కృష్ణ

జన్మభూమి కార్యక్రమాలను విజయవంతం చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), డిసెంబర్ 30: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా జనవరి 2 నుంచి నిర్వహిస్తున్న 3వ విడత జన్మభూమి కార్యక్రమాల విజయవంతానికి అందరూ కృషి చేయాలని నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్, కమిషనర్ వీరపాండియన్ కోరారు. ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం కౌన్సిల్ హాల్లో విఎంసి అధికారులు, అన్ని డివిజన్ కార్పొరేటర్లకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మేయర్ శ్రీ్ధర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికగా ఉన్న జన్మభూమి ద్వారా ప్రజలకు విస్తృత ప్రయోజనాలున్నాయన్న విషయాన్ని గుర్తించి రాజకీయాలకు అతీతంగా డివిజన్ ప్రజలందరూ పాల్గొనేలా కార్పొరేటర్లు కృషి చేయాలని హితవుపలికారు. కమిషనర్ వీరపాండియన్ మాట్లాడుతూ విఎంసి సంబంధిత సమస్యలే కాకుండా వివిధ ప్రభుత్వ విభాగాలకు చెందిన అధికారులందరూ జన్మభూమి కార్యక్రమాల్లో పాల్గొంటారని, స్థానిక సమస్యలతోపాటు ప్రభుత్వ విభాగాల సమస్యలను కూడా కార్పొరేటర్లు అధికారుల దృష్టికి తీసుకురావాలని హితవుపిలికారు. రేషన్ కార్డులు, పెన్షన్ల దరఖాస్తులతోపాటు మంజూరైన వాటిని పంపిణీ చేస్తారన్నారు. అలాగే జన్మభూమి కార్యక్రమాల్లో పాల్గొనాల్సిన వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులెవ్వరైనా పాల్గొనకపోతే తక్షణమే తన దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నగరంలోని మూడు సర్కిల్స్ కు చెందిన స్పెషల్ ఆఫీసర్లు తమ పరిధిలో ఏయే డివిజన్లలో ఏయే రోజుల్లో జన్మభూమి జరుగుతుందన్న విషయంపై వివరణ ఇవ్వగా జన్మభూమి కార్యక్రమాల నిర్వహణపై అధికార పార్టీ కార్పొరేటర్లతోపాటు విపక్ష కార్పొరేటర్లు పలు అభ్యంతరాలను వ్యక్తం చేశారు. టిడిపి సీనియర్ కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు, సిపిఎం ఫ్లోర్ లీడర్ జి ఆదిలక్ష్మీలు మాట్లాడుతూ గతంలో జరిగిన జన్మభూమి, రచ్చబండ కార్యక్రమాల్లో ప్రజలు దరఖాస్తు చేసుకొన్న వాటి పరిస్థితి ఏమిటన్న విషయంపై ప్రజలు ప్రశ్నిస్తే అధికారులు తగు సమాధానం చెప్పేవిధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ బండి నాగేంద్ర పుణ్యశీల మాట్లాడుతూ జన్మభూమి కార్యక్రమ వేదికలపై తప్పనిసరిగా ప్రొటోకాల్ పాటించాలని, ముఖ్యంగా విపక్ష కార్పొరేటర్లు ఉన్న డివిజన్‌లలో అధికార పార్టీకి చెందిన నేతలను వేదికపైకి ఆహ్వానిస్తున్న తీరు అధికార పార్టీ డివిజన్లలో జరిగే వేదికలపై విపక్ష నేతలను ఆహ్వానించని తీరు పై ఆమె మండిపడ్డారు. ఈవిషయంలో కఠినంగా వ్యవహరించాలని సూచించారు.

విజయవాడ రైల్వేస్టేషన్‌లో త్వరలో వైఫై సేవలు
* కృష్ణా పుష్కరాల నాటికి 1, 6 ప్లాట్‌ఫాంలపై కొత్త ఎస్కలేటర్లు
* రైల్వే వినియోగదారలు సలహా మండలి సమావేశంలో డిఆర్‌ఎం
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, డిసెంబర్ 30: అంతర్జాతీయ పరిస్థితుల ఆర్థిక సంక్షోభం కారణంగా సరుకుల రవాణాలో కొంతమేర తగ్గుముఖం, ప్రయాణికుల సంఖ్య తగ్గినప్పటికీ విజయవాడ రైల్వే డివిజన్ గత ఏడాది ఇదేకాలంతో పోల్చితే ఆదాయంలో 5.62 శాతం వృద్ధిని సాధించినట్లు రైల్వే డివిజనల్ మేనేజర్ అశోక్‌కుమార్ తెలిపారు. విజయవాడ డివిజనల్ రైల్వే వినియోగదారులు సలహా మండలి సమావేశం డివిజనల్ రైల్వే మేనేజర్ అశోక్‌కుమార్ అధ్యక్షతన విజయవాడలో బుధవారం జరిగింది. ఈ సమావేశానికి విచ్చేసిన సలహా మండలి సభ్యులను సలహా మండలి కార్యదర్శి, డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఎన్.వి.