కృష్ణ

కులాల మధ్య చిచ్చుపెట్టి అభివృద్ధిని అడ్డుకుంటున్న వైసిపి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, జనవరి 11: కులాల మధ్య చిచ్చు పెట్టి అభివృద్ధిని అడ్డుకునే ప్రతిపక్ష వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ అన్నారు. బుధవారం స్థానిక ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో చైర్మన్ బాబా ప్రసాద్ మాట్లాడుతూ పట్టణంలో స్టేడియం నిర్మాణం విషయంలో ప్రతిపక్ష వైసిపి నాయకులు కులాల మధ్య చిచ్చు పెట్టి అభివృద్ధికి ప్రధాన అటంకంగా మారారంటూ ధ్వజమెత్తారు. 1971లో నాటి ప్రభుత్వం కుమ్మరిగూడెంలోని 22 ఎకరాలను కుమ్మరుల జీవనోపాధికై కేటాయించిన మాట వాస్తవమేనన్నారు. అయితే ఆ భూమిలో కేవలం ఎనిమిది ఎకరాల్లో మాత్రమే నాలుగైదు కుటుంబాలకు చెందిన కుమ్మరులు ఇటుకల బడ్డీల ద్వారా వ్యాపారం చేసుకుంటున్నారన్నారు. సుమారు 10 ఎకరాలు పైబడిని భూమి నిరుపయోగంగా మారిందన్నారు. దీన్ని గుర్తించిన అధికారులు జాతీయ రహదారికి ఆ స్థలం పక్కనే ఉండటంతో స్టేడియం నిర్మాణానికి ప్రతిపాదించిందన్నారు. స్టేడియం నిర్మాణంతో ఎక్కడ ఉనికి కోల్పోతామోనన్న భయంతో వైసిపి నాయకులు కుమ్మరిగూడెం వాసుల్లో కొంత మందిని రెచ్చగొట్టి కోర్టుకు వెళ్లి స్టే తీసుకు వచ్చారన్నారు. ఫ్లోర్ లీడర్ పల్లపాటి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ప్రతిపక్షం దురుద్దేశంతోనే కుమ్మరిగూడెం వాసులను రెచ్చగొట్టి స్టేడియం నిర్మాణానికి అడ్డుపడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కెట్ యార్డు చైర్మన్ గోపు సత్యనారాయణ మాట్లాడుతూ అభివృద్ధిని అడ్డుకునే ప్రతిపక్షాలకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా స్టేడియం నిర్మాణాన్ని ఆపలేరన్నారు. ఈ సమావేశంలో 1వ వార్డు కౌన్సిలర్ బత్తిన దాస్, టిడిపి నాయకులు కుంచే దుర్గా ప్రసాద్, వంపుగడల చౌదరి, అక్కుమహంతి రాజా, సూరిబాబు, యండూరి సురేష్ పాల్గొన్నారు.

ఎస్‌ఎస్‌కేలో ఘనంగా సంక్రాంతి సంబరాలు
మైలవరం, జనవరి 11: స్థానిక ఎస్‌ఎస్‌ఎస్‌కే ఇంగ్లీష్ మీడియం హైస్కూల్‌లో బుధవారం సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. తెలుగు సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా స్కూల్ మేనేజ్‌మెంట్ సంబరాలను నిర్వహించి అందరి మన్ననలు అందుకుంది. తొలుత సంక్రాంతి పర్వదిన విశిష్టతను తెలిపే విధంగా విద్యార్థినీ, విద్యార్థులు పాటలు పాడుతూ నృత్యప్రదర్శనలు చేశారు. అనంతరం మహిళలు రంగురంగుల రంగవల్లులను దిద్ది గొబ్బెమ్మలను అలంకరించారు. భోగి మంటలు వేసి దాని చుట్టూ సాంప్రదాయ బద్ధంగా పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలతో స్కూల్ ఆవరణ ఆసాంతం ఆహూతులను ఆకట్టుకుంది. చిన్నారులకు భోగి పళ్ళు పోసి పండుగ విశిష్టతను తెలియజేశారు. పల్లెటూళ్ళలో సంక్రాంతికి కుప్ప నూర్పిళ్ళు, ధాన్యం రాసులు ఇళ్ళకు చేరే సన్నివేశాన్ని విద్యార్థులకు పంచెకట్టుతో చేసి చూపించారు. సంక్రాంతికి సంబంధించి ప్రధానమైన కోడి పందాలు తదితర అంశాలను కళ్లకుకట్టారు. ఈసందర్భంగా స్కూల్ డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గొల్లపూడి మోహనరావు మాట్లాడుతూ తమ స్కూల్‌లో ప్రతి పర్వదినం, దాని విశిష్టతను తెలియజెప్పే కార్యక్రమాలను నిర్వహించటం ఆనవాయితీ అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ గొల్లపూడి వెంకటేశ్వరరావు, ప్రిన్సిపాల్ ఎం జాన్ లాజరస్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు. అంతకుముందు విద్యార్థుల తల్లిదండ్రులకు ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందించారు.
