కృష్ణ

పోర్టు భూసమీకరణకు రైతుల నుండి విశేష స్పందన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, అక్టోబర్ 22: పోర్టు నిర్మాణం, పారిశ్రామిక కారిడార్, పోర్టు సిటీ ఏర్పాటు కోసం చేపట్టిన భూసమీకరణకు రైతుల నుండి విశేష స్పందన లభిస్తోందని రాష్ట్ర బిసి సంక్షేమం, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. శనివారం స్థానిక ‘మడ’ కార్యాలయంలో పార్లమెంటు సభ్యులు కొనకళ్ళ నారాయణరావుతో కలిసి అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నెల 21 వరకు భూసమీకరణలో 192 మంది రైతులు 511.93 ఎకరాలకు అంగీకార పత్రాలు ఇచ్చారని అధికారులు మంత్రికి తెలిపారు. ఈసందర్భంగా రవీంద్ర మాట్లాడుతూ అధికారులు ప్రతిరోజూ గ్రామాలకు వెళ్లి భూసమీకరణపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఎన్నో ఏళ్ల తరువాత వచ్చిన అరుదైన అవకాశమని, ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ రైతులకు ఎంతో లాభం కలిగిస్తుందన్నారు. మెట్ట భూములకు ఏడాదికి రూ.30వేలు, మాగాణి భూములకు రూ.50వేలు, రైతు కూలీలకు నెలకు రూ.2,500 చొప్పున పెన్షన్లను ప్రభుత్వం అందిస్తుందన్నారు. అలాగే రూ.25లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ప్రభుత్వం ఇస్తుందన్నారు. రైతుల్లో కొన్ని అనుమానాలు ఉన్నాయని ఏది మెట్ట, ఏది మాగాణి అనే అనుమానాలు నివృత్తి చేయాల్సిన అవసరం అధికారులు, ప్రజాప్రతినిధులపై ఉందన్నారు. ఈ అంశంపై బృందాలను ఏర్పాటు చేసి రైతుల అనుమానాలను నివృత్తి చేస్తామని చెప్పారు. ప్రభుత్వ ప్యాకేజీని నిజాయతీగా అమలు చేస్తామని, ఏ ఒక్క రైతుకూ అన్యాయం జరగకుండా చూస్తామన్నారు. బందరు పోర్టు, పరిశ్రమలు, పోర్టు సిటీ ఏర్పాటుకు మాస్టర్ ప్లాన్ తయారు చేయడానికి సింగపూర్ నుండి ప్రతినిధులు వస్తారని, సర్వే చేసి అధునాతన పోర్టు నిర్మాణానికి తగిన ప్రణాళికలు ఇస్తారని మంత్రి రవీంద్ర వివరించారు. ఎంపి కొనకళ్ళ మాట్లాడుతూ ప్రస్తుతం రైతులకు లభిస్తున్న లీజు కంటే ప్రభుత్వం ప్రకటించిన లీజు ఎక్కువగా ఉందన్నారు. ప్రభుత్వ ప్యాకేజీ రైతులకు లాభసాటి అవుతుందన్నారు. ఈ అవకాశాన్ని పేద రైతులు వినియోగించుకోవాలన్నారు. రైతుల అభిప్రాయాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతామని చెప్పారు. అనంతరం చిన్నాపురం రైతులు మోకా కృష్ణ, మర్కంటి గణపతి, తదితరులు మంత్రి, ఎంపి సమక్షంలో అంగీకార పత్రాలు అందచేశారు. కార్యక్రమంలో ఎంపిపి కాగిత వెంకటేశ్వరరావు, మార్కెట్ యార్డు ఛైర్మన్ గోపు సత్యనారాయణ, ఆర్డీవో సాయిబాబు, తహశీల్దార్ నారదముని, డెప్యూటీ కలెక్టర్లు, మాజీ మంత్రి నడకుదుటి నరసింహారావు, పార్టీ నాయకులు జి గోపిచంద్, బూరగడ్డ రమేష్‌నాయుడు, ఇలియాస్ పాషా, కుర్రా నరేంద్ర, తదితరులు పాల్గొన్నారు.

రైతుల గుండెల్లో రైళ్ళు!
* వణికిస్తున్న వాయుగుండం
మచిలీపట్నం (కోనేరుసెంటర్), అక్టోబర్ 22: తూర్పు మధ్య ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిందని, 48 గంటల్లో తుఫాన్‌గా మారే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ శాఖ చేసిన హెచ్చరికలు జిల్లా రైతుల గుండెల్లో రైళ్లు పరుగెట్టిస్తున్నాయి. తుఫాన్ కారణంగా బలమైన గాలులతో పాటు వర్షాలు కురిస్తే వరి పంట చాపచుట్టగా పడిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా పొట్ట దశ నుండి ఈనిక, పాలు పోసుకునే దశ, సుంకు దశలో ఉన్న వరి పొలాలకు గాలులతో కూడిన వర్షం పడితే నష్టం జరుగుతుందని వాపోతున్నారు. అయితే దుబ్బు దశ నుండి చిరుపొట్ట దశలో ఉన్న పొలాలకు వర్షం మేలు చేస్తుందని కొందరు రైతులు చెపుతున్నారు.