సత్యనారాయణ ఆహ్వానించారు. ఈ సందర్భంగా విజయవాడ రైల్వే డివిజన్ సాధించిన ప్రగతి, ప్రయాణికుల సదుపాయాల నిమిత్తం పూర్తి చేసిన పనులు, ప్రస్తుతం అమలులో ఉన్న పనులను అశోక్‌కుమార్ వివరించారు. విజయవాడ రైల్వేస్టేషన్లో కొత్తగా విశ్రాంతి మందిరం నిర్మాణంతో పాటు ప్రస్తుతం ఉన్న ఎసి విశ్రాంతి మందిరాన్ని పొడిగించే పనులు పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. టికెట్ కౌంటర్ల వద్ద ప్రయాణికుల క్యూలైన్ తగ్గించాలన్న ఉద్దేశంతో డివిజన్‌లోని 38 రైల్వేస్టేషన్లలో 81 ఆటోమేటిక్ టికెట్ మిషన్లను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. విజయవాడ రైల్వేస్టేషన్లో శుద్ధి చేసిన తాగునీటిని విక్రయించే 12 మిషన్లు ఏర్పాటు చేయడంతో పాటు డివిజన్లో మరో 66 మిషన్లు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. గోదావరి, నిడదవోలు రైల్వేస్టేషన్లలో కొత్తగా ఫుట్ ఓవర్‌బ్రిడ్జిల నిర్మాణం పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. నెల్లూరు రైల్వేస్టేషన్లోని 2,3 ప్లాట్‌ఫారంపై ఒక ఎస్కలేటర్ ఏర్పాటు చేయడంతో పాటు గూడూరు, ఒంగోలు, అనకాపల్లి, విజయవాడ రైల్వేస్టేషన్‌లో మరో నాలుగు ఎస్కలేటర్ల ఏర్పాటు త్వరలో జరుగుతుందని ఆయన ప్రకటించారు. విజయవాడ రైల్వేస్టేషన్‌లోని 1,6 ఫ్లాట్‌ఫాంలపై పాతబడిన ఎస్కలేటర్లను కృష్ణ పుష్కరాల నాటికి మారుస్తామని ఆయన తెలిపారు. విజయవాడ రైల్వేస్టేషన్లో త్వరలో వైఫై సేవలు అందిస్తామని డివిజనల్ రైల్వే మేనేజర్ తెలిపారు. రైల్వే ఆదాయం మెరుగుపడటానికి, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడానికి తమ సహాయ సహకారాలు అందించవలసిందిగా డివిజనల్ రైల్వే మేనేజర్ సభ్యులను కోరారు. డివిజన్‌లో ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, అండర్ బ్రిడ్జిల నిర్మాణాలను ట్రాఫిక్ పరిశీలన ఆధారంగా జరుగుతుందని ఆయన తెలిపారు. రైల్వేస్టేషన్లలో వివిధ సదుపాయాల కోసం స్వచ్ఛంద సంస్థలు, ప్రముఖ పారిశ్రామిక సంస్థల సహకారం కోసం ప్రయత్నించాలని డిఆర్‌ఎం సభ్యులను కోరారు. ఈ సమావేశంలో మొత్తం 18 మంది సభ్యుల్లో 13 మంది హాజరైయ్యారు. రైలు ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న సభ్యుల పాత్రను డివిజన్ రైల్వే మేనేజర్ ప్రశంసించారు. ఈ సందర్భంగా పలువురు సభ్యులు ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలని, కొత్త రైళ్లను ప్రవేశపెట్టాలని, కొత్తగా కొన్ని హాల్ట్‌లను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. జోనల్ రైలు వినియోగదారుల సలహా మండలి సంఘానికి వి.సతీష్‌బాబును సమావేశం ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ఈ సమావేశంలో అడిషనల్ డివిజనల్ రైల్వే మేనేజర్ కె.వేణుగోపాలరావు, డివిజనల్ సీనియర్ ఆపరేషన్స్ మేనేజర్ కె.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

భవానీ దీక్షల విరమణకు సిద్ధం
* ఇవో నరసింగరావు
ఇంద్రకీలాద్రి, డిసెంబర్ 30: సకల పాప నివారణ, ఆయురారోగ్య భోగ భాగ్య సుఖశాంతులను ఆకాంక్షిస్తూ 41రోజులుపాటు అత్యంత నియమనిష్ఠలను పాటించి గురువారం అమ్మవారి సన్నిధికి వచ్చి అమ్మవారి భవానీదీక్షలు విరమణ చేసే భవానీలకు కోసం సకల ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు దుర్గగుడి ఇవో సిహెచ్ నరసింగరావు తెలిపారు. ఐదురోజులు పాటు రెండు రాష్ట్రాలనుంచి వచ్చే భవానీలను కోసం సుమారు 5కోట్ల వ్యయంతో వౌలిక వసతులకు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ దీక్షల విరమణకు సంబంధించిన చేసిన ఏర్పాట్లపై బుధవారం ఉదయం తనను కలిసిన విలేఖరులతో ఆయన కొద్దిసేపు మాట్లాడారు. రెండు రాష్ట్రాల నుండి సుమారు 18లక్షల మంది భవానీలు దీక్షలు విరమణ చేసే అవకాశం ఉందని ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి అమ్మవారి సన్నిధికి వచ్చే భవానీలు ఎంతోప్రశాంతమైన వాతావరణంలో అమ్మవారిని దర్శనం, ఇరుముడులు సమర్పణ, మొక్కుబడులను చెల్లింపులు, అమ్మవారి ప్రసాదాల కొనుగోలు వంటి వాటికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేసినట్లు