కృష్ణ

ఇళ్లస్థలాల సమస్యకు త్వరలో శాశ్వత పరిష్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉయ్యూరు, నవంబర్ 24: జిల్లాలోని పలు ప్రాంతాల్లో నెలకొన్న నివేశన స్థలాల సమస్యకు శాశ్వత పరిష్కారంపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారని జిల్లా కలెక్టర్ బాబు.ఎ తెలిపారు. గురువారం స్థానికంగా ఇళ్లస్థలాల కోసం సేకరించిన భూములను ఆయన పరిశీలించారు. అనంతరం గండిగుంట గ్రామంలో పర్యటించారు. ఆయన వెంట విజయవాడ నగర మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వీరపాండ్యన్, శాసనమండలి సమీక్ష కమిటీ చైర్మన్ వైవిబి రాజేంద్రప్రసాద్, పెనమలూరు శాసనసభ్యులు బోడే ప్రసాద్, పలువురు అధికారులు ఉన్నారు. ఈసందర్భంగా కలెక్టర్ విలేఖరులతో మాట్లాడుతూ సేకరించిన స్థలాల్లో ఎక్కువ మంది లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించేలా, కేంద్ర పట్టణాభివృద్ధి సంస్ధ సహకారంతో బహుళ అంతస్థుల భవనాలను నిర్మించనున్నామని తెలిపారు. పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో ఆక్రమణలకు తావులేని విధంగా చర్యలు చేపడతామన్నారు. స్థానికంగా ప్రధాన రహదారిని పరిశీలించిన ఆయన ఆక్రమణలపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో తహశీల్దార్ రోహిణీదేవి, మున్సిపల్ చైర్మన్ జంపాన పూర్ణచంద్రరావు, పలువురు అధికారులు, టిడిపి నాయకులు పాల్గొన్నారు.

వేణుగోపాలస్వామి ఆలయ ఇవో సస్పెన్షన్
తోట్లవల్లూరు, నవంబర్ 24: స్థానిక శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ కార్యనిర్వహణాధికారి జి జయలక్ష్మిపై సస్పెన్షన్ వేటుపడింది. విధుల్లో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలపై ఆమెను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ వైవి అనూరాధ ఆదేశాలు జారీ చేశారని విజయవాడ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ వి సత్యనారాయణ గురువారం తెలిపారు. గ్రామానికి చెందిన రిటైర్ట్ ఆర్టీసీ ఉద్యోగి మాకినేని దశరథరామయ్య ఇవో జయలక్ష్మి, సీనియర్ అసిస్టెంట్ అప్పన్న కుమార్‌పై ఇటీవల పలు ఆరోపణలతో దేవాదాయ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. పంటల కౌలు వసూలు చేయటంలేదని, సక్రమంగా విధులు నిర్వర్తించటం లేదని పేర్కొన్నారు. దీంతో సత్యనారాయణను కాకినాడ ఆర్‌జేసి విచారణాధికారిగా నియమించారు. ఈ నెల 1న ఆయన ఆలయానికి వచ్చి విచారణ నిర్వహించారు. సర్పంచ్ చిరుమామిళ్ళ ఉమాదేవి, ఫిర్యాదీ దశరథరామయ్య, తదితరులు హాజరై లిఖిత పూర్వక సమాచారం అందించారు. దీనిపై తన నివేదిక ఆధారంగా జయలక్ష్మిని సస్పెండ్ చేస్తూ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారని సత్యనారాయణ వివరించారు. కాగా, ఆమె స్థానంలో విజయవాడ కృష్ణలంకలోని విశే్వశ్వరస్వామి ఆలయ ఇవో రాధాకృష్ణను ఇన్‌చార్జ్‌గా నియమించారని తెలిపారు.

1న బందరుకు జగన్
* కోన, బుద్ధాలపాలెంలో సభలు
* నేడు వైసిపి కార్యకర్తల సమావేశం
ఆంధ్రభూమి బ్యూరో
మచిలీపట్నం, నవంబర్ 24: బందరు పోర్టు, పరిశ్రమల పేరుతో ప్రభుత్వ బలవంతపు భూసమీకరణను అడ్డుకునేందుకు ప్రధాన ప్రతిపక్షం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ రైతు ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే భూపరిరక్షణ పోరాట సమితి పేరిట అన్ని రాజకీయ పార్టీలతో దశలవారీ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చిన వైకాపా ఇక ప్రత్యక్ష పోరుకు సిద్ధవౌతోంది. ఇందులో భాగంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి డిసెంబర్ 1న బందరు రానున్నారు. ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్‌లో పేర్కొన్న గ్రామాల్లో జగన్ పర్యటించి రైతులకు భరోసా ఇవ్వనున్నారు. బుద్ధాలపాలెం, కోన గ్రామాల్లో భారీ బహిరంగ సభల నిర్వహణకు పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్ని వెంకట్రామయ్య(నాని) ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం టౌన్‌హాలులో ఉదయం 10గంటలకు బందరు నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో జగన్ పర్యటన వివరాలను వెల్లడించనున్నారు. బుద్ధాలపాలెం, కోన గ్రామాల్లో బహిరంగ సభలతో పాటు మిగిలిన గ్రామాల్లో రోడ్ షో నిర్వహించే అవకాశం వున్నట్లు తెలిసింది.