ప్రభుత్వ భూదోపిడీని ఎదుర్కోండి
* ప్రజాసమస్యలపై స్పందించండి
* త్వరలో బందరుకు రాహుల్ గాంధీ
* కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పల్లంరాజు
ఆంధ్రభూమి బ్యూరో
మచిలీపట్నం, అక్టోబర్ 22: ప్రజాసమస్యలపై స్పందించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం డిసిసి అధ్యక్షులు ధనేకుల మురళీమోహనరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ప్రతి కార్యకర్త పోరాడాల్సిన అవసరం వుందన్నారు. బందరు పోర్టు, పరిశ్రమల పేరుతో పెద్దఎత్తున రైతులు నుండి వేలాది ఎకరాల భూములు గుంజుకోవాలని చూస్తున్న ప్రభుత్వ ప్రయత్నాలను అడ్డుకోవాలన్నారు. పార్టీలో గ్రూపులను పక్కనపెట్టి అందరూ ఏకతాటిపైకి వచ్చి ప్రజాసమస్యలపై పోరాడాలని కోరారు. బందరులో జరుగుతున్న పోర్టు ఉద్యమానికి ఎఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీని తీసుకొచ్చేందుకు తనవంతు కృషి చేస్తానని చెప్పారు. ఇదిలావుండగా బందరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జి డా.రాధికామాధవి నాయకత్వంపై పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆమె నాయకత్వంలో తాము పనిచేయలేమంటూ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బుల్లెట్ ధర్మారావు తేల్చిచెప్పారు. ధర్మారావుకు మరికొందరు నాయకులు మద్దతు పలికారు. దీనిపై స్పందించిన పల్లంరాజు నాయకత్వ మార్పుపై కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకొని త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సమావేశంలో గుంటూరు మాజీ ఎమ్మెల్యే షేక్ మస్తాన్‌వలీ, పిసిసి ప్రధాన కార్యదర్శి కె రమాదేవి, మిరియాల రామకృష్ణారావు, మొవ్వ మోహనరావు, విజయవాడ నియోజకవర్గ సమన్వయకర్త అన్వర్ హుస్సేన్, బందరు అసెంబ్లీ ఇన్‌ఛార్జి రాధికామాధవి, పట్టణ పార్టీ అధ్యక్షులు అబ్దుల్ మతీన్, తదితరులు పాల్గొన్నారు.

ట్రిబ్యునల్ తీర్పు రాష్ట్భ్రావృద్ధికి విఘాతం
* రైతు సంఘం నేతల ఆందోళన
ఫొటో(22ఎంవైఎంపిహెచ్ 3): మాట్లాడుతున్న రైతు సంఘం నేతలు
మైలవరం, అక్టోబర్ 22: నదీ జలాల వాడకంపై జస్టిస్ బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు రాష్ట్భ్రావృద్ధికి విఘాతం కానుందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి వై కేశవరావు ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం స్థానిక సిపిఎం కార్యాలయంలో సంఘం జిల్లా అధ్యక్షులు పివి ఆంజనేయులు, డివిజన్ కార్యదర్శి మనే్న మాధవరెడ్డితో కలిసి ఆయన విలేఖర్లతో మాట్లాడారు. నదీ జలాల పంపిణీ విషయంలో ట్రిబ్యునల్ తరపున రాష్ట్రం తరపున వాదనల్లో పస లేని కారణంగా నికర జలాలే కాకుండా మిగులు జలాలు కూడా బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం దక్కే పరిస్థితి లేదన్నారు. పైగా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో గొప్పగా గోదావరి జలాలను కృష్ణాకు రప్పించి నదులను అనుసంధానం చేసిన ఘనత తమదేనని, దీంతో కృష్ణా జిల్లాలో లక్షలాది ఎకరాల ఆయకట్టును సస్యశ్యామలం చేశామని చెప్పుకున్న కారణంగా ఈ నీటి వాటాను కూడా లెక్కగట్టి కృష్ణా నీటిని దానికి అనుగుణంగా నియంత్రిస్తూ తీర్పు చెప్పిందన్నారు. వాస్తవానికి గోదావరి జలాలతో కృష్ణా సస్యశ్యామలం అయిందనటం గొప్పగా చెప్పుకునే కబుర్లేనని, ఇదే వాస్తవమైతే కృష్ణాడెల్టాలో లక్షలాది ఎకరాలు సాగునీరు లేక పంటలు వేయని పరిస్థితి ఎందుకు నెలకొంటుందని వారు ప్రశ్నించారు. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై సుప్రీం కోర్టులో గెజిట్ నోటిఫికేషన్ రాకముందే అప్పీల్ పిటిషన్ వేసి రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటాను ఇకనైనా రాబట్టాలని, లేకపోతే జిల్లా ఎడారిగా మారిపోతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. మైలవరంలో సిసిఐ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలన్నారు. ఈ ఏడాది అతివృష్టి, అనావృష్టి వల్ల పత్తి పంటను రైతులు సాధారణ విస్తీర్ణం కన్నా తక్కువగా సాగు చేశారని, సాగైన పత్తి కూడా దెబ్బతిన్నదని, కనీసం పండిన పంటకైనా గిట్టుబాటు ధరను ఇప్పించాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేసి మద్దతు ధరను రూ.1500కి పైబడి పెంచాలని వారు డిమాండ్ చేశారు.

