కృష్ణ

ల్యాండ్ పూలింగ్ ప్యాకేజీతో లబ్ధిపొందాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రభూమి బ్యూరో
మచిలీపట్నం, మే 18: ఓడరేవు, పారిశ్రామిక వాడ నిర్మాణానికి రైతులు స్వచ్చందంగా ముందుకు వచ్చి ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీని అందిపుచ్చుకుని లబ్ధి పొందాలని పార్లమెంట్ సభ్యుడు కొనకళ్ల నారాయణరావు కోరారు. ఓడరేవు, అనుబంధ పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూముల సమీకరణ విషయంలో రైతులకు అవగాహన కల్పించేందుకు గాను ముడ కార్యాలయం సమీపంలో ఏర్పాటు చేసిన ‘రైతు దర్బారు’ (పూలింగ్‌పై అవగాహనా కార్యాలయం) కార్యాలయాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కొనకళ్ల మాట్లాడుతూ పోర్టుతోనే బందరు భవిష్యత్తు ముడి పడి ఉందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలన్నారు. భూసమీకరణలో భూములు ఇచ్చే రైతులకు ప్రభుత్వం అద్భుతమైన ప్యాకేజీని ప్రకటించిందని, దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ల్యాండ్ పూలింగ్‌లో ఎటువంటి సమస్యలు వచ్చినా, అనుమానాలు ఉన్నా ఈ కార్యాలయం ద్వారా నివృత్తి చేసుకోవచ్చన్నారు. ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మాట్లాడుతూ బందరు పోర్టుతో ఈ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందనుందన్నారు. ఈ కార్యక్రమంలో పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావ్, టిడిపి సీనియర్ నాయకులు కొనకళ్ల జగన్నాధరావు (బుల్లయ్య), బూరగడ్డ రమేష్ నాయుడు, గొర్రిపాటి గోపిచంద్, మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, వైస్ చైర్మన్ కాశీ విశ్వనాధం (చంటి), జెడ్పీటిసి లంకే నారాయణ ప్రసాద్, ఎఎంసి చైర్మన్ గోపు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం
హనుమాన్ జంక్షన్, మే 18: స్నేహితుడి పెళ్లివేడుకకు హాజరై తిరిగి ఇంటికి వెళ్ళుతున్న సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకులు మృతి చెందారు. ద్వారకా తిరుమల నుంచి బైక్‌పై గుంటూరు బయలుదేరిన యువకులు హనుమాన్ జంక్షన్ సమీపంలో అప్పనవీడు వద్ద అదుపుతప్పి జాతీయ రహదారి మార్జిన్‌లో వున్న రైలింగ్‌ను ఢీకొట్టడంతో ఈప్రమాదం జరిగింది. పెదపాడు ఎస్‌ఐ కె రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం గుంటూరుకు చెందిన ప్రశాంత్, కార్తీక్‌లు బుధవారం రాత్రి బైక్‌పై ద్వారకాతిరుమలలో జరిగిన వివాహానికి హాజరై గురువారం ఉదయం తిరిగి వస్తుండగా హనుమాన్ జంక్షన్ సమీపంలోని పెదపాడు మండలం అప్పనవీడుగ్రామం వద్ద జాతీయ రహదారిపై వున్న మలుపువద్ద వీరి బైక్ రైలింగ్‌ను ఢీకొంది. ఈ సంఘటనలో బైక్ నడుపుతున్న కార్తీక్, ప్రశాంత్ అక్కడిక్కడే మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు పెదపాడు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకోని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. మితిమీరిన వేగం, నిద్రమత్తు కారణంగానే బైక్‌ను నియంత్రించలేక పోయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్డం నిమిత్తం ఏలూరు ప్రభుత్వ అసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

పాలేటి మ్యాంగోమార్కెట్‌యార్డులో 30లక్షలు చోరి

ఎ కొండూరు, మే 18: కృష్ణాజిల్లా మండల కేంద్రమైన ఎ కొండూరు అడ్డరోడ్డుసమీపంలోని పాలేటి నాగేశ్వరరావు మ్యాంగో మార్కెట్ యార్డులో గురువారం మధ్యాహ్నాం క్యాషియర్ బీరువాలో ఉన్న 30లక్షల నగదు చోరీ అయినట్లు నూజివీడు డిఎస్పీ వి శ్రీనివాసరావు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మ్యాంగో మార్కెట్‌యార్డులో క్యాషియర్‌గా పనిచేస్తున్న మోహనరావు, రైతులకు స్లిప్‌లు పంపిణీ చేసే రషీద్, పిచ్చయ్య ముగ్గురు భోజనానికి క్యాంటిన్‌కు వెళ్ళగా గుర్తుతెలియని వ్యక్తులు బీరువా తాళం వంకి వంచి బీరువాలో ఉన్న 30లక్షల నగదు అపహరించినట్లు చెప్పారు. ఈయార్డులో మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బీహార్, ప్రకాశం జిల్లాకు చెందిన 200 మంది కూలీలు పనిచేస్తున్నారని, వారిని పూర్తి స్థాయిలో విచారిస్తున్నట్లు, ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే 20 లారీల్లో లోడై ఉన్న మామిడి కాయలను దించి పరిశీలించనున్నట్లు డిఎస్పీ తెలిపారు. క్లూస్‌టీమ్, డ్వాగ్ స్కాడ్, ఫింగర్‌ప్రింట్ నిపుణులు రంగప్రవేశం చేసి నమూనాలను సేకరిస్తున్నారు. దోషులు ఎంతటివారైన పట్టుకుంటామన్నారు. నాగేశ్వరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఈకార్యక్రమంలో విస్సన్నపేట, ముసునూరు, మైలవరం, వీరవల్లి స్టేషన్ల ఎస్‌ఐలు, నూజివీడు క్రైమ్ పోలీసులు పాల్గొన్నట్లు చెప్పారు.

