కృష్ణ

ప్రజల ఆకాంక్షలకనుగుణంగా వేగవంతంగా అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 22: జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వేగవంతంగా అమలయ్యే విధంగా అధికారులను సన్నద్ధం చేస్తున్నట్లు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ అన్నారు. శనివారం పిన్నమనేని పాలిక్లినిక్ వద్ద నున్న ఓ ప్రైవేట్ హాల్‌లో జెడ్పీ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ అధ్యక్షతన జిల్లాలోని ఎంపిడిఓలు, పిఆర్, డిఆర్‌డిఎ, డిడబ్ల్యుఎంఎ, ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులతో జిల్లా అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ అధికారులనుద్దేశించి మాట్లాడుతూ సమావేశ ముఖ్య ఉద్దేశ్యం సంక్షేమ పథకాల అమలులో ఎదురైన ఇబ్బందుల పరిష్కారానికి దోహదపడటమే నన్నారు. జిల్లాలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు నామమాత్రంగా జరుగుతున్నాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టే సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యంగా ఆర్థిక సహాయం అందించే సంస్థలు, బ్యాంకుల ద్వారా రుణాలు అందించడంలో సమస్యలు వస్తున్నాయన్నారు. జిల్లా పరిషత్‌కు చెందిన ఆస్తులను పరిరక్షించవలసిన ఆవశ్యకత ఉందని, జెడ్పీకి చెందిన ఎక్కడైనా భూమి ఉంటే అక్కడ కంచె వేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వౌలిక వసతుల కల్పనతోపాటు పెన్షన్లు, రైతు రుణ మాఫీ, ఉపాధి హామీ, ఇంకుడుగుంటలు, సాగు కుంటలు, చంద్రన్న కాలిబాట సిమెంట్ రోడ్లు, పాఠశాలల్లో ఆట స్థలాలు మెరక చేయటం, మరుగుదొడ్ల నిర్మాణం, శ్మశానవాటికల అభివృద్ధి, జల సంరక్షణ కార్యక్రమాలపై ఎంపిడిఓలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవలసిన అవసరం ఉందని చైర్‌పర్సన్ అనూరాధ సూచించారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ బి లక్ష్మికాంతం మాట్లాడుతూ నీరు - ప్రగతి 90 రోజుల కార్యక్రమంలో భాగంగా ప్రతి అధికారి ఎదో ఒక గ్రామ పంచాయతీలో ప్రతిరోజు పాల్గొనాలన్నారు. కార్యక్రమంలో పార్లమెంట్, శాసన, మండలి సభ్యులు, జెడ్‌పిటిసి, ఎంపిపి, సర్పంచ్‌లతోపాటు ఇతర ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేసి జలసంరక్షణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఒక టైంబౌండ్ కార్యక్రమంగా చేపట్టినందున ఒక ఉద్యమస్ఫూర్తితో పని చేయాలన్నారు. జిల్లాలో 50 వేల చెక్ డ్యాముల నిర్మాణంతోపాటు పంట కుంటలను 12వేల నుండి 25వేల వరకు నిర్మించటానికి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఉపాధి హామీ పథకంలో ప్రస్తుతం లక్ష మంది కూలీలు పని చేస్తున్నారని, మే నెలలో వీరిని లక్షా, 70వేల నుండి రెండు లక్షలు వరకు ఉపాధి హామీ పనులు కల్పించే విధంగా సన్నద్ధం చేస్తున్నామన్నారు. జిల్లాలో ఆరు లక్షల ఉపాధి జాబ్‌కార్డులు వున్నాయని, వీటిలో రెండు లక్షల మందికి ఉపాధి కల్పించే లక్ష్యంగా నిర్ణయించామన్నారు. అదే విధంగా గ్రామాల్లో వర్మీకంపోస్ట్ కిట్‌లు పెద్ద ఎత్తున అందిచాలని నిర్ణయించామన్నారు. జిల్లాలోని 970 గ్రామాల్లో 486 గ్రామాలను ఒడిఎఫ్‌లు ప్రకటించటం జరిగిందని, మే చివరి నాటికి మిగతాగ్రామాలను ఒడిఎఫ్‌గా ప్రకటించటం జరుగుతుందన్నారు. జిల్లాలో గృహ నిర్మాణం కింద చేపట్టిన 21వేల గృహాల్లో ఇప్పటి వరకు ఎనిమిది వేలు గ్రౌండ్ అయ్యాయన్నారు. రాబోయే రెండు, మూడు నెలలల్లో గుర్తించిన వారికి గృహాలు నిర్మించి అందజేయటం జరుగుతుందన్నారు. వెలుగు సంస్థ ద్వారా బ్యాంక్ లింకేజి రుణాలు 120 శాతం సాధించటం గొప్ప విషయమన్నారు.