ఆయన వివరించారు. అనంతరం వారు తమ తమ గమ్యస్థానాలకు వెళ్లే విధంగా అన్ని వసతులను ఏర్పాటు చేసినట్లు వివరించారు. వివిధ ప్రాంతాల నుండి నగరానికి చేరుకున్న భవానీలు తొలుత పవిత్ర కృష్ణనదీలో పవిత్ర స్నానాలు ఆచరించి ఇరుముడులకు గురుభవానీల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించుకొని తర్వాత ఇరుముడులను శిరస్సుపై ధరించి గిరిప్రదక్షణ చేసి కెనాల్‌రోడ్ వినాయకుడి వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యూమార్గంలోనికి ప్రవేశించి కెనాల్‌రోడ్, అశోక్ స్థంభం, టోల్‌గేట్ గుండా ఘాట్‌రోడ్ మీదుగా అమ్మవారిని దర్శించుకొని శ్రీమల్లిఖార్జున మహామండపం నుండి మెట్ల మార్గం గుండా కిందకు హోమగుండంలో గురుభవానీల ఆధ్వర్యంలో ఇరుముడులు సమర్పించుకొని దీక్షామాలను తీయించుకొనే విధంగా ఏర్పాట్లు చేసినట్లు ఆయన వివరించారు. పుష్కర ఘాట్ (దుర్గా ఘాట్)తోపాటు అన్ని ముఖ్యమైన ఘాట్‌ల్లో భారీగా భవానీలు,్భక్తులకు అవసరమైన అతిముఖ్యమైన మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యం, వైద్యశిబిరం, క్లోక్ రూమ్, మహిళ భక్తులకు బట్టలు మార్చుకోవటానికి ప్రత్యేక వసతి, షవర్ బాతులు, బార్బర్లు వంటి అన్నిరకాలైన వసతులను ఏర్పాటు చేసినట్లు ఇవో వివరించారు. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఇరుముడులు సమర్పించుకున్న భవానీలకు నిత్యం సుమారు 10వేలమందిపైగా అర్జున వీధిలోని శంకరమఠంలోనిత్యాన్నదాన పథకాన్ని మంగళవారం నుంచే ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. శంకరమఠానికి ఎదురుగానే శ్రీకనకదుర్గ నగర్‌లో సుమారు 20 ప్రసాదాల కౌంటర్‌లను ఏర్పాటు చేసి అమ్మవారి మహాప్రసాదాలలైన లడ్డూ, పులిహార అమ్మకాలను ఏర్పాటు చేసినట్లు నరసింగరావు వివరించారు. 5రోజులను దృష్టిలో పెట్టుకొని సుమారు 18 లక్షల మేరకు లడ్డూలను సిద్ధం చేస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ ప్రత్యేక ప్రసాదాల కౌంటర్‌లతోపాటు రైల్వే స్టేషన్, బస్‌స్టేషన్ వంటి కీలక ప్రాంతాల్లో సైతం ప్రసాదాలను విక్రయించేందుకు స్టాల్స్‌ను సైతం ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. గిరిప్రదక్షణ చేసే భవానీలను దృష్టిలో పెట్టుకొని ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను ఈ ఐదు రోజులు ఆపించటంతోపాటు భవానీలు గిరిప్రదక్షణ చేసే ఇంద్రకీలాద్రి చుట్టూ ఉన్న రోడ్‌ను భవానీలు గిరిప్రదక్షణ చేసేందుకు వీలుగా రోడ్‌ను బాగు చేయించటం జరిగిందన్నారు. అమ్మవారి సన్నిధికి ఈ ఐదు రోజులు పాటు వచ్చే భవానీలు, భక్తులెవరైనా ఎటువంటి ఇబ్బంది పడకుండా ప్రశాంతమైన వాతావరణంలో అమ్మవారిని దర్శించుకొని మొక్కుబడులను చెల్లించు కోనే విధంగా అన్ని రకాలైన సౌకర్యాలను ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. ప్రత్యేకంగా జలవనరులశాఖ మంత్రితో మాట్లాడి దుర్గా ఘాట్‌లో నీటిమట్టాన్ని సైతం పెంచిన విషయాన్ని ఈసందర్భంగా ఇవో సిహెచ్ నరసింగరావు గుర్తు చేశారు. అన్ని శాఖల ఉద్యోగులను శ్రీదుర్గా మల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం సిబ్బంది సమన్వయం చేసుకొంటూ భవానీ దీక్షల విరమణ కార్యక్రమాన్ని సైతం విజయవంతంగా పూర్తి చేయగలమని ఇవో సిహెచ్ నరసింగరావు ఆత్మవిశ్వాసంతో చెప్పారు.
ప్రత్యేక పూజలతో దీక్షల విరమణ ప్రారంభం
శ్రీ మల్లిఖార్జున మహామండపం ఆవరణలో ఏర్పాటు చేసిన హోమగుండాలకు దుర్గగుడి ఇవో సిహెచ్ నరసింగరావు,విజయలక్ష్మీ దంపతులచేత గురువారం ఉదయం 7గంటలకు ఆస్థానాచార్యుడు విష్ణుబొట్ల శివప్రసాద్ ఆధ్వర్యంలో అర్చకులు హోమగుండంలో అగ్నిప్రతిష్ఠాపన చేయించిన వెంటనే దీక్షల విరమణ ప్రారంభం అవుతోంది. ఇవో దంపతులను ఈహోమగుండం ముందుకూర్చోబెట్టి విఘ్నేశ్వర పూజ, కలశస్థాపన, అగ్నిప్రతిష్ఠాపన చేయించిన వెంటనే దీక్షల విరమణ ప్రారంభం అవుతోంది.

