కృష్ణ

అభివృద్ధికి ఆ‘మడ’ దూరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, సెప్టెంబర్ 14: తెల్లదొరల పాలనలో వాణిజ్య కేంద్రంగా విరాజిల్లిన జిల్లా కేంద్రం మచిలీపట్నం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. బందరు ఓడరేవు నిర్మాణంతో ఈ ప్రాంతాన్ని పారిశ్రామిక వాడగా తీర్చిదిద్దుతామని ప్రజా ప్రతినిధులు పదే పదే చేస్తున్న ప్రకటనలు కార్యరూపం దాల్చడం లేదు. గత ప్రభుత్వాల హయాంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన మచిలీపట్నంను ఇతోధికంగా అభివృద్ధి చేస్తామని అందళమెక్కిన అధికార తెలుగుదేశం పార్టీ నేతల మాటలు నీటి మీద రాతలుగానే మిగులుతున్నాయి. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఓడరేవు నిర్మాణం తప్పనిసరి. అటువంటి ఓడరేవు నిర్మాణం పట్ల గత పాలకులు నిర్లక్ష్యం చూపించారు. కాంగ్రెస్ హయాంలో ముగ్గురు ముఖ్యమంత్రులు మారినా బందరు ఓడరేవు నిర్మాణానికి సంబంధించిన భూసేకరణను చేయలేకపోయారు. ఈ నేపథ్యంలో 2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో బందరు పోర్టు అంశాన్ని వజ్రాయుధంగా చేసుకుని అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం ఆరు నెలల్లో ఓడరేవు నిర్మాణ పనులు ప్రారంభిస్తామని ప్రగల్భాలు పలికారు. ప్రతిపక్షంలో ఉండగా 2వేల ఎకరాలు భూమి చాలని చెప్పిన నాటి తెలుగుదేశం పార్టీ నాయకులు నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఓడరేవు, దాని అనుబంధ పరిశ్రమల స్థాపనకు 33వేల ఎకరాలకు గత ఏడాది ఆగస్టు 31న భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చి రైతుల ఆగ్రహానికి గురయ్యారు. ఆ తర్వాత ఎలాగోలా రైతులకు నచ్చ చెప్పే ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. రాజధాని భూముల విషయంలో ఉపయోగించిన ల్యాండ్ పూలింగ్ అంశాన్ని తెర మీదకు తీసుకువచ్చారు. పూలింగ్ ద్వారా 33వేల ఎకరాలు భూమిని తీసుకుని రైతులకు గణనీయమైన లబ్ధి చేకూరుస్తామని గ్రామసభల ద్వారా రైతులకు నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. పూర్తి స్థాయిలో రైతులు ల్యాండ్ పూలింగ్‌కు సిద్ధం కాకపోయినా ప్రభుత్వం మాత్రం భూముల సమీకరణకు నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం పూలింగ్‌లో తీసుకునే భూములకు సంబంధించిన వెరిఫికేషన్ ప్రక్రియ జరుగుతోంది. భూసమీకరణ ప్రక్రియను మచిలీపట్నం ఏరియా డెవలప్‌మెంట్ అధారిటీ (మడ) ద్వారా చేపడుతున్నారు. అయితే ఈ మడకు పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం లేకపోవటంతో నోటిఫికేషన్ జారీ ప్రక్రియలో కొంత జాప్యం జరుగుతూ వస్తోంది. మడకు నియమించిన వైస్ చైర్మన్ శోభ జాడ నేటికీ తెలియరాలేదు. ఆమె వైస్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించేందుకు అయిష్టత చూపుతున్నట్లు తెలుస్తోంది. ఆమె స్థానంలో మరో అధికారిని నియమించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ప్రస్తుతం వైస్ చైర్మన్‌గా కొనసాగుతున్న జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు పని భారంతో మడ కార్యకలాపాలను కొనసాగించలేకపోతున్నారు. మడకు ఇప్పటి వరకు కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయకపోవడం విశేషం. ఇటీవల జిల్లా కలెక్టర్ బాబు.ఎ మడ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డిఆర్‌డిఎ కార్యాలయం పైఅంతస్తులో మడకు తాత్కాలిక కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అలాగే భూముల వెరిఫికేషన్‌ను కూడా వెంటనే పూర్తి చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. సిబ్బంది కొరతను తీర్చేందుకు కలెక్టరేట్, బందరు, గుడివాడ డివిజన్‌ల పరిధిలోని రెవెన్యూ అధికారుల సేవలు వినియోగించుకోవాలని సూచించారు. ఈ సమీక్షతోనైనా ‘మడ’ కార్యకలాపాలు ఊపందుకుని ల్యాండ్ పూలింగ్‌కు నోటిఫికేషన్ అతి త్వరలో వెలువడుతుందని ఆశిద్దాం..