జిల్లాలో దృఢ సంకల్పంతో జల సంరక్షణ ఉద్యమం

వత్సవాయి, మే 18: జల సంరక్షణ ఉద్యమాన్ని జిల్లాలోని 970 గ్రామాల్లో దృఢ సంకల్పంతో ముందుకు తీసుకువెళుతున్నట్లు జిల్లా కలెక్టర్ బాలయ్యనాయుడు లక్ష్మీకాంతం తెలిపారు. మండలంలోని లింగాల, గంగవల్లి, పోచవరం, వత్సవాయి గ్రామాల్లో ఎంఎల్‌సి తొండపు జనార్థన్, ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్‌లతో కలిసి ఆయన పర్యటించారు. ముందుగా లింగాల గ్రామంలో నూతనంగా నిర్మించిన శివాలయంలో కలెక్టర్ ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం ఎంఎల్‌సి జనార్థన్ దత్తత తీసుకున్న గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాల ఫోటో ఎగ్జిబిషన్‌ను ఆయన తిలకించారు. తదుపరి గంగవల్లి, పోచవరం గ్రామాల్లో పంట కాలువలు, వత్సవాయి ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఇంకుడు గుంటలు పరిశీలించారు. అనంతరం లింగాలలో ఏర్పాటు చేసిన సమావేశంలోప్రజల నుండి సమస్యలపై అర్జీలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ నీటి సంరక్షణ కోసం ప్రతి ఒక్కరూ స్వచ్చందంగా కృషి చేయాలన్నారు. స్పేస్, శాటిలైట్ చిత్రాల ఆధారంగా గ్రామాల్లో ఇంకుడు గుంటలు, పంట కుంటలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లోని శ్మశాన వాటికల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కాలుష్యం లేకుండా ఉండటం కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు. శ్రీకారం పథకం ద్వారా ఇప్పటికే 120 వసతి గృహాలు అభివృద్ధి చేశామని చెప్పారు. ఉపాధి హామీ కూలీల సంఖ్యలో 55వేలకు పెరిగిందన్నారు. భువన్ యాప్ ద్వారా గ్రామాల్లో పక్కా భవనాలు లేని ప్రభుత్వ కార్యాలయాలను గుర్తించి నిర్మాణం చేస్తామని తెలిపారు. మీ సేవలో పెండింగ్‌లో ఉన్న 9500 అర్జీలను పరిష్కరించామన్నారు. అదే విధంగా పెండింగ్‌లో ఉన్న 12వేల పాసు పుస్తకాలను వేగవంతంగా పంపిణీ చేసామన్నారు. ఆదాయంలో కృష్ణా జిల్లా 12.4శాతంతో ప్రథమ స్థానంలో ఉందన్నారు. భవిష్యత్తులో అన్ని మున్సిపాలిటీ, మేజర్ పంచాయతీల్లో ప్రతి నెలా హాపీ సండే కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎంఎల్‌సి జనార్థన్ మాట్లాడుతూ 90కోట్లతో నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు మంచినీరు అందేలా పథకానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. కొంగరమల్లయ్య గట్టుపై ప్రత్యేకంగా వాటర్ ట్యాంక్ నిర్మించి అక్కడి నుండి మంచినీటి సరఫరా అందేలా ప్రతిపాదనలు అందినట్లు తెలిపారు. ఎమ్మెల్యే రాజగోపాల్ మాట్లాడుతూ పోలంపల్లి మునే్నటి ఆనకట్ట గండి పూడ్చడానికి కలెక్టర్ చొరవ చూపాలని, దీని వల్ల 20వేల ఎకరాల సాగునీటి ఇబ్బందులు తొలగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎఎంసి చైర్మన్ మల్లెల గాంధీ, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు చావా అనసూర్య, సిఐ లచ్చునాయుడు, ఎండిఒ జయచంద్ర, తహశీల్దార్ ప్రసాదరావు, ఎస్‌ఐ రమణ, తెదేపా సీనియర్ నాయకులు తొండపు జగన్మోహనరావు, మండల పార్టీ అధ్యక్షుడు జొన్నలగడ్డ రాధాకృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