కూడారై ప్రసాదానికి బారులుతీరిన భక్తులు
కూచిపూడి, జనవరి 11: ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన పెదముత్తేవి శ్రీకృష్ణాశ్రమంలో ధనుర్మాస మహావ్రతాలలో అత్యంత ప్రాముఖ్యత గాంచిన వ్రత ఫల అనుభవదినం సందర్భంగా బుధవారం వాసుదేవ నామస్మరణలతో కూడార్ వ్రత ప్రసాదానికి భక్తులు బారులుతీరారు. ముముక్షుజన మహాపీఠాధిపతి శ్రీ ముత్తీవి సీతారాం గురుదేవులు భక్తులకు నేతితో తయారు చేసిన పాయసాన్ని స్వయంగా అందచేశారు. అంతకుముందుగా ఆశ్రమంలోని దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులనుద్దేశించి గురుదేవులు అనుగ్రహ బాషణ చేశారు. రాష్ట్రం నలుమూలల నుండి తరలి వచ్చిన భక్తులతో పాటు గ్రామంలోని భక్తులు ప్రసాదం కోసం బారులుతీరారు. ముత్తీవి గౌరాకృష్ణ పర్యవేక్షణలో ఆశ్రమ సన్నిధి కార్యదర్శి తుర్లపాటి రాధాకృష్ణ, తుర్లపాటి ఆనందసాగర్, ఆత్మకూరి లక్ష్మణదాసు, యతీంద్ర సేవా సమితి భక్తులకు ప్రసాద వినియోగానికి కృషి చేశారు.

కోడి పందాలకు రంగం సిద్ధం
తోట్లవల్లూరు, జనవరి 11: మండలంలోని వల్లూరుపాలెంలో బుధవారం కోడిపందేల బరి ఏర్పాటుకు నిర్వాహకులు రంగంలోకి దిగారు. కృష్ణానది ఒడ్డున పుష్కరఘాట్ వద్ద విశాలమైన ఖాళీ పొలాలను కోడిపందాల బరికి ఎంపిక చేశారు. ఓ ప్రముఖ నాయకుడు బరికి కొబ్బరికాయ కొట్టారు. నిర్వాహకులు చిన్న టెంట్ వేసి అక్కడే కూర్చుని కూలీలతో బరికి సేకరించిన స్థలాన్ని బాగు చేయించటంతలో నిమగ్నమయ్యారు. మండలంలోని ఓ రాజకీయ పార్టీకి చెందిన నాయకులు వల్లూరుపాలెం చేరుకుని ఇందుకు నడుం బిగించారు. బరికి కోర్టులు, సైకిళ్ళు, బైక్‌లు, కార్ల పార్కింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. 13వ తేదిన ప్రజాప్రతినిధులను తీసుకువచ్చి బరిని ప్రారంభించనున్నట్లు తెలిసింది. గతేడాది కూడా ఇక్కడే పెద్దఎత్తున కోడిపందేలు జరిగిన విషయం తెలిసిందే.
అనుమతి లేదు: ఎస్‌ఐ ప్రసాద్
మండలంలో కోడిపందాలకు ఎటువంటి అనుమతి లేదని ఎస్‌ఐ ప్రసాద్ అన్నారు. వల్లూరుపాలెంలో కోడిపందాల బరి ఏర్పాటు తమ దృష్టికి రాలేదన్నారు. ఎయిర్‌పోర్టు డ్యూ టీలో ఉన్నామని చెప్పారు. ఎవరైనా కోడిపందాల బరి ఏర్పాటు చేస్తే చర్యలు తీసుకుంటామని అన్నారు.
