కృష్ణ

పుష్కరాల నిర్వహణలో ఆదర్శంగా నిలచిన విజయవాడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), ఆగస్టు 31: పుష్కరాల నిర్వహణలో విజయవాడ నగరం అందరికీ ఆదర్శంగా నిలచిందని, ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన కృష్ణా పుష్కరాల విజయవంతంలో విజయవాడ నగరపాలక సంస్థ ఉద్యోగుల పాత్ర నిరుపమానమని, నగర పాలనలోనూ, పౌర సేవల్లోనూ అదే స్ఫూర్తి కొనసాగించాలని విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని పేర్కొన్నారు. ఈసందర్భంగా బుధవారం రాత్రి నగరంలోని ఎ కనె్వన్షన్ సెంటర్లో నిర్వహించిన విజయోత్సవ, అభినందన సభలో ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపి నాని మాట్లాడుతూ ప్రపంచలోనే ఎక్కడా జరగని విధంగా కృష్ణా పుష్కరాలను నిర్వహించిన ఘనత ఆంధ్రప్రదేశ్‌కే దక్కుతుండగా అందులోనూ విజయవాడ నగరపాలక సంస్థకు ప్రత్యేక స్థానముందన్నారు. పుష్కర స్నానాలకు నగరానికి విచ్చేసిన లక్షలాది మంది భక్తులు, యాత్రికులకు అవసరమైన సకల సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా లక్షల్లో ఏ ఒక్కరికైనా అసౌకర్యం కలిగించకుండా సేవలందించడంలో విఎంసి ఉద్యోగుల పాత్ర అభినందనీయమన్నారు. అదే స్ఫూర్తిని కొనసాగించి ఇకముందు కూడా అదేవిధంగా పౌర సేవలందిస్తే రాష్ట్రం, దేశంలోనే కాక ప్రపంచంలోనే విజయవాడ నగరానికి మంచి ప్రాముఖ్యత లభిస్తుందన్నారు.
విఎంసి కమిషనర్ వీరపాండియన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ అధికారుల సూచనలు, సలహాలతోపాటు ముందుగా రూపొందించుకొన్న మైక్రో ప్లానింగ్ ను సక్రమంగా అమలుపరచి అన్ని పనులను సక్రమంగా నిర్వర్తించినందుకే పుష్కరాల్లో విఎంసికి ప్రత్యేక గుర్తింపు లభించిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కూడా విఎంసి చేపట్టిన పుష్కర పనులపై పూర్తి సంతృప్తి చెందడం హర్షణీయమని, ఈవిజయం విఎంసి ఉద్యోగులందరికీ వరిస్తుందన్నారు. ఉద్యోగులు కూడా బాధ్యతగా తమ విధులను నిర్వర్తించడం అభినందనీయమన్నారు. నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్ మాట్లాడుతూ పుష్కరాల నిర్వహణకు అన్ని రాష్ట్రాల్లోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లకు ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. కృష్ణా పుష్కరాల నిర్వహణలో విఎంసికి అప్పగించిన బాధ్యతలను నూటికి నూరు శాతం నిర్వర్తించడం జరిగిందన్నారు. పుష్కర నగర్ల ఏర్పాటు, నిర్వహణ, తాత్కాలిక మరుగుదొడ్ల ఏర్పాటు తదితర అంశాలతోపాటు విద్యుత్ దీపాలతోను, గ్రీనరీతోనూ నగర సుందరీకరణ చేసిన వైనంతోపాటు కృష్ణానదీ ఘాట్లు, నగర వ్యాప్తంగా అన్ని డివిజన్ల పరిసరాలన్నింటినీ అత్యంత పరిశుభ్రంగా తీర్చిదిద్దిన ఉదంతంలో విజయవాడ నగరం రికార్డు సృష్టించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా పుష్కర పనులకు కేటాయించిన నిధుల మంజూరులో ఎటువంటి జాప్యం కలిగించకుండా సకాలంలో విడుదల చేయడం పుష్కర విజయానికి మరో కారణమన్నారు. పుష్కరాల నేపథ్యంలో నగర వ్యాప్తంగా రూ.186కోట్ల అభివృద్ధి పనులు జరిగాయని, వీటిలో నగర ప్రధాన రహదారులన్నీ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెంది నగర ప్రయాణికులకు ఎంతో సౌకర్యవంతం చేసామన్నారు. రాష్ట్ర రాజధాని నగరంగా అభివృద్ది చెందుతున్న విజయవాడ నగరానికి కృష్ణాపుష్కరాలు వరంలా వచ్చాయని, వాటిని నూటికి నూరు శాతం సద్వినియోగం చేసుకోవడంలో విజయం సాధించామన్నారు. ఈ కార్యక్రమంలో నగర డెప్యూటీ మేయర్ గోగుల రమణారావు, అదనపు కమిషనర్ పి అరుణ్‌బాబు, వివిధ శాఖల అధికార, ఉద్యోగులు, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు సభికులందరినీ ఆకర్షించాయి.