బంగారం వ్యాపారి దారుణ హత్య
జి.కొండూరు, నవంబర్ 24: మండల పరిధిలోని వెలగలేరు శివార్లలో బుధవారం రాత్రి ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మైలవరం సిఐ డి వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడ బందరురోడ్డు బృందావన్ కాలనీకి చెందిన ఆళ్ళ రాజేష్(33)ను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో పొడిచి హతమార్చారు. వెలగలేరు వీఆర్వో కె చంద్రశేఖర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుర్తుతెలియని మృతదేహంగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణలో హతుని వివరాలు కనుగొన్నారు. రాజేష్ ఛాతీ, మెడపై పది కత్తిపోట్లు ఉన్నట్లు గుర్తించారు. వెలగలేరు పరిధిలోని పోలవరం కుడి ప్రధాన కాలువ ఎడమ గట్టుపై రక్తపు మడుగులో మృతదేహం పడి ఉంది. హతునికి భార్య భాగ్యసుధ, పది నెలల బాబు ఉన్నట్లు వివరించారు. హతుని కుటుంబం విశాఖపట్నంలో నివాసం ఉంటున్నట్లు తెలిపారు. హతుడు బంగారం వ్యాపారం చేస్తుంటాడని, ఇతనిపై విజయవాడ పిఎస్‌లలో ఐదు కేసులు ఉన్నట్లు చెప్పారు. అన్ని కోణాల్లో విచారణ ముమ్మరం చేశామని, నిందితులను పట్టుకుంటామని సిఐ తెలిపారు. మృతదేహానికి పంచనామా అనంతరం మైలవరం ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

కేశినేని నాని తన కార్యాలయంలో మేయర్ కోనేరు శ్రీ్ధర్

పోలవరం కాల్వలో వృద్ధుని గల్లంతు
జి.కొండూరు, నవంబర్ 24: పోలవరం కుడి ప్రధాన కాల్వలో వృద్ధుడు గల్లంతైన సంఘటన మండల పరిధిలోని వెలగలేరులో గురువారం జరిగింది. బుధవారం సాయంత్రం కందులపాడుకు చెందిన మంగళగిరి వెంకటేశ్వరదాసు(67) ప్రమాదవశాత్తూ పోలవరం ఆర్‌ఎంసిలో జారి పడ్డాడు. పట్టిసీమ నుంచి విడుదలవుతున్న నీటితో పోలవరం కాలువలో ప్రవాహ ఉద్ధృతి ఎక్కువగా ఉంది. ఇతని కోసం ఎంత వెతికినా ఫలితం లేకపోయంది. జాతీయ విపత్తు నివారణ దళానికి చెందిన 27 మంది గజ ఈతగాళ్లు గురువారం ఉదయం నుంచి ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఇందుకోసం ప్రత్యేకంగా మరపడవలను సైతం తీసుకొచ్చారు. కానీ వృద్ధుడి జాడ తెలియలేదు. తహశీల్దార్ కె సుధారాణి జిల్లా కలెక్టరుకు సమాచారం అందచేసి, స్థానిక రెవెన్యూ సిబ్బందిని అప్రమత్తం చేశారు. గాలింపు చర్యలను వేగవంతం చేశారు.

యజమానిని మోసగించి
లారీని అపహరించిన డ్రైవర్ అరెస్టు
మచిలీపట్నం (కోనేరుసెంటర్), నవంబర్ 24: యజమాని వద్ద నమ్మకంగా పనిచేస్తూ లారీతో సహా సొత్తు అపహరించిన డ్రైవర్ బూదాటి లక్ష్మారెడ్డి(28)ని గురువారం ఆర్‌పేట పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడకు చెందిన లక్ష్మారెడ్డి బందరు మండలం పెదకానూరు గ్రామానికి చెందిన యువతిని కులాంతర వివాహం చేసుకున్నాడు. మద్యానికి బానిసైన లక్ష్మారెడ్డి గతంలో గుంటూరులో లారీడ్రైవర్‌గా పనిచేశాడు. ఐదు నెలల క్రితం యజమానిని మోసగించి కిరాయి డబ్బులు దొంగిలించి మచిలీపట్నం వచ్చాడు. ఎండి హుస్సేన్ అనే లారీ యజమాని వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 17న లక్ష్మారెడ్డి లారీ ఆఫీస్‌లోని నగదుతో పాటు లారీని అపహరించి పారిపోయాడు. యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఆర్‌పేట ఎస్‌ఐ బాషా గురువారం లక్ష్మారెడ్డిని అరెస్టు చేశారు.

నేడు కౌన్సిల్ సమావేశం
విజయవాడ (కార్పొరేషన్), నవంబర్ 24: కృష్ణా పుష్కరాలకు చేపట్టిన పనులు, తదుపరి బిల్లుల చెల్లింపులపై అధికారులు అవలంభిస్తున్న ఏకపక్ష నిర్ణయాలతోపాటు స్థలాల వినియోగ మార్పు, ఆయుర్వేద వైద్యులను విఎంసి ఆయుర్వేద హాస్పటల్స్‌కు బదలాయింపు, విఎంసి ప్రత్యేక కమిటీల ఏర్పాటు, ఎన్‌జీవోలతో నడుపుతున్న విఎంసి అర్బన్ హెల్త్ సెంటర్లను కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌కు బదలాయింపునకు ఆమోదం వంటి ముఖ్యమైన అంశాలపై చర్చకు శుక్రవారం ఉదయం జరుగనున్న కౌన్సిల్ సమావేశం వేదిక కానుంది. ప్రస్తుత కౌన్సిల్‌లో ప్రతిపాదనకు వచ్చిన తీర్మాన అంశాలు, ప్రశ్నలు-జవాలు ప్రాధాన్యత గలవేనని చెప్పచ్చు. ఈ అంశాలపై జరిగే చర్చలో అనుసరించాల్సిన వ్యూహ, ప్రతివ్యూహాలపై అధికార తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్ష వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు చర్చోపచర్చల్లో మునిగితేలాయి.