నిండు కుండలా పులిచింతల
జగ్గయ్యపేట రూరర్, సెప్టెంబర్ 14: గుంటూరు, నల్లగొండ జిల్లాలలో కురుస్తున్న భారీ వర్షాలకు వస్తున్న వరద ద్వారా పులిచింతల ప్రాజెక్టు జలకళ సంతరించుకుని నిండుకుండలా తొణికిసలాడుతోంది. జలవనరుల శాఖ అధికారులు ప్రాజెక్టు వద్ద ఉండి ఎప్పటికప్పుడు పూర్తి వివరాలు సేకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి సామర్ధ్యం 47.6 టిఎంసిలు కాగా బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు 21.49 టిఎంసిల నీరు చేరుకుందని ఇది ఇంకా పెరిగితే 30 టిఎంసిల వరకూ చేరుకోవచ్చని భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇన్‌ఫ్లో 19,668 క్యూసెక్కులు కాగా రెండు గేట్లు ఎత్తివేయడం ద్వారా 9.994 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. జలకళతో ఉన్న పులిచింతల ప్రాజెక్టును వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో సందర్శకులు తరలివస్తున్నారు.

ప్రభుత్వ పథకాలపై ప్రజలలో అవగాహన కల్పించాలి
ఆంధ్రభూమి బ్యూరో
మచిలీపట్నం, సెప్టెంబర్ 14: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేద, బడుగు, బలహీన వర్గాలకు చేరాలంటే పథకాలు గురించి వారికి సరైన అవగాహన కల్పించాలని జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ గద్దె అనూరాధ అన్నారు. బుధవారం జిల్లా పరిషత్‌లో సాంఘిక సంక్షేమంపై జరిగిన 6వ స్థాయి సంఘ సమావేశంలో పాల్గొన్న ఛైర్‌పర్సన్ అనూరాధ మాట్లాడుతూ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బిసిల సంక్షేమానికి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదన్నారు. ప్రజలు పథకాలు తెలుసుకునేందుకు ప్రజాప్రతినిధులు వద్దకు వస్తారని, అందుకే ప్రభుత్వ పథకాలను జెడ్పీటిసిలు, ఎంపిటిసిలు, ప్రజాప్రతినిధులకు తెలియజేయాల్సిన అవసరం అధికారులపై ఉందన్నారు. సంక్షేమ హాస్టళ్ళను ఆశ్రమ పాఠశాలలుగా ప్రభుత్వం దశల వారీగా ఏర్పాటు చేస్తున్నదన్నారు. పేద గిరిజన కుటుంబాలలో ఆడపిల్లలు వివాహం చేసుకున్న సందర్భంగా ప్రభుత్వం గిరిపుత్రిక పథకం కింద రూ.50వేలు అందచేస్తున్నదన్నారు. ఇలాంటి పథకాలు తెలియక కొంత మంది దరఖాస్తులు చేసుకోవటం లేదన్నారు. సంక్షేమ పథకాలను ప్రజలలోకి విస్తృతంగా తీసుకువెళ్ళాల్సిన అవసరాన్ని అధికారులు గుర్తించాలన్నారు. బంటుమిల్లి జెడ్పీటిసి దాసరి కరుణాజ్యోతి మాట్లాడుతూ మానవ జీవితంలో విద్యార్థి దశ ఎంతో కీలకమైనదన్నారు. జిల్లాలో 18 గిరిజన సంక్షేమ హాస్టళ్ళను ఆరు ఆశ్రమ పాఠశాలలుగా ప్రభుత్వం ఏర్పాటు చేసి వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తుందన్నారు. ఈ సమావేశంలో అవనిగడ్డ జెడ్పీటిసి కొల్లూరి వెంకటేశ్వరరావు, కో-ఆప్షన్ సభ్యులు తేళ్ల పుష్పరాజ్, జెడ్పీ సిఇఓ టి దామోదర్ నాయుడు, సాంఘిక సంక్షేమ శాఖ ఇఇ నరసింహమూర్తి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

చర్చలతో నీటి సమస్యలకు పరిష్కారం
