కృష్ణ

ఎస్సీల్లో చేర్చాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 9: రాష్ట్రంలోని బోయలను ఎస్‌సి జాబితాలో చేర్చాలనే అపరిష్కృత డిమాండ్ సాధనకై వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ఎం సుభాష్ చంద్రబోస్ నాయకత్వంలో వందలాది బోయలు శనివారం తొలిసారి ప్రత్యక్ష పోరుకు సన్నద్ధమయ్యారు. ప్రధానంగా రాయలసీమ ప్రాంతం నుంచి దాదాపు 500 మందికిపైగా తరలివచ్చారు. తొలుత అలంకార్ జంక్షన్‌లో ధర్నా జరిగింది. అనంతరం ముందస్తు అనుమతి లేకపోయినా ముఖ్యమంత్రి కార్యాలయం వైపు దూసుకెళ్ళే ప్రయత్నం చేయగా పోలీసలు అడ్డుకోడంతో తోపులాటలు మధ్య స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఏ విధంగానైనా తమను అనుమతించాలంటూ ఒక కార్యకర్త తన ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేయగా మరో ఇద్దరు కార్యకర్తలు సమీపంలోని వాటర్ ట్యాంక్‌పైకి ఎక్కి దూకేస్తాం అంటూ కొంత సేపు బెదిరించారు. దాంతో అదనపు పోలీసు బలగాలు అక్కడికి చేరుకున్నాయి. దొరికిన వారిని దొరికినట్లు పోలీస్ వ్యాన్‌లలో పడవేసి వేర్వేరు పోలీసు స్టేషన్‌లకు తరలించారు. రాష్ట్ర అధ్యక్షులు సుభాష్‌చంద్ర బోస్‌తోపాటు 30 మందికిపై అరెస్ట్ చేసి సాయంత్రం విడుదల చేశారు. ఈ ఆందోళనలో జెఎసి చైర్మన్ చొప్పవరపు హనుమంతరావు, సంఘం ప్రధాన కార్యదర్శి గూడూరి దిడ్డయ్య, ఉపాధ్యక్షులు అనంతపురం తిరుపాలు, నాయకులు అద్దాల నాగరాజు, వలసల రామకృష్ణ, గౌరవ సలహాదారు బోజనాల కాటం రాజు, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుభాష్‌చంద్ర బోస్ మాట్లాడుతూ గత ఎన్నికల ప్రచారం పాదయాత్రలో వచ్చిన చంద్రబాబు తమను ఎస్‌సి జాబితాలో చేరుస్తానంటూ హామీనిచ్చారని అయితే గత రెండేళ్ళుగా అతీగతి లేదన్నారు. ఇప్పటికి ఎన్ని సార్లు సింను కలిసి విన్నవించడం జరిగిందన్నారు. అసలు 1956 వరకు తాము ఎస్‌సిలుగా ఉన్నామని అయితే నీలం సంజీవరెడ్డి హయాంలో తమను విభజించి ఉత్తరాంధ్ర ఉభయగోదావరి జిల్లాల వారిని ఎస్‌సిలుగా ఉంచి మిగిలిన వారందరినీ బిసి బి గ్రూప్‌లో చేర్చి తమకు తీరని అన్యాయం చేసారన్నారు. దీనిపై నాటి నుంచి పోరాడుతునే ఉన్నామన్నారు. ముఖ్యమంత్రి ఇప్పటికైనా స్పందించి తమను ఎస్‌సి జాబితాలో చేరుస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని డిమాండ్ చేశారు. గత బడ్జెట్ సమావేశంలో గవర్నర్ ప్రసంగంలో ఈ హామీ ఇవ్వబడినప్పటికీ ఫలితం లేకుండా పోయిందన్నారు. ఇక శాంతియుతంగా ఉద్యమించేదిలేదని మున్ముందు హింసాయుత పద్ధతుల్లో తమ ఉద్యమాలు సాగుతాయంటూ హెచ్చరించారు. వీరి ఆందోళన సందర్భంగా దాదాపు గంట సేపు గాంధీనగర్ జంక్షన్‌లో ట్రాఫిక్ స్తంభించింది.