జర్నలిస్టుల సంక్షేమానికి
ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత
* సమాచార పౌరసంబంధాల శాఖా మంత్రి పల్లె రఘునాథరెడ్డి
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, డిసెంబర్ 30: జర్నలిస్టు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖా మంత్రి పల్లె రఘునాధరెడ్డి అన్నారు. స్థానిక ముఖ్యమంత్రి కార్యాలయ మీడియా పాయింట్ వద్ద బుధవారం మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. దేశంలోని ఏ ఇతర రాష్ట్రాలలోను అమలులో లేని పథకాలు విలేఖరుల కోసం ముఖ్యమంత్రికి నారా చంద్రబాబునాయుడు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని మంత్రి ఈ సందర్భంగా అన్నారు. నగదు రహిత వైద్య సేవల్ని రాష్ట్రంలోని పాత్రికేయులందరికీ అమలులోకి తెచ్చిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని మంత్రి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా యన్‌టిఆర్ వైద్య సేవలు అమలవుతున్న అన్ని ప్రైవేట్, ప్రభుత్వ, కార్పొరేట్ ఆసుపత్రులలో పాత్రికేయులకు హెల్త్ కార్డులపై నగదు రహిత వైద్య సేవలు అందుబాటులోకి వచ్చే విధంగా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. ఎక్కడైనా ఈ సేవలు అందుబాటులోకి రాని పరిస్థితి తలెత్తితే తమ దృష్టికి తేవాలని, తక్షణమే స్పందించి హెల్త్ కార్డులపై నగదు రహిత వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. పాత్రికేయుల కుటుంబ సభ్యులతో పాటు వారి తల్లిదండ్రులకు గరిష్టంగా రూ.2.5 లక్షల మేర నగదు రహిత వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు. మండల, జిల్లా, రాష్ట్ర కేంద్రాలలో పాత్రికేయులకు ఇళ్లస్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. డెస్క్ జర్నలిస్ట్‌లకు అక్రిడిటేషన్ కార్డులు, హెల్త్ కార్డులు జారీ చేసేందుకు నిర్ణయించామని, దీనికి సంబంధించి త్వరలోనే ఉత్తర్వులు వెలువడతాయని పేర్కొన్నారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలపై సమాచారాన్ని ప్రజలకు సమర్థవంతంగా చేరవేసే బాధ్యత మీడియాపై ఉందని మంత్రి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. రాబోయే జన్మభూమి కార్యక్రమం, చంద్రన్న క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి కానుకల పంపిణీపై సమాచారాన్ని ప్రజలకు చేరవేయాలని మంత్రి పాత్రికేయులకు విజ్ఞప్తి చేశారు. ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలకు వెళ్లేందుకు నాసి రెసిడెంట్ ఇండియన్స్ శాఖ గుర్తింపు పొందిన ఏజన్సీలను మాత్రమే ఆశ్రయించాలని మంత్రి కోరారు. పాత్రికేయుల సమావేశంలో సమాచార పౌర సంబంధాల కమిషనర్ పి.కృష్ణమోహన్ పాల్గొన్నారు.

ఏడాదికాలంలోనే సిఆర్‌డిఎ విశేష ప్రగతి
* మున్సిపల్ మంత్రి నారాయణ
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, డిసెంబర్ 30: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఎపిసిఆర్‌డిఎ) ఆవిర్భవించిన ఏడాది కాలంలోనే కీలక ఘట్టమైన ప్రతిపాదిత రాజధాని ప్రాంత, నగర, సీడ్ క్యాపిటల్ బృహత్ ప్రణాళికల ముసాయిదాలను ప్రజల ముందుంచగలిగామని ఎపిసిఆర్‌డిఎ ఉపాధ్యక్షులు, రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ అన్నారు. ఏడాదికాలంలో దేశ, విదేశాల్లో నిపుణుల బృందాలతో పర్యటనలు జరిపి వివిధ అంశాలపై అధ్యయనాలు చేసిన తర్వాత బృహత్ ప్రణాళికలను తీర్చిదిద్దడం జరిగిందన్నారు. ప్రణాళికలకు సంబంధించి విస్తృత ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించి ప్రజల మనోభావాలకు అనుగుణంగా అడుగులు వేశామన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలో రూపొందించిన భూసమీకరణ విధానం అందరినీ ఆకట్టుకుందన్నారు. ప్రజా రాజధాని అమరావతికి అవసరమైన భూమిని ఎలాంటి వివాదాలకు తావు లేకుండా రైతుల సహాయ సహకారాలతో దేశంలోనే వినూత్నమైన భూసమీకరణ విధానంతో 33 వేల ఎకరాలు సమకూర్చుకోవడం జరిగిందని తెలిపారు. భూసమీకరణ సమయంలో ప్రభుత్వానికి సహకరించిన రైతులందరికీ అభినందనలు తెలిపారు. రాష్ట్ర మంత్రులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు భూసమీకరణకు ఎంతో తోడ్పాటును అందించారన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సారధ్యంలో అమరావతిని ప్రపంచ శ్రేణి రాజధానిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని తెలిపారు. రాష్ట్ర విభజన అనంతరం ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నూతన రాజధాని నిర్మాణం చేపట్టే బాధ్యతను ఎపిసిఆర్‌డిఎకు అప్పగించారని కమిషనర్ శ్రీకాంత్ అన్నారు. ఈ సంవత్సరం కాలంలో ప్రతిపాదిత రాజధాని ప్రాంత, నగర, సీడ్ క్యాపిటల్ బృహత్ ప్రణాళికల ముసాయిదాలను రూపొందించి ప్రజల ముందుంచడంలో ఎపిసిఆర్‌డిఎ సిబ్బంది నిరంతర శ్రమ ఉందన్నారు. భూసమీకరణ సమయంలో ప్రభుత్వానికి సహకరించిన రైతులందరినీ కమిషనర్ అభినందించారు. రైతులకు సంబంధించినన లేఔట్లు కేటాయించే పనులు వేగంగా జరగాలని అన్నారు. రానున్నకాలంలో అధికారులు, ఉద్యోగులు ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ మరింత ఉత్సాహంగా ప్రజల మన్ననలు పొందే విధంగా పని చేయాలని సూచించారు.

