కృష్ణ

గ్రీన్‌జోన్ నిబంధనలు సవరించకుంటే పతనం తప్పదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం, జనవరి 27: సీఆర్డీఏ పరిధిలో ప్రభుత్వం రూపొందించిన గ్రీన్‌జోన్ నిబంధనలను సవరించకుంటే తెలుగుదేశం ప్రభుత్వానికి పతనం తప్పదని విపక్ష నేతలు హెచ్చరించారు. ప్రభుత్వం తీసుకున్న గ్రీన్‌జోన్ నిర్ణయానికి నిరసనగా బుధవారం మైలవరంలో తెలుగుదేశం పార్టీ మినహా అన్ని రాజకీయ పక్షాల నేతలు ఆందోళన నిర్వహించారు. తొలుత వైసిపి కార్యాలయం నుండి నిరసన ర్యాలీ ప్రారంభమై మైలవరం పురవీధుల్లో సాగింది. బోసుబొమ్మ సెంటరులో కొద్దిసేపు ధర్నా నిర్వహించారు. అక్కడి నుండి ర్యాలీగా తహశీల్దార్ కార్యాలయం వరకూ వెళ్లి కొద్దిసేపు ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా వైసిపి అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్ మాట్లాడుతూ వ్యవసాయ జోన్ పరిధి నుండి మైలవరం, జి.కొండూరు మండలాలను తొలగించాలని డిమాండ్ చేశారు. కేవలం వర్షంపైనే ఆధారపడి పంటలు పండే ఈప్రాంతంలో వాటిని పండించటానికి అవసరమైన వసతులు ప్రభుత్వం కల్పించకుండా గ్రీన్‌జోన్ పరిధిలోకి తేవటం శోచనీయమన్నారు. ఈ ప్రాంతానికి ప్రాతినిథ్యం వహిస్తున్న రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సైతం దీనిపై నోరుమెదపక పోవటం దారణమని ఆయన ధ్వజమెత్తారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు పివి ఆంజనేయులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు భూదాహానికి అదుపులేకుండా పోతోందని, పోరాటాల ద్వారానే దీన్ని అడ్డుకోవాలన్నారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకరకంగా మాట్లాడిన చంద్రబాబు, మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మరోరకంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. గ్రీన్‌జోన్ నుండి మైలవరం, జి.కొండూరు మండలాలను మినహాయించకపోతే అథోగతి తప్పదన్నారు. అనంతరం తహశీల్దార్ కెవి శివయ్యకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో బిజెపి, సిపిఐ, కాంగ్రెస్ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

నకిలీ పురుగు మందులతో
రైతులకు తీవ్ర నష్టం

గుడ్లవల్లేరు, జనవరి 27: నకిలీ పురుగుల మందుల వాడకంతో తీవ్ర పంటనష్టం జరిగింది. మండల పరిధిలోని వడ్లమన్నాడు, కౌతవరం గ్రామాల్లో మినుము పంటకు ఆకుముడత తెగులుకు పురుగు మందులు పిచికారీ చేయడం, అవి నకిలీ మందులు కావటంతో దాదాపు 50 ఎకరాల్లోని మినుము పంట చనిపోయింది. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. గత ఖరీఫ్‌లో తీవ్రంగా దెబ్బతిన్న రైతులు అప్పుల్లో కూరుకుపోయారు. మినుము పంటపైనే ఆశలు పెట్టుకున్న రైతులకు నకిలీ మందులు కారణంగా మరింత అప్పుల ఊబిలోకి కూరుకుపోయామని కౌలురైతులు వాపోతున్నారు. బుధవారం జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు, సస్యరక్షణ విభాగం డిడిఎ టి మోహనరావు, పామర్రు ఎడి శశిబిందు, మండల వ్యవసాయ శాఖాధికారిణి ఎన్ రమాదేవి, ఎఇఓ దివ్య పంటలను పరిశీలించారు. ఈసందర్భంగా రైతులు మాట్లాడుతూ పంటకు ఆకుముడత రావటంతో గ్రామంలోని పవన్ శ్రీలలిత ఫెర్టిలైజర్ దుకాణంలో మందులను కొనుగోలు చేసినట్లు తెలిపారు. కొనుగోలు చేసిన మందులను పిచికారీ చేసిన కొద్దిరోజులకే మినుము మొక్కలు చనిపోయాయని వాపోయారు. 8బస్తాల దిగుబడి వస్తుందని ఆశపడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామానికి చెందిన బిసి నాయకులు ఈడే కృష్ణ మాట్లాడుతూ ఎరువుల దుకాణదారులు నకిలీ మందులు అమ్మడంతో అవి గ్రహించని అమాయకపు రైతులు వాడటంతో తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కౌలురైతులు చిట్టిబొమ్మ సత్యనారాయణ, చిట్టిబొమ్మ వెంకటసాయి, కాగిత వెంకన్న, జోగి అమలేశ్వరరావు, భూపతి సుబ్బారావు, తూము భానూజి రామకృష్ణ, మదిరి రామస్వామి, దాసి వెంకటేశ్వరరావు, పోతినేని పెద్దిరాజులు, కూదేటి సూరయ్య తమకు చావే శరణ్యమని అధికారుల వద్ద వాపోయారు. తమను ఆదుకోవాలని అధికారులను వేడుకున్నారు. అధికారులు స్పందిస్తూ ఎరువుల షాపు వద్దకు వెళ్లారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పడిగాపులు కాసినా షాపు యజమాని మత్తి రాజేష్ అక్కడకు చేరుకోలేదు. డిడిఎ టి మోహనరావు మాట్లాడుతూ శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపుతున్నట్లు తెలిపారు. రెండురోజుల్లో వ్యవసాయ శాఖ శాస్తవ్రేత్తలు గ్రామానికి వచ్చి పంటలను పరిశీలిస్తారని తెలిపారు. తగిన రిపోర్టులను ఉన్నతాధికారులకు అందజేస్తామన్నారు. తద్వారా షాపు యజమానిపై, మందుల కంపెనీలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. రిపోర్టును బట్టి షాపు యజమానికి షోకాజు నోటీసులు అందించనున్నట్లు తెలిపారు. రైతులకు తగిన న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు. నకిలీ మందులతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇప్పించాలని మండల వ్యవసాయ శాఖ అధికారిణి ఎన్ రమాదేవికి పంచాయతీ కార్యాలయంలో రైతులు వినతిపత్రం అందచేశారు.
రాజీకి రైతులపై ఒత్తిడి
షాపు యజమానిపై ఎలాంటి కేసులు లేకుండా రైతుల వద్దకు రాజీ కుదిర్చేందుకు గుడ్లవల్లేరుకు చెందిన ఓ ఎరువుల కొట్టు వ్యాపారి అధికారుల ఎదుటే రైతులతో బేరసారాలు ఆడాడు. రైతులు మాత్రం రాజీపడమనటంతో వెనుదిరిగి వెళ్లారు.

