కృష్ణ

సాంకేతిక రంగంలో ఏపీదే అగ్రస్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కైకలూరు, జూన్ 11: టెక్నాలజీ వినియోగానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రతి రికార్డును కంప్యూటరీకరించాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని, ఆ దిశగా ఇప్పటికే ఈ-ఆఫీస్ విధానం విజయవంతంగా అమలు చేస్తున్నామని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి చెప్పారు. శనివారం స్థానిక సీతారామా ఫంక్షన్ హాలులో ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల ఫోరం (ఎపిజెఎఫ్) ఆధ్వర్యంలో ‘నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణంలో జర్నలిస్టుల పాత్ర’ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. ఎపిని డిజిటల్ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ఈ-ఆఫీస్ విధానాన్ని ప్రవేశపెట్టామని, ఈ-ఆఫీస్ విధానం ప్రపంచంలోని 180 దేశాలకు గాను 10 దేశాల్లో మాత్రమే అమలు జరుగుతుండగా దక్షిణాసియాలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని మంత్రి పల్లె వెల్లడించారు. భవిష్యత్తులో రాష్టవ్య్రాప్తంగా 40వేల గ్రామాల్లో 20 ఎంబిపిఎస్ నెట్ సౌకర్యాన్ని సుమారు రూ.330 కోట్ల వ్యయంతో ప్రారంభిస్తున్నామన్నారు. ఈ విధానం వల్ల ప్రతి ఇంటికీ నెట్ సౌకర్యంతో పాటు ఫోన్, కేబుల్ ప్రసారాలు, తదితర సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ప్రపంచంలో అగ్రదేశమైన అమెరికాలో కూడా ఇలాంటి సౌకర్యం లేదని మంత్రి అన్నారు. నవ్యాంధ్ర నిర్మాణంలో పాత్రికేయులు ముందుకు రావటం అభినందనీయమన్నారు. సమాజాన్ని మార్చే శక్తి పాత్రికేయులకు ఉందని, అదే స్ఫూర్తితో సమాజాభివృద్ధికి పాత్రికేయులు కృషిచేయాలని, అభివృద్ధి నిరోధకులు, సంఘ విద్రోహశక్తులను సమర్ధించటం మంచిది కాదన్నారు. పాత్రికేయులకు అక్రిడిటేషన్, బస్‌పాస్, ఆరోగ్యశ్రీ హెల్త్‌కార్డులు, పిల్లలకు విద్యాఫీజుల్లో 50శాతం రాయితీ వంటి అనేక సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తోందన్నారు. భవిష్యత్తులో పాత్రికేయులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు అదనపు డైరెక్టర్ స్థాయిలో ఒక కమిటీని ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ కమిటీ దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల్లో పర్యటించి ఆయా రాష్ట్రాలు జర్నలిస్టులకు అమలు చేస్తున్న రాయితీలు, తదితర అంశాలు పరిశీలించి నివేదిక ఇస్తుందన్నారు. దాని ప్రకారం పాత్రికేయులకు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని మంత్రి పల్లె వివరించారు. రూ.190 పాత్రికేయులు చెల్లిస్తే బీమా పథకం రూ.10 లక్షలు సదుపాయం కల్పించామని, ఈ నెలాఖరు వరకు బీమా పథకాన్ని పొందేందుకు గడువు పెంచామని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ, కైకలూరు నియోజకవర్గ వైకాపా సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు, కలిదిండి ఎఎంసి చైర్మన్ తాడినాడ బాబు, ఎపిజెఎఫ్ కన్వీనర్ శ్రీనివాస యాదవ్, తదితరులు మాట్లాడారు. సదస్సుకు ఎపిజెఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్ కృష్ణాంజనేయులు అధ్యక్షత వహించారు. ఉపాధ్యక్షుడు కృపావరం, రాష్ట్ర నాయకులు అన్నవరపు బ్రహ్మయ్య, పి రమేష్, కె గాంధీబాబు, జిల్లాలోని వివిధ మండలాల పాత్రికేయులు పాల్గొన్నారు. కాగా కైకలూరు మండలం దొడ్డిపట్ల జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని కె బేబి, కలిదిండి మండలం కోరుకొల్లు జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన కె కిరణ్‌కుమార్ 10/10 జిపిఎ సాధించినందుకు ఒక్కొక్కరికి రూ.3వేలు చొప్పున మంత్రి రఘునాథరెడ్డి ప్రోత్సాహక బహుమతిగా అందించి శాలువాలతో సత్కరించారు. కైకలూరు మండలం గోపవరానికి చెందిన అల్లుడు ఏడుకొండలు విజయవాడలో రోడ్డు ప్రమాదంలో చనిపోవటంతో అవయవాలను దానం చేసిన భార్య నాగమణికి ఆర్థిక సాయం అందించి అభినందించారు.