హరిత ఎన్‌టిఐ ఉత్పత్తులు విడుదల
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, డిసెంబర్ 30: అమరావతి అసోసియేట్స్ - హరిత ఎన్‌టిఐసి, అమెరికాకు చెందిన నూతన ఉత్పత్తులు నగర మార్కెట్లోకి రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ విడుదల చేశారు. ఎంజి రోడ్డులోని హోటల్ ఫార్చ్యూన్ మురళి నందు బుధవారం జరిగిన కార్యక్రమంలో ఉత్పత్తులను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ అమరావతి అసోసియేట్స్ డొమెస్టిక్, నాన్ డొమెస్టిక్ ఉత్పత్తులను నూతన రాజధాని అమరావతిలో ఆవిష్కరించడం అభినందనీయమని, సంస్థ భవిష్యత్తులో మరిన్ని ఉత్పత్తులు ఆవిష్కరించి రాష్ట్ర ప్రజలకు చేరువకావాలని ఆకాంక్షించారు. అమరావతి అసోసియేట్స్ డైరెక్టర్లు యామిని సాధినేని, సతీష్‌బాబు గట్టినేని మాట్లాడుతూ టివిఎస్ కంపెనీకి చెందిన హరిత ఎన్‌టిఐ ఉత్పత్తులకు దేశ వ్యాప్తంగా మంచి ఆదరణ ఉందని పేర్కొన్నారు. ఈ ఉత్పత్తులను అమరావతి అసోసియేట్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో మార్కెటింగ్ చేస్తుందని తెలిపారు. నూతన రాజధాని విజయవాడ నగరంలో ప్రధానంగా ఆరు ఉత్పత్తులను ఆవిష్కరించినట్లు తెలిపారు. ప్రధాన ఉత్పత్తుల్లో డ్యూరా సిల్వర్ ఇది వెండి, ఒక గ్రాము ఆభరణాలు నల్లబడకుండా ఉండేందుకుగాను డ్యూరా సిల్వర్ కవర్లు ప్రత్యేకంగా రూపొందించినట్లు తెలిపారు. వెండి, ఒక గ్రాము ఆభరణాలు జిప్‌లాక్ కవర్లలో ఉంచడం వలన నల్లబడకుండా చాలా సంవత్సరాలు ఉంటాయని తెలిపారు. జీరస్జ్ ప్రొడక్ట్స్ ఇది కార్లు, వివిధ రకాలైన మెషిన్లకు తుప్ప పట్టకుండా ఉండేందుకుగాను జీరస్ట్ స్ప్రే చేయడం వలన చాలా సంవత్సరాలు తుప్పు లేకుండా ఉంటుందని తెలిపారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి సంబంధించి పైపులైన్లు లీకేజిని అరికట్టేందుకు అమరావతి అసోసియేట్స్ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన ఉత్పత్తి రస్ట్ ప్రివేంషన్ ఆయిల్ ఉపయోగించడం వలన తుప్పు లేకుండా ఉంటాయని తెలిపారు. లీకేజీ ఉన్నచోట ఈఫిల్మ్‌లను ఉపయోగించాలని తెలిపారు.

రాష్టవ్య్రాప్త సంచలనాలకు నగరమే నాంది
విజయవాడ (క్రైం), డిసెంబర్ 30: నగరం రాష్ట్ర వ్యాప్త సంచలన కేసులకు కేంద్రమైంది. రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్ర తాత్కాలిక రాజధానిగా నగరాన్ని ప్రకటించిన తర్వాత పోలీసు కమిషనరేట్‌కు ఈ ఏడాది ఇద్దరు పోలీసు కమిషనర్లు పని చేశారు. కమిషనరేట్ పరిథిలో చోటు చేసుకున్న సంఘటనలు అన్నీ రాష్ట్ర స్థాయిలో సంచలనాలు రేకెత్తించాయి. మొదటి ఆర్నెల్లు అదనపు డిజిపి ఏబి వెంకటేశ్వరరావు పని చేసి వెళ్లగా ఆతర్వాత ఆర్నెల్లు ప్రస్తుతం మరో అదనపు డిజిపి గౌతం సవాంగ్ పోలీసు కమిషనర్‌గా పని చేస్తున్నారు. కమిషనరేట్ పాలనా పగ్గాలు చేబూని ఎవరికి వారు తమదైన శైలితో నడిపించారు. అయితే ఏడాది ఆరంభంలో కొంతవరకు సాఫీగా నడిచినా.. గడిచిన ఆర్నెల్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని సైతం పట్టి కుదిపేసిన ఘటనలకు వేదికైంది. ఈ ఏడాది జనవరి నుంచి డిసెంబర్ వరకు చోటు చేసుకున్న కొన్ని ముఖ్య ఘటనలు పరిశీలిస్తే.. పోలీసు కమిషనర్ ఏబి వెంకటేశ్వరరావు ఉన్న సమయంలో జనవరిలో రాష్టవ్య్రాప్తంగా పోలీసుశాఖకు ప్రభుత్వం మంజూరు చేసిన కొత్త వాహనాలను ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఇక్కడే ప్రారంభోత్సవం జరిపారు. అదేనెలలో వన్‌టౌన్ కెఎల్ రావు నగర్‌లోని ఓ ఇంట్లో గ్యాస్ సిలెండర్ పేలుడు సంభవించి ముగ్గురు మృతి చెందగా.. ఆరుగురు గాయపడ్డారు. ఈపేలుడు రాష్టవ్య్రాప్తంగా కలకలం రేపింది. ఇక సీపి తన దైన శైలితో ఆలోచన చేసి నగరానికి నైట్‌లైఫ్ అలవాటు చేసే క్రమంలో నైట్ ఫుడ్ కోర్టులకు శ్రీకారం చుట్టి బెంజసర్కిల్, ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం, సత్యనారాయణపురం బిఆర్‌టిఎస్ రోడ్డు వద్ద మూడు ఫుడ్‌కోర్టులు ప్రారంభించారు. ఇక ఏప్రిల్‌లో నగరంలోకి సిమి ఉగ్రవాదులు చొరబడ్డరన్న నిఘా