కృష్ణ

రంగస్థల కళాకారుల సంక్షేమానికి కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కల్చరల్), డిసెంబర్ 24: రంగస్థల కళాకారుల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ అన్నారు. స్థానిక మున్సిపల్ పార్కులో గత రెండు రోజులుగా నిర్వహిస్తున్న శ్రీ రామకృష్ణ నాట్యమండలి 40వ వార్షికోత్సవ వేడుకలు శనివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా నిర్వహించిన ముగింపు సభలో చైర్మన్ బాబా ప్రసాద్ మాట్లాడుతూ నాటక రంగానికి ప్రఖ్యాతిగాంచిన బందరు పట్టణానికి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రంగస్థల కళాకారులను ఘనంగా సత్కరించారు. నాట్య మండలి నిర్వాహకుడు జె జగన్మోహనరావు నేతృత్వంలో భక్తిరస పౌరాణిక పద్య నాటకం సతీ సక్కుబాయిని ప్రదర్శించారు. వై పూర్ణచంద్రరావు, కె గణేష్ కుమార్, ఎస్ కోటీశ్వరి, జి రాజేశ్వరి, జి శివ కుమారి, వై ఏడుకొండలు, పి రాజేశ్వరరావు, నాగేశ్వరరావు, వీరాస్వామి, కృష్ణమూర్తి పాత్రోచిత న్యాయం చేశారు. జె శ్రావణకుమార్, టి వీరాంజనేయులు, యండి పెదబాబు అందించిన వాద్య సహకారం కార్యక్రమానికి నిండుదనం చేకూర్చింది. తొలుత పసుమర్తి సాయికృష్ణ ప్రణీత్ కాంగో డ్రమ్స్‌పై లయబద్ధంగా వినిపించిన సంగీతం వీనులవిందు చేసింది. ఈ కార్యక్రమంలో రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు చలమలశెట్టి గాంధీ, గుడివాడ కళాకారుల సమాఖ్య అధ్యక్షుడు చింతయ్య, గుడిపూడి రాధికారాణి, ఎల్ విజయలక్ష్మి, భవిష్య తదితరులు పాల్గొన్నారు.

అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు
మచిలీపట్నం (కల్చరల్), డిసెంబర్ 24: ధనుర్మాస మహోత్సవాల్లో భాగంగా స్థానిక రాబర్ట్‌సన్‌పేటలో వేంచేసియున్న శ్రీ రంగనాయక స్వామి దేవస్థానంలో శనివారం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. పలు విద్యా సంస్థలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు కూచిపూడి నృత్య ప్రదర్శనలతో అలరించారు. ఆలయ పాలకవర్గ చైర్మన్ వాడపల్లి బాలాజీ, ఆలయ కార్య నిర్వహణాధికారి అడబాల శ్రీనివాస్ కార్యక్రమాలను పర్యవేక్షించారు.
బాలా త్రిపుర సుందరి సమక్షంలో
గజ్జెకట్టిన హాంకాంగ్, చైనా కళాకారులు
కూచిపూడి, డిసెంబర్ 24: కూచిపూడి నాట్యాచార్యుల ఇలవేల్పు శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి సమక్షంలో గజ్జె కడితే నాట్య శిక్షణకు సార్థకత ఏర్పడుతుందన్న నమ్మకానికి హాంకాంగ్, చైనా దేశాలకు చెందిన కళాకారులు సైతం ఆచరించేందుకు శనివారం నాట్య క్షేత్రానికి తరలి వచ్చారు. విశాఖపట్నంకు చెందిన నాట్యాచార్య ఈరంకి శ్రీహరిబాలాదిత్య తన శిష్యులైన హాంకాంగ్‌కు చెందిన అనిటలీ, కిర్టైవాంగ్, ఫాన్‌డిమెక్, తమ్మిలీవింగ్, ఇంగ్రీట్ ముతాంగ్, సింధియాలో, మొనిలలివాంగ్, జాన్‌కిలా, విర్గినియలెహంగ్, చైనాకు చెందిన లూవాంగ్‌తో పాటు కర్నూలుకు చెందిన నాగ సాయి ప్రదీప్ శిష్య బృందం 40 మంది, న్యూఢిల్లీ, కాన్పూర్ తదితర ప్రాంతాలకు చెందిన సాంప్రదాయ ఔత్సాహిక కళాకారులు అమ్మవారి సమక్షంలో సంప్రదాయ కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించి పులకించారు. ఆలయ అర్చకులు పెనుమూడి బాబూరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కాంతులీనుతున్న చర్చిలు
మచిలీపట్నం (కల్చరల్), డిసెంబర్ 24: క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని పట్టణంలోని ప్రార్థనాలయాలు కాంతులీనుతున్నాయి. ప్రసిద్ధిగాంచిన ఆంధ్రేయ మహాదేవాలయం, సెయింట్ మెరీస్ చర్చి, ఆర్‌సియం హోలిక్రాస్ చర్చి తదితర చర్చిలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. అర్ధరాత్రి ప్రత్యేక ప్రార్థనలతో క్రీస్తుకు ఘనంగా స్వాగతం పలికారు.