పుట్టగొడుగుల్లా ప్రైవేట్ స్కూళ్లు!
ఆంధ్రభూమి బ్యూరో
మచిలీపట్నం, జూన్ 11: జిల్లాలో ఎలాంటి అనుమతులు లేని ప్రైవేట్ పాఠశాలలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. గతంలో మారుమూల ప్రాంతాల్లో గుట్టుచప్పుడు కాకుండా అనుమతులు లేని పాఠశాలల కార్యకలాపాలు కొనసాగేవి. కానీ నేడు పట్టణాల్లో సైతం అనుమతులు లేని పాఠశాలలను నెలకొల్పుతున్నారు. విద్య వ్యాపారమయం కావటంతో కొందరు అనుమతులు లేకున్నా పాఠశాలలను ఏర్పాటు చేసి విద్యాబోధన కొనసాగిస్తున్నారు. అనుమతులు లేని పాఠశాలలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని చెబుతున్న అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకుంటున్న పాపాన పోవడం లేదు! జిల్లాలో వందల సంఖ్యలో అనుమతులు లేని విద్యాలయాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. వీటిని గుర్తించాల్సిన విద్యాశాఖాధికారులు గుడ్డిగా వ్యవహరిస్తున్నారు. కేవలం మొక్కుబడిగా అనుమతులు లేని పాఠశాలలకు షోకాజ్ నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. జిల్లాలో సుమారు 100 నుండి 150 వరకు అనుమతులు లేని పాఠశాలలు ఉన్నట్లు అనధికార వర్గాల సమాచారం. కానీ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు విద్యాశాఖాధికారులు రెండు మూడు రోజులుగా హడావుడి చేసి 35 పాఠశాలలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మిగిలిన పాఠశాలలకు ఎలాంటి నోటీసులు ఇవ్వకపోవడం విమర్శలకు తావిస్తోంది. జిల్లాలో కొన్ని పాఠశాలల్లో ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ వరకు అనుమతులు ఉన్నప్పటికీ వాటిద్వారా 8, 9, 10 తరగతులు కూడా నిర్వహిస్తుండటం గమనార్హం. విజయవాడ అర్బన్, రూరల్ పరిధిలో ఇలాంటి పాఠశాలలు పదుల సంఖ్యలో ఉన్నట్టు తెలుస్తోంది. జి.కొండూరు, గన్నవరం, ఘంటసాల, గూడూరు, కలిదిండి, కోడూరు, ముసునూరు, పెనమలూరు, ఉంగుటూరు ప్రాంతాల్లో అధికంగా అనుమతులు లేని పాఠశాలలు ఉన్నట్టు అధికారుల నివేదికలే చెపుతున్నాయి. మరో రెండు రోజుల్లో పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో అనుమతులు లేని పాఠశాలల్లో పిల్లలను చేర్చితే వారి పరిస్థితి ఏమిటని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. కొత్త పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులను ఆకర్షిస్తూ విస్తృత ప్రచారం చేస్తున్నారు. దీంతో అవగాహన లేని తల్లిదండ్రులు ఈ పాఠశాలలకు అన్ని అనుమతులు ఉన్నాయనుకుని తమ పిల్లలను చేర్పిస్తున్నారు. అనుమతులు లేవన్న విషయాన్ని గ్రహించడం తల్లిదండ్రులకు కష్టంగా మారుతోంది. యాజమాన్యాలు చెప్పే మాటలకు మోసపోయే తల్లిదండ్రులు కూడా ఎక్కువగానే ఉంటున్నారు. ఫలితంగా నష్టపోతున్నారు. ఏదిఏమైనా జిల్లాలో అనధికారిక ప్రైవేట్ పాఠశాలలను నియంత్రించడంలో విద్యాశాఖ పూర్తిగా విఫలమైందనే చెప్పాలి.

అధిక వేడిమికి అల్లాడిన జనం
మచిలీపట్నం (కోనేరుసెంటర్), జూన్ 11: పది రోజులుగా వాతావరణం చల్లగా ఉండటంతో సేదతీరిన ప్రజలు శుక్ర, శనివారాల్లో మళ్లీ పెరిగిన ఉష్ణోగ్రతలకు ఉక్కిరిబిక్కిరి అయ్యా రు. వేడి అధికంగా ఉండటంతో ప్రయాణికులు, పాదచారులు నానా అవస్థలు పడ్డారు. కొన్ని ప్రైవేటు పాఠశాలలు పునఃప్రారంభం కావటంతో విద్యార్థులు ఉష్ణోగ్రతలకు అల్లాడారు. మొన్నటి వరకు హాయిగా నిద్రపోయిన వృద్ధులు, చిన్నారులు ఉష్ణోగ్రతలకు ఉడికిపోయారు. అధిక వేడికి మొత్తం ప్రజానీకం ఆపసోపాలు పడ్డారు. మరి స్థూలకాయం గల వారి పరిస్థితి చెప్పాల్సిన అవసరం లేదు. హాయిగా నిద్రపోతున్న పసికందులకు ఉష్ణోగ్రతలు మంటలు పుట్టిస్తుండటంతో కమిలిపోతున్నారు. వారి ఏడ్పులను మాన్పించటం ఎవ్వరి తరం కావటం లేదు. శనివారం ఉష్ణోగ్రతల వేడికి పట్టణంలోని ప్రధాన రహదారులు సైతం నిర్మానుష్యంగా దర్శనమిచ్చాయి. రద్దీగా ఉండే కోనేరుసెంటరు, మార్కెట్ బోసిపోయాయి. ఉదయం 8గంటలకే భానుడి భగభగలు మొదలయ్యాయి. ఏదిఏమైనా చల్లబడిన వాతావరణం ఒక్కసారిగా వేడెక్కటంతో ప్రజలు ఆపసోపాలు పడ్డారు. ఇదిలావుండగా వాతావరణ శాఖ మాత్రం ఉపరితల ఆవర్తనం కారణంగా ఆంధ్రాలో వర్షాలు కురుస్తాయని చెబుతుంది. అయితే ప్రజలు కూడా రానున్న వర్షాలకు సంకేతమే ఈ ఉష్ణోగ్రతలని ప్రజలు భావిస్తున్నారు.