విఎంసి ఖజానాపై
కృష్ణా పుష్కరాల ప్రభావం
విజయవాడ (కార్పొరేషన్), ఆగస్టు 31: ఈ నెల 12నుంచి 23 వరకూ జరిగిన కృష్ణాపుష్కరాల ప్రభావం విజయవాడ నగరపాలక సంస్థ ఖజానాపై పడింది. ఉద్యోగులందరూ పుష్కర విధులకు పరిమితమవ్వడంతో నగర ప్రజల నుంచి వసూలు చేయాల్సిన ఆస్తి, నీటి, యుజిడి తదితర పన్ను వసూళ్లు దాదాపుగా నిలచిపోయాయి. అంతేకాకుండా ఇతర మార్గాల ద్వారా అంటే టౌన్‌ప్లానింగ్ ప్లాన్ మంజూరు ప్రక్రియ, డి అండ్ ఓ లైసెన్స్ ఫీజుల వసూలు తదితర వసూళ్లు కూడా నిలచిపోవడంతో విఎంసి ఖజానా ఆదాయానికి గండి పడింది. దీంతో సెప్టెంబర్ నెలకు సంబంధించి ఉద్యోగులకు చెల్లించాల్సిన జీతం చెల్లింపులు మరికొద్ది రోజుల పాటు జాప్యం నెలకొంది. నెలకు సుమార ఐదున్నర కోట్లకు పైగా సిబ్బంది జీత భత్యాలు, పెన్షనర్ల పెన్షన్ చెల్లింపులు ఉంటాయి. ప్రతి నెల 1నుంచి 5లోగా ఖచ్చితంగా జీతాలు పొందే విఎంసి ఉద్యోగులకు కృష్ణా పుష్కరాలు విపత్కర పరిస్థితులను తెచ్చిపెట్టాయని చెప్పచ్చు. అంతేకాకుండా ఈనెలలో హిందువులకు వినాయకచవితి, ముస్లీంలకు బక్రీద్ పండుగలు జరుపుకోవాల్సి ఉంది. ఈనేపథ్యంలో నెలవారీ ఖర్చుల కన్నా అధిక ఖర్చులు ఎదురవుతాయన్నది తెలిసిందే. అదనపు ఖర్చులకు అదనపు ఆదాయం లేకపోగా క్రమంగా వస్తాయనుకొన్న నెల జీతం కూడా మరికొంత ఆలస్యం అవుతుందన్న విషయం పై ఉద్యోగులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. జీతానికే దిక్కులేని దుర్బర పరిస్థితుల్లో ఇక పండుగ అడ్వాన్స్‌నకు అవకాశం ఉండదన్న విషయం వేరే చెప్పనక్కర్లేదు. ఈవిషయంపై నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్ సంబంధిత అధికారులతో సమీక్షించారు. బుధవారం ఉదయం తన ఛాంబర్‌లో విఎంసి రెవెన్యూ డెప్యూటీ కమిషనర్ ఎవి రమణి, ఇతర అకౌంట్స్ అధికారులతో చర్చించిన ఆయన ఎట్టి పరిస్థితిల్లోనూ జీతాలను చెల్లించాల్సిందేనని, రెండు, మూడు రోజులు ఆలస్యమైనా పండుగ లోపే జీతాలను చెల్లించి ఉద్యోగులను ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు. బిల్ కలెక్టర్లు, ఆర్‌ఐను ఫీల్డ్ వర్క్ చేయించి పన్ను వసూళ్లపై దృష్టి పెట్టాలని మేయర్ శ్రీ్ధర్ సూచించారు. ఊహించని విధంగా ఎదురైన ఆర్థిక విపత్కర పరిస్థితులను అధిగమించేందుకు ఉద్యోగులు బాధ్యతగా వ్యవహరించాలన్నారు.