పొలాలకు పరిహారం పెంచి ఇవ్వాలి
మైలవరం, జనవరి 27: జాతీయ రహదారి విస్తరణలో పొలాలు కోల్పోయిన వారికి నష్టపరిహారం పెంచి వెంటనే ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. బుధవారం సిపిఎం ఆధ్వర్యంలో రైతులు మండలంలోని చండ్రగూడెం వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈసందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు పివి ఆంజనేయులు మాట్లాడుతూ జాతీయ రహదారి విస్తరణలో చండ్రగూడెం రైతులు విలువైన భూములను కోల్పోతున్నారని, వారికి ఇస్తామన్న నష్టపరిహారం చాలా తక్కువగా ఉందన్నారు. ఎంతోకాలంగా ఈ భూములనే నమ్ముకుని పండించుకుని రైతులు జీవిస్తున్నారని, భూములను ప్రభుత్వం లాగేసుకుంటున్న కారణంగా జీవనోపాధి కోల్పోవలసి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. భూముల నష్టపరిహారాన్ని పెంచాలని గతంలో విన్నవించుకున్నా ఫలితం లేకపోగా ఇస్తామన్న నష్టపరిహారాన్ని ఇంతవరకూ ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారని ఆరోపించారు. రాస్తారో కోలో సిఐటియు నేత సాల్మన్‌రాజు, గిరిజన సంఘం నేత జె బాలయ్య, రైతులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
కైకలూరు, జనవరి 27: మోటారు సైకిల్‌పై వేగంగా వెళుతున్న యువకులు నియంత్రణ కోల్పోవటంతో అతివేగంతో ఆర్టీసీ బస్సును ఢీకొట్టారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇద్దరు యువకులు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే... మండలంలోని ఆటపాక శివారు జాన్‌పేటకు చెందిన పేరం ఆనంద్‌బాబు (19), దుర్గం ఏసులు బుధవారం ఉదయం ఆటపాక వైపు నుంచి కైకలూరు మోటారు సైకిల్‌పై వస్తున్నారు. అదే సమయంలో ఏలూరు నుంచి నరసాపురం వెళుతున్న ఆర్టీసి బస్సు (ఎపి 29 జెడ్ 2091) బస్టాండ్ ఇన్‌గేట్‌లోకి వెళుతోంది. మోటారు సైకిల్‌పై వస్తున్న యువకులు నియంత్రణ కోల్పోయి అతివేగంగా మోటారు సైకిల్‌తో బస్సును ఢీకొట్టారు. ప్రమాదంలో ఆనంద్, ఏసులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆనంద్‌బాబు మృతి చెందాడు. ఏసును మెరుగైన వైద్యం కోసం గుంటూరు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఏసు మృతి చెందాడు. కైకలూరు రూరల్ టౌన్ ఇన్‌చార్జి ఎస్‌ఐ సిహెచ్ రంజిత్‌కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.