పుష్కర యాత్రికులకు సేవలందించే సంస్థలకు
సంపూర్ణ సహకారం
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, జూలై 9: కృష్ణా పుష్కరాలకు వచ్చే యాత్రికులకు సేవలు, ఆతిథ్యం అందించే సేవా సంస్థలకు ప్రభుత్వపరంగా అన్ని విధాల సహకారం ఉంటుందని జిల్లా జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు పేర్కొన్నారు. శనివారం సాయంత్రం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, వసతులకు సంబంధించిన అధికారులతో జాయింట్ కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులతో మాట్లాడుతూ సాధ్యమైనంత మేర ఎన్‌జివోలు తాము కోరుకునే ప్రాంతంలోనే సేవలు అందించే విధంగా రూపకల్పన చేయనున్నట్లు తెలిపారు. ఏఏ ఎన్‌జవోలకు పుష్కర ఘాట్లు, పుష్కరనగర్‌లు కేటాయింపులు ఒక వారం రోజుల్లో ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలిపారు. గత అనుభవాల దృష్ట్యా ఎన్‌జవోలు తమకు కేటాయించిన ప్రాంతంలోనే భోజన తయారీ చేసి యాత్రికులకు ఆతిథ్యం అందే విధంగా ఏర్పాట్లు సిద్ధంగా ఉండాలన్నారు. వీటికి కావాల్సిన సదుపాయాలు పుష్కరనగర్‌లు, పుష్కరఘాట్‌ల వద్ద ఏర్పాట్లు చేయనున్నట్లు జెసి తెలిపారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చే ఎన్‌జవో ప్రతినిధులకు, వాలంటీర్లకు తగిన విధంగా వసతి సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. ఫొటో, వాహన గుర్తింపు కార్డులు జారీ చేయనున్నట్లు తెలిపారు. ఎన్‌జీవోలు ఆతిథ్యం, వైద్యం, సేవలు తదితర సేవలందించడానికి ముందుకు వస్తున్నారని, అలాంటి వారి సేవలను ఏ విధంగా వినియోగించుకోవాలనే అంశాలను ఒక ప్రణాళికబద్ధంగా రూపొందించనున్నట్లు జెసి తెలిపారు. కొంత మంది ఎన్‌జీవోలు ఉచిత భోజనం, ధరపై భోజనం పెట్టడానికి, అదే విధంగా వికలాంగులు, వృద్ధులకు వీల్‌చైర్‌ల ద్వారా సేవలు అందించడానికి ముందుకు వస్తున్నారని జెసి తెలిపారు. జిల్లా పౌర సరఫరాధికారి వి రవికిరణ్ అతిధ్య నిర్వహణకు జిల్లా నోడల్ అధికారిగా వ్యవహరిస్తారని తగు సమాచారం కోసం 8008301464 ఫోన్‌కు సంప్రదించవచ్చని జెసి ఎన్‌జివో ప్రతినిధులకు సూచించారు.
వసతులపై సమీక్ష
పుష్కరాల నిర్వహణకు వివిధ శాఖల నుండి వచ్చే సిబ్బందిని ఆయా శాఖ అధికారులే ముందస్తుగానే వసతులు గుర్తించి వసతి ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. దీనికోసం గుర్తించిన ప్రభుత్వ పాఠశాలతో పాటు ప్రైవేట్ పాఠశాల గదుల వారీగా పరిశీలించి ఎంత మందిని వసతి కల్పించవచ్చునో తదితర అంశాలను గుర్తించాలన్నారు. ఈ సమావేశంలో వసతులకు సంబంధించి పోలీసు, వైద్య ఆరోగ్యశాఖలతోపాటు ఇతర శాఖల అధికారులు, వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. సమావేశంలో ట్రైనీ కలెక్టర్ బాలాజి, డిఆర్‌వో సిహెచ్ రంగయ్య, బందరు, గుడివాడ ఆర్డివోలు పి సాయిబాబా, చక్రపాణి, పౌర సరఫరాలాధికారి వి రవికిరణ్, పుష్కరసెల్, జిల్లా అభివృద్ధి అధికారులు అనంతకృష్ణన్, శ్యామ్‌సుందర్, పుష్కరసెల్ సిబ్బంది పాల్గొన్నారు.

ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న బిజెపి
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, జూలై 9: ఇతర పార్టీలలో అసంతృప్తితో ఉన్న వారిని చేర్చుకోవడం ద్వారా రాష్ట్రంలో బలోపేతం కావాలని బిజెపి నిర్ణయించడం సిగ్గుచేటని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్, వైఎస్సార్సీలు బలహీనంగా ఉన్నాయని చెబుతున్న బిజెపి నాయకత్వం, ఫిరాయింపులను ప్రోత్సహించడం ద్వారా ఆ స్థానాన్ని భర్తీ చేయాలని తహతహలాడుతోందన్నారు. సిద్ధాంతాలతో కూడిన జాతీయ పార్టీ అని చెప్పుకుంటునే కేంద్రంలో అధికారంలో ఉండి కూడా ఫిరాయింపుదారులు, పనికిమాలిన చెత్తను కలుపుకుంటే రాష్ట్రంలో ఏవిధంగా బలోపేతం అవుతుందో అర్థం కావడం లేదన్నారు. దాసరి భవన్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులైన చంద్రబాబు, కెసిఆర్‌లు ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ చేస్తున్న తప్పులనే బిజెపి చేయాలనుకుంటోందని ఆయన ఎద్దేవా చేశారు. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చని పార్టీ ఏదైనా ఉంటే అది ఒక్క బిజెపి మాత్రమేనన్నారు. రాష్ట్రంలో భూములు అతిచౌకైన నిత్యావసర వస్తువుగా మారిపోయిందని రామకృష్ణ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకి భూపిచ్చి పట్టిందన్నారు. రాజధాని పేరుతో భూసమీకరణ పథకం కింద ఇప్పటికే రైతుల నుండి 33వేల ఎకరాలను సేకరించిన ప్రభుత్వం తాజాగా బందరు పోర్టుకు లక్ష ఎకరాలను సమీకరించాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించడం దారుణమన్నారు. బందరులో రైతుల నుండి లక్ష ఎకరాలను సమీకరించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సిపిఐ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ఈ విషయమై పది వామపక్ష పార్టీలతో సమావేశమై లోతుగా చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామన్నారు.