సంస్థల హెచ్చరికలు కలకలం రేపాయి. నల్గొండ జిల్లాలో జరిగిన కాల్పుల ఘటనలో పరారైన ఉగ్రవాదులు నగరంలో ప్రవేశించారన్న సమాచారంతో జాతీయ దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాయి. ఇదే నెలలో మంత్రి ఉమా ఇంట్లో సెక్యూరిటీ సిబ్బంది చేతిలో తుపాకీ మిస్‌ఫైర్ అయి కలకలం రేపింది. ఇక దుర్గగుడిలో చోరీకి పాల్పడి దేశవ్యాప్తంగా కరుడుగట్టిన గుళ్ళల్లో బంగారం, వెండి దొంగగా ప్రసిద్దికెక్కిన సాహును నగర పోలీసులు కొనే్నళ్ళ తర్వాత మరలా అదుపులోకి తీసుకుని రికార్డు సృష్టించారు. మే నెలలో జరిగిన ఎంసెట్ పరీక్షల సందర్భంగా పోలీసుల సేవలు ప్రజల అభినందనలు అందుకున్నాయి. ఇదే నెలలో డిజిపి జెవి రాముడు ప్రి పెయిడ్ ఆటో స్టాండును ఇక్కడే ప్రారంభోత్సవం చేశారు. ఇదిలావుండగా తెలుగుదేశం పార్టీని తెలంగాణాలో ఇరకాటంలో పడేసిన ఓటుకు నోటు కేసులో అక్కడి ఏసిబి అధికారులు గాలిస్తున్న నిందితుడు జెరూసలేం మత్తయ్య జూన్ 10వ తేదీన నగరంలో ప్రత్యక్షమై తెలుగు రాష్ట్రాల్లో సంచలనానికి తెర తీశాడు. సత్యనారాయణపురం పోలీసులు ఇతని ఫిర్యాదు మేరకు తెలంగాణా ఏసిబి అధికారులు, కొందరు నేతలపై కేసు నమోదు చేశారు. ఇదే నెలలో ప్రమాదవశాత్తు కరెంటు షాకుతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణంపాలైన ఘటన రాష్టస్థ్రాయిలో విషాదానికి గురి చేసింది. కాగా ఓటుకు నోటు కేసు సందర్భంగా ఇరకాటంలో పడిన రాష్ట్ర ప్రభుత్వం నగర పోలీసు కమిషనర్ ఏబి వెంకటేశ్వరరావు బదిలీ చేసి ఇంటిలిజెన్స్ చీఫ్‌గా నియమించింది.
దీంతో దామోదర్ గౌతం సవాంగ్ ఆగస్టు 2న సీపిగా బాధ్యతలు స్వీకరించారు. ఇక అక్కడి నుంచి ఇప్పటి వరకు జరిగిన ఉందంతాలన్నీ సంచలనాలే. నవంబర్‌లో డిజిపి క్యాంపు కార్యాలయం ప్రారంభోత్సవం జరుపుకుంది. డిసెంబర్ 7న కృష్ణలంక స్వర్ణబార్‌లో కల్తీ మద్యం సేవించి ఐదుగురు చనిపోగా మరో 25మంది వరకు అస్వస్ధతకు గురయ్యారు. అంతకుముందు నకిలీ నెయ్యి రాకెట్ గుట్ట రట్టయింది. దానికి ముందు గుట్కా మాఫియా ఇక్కడే వెలుగు చూసింది. ఇక డిసెంబర్ 11వ తేదీన వెలుగులోకి వచ్చిన కాల్‌మనీ సెక్స్‌రాకెట్ ఉదంతం ఇప్పటికీ కలకలం రేపుతూనే ఉంది. ఈకేసులో నిందితుడు ట్రాన్స్‌కో డివిజనల్ ఇంజనీరు సత్యానందంకు తాజాగా హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడం ప్రజల్లోనూ.. బాధితుల్లోనూ.. పోలీసుల్లోనూ కలకలం రేపింది. ఆయా కేసుల్లో సూటిగా వ్యవహరించినందుకు సీపి సవాంగ్‌కు ప్రజల నుంచి అభినందనలు వెల్లువెత్తినా.. క్రిస్మిస్ సెలవులకు విదేశాల్లో ఉన్న కుటుంబ సభ్యులను కలిసేందుకు తీసుకున్న సెలవు రద్దు చేసుకోవడం వ్యక్తిగతంగా ఆయన్ను బాధించినట్లైంది.

ఇయర్ రౌండప్ - 2015
నదుల అనుసంధానం జరిగినా..
జిల్లాలో తప్పని కష్టాల సేద్యం!
* లక్ష ఎకరాల్లో సాగని సాగు
* 10వేల ఎకరాల్లో ఎండిన పంటలు
* రూ.10 కోట్లుపైనే పంట నష్టం
(ఆంధ్రభూమి బ్యూరో, విజయవాడ)
ప్రస్తుత సంవత్సరాంతంలో కృష్ణా - గోదావరి నదుల సంగమం ఎంతో ఆర్భాటంగా సాగింది అయితేనేమి అన్నపూర్ణగా పేరుగాంచిన కృష్ణాజిల్లా రైతాంగం గతంలో ముందెన్నడూలేని రీతిలో కష్టాల కడలిలో చిక్కొని విలవిలాడింది. ఓ వైపు వర్షాభావ పరిస్థితులు మరో వైపు కాలువలకు ఆగస్టు మాసాంతంలో కూడా సాగునీటి సరఫరా లేక రైతులు దాదాపు లక్ష ఎకరాల్లో పంటలను వేయలేక బీడు పెట్టారు. కృష్ణాలో సాధారణ సాగు విస్తీర్ణ 2.55 లక్షల హెక్టార్లు కాగా కేవలం 2.10 లక్షల హెక్టార్లలోనే సాగు జరిగింది. దీని వల్ల గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రభుత్వం 14 మండలాలను కరవు మండలాలుగా గుర్తించింది. ఇక అడపాదడపా విడుదలైన సాగునీటిని అతి జాగ్రత్తగా పొదుపుగా వినియోగించుకుంటూ అలాగే అప్పుడప్పుడూ కురిసిన వర్షాలతో భారీ వ్యయప్రయాసలతో కానకష్టంగా ఐదు లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయగలిగారు. అయితేనేమి 290 గ్రామాల్లో కరవు కారణంగా 10వేల ఎకరాల్లోనైన పంటలు ఎండిపోయాయి. దీని వల్ల తొలిసారిగా కృష్ణాలో రూ. 