జగ్గయ్యపేట రూరల్, సెప్టెంబర్ 14: తెలుగు రాష్ట్రాల మధ్య ఎలాంటి జల వివాదాలు రాకుండా రెండు ప్రభుత్వాలు చర్చించుకొని నీటి సమస్యలను సానుకూలంగా పరిష్కరించుకుంటామని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. బుధవారం జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్‌తో కలిసి పులిచింతల ప్రాజెక్టును సందర్శించారు. శ్రీశైలం, నాగార్జున సాగర్‌లో పూర్తి స్థాయిలో నీటి మట్టం లేకపోయినా నల్లగొండ, గుంటూరు జిల్లాలలో కురుస్తున్న వర్షాలు, వరదల వల్ల పులిచింతల ప్రాజెక్టులో అతి తక్కువ వ్యవధిలోనే 21.49 టిఎంసిల నీటి నిల్వ చేసుకునే అవకాశం కల్గిందన్నారు. దీని వల్ల కృష్ణా డెల్టాకు పూర్తి స్థాయిలో సాగు, తాగునీటి సమస్య పరిష్కారం అవుతుందని మొదటి సారిగా పులిచింతలలో ఇంత సామర్ధ్యంలో నీటి నిల్వ ఉండటం చాలా ఆనందంగా ఉందన్నారు. జూన్, జూలై, ఆగస్టు నెలల్లో వర్షపాతం తక్కువగా ఉండటం, కృష్ణానదికి ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్నాటకల్లో డ్యామ్‌లు నింపుకొని దిగువకు నీరు రాకుండా చేయడం వల్ల శ్రీశైలం, నాగార్జున సాగర్‌లో పూర్తి స్థాయిలో నీటి నిల్వ సామర్ధ్యం లేకుండా పోయిందన్నారు. కావేరీ జలాలపై కర్నాటక, తమిళనాడుల మధ్య వివాదాలు తలెత్తి అది హింసకు దారి తీయడం విచారకరమని, అలాంటి పరిస్థితులు భవిష్యత్తులో తెలుగురాష్ట్రాల మధ్య రాకుండా ఉండేందుకు రెండు రాష్ట్రాల పాలకులు, అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తామన్నారు. పులిచింతల ప్రాజెక్టు కింద తెలంగాణా ప్రాంతంలోని భూనిర్వాసితుల నష్టపరిహారానికి సంబంధించి నిధులు తెలంగాణా ప్రభుత్వానికి చెల్లించడం జరిగిందని, ప్రాజెక్టు భద్రతకు అధికారులు డ్యామ్ వద్ద విధులు నిర్వహిస్తూ ఎప్పటి కప్పుడు సమీక్ష చేస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇంకా వరద ఉద్ధృతి పెరిగితే 30 టిఎంసిల వరకూ నీరు నిల్వ చేసే అవకాశం ఉంటుందన్నారు. రాయలసీమతో సహా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సాగునీటి ఇబ్బందులు లేకుండా తెలుగుదేశం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యం వల్ల పులిచింతల నిర్మాణంలో జాప్యం జరిగిందని, ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుచూపుతో వ్యవహరించి తెలంగాణా ప్రాంత ముంపు బాధితులకు నష్టపరిహారం చెల్లించడం ద్వారా పులిచింతలలో నీరు నిల్వ చేసుకునే అవకాశం కల్గిందన్నారు. దీని వల్ల జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాల్లో భూగర్భజలాలు పెరిగి తాగునీటి సమస్య పరిష్కారం అవుతుందని, ముక్త్యాలలో ప్రభుత్వం నిర్మించతలపెట్టిన ఎత్తిపోతల పథకానికి ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉమా అధికారులకు పలు సూచనలు చేసారు. కార్యక్రమంలో సిఇ ఎం వెంకట రమణ, జిల్లా తెలుగుమహిళ అధ్యక్షురాలు ఆచంట సునీత, పార్టీ నేతలు ముల్లంగి రామకృష్ణారెడ్డి, కట్టా నర్శింహరావు, గింజుపల్లి రమేష్, డిసి అధ్యక్షుడు వేగినేటి గోపాలకృష్ణమూర్తి, నీటి సంఘం అధ్యక్షుడు యానాల గోపీచంద్, రావూరి శ్రీను, నందిగామ డిఎస్‌పి ఉమామహేశ్వరరావు, సిఐ లచ్చునాయుడు, చిల్లకల్లు ఎస్‌ఐ వంశీకృష్ణలు పాల్గొన్నారు.

