కృష్ణ

ప్రభుత్వ పథకాలు కావాలంటే ‘ఆధారే’ ఆధారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 18: 20 గుర్తింపు పత్రాల ఆధారంగా స్మార్ట్ పల్స్ సర్వే సమగ్రంగా చేపట్టేందుకు జిల్లాస్థాయి నుండి మండల స్థాయి వరకు డేటా సేకరణలో సమగ్రమైన శిక్షణ అందించి ముందుకు వెళ్లాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. భవిష్యత్‌లో ఆధార్ సంఖ్యలేని ప్రజలకు ప్రభుత్వపరంగా ఎటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అందవని, అందుకోసం వారిలో అవగాహన పెంచి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేలాగా, అర్హులకు ప్రభుత్వ పథకాలు అందేలాగా ప్రతి ఒక్కరూ ఆధార్ సంఖ్యను తీసుకోవాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. స్థానిక సిఎం కార్యాలయం నుండి ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లు, మండల స్థాయి అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లు కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి కలెక్టర్ బాబు.ఎ, నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్, జాయింట్ కలెక్టర్ గంథం చంద్రుడు, మున్సిపల్ కమిషనర్ జి.వీరపాండియన్, ఇతర జిల్లా అధికారులు, సాంకేతిక సిబ్బంది హాజరయ్యారు. ఈ కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌పి టక్కర్, ఐటి సలహాదారు జె.సత్యనారాయణ హైదరాబాద్ నుండి ప్రభుత్వ, మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ విజయవాడ నుండి పాల్గొన్నారు. చంద్రన్న బీమాలో లేనివారికి పథకం వర్తించేలాగా చర్యలు చేపట్టాలని, రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఒక్కరు కూడా ఆధార్ నెంబర్ లేకుండా ఉండరాదన్నారు. పూర్తిస్థాయి సంసిద్ధతతో 13 జిల్లాలకు చెందిన మాస్టర్ ట్రైనర్‌లకు ఈనెల 22 లేదా 23 తర్వాత గాని శిక్షణను అందివ్వాలని మరింత సమర్థవంతంగా డేటా సేకరణ ప్రక్రియ ఉండాలన్నారు. క్షేత్రస్థాయిలో డేటా సేకరణ నూరుశాతం స్వచ్ఛత, నిర్థారణ ఆధారంగా ఉండాలని, ఇందుకు అనుసంధానంగా లభ్యమైన డేటాను గత డేటాతో అనుసంధానించేలాగా చర్యలు చేపడుతున్నట్లు ఐటి కార్యదర్శి, ముఖ్యమంత్రి కార్యాలయ సంయుక్త కార్యదర్శి పిఎస్ ప్రద్యుమ్న తెలిపారు.
కలెక్టర్ బాబు.ఎ మాట్లాడుతూ ట్యాబ్ మేనేజ్‌మెంట్ అప్లికేషన్లను రూపొందించడం జరిగిందని, ఆయా అప్లికేషన్‌ను సంబంధిత ఎన్యూమరేటర్ ట్యాబ్‌లో పొందుపరచడం జరుగుతుందన్నారు. డేటాలో జవాబుదారీతనం పెంచేందుకు ఎన్యూమరేటర్, పర్యవేక్షకుల బయోమెట్రిక్ నిర్థారణతో ఆ ట్యాబ్ ఐఎంఇ నెంబరుతో నిర్ధారణ ప్రక్రియను చేపడుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ఎన్యూమరేటర్‌గా బాధ్యత గల ప్రభుత్వ ఉద్యోగిని నియమించడం జరుగుతుందని, వారికి సహాయకులుగా డ్వాక్రా గ్రూప్ సభ్యురాళ్లను నియమించడం జరుగుతుందని, అందుకు చర్యలు తీసుకోవాలని డిఆర్‌డిఎపిడికి కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు.