కార్పొరేషన్ రుణ లబ్ధిదారుల జాబితాలను తక్షణమే బ్యాంకర్లకు పంపాలి
* ఎస్సీ కార్పొరేషన్ ఇడి ఎన్‌వివి సత్యనారాయణ
ఆంధ్రభూమి బ్యూరో
మచిలీపట్నం, జనవరి 11: పలు కార్పొరేషన్‌లకు ఎంపికైన లబ్ధిదారుల జాబితాలను ఎంపిడివోలు, మున్సిపల్ కమిషనర్లు శుక్రవారం సాయంత్రం నాటికి ఆయా బ్యాంకర్లకు పంపాలని ఎస్‌సి కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎన్‌వివి సత్యనారాయణ బుధవారం తన ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్రవారం సాయంత్రం నాటికి బ్యాంకర్లకు లబ్ధిదారుల జాబితాలను పంపని పక్షంలో రుణాలు రద్దు చేయడం జరుగుతుందన్నారు. ఈ విషయంలో ఎంపిడివోలు, మున్సిపల్ కమిషనర్లు అప్రమత్తమై తక్షణమే స్టీరింగ్ కమిటీల ద్వారా ఎంపికైన లబ్ధిదారుల జాబితాలను బ్యాంకర్లకు పంపాలన్నారు. బ్యాంకర్లు లబ్ధిదారులతో రెండు అకౌంట్లు ఓపెన్ చేయించి తిరిగి 16వతేదీ నాటికి ఆయా ఎంపిడివోలు, కమిషనర్లకు నివేదికలు ఇవ్వాలన్నారు. ఈ నివేదికలను ఎంపిడివోలు సంబంధిత కార్పొరేషన్ కార్యాలయాలకు పంపాలన్నారు. ఈ సమావేశంలో బిసి కార్పొరేషన్ ఇడి పెంటాజీరావు, జిల్లా గిరిజన సంక్షేమాధికారి మధుసూదనరావు పాల్గొన్నారు.

సినిమా చూపిస్తున్న పోలీసులు
* టిక్కెట్లు కేరాఫ్ పోలీస్టేషన్లు
* రేసులో ఎస్‌ఎన్‌ఫురం, గవర్నర్‌పేట, టాస్క్ఫోర్స్ పిఎస్‌లు
విజయవాడ (క్రైం), జనవరి 11: అదంతే.. టిక్కెట్లు థియేటర్లలో దొరకవు.. గంటల తరబడి క్యూలో బారులు తీరినా.. కేవలం బుకింగ్ కౌంటర్‌లో లభించేవి నామమాత్రమే. అందుకే.. పోలీసులే నేరుగా ప్రేక్షకులకు సినిమా చూపించే బాధ్యత భుజానెత్తుకున్నారు. బెజవాడ పోలీసులకు ఇది ఈరోజు కొత్తేమీ కాదు. కొత్త సినిమా విడుదల సందర్భంగా సినిమా థియేటర్లకు బదులు పోలీస్టేషనే్ల కిటకిటలాడుతుంటాయి. సినిమా హాళ్ల వద్ద పట్టుబడిన జేబుదొంగలు, బ్లాక్ టిక్కెట్ల విక్రేతలు, నేరగాళ్లతో మాత్రం కాదు.. తమ అభిమాన హీరో సినిమా సినిమా తొలిరోజు తొలి ఆట చూసేందుకు తరలివచ్చే అభిమానులతో అంటే అందులో అనుమానమే లేదు. ఇందుకు మొదటి వరుసలో సత్యనారాయణపురం పోలీస్టేషన్, ఆ తర్వాత గవర్నర్‌పేట స్టేషన్లతోపాటు, ఇక గట్టు చప్పుడు కాకుండా టాస్క్ఫోర్స్. ఇక తర్వాత వరుసలో వన్‌టౌన్, కొత్తపేట పోలీస్టేషన్లు. మల్టీఫ్లెక్స్ థియేటర్లు వచ్చాక అవి కూడా ఈ జాబితాలో చేరిపోయాయి. మాస్ ప్రేక్షకులే కాదు.. క్లాస్ క్రౌడ్‌కు కూడా టిక్కెట్లు కావాలంటే ‘పోలీసు’లే దిక్కు. అసలు విషయానికొస్తే.. భారీ బడ్జెట్‌తో నిర్మించే పెద్ద హీరోల సినిమాల విడుదల సందర్భంగా ప్రతిసారీ అభిమాన సంఘాలకు ఆరోజు పెద్ద పండుగే. ఇక పండుగ సమయాల్లో