అలరించిన కూచిపూడి నృత్య ప్రదర్శన
నందిగామ, సెప్టెంబర్ 14: గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా స్థానిక గాంధీ సెంటర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి ఏర్పాటు చేసిన కూచిపూడి నృత్య ప్రదర్శన చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. బాలికలు, మహిళలు భరతనాట్యం, కూచిపూడి తదితర నృత్యాలను చేసారు. పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ ప్రదర్శనను తిలకించి ఆనందించారు. కాగా విజయవాడ మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ స్థానిక గాంధీ సెంటర్, వాసవీ మార్కెట్ నవరాత్రి పందిళ్లను సందర్శించి గణనాధుడికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు కమిటీ నిర్వహకులు దుశ్సాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమాల్లో మాజేటి శ్రీనివాస్, సరికొండ రవీంద్రబాబు, అనుమోలు శ్రీను, లక్ష్మీనారాయణ, నకిరికంటి విశే్వశ్వరరావు, యేచూరి రాము, సముద్రాల మధు తదితరులు పాల్గొన్నారు.
నందిగామను వణికిస్తున్న వైరల్ ఫీవర్స్
* ఎమ్మెల్యేనూ వదలని జ్వరం
నందిగామ, సెప్టెంబర్ 14: నందిగామ, పరిసర గ్రామాల్లో విష జ్వరాలు ప్రబలుతుండటంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వాతావరణంలో మార్పులు, నీటి కాలుష్యం, అపరిశుభ్రత, దోమల వ్యాప్తి తదితర కారణాల వల్ల విష జ్వరాలు సోకి అస్వస్థతకు గురి అవుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులలో నిత్యం వందలాది మంది జ్వర పీడితులు చికిత్స పొందుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సైతం తీవ్ర జ్వరంతో అస్వస్థతకు గురి అయి గొల్లపూడిలోని ఆంధ్రా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. డెంగ్యూ లక్షణాలు ఉన్నట్లు అనుమానంతో వైద్యులు పరీక్షలు నిర్వహించినట్లు సమాచారం. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే సౌమ్యను బుధవారం జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పరామర్శించారు.

మైనర్‌పై అత్యాచారం
హనుమాన్ జంక్షన్, సెప్టెంబర్ 14:బాపులపాడు మండలం వేలేరు గ్రామానికి చెందిన బాలికపై అదే గ్రామానికి చెందిన నలుగురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఇరవై రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన అలస్యంగా వెలుగుచూసింది. బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ యువకులు మూడురోజుల క్రితం మరోసారి తమ వద్దకు రావాలని ఒత్తిడి చేయడంతో బాలిక హనుమాన్ జంక్షన్ పోలీసులను అశ్రయించింది. హనుమాన్ జంక్షన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వేలేరు గ్రామానికి చెందిన బాలిక (16)సైకిల్‌పై వెళుతున్న సమయంలో అదే గ్రామానికి చెందిన కుంపటి కిషోర్, బొబ్బిలి దానియోల్, యజ్జవరపు సుధీర్, తానంకి రమేష్‌లు అడ్టుకున్నారు. అనంతరం అమెను బలవంతంగా పక్కనే వున్న అయిల్‌పామ్ తోటలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. బాలిక కేకలు వేస్తున్నా బయటకు వినబడకుండా నిందితులు నోటిని మూసివేశారు. విషయాన్ని బయటకు చెబితే చంపివేస్తామని బెదిరించడంతో బాలిక విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పకుండా వౌనం దాల్చింది. మూడు రోజుల క్రితం అత్యాచారం చేసిన నలుగురు యువకులు బాధితురాల్ని మరోసారి తమ వద్దకు రావాలని వేధించారు. దీంతో మరోసారి తనను ఏమైనా చేస్తారనే భయంతో బాలిక జరిగిన సంఘటనను కుటుంబ సభ్యులకు తెలియజేయడంతోపాటు జంక్షన్ పోలీసులను ఆశ్రయించింది. బుధవారం బాలిక లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడంతో ప్రాధమిక విచారణ నలుగురిపై నిర్భయచట్టం కింద కేసు నమోదు చేశారు. నూజివీడు డిఎస్పి శ్రీనివాసరావు అధ్వర్యంలో జంక్షన్ సిఐ కెఎన్‌వి జయకుమార్, ఎస్‌ఐ తులసిధర్ నిందితుల కోసం గాలిస్తున్నారు. కాగా బాలికపై జరిగిన అత్యాచారం కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్, వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళ నేతలు డిమాండ్ చేశారు. ఈమేరకు స్థానిక విలేఖర్లకు రాష్ట్ర కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ, జిల్లా వైయస్‌ఆర్ కాంగ్రెస్ మహిళ అధ్యక్షురాలు కైలేజ్ఞానమణిలు ఒకప్రకటన విడుదల చేశారు.