ప్రతిభ ఆధారంగా అధికారులకు గ్రేడ్‌లు
మండల స్థాయి అధికారులను వారి పనితీరునుబట్టి ప్రతిభ ఆధారంగా గ్రేడ్‌లు ఇవ్వనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. పనిచేసే వారికి పని చేయనివారికి తగిన విధంగా గుర్తింపు ఉంటుందన్నారు. పనిచేసే అధికారులను అభినందించటంతోపాటు పని చేయని వారి పట్ల వెంటపడి పని చేసే విధంగా చర్యలు తీసుకోవటం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరికీ పని పట్ల సామర్ధ్యం ముఖ్యమని లేకపోతే అభివృద్ధి కుంటుపడుతుందన్నారు.
పని కల్పించకపోతే కఠిన చర్యలు
ఉపాధి హామీ పథకంలో జాబ్‌కార్డు కలిగి ఉండి కాల్ సెంటర్ ద్వారా పని కల్పించలేదని ఫిర్యాదువస్తే అలాంటి మండలాలపై తగిన చర్యలు తీసుకోవటం జరుగుతుందని కలెక్టర్ హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాల్ సెంటర్ ఉద్దేశ్యాలను అధికారులు గ్రహించి సామాన్య మానవులు ద్వారా వచ్చే ఫిర్యాదులను తక్షణం పరిష్కరించే విధంగా పని చేయాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా నీటి యాజమాన్య సంస్థ, ఆర్‌డబ్ల్యుఎస్, హౌసింగ్, డిఆర్‌డిఎ, పంచాయతీరాజ్ శాఖల ద్వారా జరుగుతున్న పనులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. బాగా పని చేసిన ఎంపిడిఓలను అభినందిస్తూ పని చేయనివారు పనితనం మెరుగుపర్చుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో జెడ్‌పి ఇన్‌చార్జి సిఇఓ ఎన్‌వివి సత్యనారాయణ, పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇలు సూర్యనారాయణ, శ్రీనివాసరావు, పిడిలు డిఆర్‌డిఎ డ్వామా డి చంద్రశేఖరరాజు, బి రాజగోపాల్‌తోపాటు సంబంధిత శాఖల అధికారులు, జిల్లాలోని మండలాల ఎంపిడిఓలు, ఎపిఓలు పాల్గొన్నారు.

గ్రూప్ 3 పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, ఏప్రిల్ 22: ఆదివారం నిర్వహించనున్న ఎపి పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 3 పంచాయతీరాజ్ సబార్డినేట్ సర్వీస్ స్క్రీనింగ్ టెస్ట్‌ను కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ బి లక్ష్మీకాంతం వివరించారు. శనివారం కలెక్టర్ నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం సర్వీస్ కమిషన్ నిర్వహించే స్క్రీనింగ్ టెస్ట్‌కు నియమితులైన అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ప్రశ్నపత్రాల బండిల్స్‌ను ప్రభుత్వ చెస్ట్ నుండి ఆర్మ్‌డ్ గాడ్స్ సహకారంతో పరీక్షా కేంద్రాలకు తరలించటం దగ్గర నుండి క్వచ్ఛన్, అన్సర్ పేపర్ల పంపిణీ విధానాన్ని క్రమం తప్పకుండా పాటించాలన్నారు. అదే విధంగా పరీక్ష రాసే విద్యార్థులు సమయానికే కేంద్రానికి హాజరుకావటంతోపాటు అన్ని అంశాలను పరిగణనలోనికి తీసుకుని స్క్రీనింగ్ టెస్ట్ సజావుగా జరిగే విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆయన ఆదేశించారు.