10 కోట్లు పైనే పంట నష్టం జరిగింది. ఇదిలా ఉంటే ఈ దఫా ధాన్యం దిగుబడి అనూహ్యంగా తగ్గిపోయింది. 2014లో 14 లక్షల పంట దిగుబడి రాగా ప్రస్తుతం సీజన్‌లో 12 లక్షలకు మించే పరిస్థితి కన్పించడం లేదు. అయితే డెల్టాలో సాగు చేసిన బిపిటి - 5204 రకం ధ్యానానికి కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ. 1450లు ఉండగా మార్కెట్‌లో అంతకుమించి రూ. 1900 వరకు లభిస్తుండటంతో గుడ్డిలో మెల్లగా కొంత ఆశాజనకం. ఇక వాతావరణ ప్రభావం వాణిజ్య పంటలైన పత్తి, మిర్చిలపై కూడా పడింది. జిల్లాలో 10వేల ఎకరాల్లో సాగు విస్తీర్ణం తగ్గింది. ఉష్ణోగ్రత, అకాల వర్షం వల్ల కొంతమేర ప్రత్తిరంగు మారి నాణ్యత కోల్పోయింది. దీనికి తోడు సగటు దిగుబడులు కూడా తగ్గాయి. ఎకరాకు 13 క్వింటాళ్లుకు మించి వచ్చేలా కన్పించలేదు. 45వేల ఎకరాల్లో చెరకు సాగు జరుగ్గా క్రషింగ్ ఇటీవలే ఆరంభమైంది. టన్నుకు రూ. 100 మాత్రమే పెంపుదల కాస్తంత తీపి కబురు. ఆరువేలకు పైగా హెక్టార్లలో సాగయిన కంది, పెసర, మినుముల వంటి అపరాల దిగుబడులు మొక్కజొన్నల విషయంలో దిగుబడులు మిశ్రమంగానే కన్పిస్తున్నాయి. వేరుశనగ, పసుపు పంటల రైతులు కూడా కరవు ప్రభావానికి లోనుకాక తప్పలేదు. దాదాపు అదను తప్పుతున్న తరుణంలో పలు ప్రాంతాల్లో దింపుడు కల్గం ఆశతో ఉన్న పంటలను బతికించుకునేందుకు రైతులు అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుత రబీసాగు కూడా నిరాశజనకంగా మారింది. సాగునీటి సరఫరా లేదంటూ ప్రభుత్వం తేల్చి చెప్పింది. దీంతో రైతాంగం అపరాల సాగుకు మొగ్గ చూపుతున్నారు. అక్కడక్కడ మొక్కజొన్న సాగుకు సమాయత్తమవుతున్నారు. ఇప్పటికే జిల్లాలో లక్ష హెక్టార్లలో అపరాల సాగు పూర్తయింది. 25వేల హెక్టార్లలో మొక్కజొన్న సాగు జరుగుతున్నది. ఏదిఏమైనా 2015 సంవత్సరం కృష్ణా జిల్లా రైతులను అన్నివిధాలా తీవ్ర నిరాశపరచింది.

లొసుగులమయంగా ఉపాధి పనులు
* తప్పులు జరిగాయన్న తనిఖీ సిబ్బంది
* ఆరునెలల తర్వాత తనిఖీ ఎలా చేస్తారని ప్రశ్న
తోట్లవల్లూరు, డిసెంబర్ 30: మండలంలో జరిగిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులపై బుధవారం స్థానిక జెడ్పీ హైసూల్లో సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. ఎంపిపి కళ్ళం వెంకటేశ్వరరెడ్డి, ఉపాధి హామీ ఎపిడి (మచిలీపట్నం) నరసింహారావు, డ్వామా విజిలెన్స్ ఎపిడి చంద్రశేఖర్, ఎంపిడిఓ పద్మసుధ, వ్యవసాయాధికారి శివప్రసాద్, స్టేట్ రీసోర్స్ పర్సన్ ఎల్లారావు ప్రజావేదిక నిర్వహించారు. అయితే ఇదో ప్రహసనంగా మారింది. శిక్షణ పొంది తనిఖీలు నిర్వహించిన సిబ్బంది పలు తప్పులను ప్రజావేదికపై బహిర్గతం చేయగా ఉపాధి హామీ ఎపిడి నరసింహారావు మాత్రం తప్పులు ఎలా గుర్తించారని ఎదురుప్రశ్నించారు. ఒక దశలో తనిఖీ సిబ్బంది ఎపిడితో వాగ్వాదానికి సైతం దిగారు. ఒకరిద్దరు ఇచ్చిన స్టేట్‌మెంట్‌తో తప్పులు జరిగాయంటే ఎలా సమర్థనీయమని ఎపిడి అనటంతో తనిఖీ సిబ్బంది కలుగజేసుకుని అన్నికోణాల నుంచి పరిశీలించి తాము ఒక నిర్థారణకు వచ్చామని బదులిచ్చారు. దీన్నికాదంటే ఈసారి వీడియోలు తీస్తే నమ్ముతారా సార్? అంటూ ప్రశ్నించారు. చాలామంది కూలీలు పనులకు రాలేదని తేలిందని, అయినా వారి పేరున కూలి చెల్లించారని, ఒక పంచాయతీలో స్వీపర్‌గా పనిచేస్తున్న వ్యక్తి రెండుచోట్ల ఏకకాలంలో పనిచేసినట్లు గుర్తించామని తనిఖీ సిబ్బంది తెలిపారు. ఈ అంశాలపై వాడివేడిగా చర్చ జరిగింది. జనవరిలో చేసిన పనులను ఇప్పుడు గుర్తించటం ఎలా సాధ్యమని, తవ్విన బోదెలు పూడిపోయి ఉంటే మీరు కొలతలు ఎలా తీశారని తనిఖీ సిబ్బందిని ఎంపిపి వెంకటేశ్వరరెడ్డి ప్రశ్నించారు. మీరు చేసిన తనిఖీ తూతూమంత్రమేనని, అలాగే చిన్నచిన్న తప్పులు జరగటం సహజమేనని అన్నారు. కాగా ఫీల్డ్ అసిస్టెంట్ల తప్పిదాల వల్ల కొన్ని తప్పులు జరిగి ఉండవచ్చని, వారి నుంచి డబ్బులు రికవరీకి చర్యలు తీసుకుంటామని నరసింహారావు తెలిపారు. పలు గ్రామాల సర్పంచ్‌లు, ఎంపిటిసి సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.