పొంగి ప్రవహిస్తున్న ఏనుగుగడ్డ వాగు
ఇబ్రహీంపట్నం, ఆగస్టు 31: ఏనుగుగడ్డ వాగు పొంగి ప్రవహించటంతో మండలంలోని కొటికలపూడి గ్రామం నుంచి కేతనకొండ వచ్చే రోడ్డుపై రవాణాకు అంతరాయం ఏర్పడింది. మండలంలోని కొటికలపూడి గ్రామం రోడ్డులో పరిటాల కొండల నుండి వచ్చే వరదకు కేతనకొండ నుండి కొటికలపూడి గ్రామంకు జరిగే రాకపోకలకు తీవ్ర అసౌకర్యం ఏర్పడింది. ఆటోలు, ద్విచక్ర వాహనాలు నిలిచిపోగా కాలిబాటన, ట్రాక్టర్ల మీద రవాణా జరుగుతోంది. బుధవారం ఒకేసారి వరద ఉధృతంగా రావడంతో రవాణా సౌకర్యం దెబ్బతింది.

30తో ముగియనున్న ఆదాయ వెల్లడి పథకం
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, ఆగస్టు 31: ఆదాయ వెల్లడి పథకం 2016ను వైద్యులు అందరూ వినియోగించుకోవాలని ఆదాయపు పన్ను శాఖ అదనపు కమిషనర్ బి శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. గవర్నర్‌పేట ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్‌లో వైద్య నిపుణులకు ఆదాయ వెల్లడి పథకం 2016పై అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా పాల్గొన్న బి శ్రీనివాస్ మాట్లాడుతూ అర్హులైన వ్యక్తులు ఈ పథకం ద్వారా 2015-16 ఆర్థిక సంవత్సరం వరకు వెల్లడించని ఆదాయం, ఆస్తులను ప్రకటింవచ్చన్నారు. ఈ పథకం సెప్టెంబర్ 30నాటికి ముగుస్తుందన్నారు. ఈ సందర్భంగా డాక్టర్లకు పథకం అవగాహన చెందే విధంగా పవర్‌పాయింట్ ప్రజంటేషన్‌ను ఆదాయపు పన్ను అధికారి ఎన్ నాగభూషణం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ పిఎమ్‌సి నాయుడు, డాక్టర్ రవీంద్రనాథ్, స్థానిక అదాయపు పన్ను అధికారులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లాలో నలుగురు మండలాభివృద్ధి అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేసిన కలెక్టర్ బాబు ఎ
అధికారుల పనితీరు బాగాలేదంటూ కలెక్టర్ ఆగ్రహం
స్వేచ్ఛను దుర్వినియోగం చేయరాదు
పనితీరు సరిగాలేని అధికారులు వచ్చే సమావేశంలో ఉండబోరు
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, ఆగస్టు 31: ప్రజాసాధికారిత సర్వేలో సరైన విధానంలో పని చూపడం లేదని, మున్సిపల్ కమిషనర్‌లను కూడా ఎన్యూమరేటర్లగా క్షేత్రస్థాయిలో పని చేయాల్సి ఉంటుందని కలెక్టర్ బాబు ఎ స్పష్టం చేశారు. స్థానిక కలెక్టర్ ఛాంబర్‌లో బుధవారం జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు, సబ్ కలెక్టర్ సృజనలతో కలిసి మున్సిపల్ కమిషనర్‌లతో సర్వే పుష్కరాలకు ముందు, పుష్కరాల సమయంలో, పుష్కరాల అనంతరం పనితీరును మూడు విధాలుగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాబు ఎ మాట్లాడుతూ ఇప్పటి వరకు 35 నుండి 40 శాతం వరకే పనితీరును కనబరచగలిగారని, ఇదే తీరును కొనసాగిస్తే తదుపరి సమావేశంలో పనితీరు చూపని అధికారులు ఉండరని ఆయన హెచ్చరించారు. ఎన్నో సాంకేతికపరమైన పనితీరులో జిల్లా ఆదర్శంగా నిలవడం జరుగుతోందని, సర్వేకు జిల్లానే కేంద్రంగా ప్రారంభించిన టిం కృష్ణ పనితీరులో అలా జరగకపోవడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్యూమరేటర్ స్థాయిలో జరుగుతున్న సర్వే తీరుపట్ల కొంత మేర ఆలక్ష్యం చూపుతున్నారని సాంకేతిక పరంగా ప్రతి ఎన్యూమరేటర్ పనితీరును విశే్లషణ జరుగుతుందన్నారు. వారి డేటా ఆధారంగానే క్షేత్రస్థాయిలో పని చేసే సిబ్బందికి చర్యలు ఉంటాయనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తెరిగి