పోటీ పడి రిలీజయ్యే సినిమాల విషయంలో వేరే చెప్పాల్సిన పనిలేదు. గతంలో బెన్‌ఫిట్ షో ట్రెండ్ నడిచిన సమయంలో సినిమా రిలీజుకు ముందు రోజు నుంచే థియేటర్ల వద్ద హడావుడి ఉంటుంది. టిక్కెట్ల కోసమైతే సామాన్య ప్రేక్షకులు, కొందరు అభిమానులు క్యూలైన్లలో అర్ధరాత్రి నుంచే పడిగాపులు కాసేవారు. రానురాను టిక్కెట్ల ఇక్కట్లు ఎక్కవయ్యాక.. గొడవలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగాల్సివచ్చేది. క్యూలో కేవలం నామమాత్రంగా టిక్కెట్లు ఇచ్చేసి అంతలోనే బుకింగ్ క్లోజ్ చేసి హౌస్‌ఫుల్ బోర్డు పెట్టేసేవారు. మిగిలిన టిక్కెట్లు మాత్రం అభిమాన సంఘాలు, పోలీస్టేషన్ల వద్ద దొరికేవి. ఇక స్టేషన్ల వద్ద గుంపులు గుంపులుగా జనం చేరడం ఆనవాయితీగా వచ్చేసింది. ఇప్పుడు తాజా పరిస్ధితి కూడా ఇంతే. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150 సినిమా విడుదల సందర్భంగా క్యూలైన్లలో గంటల తరబడి నిరీక్షించిన ప్రేక్షకులకు మొండి చేయి మిగిలింది. కాని టిక్కెట్ల పందారం పోలీస్టేషన్ల నుంచే సాగింది. ప్రతిరోజూ ప్రతి షోకు ఇన్ని టిక్కెట్లు చొప్పున ప్రతి థియేటర్ నుంచి పోలీస్టేషన్‌కు అప్పగించాల్సిందే. అదేవిధంగా టాస్క్ఫోర్స్‌కు మరో కోటా ఇవ్వాల్సిందే. దీన్నిబట్టి స్టేషన్ హౌసాఫీసర్ చెప్పిన వారికి, ముందుగా కాగితంపై రాసి ఉంచుకున్న వారికి జనరల్ డ్యూటీ కానిస్టేబుళ్లు పంపకాలు చేస్తుంటారు. వీరిలో ఎక్కువ మంది పోలీసు, రాజకీయనేతలు, ఇతర వ్యాపారస్థులు, సన్నిహితులు, వారి కుటుంబ సభ్యులు, వారి పిల్లలు, వారి స్నేహితులకు ఇలా ఒక్కరోజులో నగరంలో అన్ని థియేటర్లు కలిపి వేల సంఖ్యలోనే పోలీసుల కనుసన్నల్లో టిక్కెట్లు పందారం జరుగుతుంది. ఖైదీ నెంబర్ 150 విడుదల తొలిరోజు కూడా ఇదే పరిస్థితి. ఇక యువరత్న బాలకృష్ణ నటించిన గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రం గురువారం విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాకు క్యూలైన్‌లో కాకుండా పోలీస్టేషన్ల ద్వారా వేల సంఖ్యలో టిక్కెట్లు బుక్ అయిపోయాయని థియేటర్ల యాజమాన్యమే చెబుతోంది. ఒకప్పుడు జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో రెవెన్యూ, పోలీసు కమిషనర్ ఆదేశాలతో యాంటీ గూండా స్వ్కాడ్ పోలీసులు థియేటర్ల బుకింగ్ కౌంటర్ల వద్ద నిలబడి మరీ టిక్కెట్లు పక్కదారి పట్టకుండా క్యూలైన్‌లో నిలుచున్న ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చొప్పున అమ్మించి దళారులను నిలువరించారు. ఇప్పుడు కూడా అదేమాదిరిగా పోలీసు కమిషనర్ చర్యలు చేపట్టి ఉంటే బావుండేదని సగటు ప్రేక్షకుడు ఆశిస్తున్నాడు.