగాహన కలిగిందన్నారు. ఈసమావేశంలో టిడిపి కార్పొరేటర్లు చెన్నుపాటి గాంధీ, యేదుపాటి రామయ్య, ముప్పా వెంకటేశ్వరరావు, అల్లు జయలక్ష్మీ, కో-అప్షన్ సభ్యుడు సిద్దెం నాగేంద్రరెడ్డి, వైసిపి కార్పొరేటర్లు సిహెచ్ సుజాత, పి సుభాషిణి, బి సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.

పేలవంగా ఐపిఎల్ ఫ్యాన్ పార్క్

విజయవాడ (స్పోర్ట్స్), మే 14: స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఐపిఎల్ ఫ్యాన్ పార్క్ మొదటి రోజు పేలవంగా కనిపించింది. క్రికెట్‌ను జనంలోకి తీసుకువెళ్లడానికి బిసిసిఐ రూపొందించిన ప్రణాళికలో భాగంగా ఎంపిక చేసిన నగరాల్లో భారీ స్క్రీన్లను ఏర్పాటు చేసి క్రికెట్ విందును అందించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. అయినప్పటికీ ప్రేక్షకులు అనుకున్న స్థాయిలో హాజరుకాకపోవడంతో ఫ్యాన్‌పార్క్ ఏర్పాటు చేసిన ప్రదేశమంతా ఖాళీగా జనం లేకుండా కనిపించింది. ఒకవైపు వేసవి కావడం, మరోవైపు జనం బయటకు రాని స్థితి నెలకొనడం కూడా ఒకందుకు జనం లేకపోవడానికి కారణంగా పేర్కొనవచ్చు. దీనికి తోడు క్రికెట్‌ను అభిమానించే అభిమానులు చక్కగా ఇంటి వద్దే టివిలో క్రికెట్‌ను వీక్షిస్తూ ఆనందించారు. సాధారణ సమయాల్లో ఈ విధంగా స్క్రీన్లను ఏర్పాటు చేస్తే జనం వాటిని ఎంజాయ్ చేసుండేవారు. వేసవి నేపథ్యంలో మండుటెండ సెగలు కక్కుతున్న మధ్యాహ్నం సమయం కావడంతో జనాధారణకు ఫ్యాన్‌పార్క్ ఏర్పాటు చేసిన స్క్రీన్లు నోచుకోలేదని చెప్పొచ్చు.

వాంబే కాలనీని జల్లెడ పట్టిన పోలీసులు

పాయకాపురం, మే 14: అనుమానితులను, నేరస్తులను జల్లెడపట్టే క్రమంలో భాగంగా పోలీసులు నిర్వహిస్తున్న కార్డన్ అండ్ సెర్చ్‌లో భాగంగా అజిత్‌సింగ్‌నగర్ వాంబే కాలనీలోని సి బ్లాక్‌లో శనివారం తెల్లవారుజామున పోలీసులు సెర్చ్ నిర్వహించారు. ఈ సెర్చ్‌లో నార్త్‌జోన్ ఏసిపి శ్రావణి, సౌత్ జోన్ ఏసిపి శ్రీనివాసరావు, ఈస్ట్ ఏసిపి విజయభాస్కర్ పాల్గొనగా ఐదుగురు సిఐలు, 15 మంది ఎస్సైలు, 200 మంది కానిస్టేబుళ్లు సోదాల్ని నిర్వహించారు. ప్రతి ఫ్లాట్‌కు వెళ్లి అక్కడ నివాసముంటున్న వారి వివరాల్ని సేకరించారు. దీంతో అసలు ఏం జరుగుతుందో తెలియక స్థానికులు అయోమయానికి గురైయ్యారు. వాంబే కాలనీని పోలీసులు అష్ట దిగ్భంధనం చేశారు. ఈ సోదాల్లో ఎవరికైనా నేర చరిత్ర ఉందేమోనన్న సందేహంతో సుమారు 300 మందికి ఐరీష్ పరీక్షలు నిర్వహించారు. వీరిలో అనుమానితులైన ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే సరైన పత్రాలు లేని 35 వాహనాల్ని సీజ్ చేసిన పోలీసులు వాటిని స్టేషన్‌కు తరలించారు.