పని చేయాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. పట్టణ ప్రాంతంలో సర్వేను మరింత వేగవంతం చేయాలని 5 రోజుల క్రితం ఆదేశించిన పనితీరులో మెరుగుచూపలేకపోతున్నారని, సగటున ప్రతిరోజు 4 కుటుంబాలే సర్వేనే చేపట్టడం అందులోను అందరి కుటుంబ సభ్యులను సర్వే చేయకపోవడం గుర్తించామన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 14 లక్షల మంది జనాభా సర్వేను పూర్తి చేశారని, మరో 36 లక్షల మంది సర్వేను పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. జిల్లాలో 2611 మంది ఎన్యూమరేటర్లు పని చేయాల్సి ఉండగా ఈరోజు 1600 మంది మాత్రమే పని చేస్తున్నారని కమిషనర్లు, తహశీల్దార్లు, మండల అభివృద్ధి అధికారులు, ప్రత్యేక అధికారులు వ్యక్తిగత బాధ్యతతో పనితీరును నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ప్రజాసాధికారిత సర్వేలో మండల స్థాయిలో సర్వేలో ఆలక్ష్యం వహిస్తున్న విసన్నపేట, వత్సవాయి, చందర్లపాడు, మైలవరం మండలాభివృద్ధి అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాల్సిందిగా జెడ్‌పిసి ఈఓ దామోదర్ నాయుడును కలెక్టర్ ఆదేశించి 3 మండలాలకు చెందిన తహశీల్దార్లకు, ప్రత్యేక అధికార్ల నుంచి వివరణ కోరాల్సిందిగా ఆయన ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా విసన్నపేట ఎంపిడివోపై ముందస్తు సమాచారం లేకుండా విధులకు గైర్హజైన సందర్భాన్ని పురస్కరించుకుని ఎందుకు క్రమశిక్షణ చర్యలు తీసుకోరాదో వివరణతో కూడిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్లు, మెప్మా పిడి ఆధ్వర్యంలో జిల్లా పరిపాలన యంత్రాంగానికి లోబడి పని చేయాలన్నారు. త్వరలో ఆర్డివోలను డివిజన్ స్థాయి కమాండ్ కంట్రోల్ రూం పర్యవేక్షకుడిగా ప్రభుత్వం నియమిస్తుందని, అందుకు అనుగుణంగా అన్ని శాఖలతో సమన్వయం చేస్తూ పనితీరును చూపాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ గందం చంద్రుడు, సబ్ కలెక్టర్ జి సృజన, ఆర్‌డివోలు సాయిబాబా, చక్రపాణి, మెప్మా పిడి టి సోమ్మయ్య, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.

నకిలీ కారంపొడి తయారీ కేంద్రంపై దాడులు
పాతబస్తీ, ఆగస్టు 31: కొత్తపేట పోలీసు స్టేషన్ పరిధిలోని పాముల కాలువ వద్ద ఓ రేకుల షెడ్డులో నకిలీ కారంపొడిలు తయారు చేస్తుండగా ఆ కేంద్రంపై టాస్క్ఫోర్స్, కొత్తపేట పోలీసులు దాడులు నిర్వహించారు. వనమా జనార్థన్ అనే వ్యక్తి రేకుల షెడ్డులో పలు రకాల కారంపొడులు తయారు చేస్తున్నాడు. త్రి మ్యాంగోస్ అనే బ్రాండ్‌ను అనుకరిస్తూ అతను తయారు చేస్తున్న కారంపొడులలో రంపం పొట్టు, రంగు ఎక్కువ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పచ్చళ్ల కారమని, ఇండ్లీల కారమని, నువ్వులు, పుట్నాల కారం ఇలా రకరకాల పేర్లతో కారంపొడి ప్యాకెట్లు తయారు చేస్తున్నాడు. ఘాటు కోసం నాసిరకం మెంపులు వాడినా రంగు కోసం రసాయన పొడి అలాగే రంపం పొట్టుతో ఈ ప్యాకెట్లు తయారు చేస్తున్నాడు. నిందితుని వద్ద 50 బస్తాల సరుకును స్వాధీనం చేసుకున్నారు. బుధవారం రాత్రి జరిగిన ఈ దాడుల్లో టాస్క్ఫోర్స్ ఎసిపి ప్రసాద్, ఎస్‌ఐ శ్రీనివాసరావు, కొత్తపేట సిఐ దుర్గారావు, ఎస్‌ఐ సుబ్బారావు. జనరల్ డెప్యూటీ కానిస్టేబుల్ దుర్గాకుమార్ తదితరులు పాల్గొన్నారు. పట్టుబడిన సరుకు విలువ రూ. 1.50 లక్షల ఉండవచ్చని పోలీసుల అంచనా.