జిల్లాలో 49.2 మి.మీ.ల సరాసరి వర్షపాతం నమోదు
మచిలీపట్నం (కోనేరుసెంటర్), జూన్ 18: జిల్లాలో సరాసరి వర్షపాతం 49.2 మి.మీలుగా నమోదైంది. శుక్రవారం ఉదయం 8గంటల నుండి శనివారం ఉదయం 8గంటల వరకు ఈ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖాధికారులు తెలిపారు. అత్యధికంగా మైలవరం మండలంలో 94.2 మి.మీలు, అత్యల్పంగా చందర్లపాడులో 6.8 మి.మీలుగా నమోదైంది. మండలాల వారీగా నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. జగ్గయ్యపేటలో 9.4, వత్సవాయిలో 7.0, పెనుగంచిప్రోలులో 15.0, నందిగామలో 15.2, కంచికచర్లలో 23.8, వీరుళ్లపాడులో 25.6, ఇబ్రహీంపట్నంలో 31.0, జి.కొండూరులో 70.6, ఎ.కొండూరులో 93.6, గంపలగూడెంలో 51.0, తిరువూరులో 51.4, విస్సన్నపేటలో 56.6, రెడ్డిగూడెంలో 77.4, విజయవాడ రూరల్, అర్బన్‌లో 61.2, పెనమలూరులో 67.4, తోట్లవల్లూరులో 51.0, కంకిపాడులో 74.2, గన్నవరంలో 55.8, ఆగిరిపల్లిలో 68.8, నూజివీడులో 84.4, చాట్రాయిలో 52.4, ముసునూరులో 35.2, బాపులపాడులో 40.6, ఉంగుటూరులో 24.6, ఉయ్యూరులో 76.2, పమిడిముక్కలలో 33.2, మొవ్వలో 31.0, ఘంటసాలలో 33.2, చల్లపల్లిలో 56.8, మోపిదేవిలో 53.0, అవనిగడ్డలో 82.0, నాగాయలంకలో 66.8, కోడూరులో 65.8, మచిలీపట్నంలో 48.6, గూడూరులో 96.4, పామర్రులో 84.0, పెదపారుపూడిలో 24.0, నందివాడలో 28.2, గుడివాడలో 39.2, గుడ్లవల్లేరులో 62.2, పెడనలో 58.4, బంటుమిల్లిలో 42.2, ముదినేపల్లిలో 19.6, మండవల్లిలో 24.8, కైకలూరులో 26.6, కలిదిండిలో 23.8, కృత్తివెన్నులో 80.0మి.మీ.ల చొప్పున వర్షపాతం నమోదైంది.

ముద్రగడ దీక్షను రాజకీయం చేయొద్దు
జగ్గయ్యపేట, జూన్ 18: కాపు జాతి ప్రయోజనాల కోసం సిఎం ఇచ్చిన ఎన్నికల హామీలనే అమలు చేయాలని చేస్తున్న ముద్రగడ పద్మనాభం దీక్షను రాజకీయ ప్రయోజనాలతో ప్రభుత్వం చూస్తోందని, ముద్రగడకు ఎలాంటి ఆపద జరిగినా అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సామినేని ఉదయభాను అన్నారు. శనివారం తన నివాసంలో మున్సిపల్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు, తదితరులతో కలిసి ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీ రోజులు గుర్తుకు వస్తున్నాయని, ప్రభుత్వం అణచివేత విధానాలు నానాటికీ పెచ్చుమీరుతున్నాయని విమర్శించారు. ఇచ్చిన హామీలను అమలు చేయమని ముద్రగడ దీక్ష చేస్తుంటే సిఎం, మంత్రులు, అధికారులు, ఎమ్మెల్యేలు ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడుతున్నారన్నారు. తాను వైకాపా నేతలు బొత్స సత్యనారాయణ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, తదితరులు ఆయన్ను పరామర్శించేందుకు వెళుతుంటే రాజమండ్రి ఎయిర్‌పోర్టులో దిగగానే అదుపులోకి తీసుకొని కోరుకొండ పోలీసు స్టేషన్‌కు తరలించి ఆ తరువాత విడుదల చేశారన్నారు. గుడ్లవల్లేరులో వైకాపా నేత బాబ్జీపై నాన్ బెయిలబుల్ కేసు పెడితే స్టేషన్ ముందు గుడివాడ ఎమ్మెల్యే నాని బైఠాయిస్తే తప్ప అరెస్టు చూపలేదని, వైకాపా యూత్ నేత జక్కంపూడి రాజా ప్రజా సమస్యలపై ఆర్‌ఐని ప్రశ్నిస్తే తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేశారని సామినేని అన్నారు. ముద్రగడ్డ వ్యవహార శైలి, మనస్తత్వం రాష్ట్ర ప్రజలకు తెలుసునని, ఆయన్ను ఆవహేళన చేసేలా మంత్రులు మాట్లాడటం, కుమారుడిపై పోలీసుల దౌర్జన్యం ప్రభుత్వ తీరుకు నిదర్శనమన్నారు. ముద్రగడను మీడియాకు చూపకుండా, నేతలు కలవకుండా చూడటం దారుణమని, ఆయనకు మీడియాతో మాట్లాడే స్వేచ్ఛ, నేతలు ఎవరైనా వెళ్లి పరామర్శించే అవకాశం కల్పించాలన్నారు. పుష్కర పనులు పేరుకే టెండర్లు పిలుస్తూ టిడిపి నేతలకే కేటాయిస్తున్నారని, నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదన్నారు. వత్సవాయిలో ఎస్‌సి కార్పొరేషన్ నుండి లబ్ధిదారులకు చెక్కులు వచ్చినా అక్కడి ఎండిఒ టిడిపి నేతల ప్రోత్సాహంతో తెలుగుదేశం కండువా వేసుకుంటేనే చెక్కులు ఇస్తానని ఆపారన్నారు. దీన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువద్దామన్నా ఆయన అందుబాటులోకి రావడం లేదని సామినేని పేర్కొన్నారు. సమావేశంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు చౌడవరపు జగదీష్, కౌన్సిల్ సభ్యులు ఇంటూరి చిన్నా, నేతలు తుమ్మల ప్రభాకర్, జుబేర్, పఠాన్ ఫిరోజ్‌ఖాన్, తదితరులు పాల్గొన్నారు.