గ్రంథాలయాల అభివృద్ధికి చర్యలు
* రాష్ట్ర గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ ప్రభాకరరావు
నందిగామ/ కంచికచర్ల/ జగ్గయ్యపేట, ఆగస్టు 22: రాష్ట్ర గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ పాలపర్తి ప్రభాకరరావు శనివారం కంచికచర్ల, నందిగామ, జగ్గయ్యపేట పట్టణాల్లోని గ్రంధాలయాలను సందర్శించారు. ఈసందర్భంగా పాఠకుల నుండి సమస్యలు, ఇతర విషయాలను అడిగి తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించారు. గ్రంథాలయాల అభ్యున్నతికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు. నందిగామలో ఆయన్ను జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ రాటకొండ కోటేశ్వరరావు, నగర పంచాయతీ చైర్‌పర్సన్ యరగొర్ల పద్మావతి, గ్రంథాలయ అధికారి తదితరులు ఘనంగా సత్కరించారు. కాగా జగ్గయ్యపేటలో పూర్వ విద్యార్థి అయినందున పట్టణంతో తనకు ఉన్న అనుబంధాన్ని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి వై కృష్ణారావు, కంచికచర్లలో గ్రంథాలయ అధికారి పి వెంకటేశ్వరరావు, జగ్గయ్యపేటలో గ్రంథాలయ అధికారిణి రజని, నందిగామ పట్టణ తెదేపా అధ్యక్షుడు కొండూరు వెంకట్రావు, చందర్లపాడు జడ్‌పిటిసి వాసిరెడ్డి ప్రసాద్, కౌన్సిలర్లు ఎంఎ ఖాజా, గోపు పూర్ణచంద్రరావు, పట్టణ తెదేపా ఉపాధ్యక్షుడు పులవర్తి కోటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
పరిశుభ్రమైన మున్సిపాలిటీగా
బందరును అభివృద్ధి చేస్తాం
* మంత్రి రవీంద్ర
మచిలీపట్నం (కోనేరుసెంటర్), అక్టోబర్ 22: బందరు పట్టణాన్ని పరిశుభ్రమైన మున్సిపాలిటీగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర బిసి సంక్షేమం, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. శనివారం ఎంపి కొనకళ్ళ నారాయణరావుతో కలిసి పట్టణంలోని వివిధ వార్డులలో సుమారు రూ.28 లక్షలతో సిసిరోడ్లు, డ్రైన్ల అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. తొలుత 1వ వార్డులో 7.9 లక్షలతో నిర్మించే సిసిరోడ్డు, 9వ వార్డు ఆశీర్వాదపురంలో రూ.9.98 లక్షలతో సిసిరోడ్డు అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు. 1వ వార్డులోని పార్కును అభివృద్ధి చేయాలని, 9వ వార్డులో పేదలకు ఇళ్ళస్థలాలు, ఇళ్లు, రేషన్ కార్డులు మంజూరు చేయాలని, 24వ వార్డులో మిగతా రహదారులు కూడా సిసిరోడ్లుగా అభివృద్ధి చేయాలని ప్రజలు మంత్రిని కోరగా మీ సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనివిధంగా అభివృద్ధి కార్యక్రమాలు పెద్దఎత్తున చేపట్టామన్నారు. 14వ ఆర్థిక సంఘం నిధులు, మున్సిపల్ జనరల్ నిధులు, పుష్కర నిధులు రూ.9కోట్లతో పట్టణాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. అమృత్ స్కీమ్ కింద రూ.38కోట్ల అభివృద్ధి పనులకు టెండర్లు ఓపెన్ చేస్తున్నారని, ఈ నిధులతో పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థను అభివృద్ధి చేస్తామన్నారు. పార్లమెంటు సభ్యులు కొనకళ్ళ నారాయణరావు మాట్లాడుతూ మున్సిపాలిటీలో శాశ్వత అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. పట్టణంలో సాధ్యమైనంత వరకు అన్ని వౌలిక వసతులు కల్పిస్తామని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్, వైస్ ఛైర్మన్ పి కాశీవిశ్వనాథం, కౌన్సిలర్లు బత్తిన దాసు, కొట్టె అంకా వెంకట్రావు, చింతా చిన్ని, టిడిపి పట్టణ అధ్యక్షులు ఇలియాస్ పాషా, నాయకులు పాషా, ఎ రాజా, కాసాని భాగ్యారావు, చౌదరి, శేషు, నాంచారయ్య పాల్గొన్నారు.