మంచినీటి కోసం మహిళల ఆందోళన
అవనిగడ్డ, మే 18: స్థానిక 9వ వార్డులోని వీవర్స్ కాలనీలో మంచినీటి కోసం ఖాళీ బిందెలతో ఆందోళన చేశారు. గత తొమ్మిది రోజులుగా ఆ కాలనీలో దాహం కేకలు వేస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం పట్ల వారు ఆందోళనకు దిగారు. మంచినీరు లేకపోవటంతో కనీసం ట్యాంకర్‌తోనైనా మంచినీరు అందించకపోవటం విచారకరమని, ఆ కారణంగా మహిళలు ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. వీరికి జనసేన పార్టీ నేత రాయపూడి వేణుగోపాలరావు మద్దతు తెలిపారు. వెంటనే వీవర్స్ కాలనీ వాసులకు మంచినీరు అందించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఉపాధి హామీ పనులు పరిశీలించిన జెడ్పీ చైర్‌పర్సన్

జి.కొండూరు, మే 18: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మండల పరిధిలో చేస్తున్న పనులను జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దె అనురాధ గురువారం తనిఖీ చేశారు. చెవుటూరు పేరంటాళ్ళ చెరువులో జరుగుతున్న పూడికతీత పనులను ఆమె పరిశీలించారు. పథకం రికార్డులను, కూలీల మస్టర్లను పరిశీలించారు. కూలీలకు అందుతున్న వేతనం గురించి ఆరాతీశారు. ఎండతీవ్రత దృష్ట్యా సాధ్యమైనంత వరకూ ఉదయానే్న పనులు ప్రారంభించాలని కూలీలకు సూచించారు. చెరువులో 29 గ్రూపులకు చెందిన 160 మంది కూలీలు గురువారం పని చేస్తున్నట్లు గుర్తించారు. కూలీలకు టార్పాలిన్ పట్టాలను పంపిణీ చేశారు. ఎన్‌ఆర్‌ఇజిఎస్ ఎపిఒ వీరమల్లు వెంకటేశ్వరరావు, ఎంపిడిఒ బివి రామకృష్ణనాయక్, కార్యదర్శి కెవి రమణ తదితరులు పాల్గొన్నారు.

ఎంప్లారుూస్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికుల నిరసన
జగ్గయ్యపేట, మే 18: సమస్యలు పరిష్కరించాలంటూ ఆర్టీసీ ఎంప్లారుూస్ యూనియన్ కార్మికులు డిపో ముందు ధర్నా నిర్వహించారు. యూనియన్ అధ్యక్షులు కల్యాణం కృష్ణారావు ఆధ్వర్యంలో రద్దు చేసిన సర్వీసులను పునరుద్ధరించాలని తదితర ఆరు డిమాండ్లతో ఆ ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిపో కార్యదర్శి పసుపులేటి శ్రీనివాసరావు, డ్రైవర్స్ అసోసియేషన్ కార్యదర్శి సాంబశివరావుతదితరులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

ముసునూరు, మే 18: శుభకార్యానికి వెళ్ళేందుకు ఆటోఎక్కిన వ్యక్తి ఆఅటో బోల్తాపడటంతో ఆటోపైనున్న రేకులు అతనిపై పడి అక్కడికక్కడే దుర్మరణం పాలైన సంఘటన ఇది. సేకరించిన వివరాల ప్రకారం ముసునూరు గ్రామానికి చెందిన చెప్పుల జయరాజు(30) వ్యవసాయ కూలీగా జీవనం సాగిస్తున్నాడు. బంధువుల ఇంట్లో శుభకార్యానికి పశ్చిమగోదావరి జిల్లా లింగపాలెం మండలం సింగూడెం గురువారం బయలుదేరాడు. ఈక్రమంలో వలసపల్లి అడ్డరోడ్డు వద్ద అటుగా వెళ్తున్న ఆటోను ఎక్కాడు. ఆ ఆటోపైన సిమెంట్ రేకులు ఉన్నాయి. ఆటో కొద్ది దూరం వెళ్ళాక అదుపుతప్పిన ఆటో బోల్తా కొట్టిందని, ఆటోలో ఉన్న జయరాజు కిందపడిపోగా ఆటోతో పాటు ఆటోపైన ఉన్న రేకులు ఆతనిపై పడటంతో జయరాజు అక్కడికక్కడే మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. సంఘటన జరిగిన వెంటనే ఆటో డ్రైవర్ పరారుకాగా అటుగా వెళ్తున్న వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి పరిశీలించగా జయరాజు మృతి చెందినట్లు నిర్ధారించారు. జయరాజు బంధువులకు సమచారం ఇచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. మృతునికి భార్య, ఇద్దరు సంతానం. జయరాజు మృతి చెందిన వార్త తెలుసుకున్న బంధువులు, గ్రామస్థులు సంఘటన స్థలికి చేరుకుని జయరాజు మృతదేహాన్ని చూసి రోదిస్తున్న తీరు అక్కడివారిని కలచివేసింది.