బందరులో భారీ వర్షం
మచిలీపట్నం (కోనేరుసెంటర్), జూన్ 18: బందరు పట్టణంలో శుక్రవారం రాత్రి నుండి శనివారం ఉదయం 9గంటల వరకు భారీ వర్షం కురిసింది. పల్లపు ప్రాంతాలు వర్షం నీటితో నిండిపోయాయి. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటంతో నీరు కదలక దుర్గంధం వెదజల్లుతోంది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్ల చుట్టూ నీరు నిలిచిపోవటంతో నివాసులు ఇబ్బందులు పడుతున్నారు. పందులు స్వైరవిహారం చేస్తూ ఇళ్లలోకి ప్రవేశిస్తుండటంతో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఇదిలావుండగా అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడుతున్న వృద్ధులు, చిన్నారులతో పాటు ప్రజలు చల్లదనానికి సేదతీరారు. శుక్రవారం రాత్రి నుంచి శనివారం రాత్రి వరకు ఆకాశం మేఘావృతం కావటంతో పట్టణం చల్లగా మారింది. పట్టణ ప్రజలు హాయయిన అనుభూతి పొందారు.
దివిసీమలో..
అవనిగడ్డ : దివిసీమలో శుక్రవారం అర్ధరాత్రి నుండి శనివారం ఉదయం వరకు కురిసిన భారీ వర్షానికి రహదారులు, కాలనీలు బురదకయ్యలుగా మారాయి. కొంతకాలంగా వేసవి తాపానికి అల్లాడుతున్న ప్రజలు శనివారం వాతావరణం చల్లబడటంతో ఊపిరిపీల్చుకున్నారు. కాగా ఈ వర్షం మెట్ట పంటలకు నష్టం చేకూర్చటంతో పాటు పొలాల్లో కలుపు ఏపుగా పెరిగే ప్రమాదం ఉందని కొందరు రైతులు అంటున్నారు. రహదారులు మరీ అధ్వానంగా పాదచారులు నడవటానికి వీలులేని స్థితికి మారాయి.
నాగాయలంకలో..
నాగాయలంక : నాగాయలంకలో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది. రెండు నెలలుగా ఎండ తీవ్రతతో అల్లాడుతున్న ప్రజలకు వర్షం ఊరటనిచ్చింది. మంచినీటి సమస్యతో సతమతమవుతున్న ప్రజలు, పశుపక్ష్యాదులను వర్షం సేదతీర్చింది. 66.8 మి.మీ.ల వర్షపాతం నమోదైందని తహశీల్దార్ స్వర్గం నరసింహారావు తెలిపారు. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతం కావటమే కాకుండా చిరుజల్లుల వల్ల వర్షాలు కొనసాగే అవకాశాలున్నట్లు భావిస్తున్నారు.

నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి
* ఎమ్మెల్యే కాగిత
పెడన, జూన్ 18: నియోజకవర్గ అభివృద్ధి కోసం తన శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్, స్థానిక శాసనసభ్యులు కాగిత వెంకట్రావు తెలిపారు. టిడిపి నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో జరిగింది. నాలుగు మండలాలకు చెందిన ఎంపిటిసిలు, జెడ్పీటిసిలు, ముఖ్య నాయకులు హాజరుకాగా సభకు ఎమ్మెల్యే కాగిత అధ్యక్షత వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నీరు-చెట్టు, ఉపాధి హామీ పథకం, తదితర కార్యక్రమాలతో నియోజకవర్గం ముందంజలో ఉందన్నారు. నీరు-చెట్టు పథకం కింద చెరువుల తవ్వకాలు జరుగుతున్నాయన్నారు. రానున్న ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ఎరువులు, విత్తనాలను సిద్ధంగా ఉంచామని ఎమ్మెల్యే తెలిపారు. రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వ్యవసాయ శాఖాధికారులు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలన్నారు. సాగునీటి విషయంలో త్వరలో ఒక ప్రకటన వెలువడనుందని తెలిపారు. గూడూరు ఎంపిపి కాసగాని శ్రీనివాసరావు, బిసి కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ బొల్లా వెంకన్న, మాజీ మున్సిపల్ ఛైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు, మున్సిపల్ ఛైర్మన్ హన్ను, పట్టణ టిడిపి అధ్యక్షులు యక్కల శ్యామలయ్య, మార్కెట్ యార్డు చైర్మన్‌లు గుడిశేవ రామారావు, వాటాల నరసింహస్వామి, నీటి సంఘం అధ్యక్షులు చలపాటి వీరప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. తొలుత ఎన్టీఆర్ చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక
బందరులో ప్రబలుతున్న వ్యాధులు
మచిలీపట్నం (కల్చరల్), జూన్ 18: పట్టణంలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారని కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఎస్ రామకృష్ణారావు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శనివారం ‘మచిలీపట్నంలో ఉపరితల డ్రైనేజీ వ్యవస్థ- సమస్యలు- సవాళ్లు’ అనే అంశంపై రెండు రోజుల జాతీయ స్థాయి సదస్సు జరిగింది. సదస్సుకు అధ్యక్షత వహించిన ఆచార్య రామకృష్ణారావు మాట్లాడుతూ చిన్నపాటి వర్షానికే రోడ్లపై నీరు నిలిచిపోతుండటంతో దోమలు పెరిగిపోతున్నాయని, దీంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారన్నారు. సమస్య పరిష్కారానికి సదస్సు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. మున్సిపల్ ఛైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్ మాట్లాడుతూ డ్రైనేజీ వ్యవస్థ పట్టణానికి పెద్ద సమస్యగా ఉందన్నారు. వర్షాకాలానికి ముందే పూడికను తొలగించటం, మోటార్ల సహాయంతో నీటిని తోడటం చేస్తున్నామన్నారు. సమస్య పరిష్కారానికి పురపాలక సంఘం నుండి కూడా నిధులను మంజూరు చేయటానికి కృషి చేస్తానన్నారు. గౌరవ అతిథిగా పాల్గొన్న రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ ప్రొ. పి విజయప్రకాష్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో పట్టణ సదుపాయాల ఏర్పాటు పథకంలో భాగంగా ప్రత్యేక నిధులను ఉన్నత విద్యామండలి నుండి విడుదల చేయడానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొ. ఉమేష్‌చంద్ర చౌబే, నూజివీడు పిజి సెంటర్ ప్రత్యేక అధికారి ఆచార్య ఎంవి బసవేశ్వరరావు, క్యాంపస్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య వైకె సుందరకృష్ణ, వర్క్‌షాప్ నిర్వహణాధికారి పి వీరబ్రహ్మాచారి, డా. సిఎం వినయ్ కుమార్, డా. జయశంకర ప్రసాద్, డా. విజయ్‌కుమార్, డా. నవీన పాల్గొన్నారు.

నాణ్యమైన విద్య అందించటమే లక్ష్యం

మచిలీపట్నం (కల్చరల్), జూన్ 18: ఆహ్లాదకర వాతావరణంలో నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యమని డిఎంఎస్ అండ్ ఎస్‌విహెచ్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొ. కె సూర్యప్రకాశరావు అన్నారు. స్థానిక డిఎంఎస్ అండ్ ఎస్‌విహెచ్ ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 15 ఎకరాల విస్తీర్ణం కలిగిన స్థలంలో అన్ని వౌలిక వసతులతో ఏర్పాటు చేసిన ఈ కళాశాలలో నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు తెలిపారు. 2015-16 సంవత్సరంలో నిర్వహించిన ప్రాంగణ ఎంపికల్లో 154 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికైనట్లు తెలిపారు. 13 మంది పిహెచ్‌డిలు, 70 మంది పోస్టు గ్రాడ్యుయేట్లు, 15 మంది రిసెర్చ్ స్కాలర్లతో ఎయిర్ కండీషనర్ సెమినార్ హాల్స్, స్మార్ట్ తరగతి గదుల్లో విద్యాబోధన జరుగుతుందన్నారు. తెల్లకార్డు వారికి ఫీజు రీయింబర్స్‌మెంట్ సౌకర్యం ఉందని, ఎ, బి కేటగిరిల్లోని విద్యార్థులకు ఒకే రకమైన ఫీజు వసూలు చేయనున్నట్లు తెలిపారు. గత 35 సంవత్సరాలుగా ఉత్తమ ఫలితాలను సాధిస్తున్నట్లు ఆయన వివరించారు. సమావేశంలో ప్లేస్‌మెంట్ ఆఫీసర్ ప్రొ. జె ఉదయభాస్కర్, ప్రొ. విఎస్‌విఆర్ ప్రసాద్, శాఖాధిపతులు ఎ ధీరజ్, డా. బి అమర నాగేంద్రం, డా. సిహెచ్ శాంతిరాణి, డా. బి నాగజ్యోతి పాల్గొన్నారు.