జిల్లా ప్రభుత్వాసుప్రతి అభివృద్ధికి కృషి
మచిలీపట్నం (కోనేరుసెంటర్), సెప్టెంబర్ 14: జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రి అభివృద్ధికి నిత్యం కృషి చేస్తున్నట్లు జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ గద్దె అనూరాధ అన్నారు. జిల్లా ప్రభుత్వాసుపత్రిలో నర్సింగ్ కళాశాల విద్యార్థినుల సౌకర్యార్ధం జిల్లా పరిషత్ నిధులు రూ.4.5లక్షలతో ఏర్పాటు చేసిన ఆర్వోప్లాంట్‌ను జిల్లా చైర్‌పర్సన్ అనూరాధ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వాసుపత్రిని కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా రోగులకు వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులను అవినీతి రహితంగా ఖర్చు చేసి పేదలకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని అధికారులు, కాంట్రాక్టర్లకు సూచించారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయటం వల్ల మంచి పేరువచ్చిందని వైద్యులను, సిబ్బందిని అభినందిస్తున్నట్లు తెలిపారు. ఆసుపత్రిలో మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం రూ.1.44కోట్లు మంజూరు చేసిందన్నారు. వీటికి అదనంగా మరో రూ.80లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. నర్సింగ్ కళాశాలకు వౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. మాతా, శిశు సంక్షేమంలో భాగంగా బాలింతలు, గర్బిణీలకు పౌష్టికాహారం అందిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థినుల సమస్యలను తెలుసుకుని పరిష్కరించటం జరుగుతుందన్నారు. నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ పద్మ మాట్లాడుతూ 2013లో ప్రారంభమైన ఈ కళాశాలకు సొంత భవనం ఏర్పాటు చేయాలని, విద్యార్థినులకు అవసరమైన టీచింగ్ ఎయిడ్స్, ఎల్‌ఇడి ప్రొజెక్టర్, లైబ్రరీ బుక్స్, ఛైర్స్ అందించేందుకు దాతలు ముందుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి కాగిత వెంకటేశ్వరరావు, మున్సిపల్ వైస్ ఛైర్మన్ కాశీవిశ్వనాధం, కౌన్సిలర్ బందెల కవిత, బంటుమిల్లి జెడ్పీటిసి దాసరి కరుణాజ్యోతి, ఆసుపత్రి సూపరింటెండెంటు డా. జయకుమార్, ఆర్‌ఎంఓ అల్లాడ శ్రీనివాసరావు, జెడ్పీసిఇఓ దామోదరనాయుడు, మండల దేశం పార్టీ నాయకులు తలారి సోమశేఖర్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

రూ.5.11 కోట్లతో 5 రైతు బజార్ల ఏర్పాటు
కూచిపూడి, సెప్టెంబర్ 14: రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం నెలకొన్న దృష్ట్యా వ్యవసాయ మార్కెట్ కమిటీలో ఖాళీగా ఉన్న 2వేల పోస్టులు భర్తీ కాలేదని వ్యవసాయ మార్కెట్ కమిటీ జెడి సి రామాంజనేయులు పేర్కొన్నారు. స్థానిక పసుమర్తివారి ధర్మచెరువులో రూ.46లక్షల మార్కెట్ కమిటీ నిధులతో నిర్మిస్తున్న రైతు బజారు దుకాణాలను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.5.11 కోట్లతో ఐదు రైతు బజారుల నిర్మాణాలు చేపట్టినట్లు తెలిపారు. ఇందులో కూచిపూడిలో రూ.46లక్షలు, గన్నవరంలో కోటి రూపాయలు, తిరువూరులో రూ.50లక్షలు, విజయవాడ పాయకాపురంలో రూ.65లక్షలతో రైతు బజారుల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయన్నారు.