మంత్రి కొల్లు, ఎంపి కొనకళ్ల
క్రిస్మస్ శుభాకాంక్షలు
ఆంధ్రభూమి బ్యూరో
మచిలీపట్నం, డిసెంబర్ 24: రాష్ట్ర బిసి సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, పార్లమెంట్ సభ్యుడు కొనకళ్ల నారాయణరావులు శనివారం వేర్వేరు ప్రకటనల్లో జిల్లా వాసులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. యేసు క్రీస్తు చెప్పిన విధంగా ప్రతి ఒక్కరూ ప్రేమ, దయ, కరుణ కలిగి ఉండాలన్నారు.

నా తండ్రి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తా
చందర్లపాడు, డిసెంబర్ 24: తండ్రి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని విజయవాడ పట్టణపార్టీ అద్యక్షులు వంగవీటి రాధా అన్నారు. శనివారం కాసరబాద గ్రామంలో దివంగత వంగవీటి రంగా విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వంగవీటి రాధా మాట్లాడుతూ నిరహార దీక్ష చేస్తున్న తన తండ్రిని అన్యాయంగా చంపివేశారని, తండ్రిని చంపినవారి ఫొటోలు ఫ్లెక్సీలో వేయటం తనను బాధించిందని అన్నారు. కుల, మతాలకు సంబంధం లేకుండా తను అందరి వాడినని అన్నారు. ఈకార్యక్రమంలో పిసిసి నాయకులు నరహరశెట్టి నరశింహారావు, నందిగామ వైసిపి నాయకులు మొండితోక జగన్మోహన్‌రావు, చందర్లపాడు నాయకులు పాల్గొన్నారు.

క్రీడాపోటీ విజేతలకు అభినందనలు
మోపిదేవి, డిసెంబర్ 24: చల్లపల్లి మండలం మంగళాపురం జెడ్పీ హైస్కూల్‌లో ఇటీవల డివిజన్ స్థాయిలో నిర్వహించిన గ్రిగ్ మెమోరియల్ క్రీడా పోటీల్లో మండల పరిధిలోని పెదకళ్లేపల్లి జెడ్పీ హైస్కూల్ విద్యార్థినులు ప్రతిభ కనబర్చారు. అండర్-14, అండర్-17 విభాగాల్లో షటిల్, బ్యాడ్మింటన్, టెన్నికాయిట్ పోటీల్లో విన్నర్స్‌గా నిలిచారని హెచ్‌ఎం సుబ్బారావు తెలిపారు. విజేతలైన విద్యార్థులను శనివారం హెచ్‌ఎం సుబ్బారావుతో పాటు పిఇటి అభినందించారు.

వినియోగదారులను మోసం చేస్తే కఠిన చర్యలు
* శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ ఎస్ రజని
మచిలీపట్నం (కోనేరుసెంటర్), డిసెంబర్ 24: కక్షిదారులు, వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసమే వినియోగదారుల ఫోరంలు, శాశ్వత లోక్ అదాలత్‌లు, లోక్ అదాలత్‌లు పని చేస్తున్నాయని జిల్లా శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్, అదనపు జిల్లా జడ్జి ఎస్ రజని అన్నారు. జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం సివికాం ఆధ్వర్యంలో రైతు బజారులో అవగాహనా సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ నిరక్షరాస్యులను మోసం చేసే సంస్థలు, వ్యాపారస్థులపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఫౌర సరఫరాల శాఖ, కన్సూమర్స్ వారుూస్ కౌన్సిల్ ఆఫ్ మచిలీపట్నం (సివికాం) అధ్యక్షుడు కైలాసపతి, సీనియర్ న్యాయవాది లంకిశెట్టి బాలాజీ, మార్కెట్ యార్డు చైర్మన్ గోపు సత్యనారాయణ, రాష్ట్ర పెన్షనర్స్ సంఘం అధ్యక్షుడు బి సత్యనారాయణ సింగ్, ఆర్టీసి అసిస్టెంట్ మేనేజర్ ఎస్ సునీల్, ఫిషరీస్ ఆఫీసర్ రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు.

మంత్రిగా రావెలను తొలగించాలి
విజయవాడ (కార్పొరేషన్), డిసెంబర్ 24: మహిళలపై అనుచిత ప్రవర్తన, వేధింపులకు పాల్పడుతున్న మంత్రి రావెల కిషోర్‌ను మంత్రి పదవినుంచి తొలగించాలని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సుంకర పద్మ పేర్కొన్నారు. శనివారం ఎపిసిసి కార్యాలయంలో నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో టిడిపి పాలనలో మహిళలపై వివక్ష, దాడులు ఎక్కువ అవ్వడం ఒక సమస్య అయితే ఏకంగా ప్రజాప్రతినిధులు, మంత్రులు సైతం మహిళలపై వేధింపులకు గురిచేస్తున్న వైనం గర్హనీయమన్నారు. కాంగ్రెస్ పార్టీ కల్పించిన మహిళా రిజర్వేషన్‌తో ఎంతో మంది మహిళలు రాజకీయాల్లో అభ్యున్నతి చెందుతున్న వైనం అభినందనీయం కాగా అట్టివారిపై రావెల, ఆయన కుమారుడు సైతం మహిళలపై దాడులు చేయడం హేయమన్నారు. సిఎం చంద్రబాబు వత్తాసుతోనే వారు దాడులకు దిగుతున్నారన్నారు. ఈ విషయంపై ప్రభుత్వం స్పందించి రావెలను మంత్రి పదవి నుంచి తప్పించకపోతే కాంగ్రెస్ మహిళలు ఉద్యమిస్తారని హెచ్చరించారు.