గ్రామాల్లో వైద్యసేవలపై ఆరా
* వెలగలేరులో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పర్యటన
జి.కొండూరు, డిసెంబర్ 30: మండల పరిధిలోని వెలగలేరులో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియా, కేంద్ర కమిటీ బృంద సభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, నీతి ఆయోగ్ సలహాదారుడు ఎకె జైన్, జిల్లా కలెక్టర్ బాబు ఎ బుధవారం పర్యటించారు. వెలగలేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వౌలిక వసతులను పరిశీలించారు. ప్రజలకు అందుతున్న వైద్యసేవలపై ఆరాతీశారు. నేషనల్ రూరల్ హెల్త్‌మిషన్ కింద అమలు చేసిన కార్యక్రమాలను తెలుసుకున్నారు. గర్భవతులకు, బాలింతలకు, శిశువులకు అమలు చేస్తున్న ఇమ్యునైజేషన్ గురించి వాకబు చేశారు. ఇంకా ఇతర సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు అమలు జరుగుతున్న తీరుపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మహిళాశిశుసంక్షేమ శాఖ పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని కూడా వారు పరిశీలించారు. అక్కడి పిల్లలను పలుకరించి వారికి అమలవుతోన్న పథకాలపై వాకబు చేశారు. పిల్లల చేత ప్రీస్కూల్ విద్యాపరిజ్ఞానాన్ని తెలుసుకున్నారు. అన్న అమృతహస్తం పథకం కింద ఏర్పాటు చేసిన భోజనాన్ని, కూరలను పరిశీలించారు. ఇతర పోషకాహారం మహిళలకు, శిశువులకు అందుతున్నదీ లేనిదీ వాకబు చేశారు. పోషకాహారం తీసుకున్న తరువాత రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరిగిన వైనంపై గర్భిణీలు సభ్యులకు వివరించారు. మైలవరం ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో అంగన్‌వాడీ కేంద్రాలు సమర్థవంతంగా నిర్వహిస్తున్న వైనాన్ని గుర్తించారు. అనంతరం చౌకధరల దుకాణాన్ని పరిశీలించారు. ప్రజలకు సబ్సిడీపై పంపిణీ చేస్తున్న నిత్యావసర వస్తువుల గురించి, నాణ్యత గురించి పరిశీలించారు. పథకాలు అమలవుతున్న తీరుపై వీరంతా సంతృప్తి వ్యక్తం చేశారు. మహిళాశిశు సంక్షేమ శాఖ కమిషనర్ చక్రవర్తి, జాయింట్ కలెక్టర్ గంథం చంద్రుడు, డిఎం అండ్ హెచ్‌ఒ డాక్టర్ ఆర్ నాగమల్లేశ్వరి, ఎఎంసి చైర్మన్ ధనేకుల సాంబశివరావు, జడ్పీటిసి కాజ బ్రహ్మయ్య, ట్రైనీ కలెక్టర్ సలోని సిద్ధాన, ఐసిడిఎస్ పిడి కె కృష్ణకుమారి, సిడిపిఒ లలితకుమారి, జిల్లా ఉన్నతాధికారులు, స్థానిక అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మచిలీపట్నం కార్పొరేషన్ ఏర్పాటుపై..
మరో వారంలో గైడ్‌లైన్స్
* మున్సిపల్ చైర్మన్ బాబాప్రసాద్ వెల్లడి
ఆంధ్రభూమి బ్యూరో
మచిలీపట్నం, డిసెంబర్ 30: మచిలీపట్నం కార్పొరేషన్‌కు సంబంధించి మరో వారం పదిరోజుల్లో గైడ్‌లైన్స్ వచ్చే అవకాశం ఉందని మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్ వెల్లడించారు. చైర్మన్ అధ్యక్షతన బుధవారం కౌన్సిల్ హాలులో అత్యవసర సమావేశం నిర్వహించారు. గైడ్‌లైన్స్ రాని కారణంగా సమావేశాన్ని వాయిదా వేశారు. ఈసందర్భంగా బాబాప్రసాద్ మాట్లాడుతూ పురాతనమైన మచిలీపట్నం పురపాలక సంఘాన్ని కార్పొరేషన్‌గా చేస్తూ ఇప్పటికే ప్రభుత్వం జీవో జారీ చేసిందని చెప్పారు. ప్రస్తుతం ఉన్న మున్సిపల్ పాలకవర్గాన్ని నగర పాలక సంస్థ పాలకవర్గంగా అప్‌డేట్ చేస్తూ త్వరలో ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉందన్నారు. ఉత్తర్వులు వచ్చిన తర్వాత కౌన్సిల్ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. మచిలీపట్నంను కార్పొరేషన్‌గా చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. దీనిపై ప్రతిపక్ష నాయకుడు అచ్చాబా మాట్లాడుతూ గైడ్‌లైన్స్ రాకుండా కౌన్సిల్ సమావేశాన్ని ఎందుకు ఏర్పాటు చేశారని ప్రశ్నించారు. ఈ సమావేశంలో కమిషనర్ జస్వంతరావు, వైస్ చైర్మన్ పంచపర్వాల కాశీవిశ్వనాథం, టిడిపి కౌన్సిలర్లు నారగాని ఆంజనేయప్రసాద్, కొట్టె వెంకట్రావ్, లోగిశ