దుర్గమ్మ దేవస్థానం ఆధీనంలోకి
శనైశ్చరస్వామి ఆలయం?
ఇంద్రకీలాద్రి, జూలై 9: సీతమ్మవారి పాదాల చెంత ఉన్న శ్రీ ప్రత్యేక శనైశ్చరస్వామివారి దేవస్థానాన్ని శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం స్వాధీనం చేసుకోనేందుకు దాదాపుగా రంగం సిద్ధం అయినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా లభించినకీలక సమాచారం. ఈదేవస్థానానికి అధ్యక్ష,కార్యదర్శులు ఆలమూరికొండ,కలిశెట్టి కనకరావులు వచ్చిన తర్వాత ఈదేవస్థానానికి మరింత ప్రచారంలోనికి తీసుకొచ్చి శక్తిమేరకు అభివృద్ధి చేసారు. దీనికి అనుగుణంగా దాతలను అధికశాతం భాగస్వాములుగా చేసి ప్రధాన ఆలయానికి అనుసంధానంగా రాహు-కేతు,ఆలయాన్ని సైతం నిర్మించారు. కొద్ది రోజుల క్రితం యంపి కేశినేని పర్యటనకు వచ్చిన సందర్భంలో కమిటీ సభ్యులు ఆలయం కూల్చివేత ఈవిషయాన్ని ఆయన దృష్టికి తీసుకువెళ్ళారు. దీంతో ఈఆలయాన్ని శ్రీదుర్గా మల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం అప్పగించాలని నిర్ణయం తీసుకోవటంతో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే యంపి ఆలోచనను సర్కార్ అమలోనికి తీసుకొచ్చేందుకు రంగం సిద్ధం చేసి దీనికి సంబంధించిన ఒక ప్రత్యేక జివోను తయారు చేసి దేవాదాయ ధర్మాదాయశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ జెవియస్ ప్రసాద్ కమీషనర్ వైవి అనూరాధ చేత విడుదల చేసినట్లుగా దేవాదాయ ధర్మాదాయశాఖ కమీషనర్ కార్యాలయానికి చెందిన ఒక సీనియర్ అధికారి తెలిపారు. శనైశ్చర స్వామి ఆలయానికి దుర్గగుడి స్వాధీనం చేసుకోవటానికి గత కొద్ది రోజుల నుండే తెర వెనుక ఒక రాజకీయనాయకుడు పావులు కదపారు. దీనికితోడు ఈ ఆలయాన్ని దుర్గగుడికి అప్పగిస్తే మరింత ప్రచారంలోనికి ఈ గుడిని తీసుకువెళ్ళేందుకు అవకాశం ఉంటుందని ఈశాఖకు చెందిన ఒక సీనియర్ అధికారి కూడ ప్రిన్సిపాల్ సెక్రటరీ సూచించటంతో దుర్గగుడి ఈఆలయాన్ని స్వాధీనం చేసుకోనేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. సుమారు 10రోజుల వ్యవధిలో శ్రీదుర్గా మల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం పరిధిలోనికి శ్రీ ప్రత్యేక శనైశ్చరస్వామివార్ల ఆలయం వెళ్ళే విధంగా ఈశాఖకు చెందిన అధికారులు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. ఇది ఉండగా గతంలో ప్రైవేట్ కమిటీ ఆధీనంలో ఉన్న ఈఆలయాన్ని దేవాదాయ ధర్మాయశాఖ స్వాధీనం చేసుకొని ఇవోను సైతం నియమించారు. దీనిపై ప్రైవేట్ కమిటీ న్యాయస్ధానాన్ని ఆశ్రయించారు. దీంతో అప్పట్లో ఏర్పాటు చేసిన ఇవో బాధ్యతలను స్వీకరించకుండానే వెళ్ళిపోగా గత రెండు నెలల క్రితం దేవాదాయ ధర్మాదాయశాఖ కమిషనర్ ఒక ఇవోకు ఈబాధ్యతలను అప్పగించినప్పటికీ కొన్ని కారణాల వలన ఇవోను ఈఆలయాన్ని సైతం స్వాధీనం చేసుకోకుండా కాలయాపన చేసారు.