కృష్ణ

బిజెపి మహా సమ్మేళనంలో అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంజిసర్కిల్, మే 25: నగరంలో గురువారం నిర్వహించిన బిజెపి కార్యకర్తల మహా సమ్మేళనంలో ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. జనచైతన్య కళామండలి ఆధ్వర్యంలో పలువురు కళాకారులు దేశ చరిత్రతో పాటు మోదీ పా లనపై కళా ప్రదర్శనను అందరూ ఆసక్తిగా తిలకించారు. నూజివీడు ట్రిపుల్ ఐటి విద్యార్థుల ‘నవామి గంగే.. వందేమాతరం’ నృత్య ప్రదర్శన అందరినీ అమితంగా ఆకట్టుకుంది. వందేమాతరం ప్రదర్శనను ఆద్యంతం తిలకించిన బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా విద్యార్థులను అభినందించారు.
కార్యకర్తల హల్‌చల్!
మహా సమ్మేళనంలో కార్యకర్తలు హల్‌చల్ చేశారు. సభా ప్రారంభంలో నాయకులు మాట్లాడుతున్న సందర్భంలో టిడిపితో మైత్రీబంధంపై ప్లకార్డులు ప్రదర్శిస్తూ కాస్త అలజడి సృష్టించారు. ‘లీవ్ టిడిపి.. సేవ్ బిజెపి’ అంటూ పెద్దపెట్టున నినాదాలు కూడా చేశారు. అమిత్‌షా మాట్లాడుతున్న సందర్భంలో వేదిక ముందు కూర్చున్న నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ఒక్కసారిగా లేచి నిలబడి వర్గీకరణ చేయాలని నినదిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని, దీనిపై ఆందోళన చేందాల్సిన పనిలేదని చెప్పిన్పటికీ వారు శాంతించలేదు. వెంటనే పోలీసులు కలుగజేసుకుని బిజెపి కార్యకర్తల నుంచి ప్లకార్డులు లాక్కోవడంతో పాటు, ఎమ్మార్పీఎస్ కార్యకర్తలను బయటకు పంపేశారు. ఈసందర్భంలో సభ దృష్టి మొత్తం వీరి నినాదాలవైపే మళ్లింది. సభానంతరం ఒక్కసారిగా నేతలతో పాటు కార్యకర్తలు బయటకు రావడంతో ట్రాఫిక్ స్తంభించింది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. మొత్తమీద సుమారు 20వేల మంది హాజరైన సభ విజయవంతం కావడంతో బిజెపి శ్రేణుల్లో నూతనోత్సాహం వెల్లివిరిసింది. '

సైన్స్ ఎక్స్‌ప్రెస్ క్లయిమేట్ యాక్షన్ స్పెషల్ ఎగ్జిబిషన్‌కు అనూహ్య స్పందన
విద్యార్థులతో కిక్కిరిసిన గుడివాడ రైల్వేస్టేషన్
గుడివాడ, మే 25: గుడివాడ రైల్వేస్టేషన్‌కు చేరుకున్న సైన్స్ ఎక్స్‌ప్రెస్ క్లయిమేట్ యాక్షన్ స్పెషల్ ఎగ్జిబిషన్ ట్రైన్‌కు 2వ రోజు గురువారం అనూహ్య స్పందన లభించింది. 3వ నెంబరు ఫ్లాట్‌ఫారంపై రైల్లో ప్రదర్శనలను తిలకించేందుకు వేలాది మంది విద్యార్థులు, పట్టణ ప్రజలు తరలి రావడంతో రైల్వేస్టేషన్ కిక్కిరిసి పోయింది. విక్రమ్ సారాబాయి సెంటర్‌కు చెందిన సైంటిస్ట్ సంకేత్ రావత్ ఆధ్వర్యంలో పలువురు సిబ్బంది వాతావరణంలో సంభవించే మార్పులను, ఏ విధంగా రక్షించుకోవాలో అవగాహన కల్పిస్తున్నారు. విద్యార్థులు, ప్రజల నుండి వచ్చే సందేహాలను విక్రమ్ సారాబాయి సెంటర్‌కు చెందిన నిష్ణాతులైన సిబ్బంది నివృత్తి చేశారు. కిడ్స్ బోగి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కాగా మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, రైల్వేశాఖ సీనియర్ డివిజనల్ కంట్రోల్ మేనేజర్ షెఫాలి కుమార్‌లు సందర్శించారు. వారు మాట్లాడుతూ విద్యార్థులకు ఈ ప్రదర్శనలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. శుక్రవారం కూడా ఈ ఎక్స్‌ప్రెస్ రైలు అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ మేనేజర్ పిఎం గాంధీ, రైల్వే ట్రాఫిక్ ఇన్స్‌పెక్టర్ పి శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు.

శ్రీ అనంత ఆదిశేష భగవానుడి
అభిషేకానికి తరలివచ్చిన భక్తజనం
కూచిపూడి, మే 25: అనుక్షణం హరినామ స్మరణలతో భక్త్భివాన్ని పెంపొందింప చేస్తున్న ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన పెదముత్తేవి శ్రీకృష్ణాశ్రమంలో గురువారం శ్రీ అనంత ఆదిశేష భగవానుడిని అభిషేకించేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ముముక్షుజన మహాపీఠాధిపతులు ముత్తీవి సీతారాం గురుదేవులు, కమల దంపతుల పర్యవేక్షణలో భక్తుల వాసుదేవ నామస్మరణలు, పండితుల పంచసూక్తుల పారాయణం, రుత్వీకుల వేద మంత్రాల మధ్య శ్రీ అనంత ఆదిశేష భగవానుడిని అభిషేకించి భక్తులకు మార్గదర్శకత్వం చేశారు. ముత్తీవి గౌరాకృష్ణ, ఆశ్రమ సన్నిధి కార్యదర్శి తుర్లపాటి రాధాకృష్ణ, ఆత్మకూరి లక్ష్మణదాసు, తుర్లపాటి ఆనందసాగర్‌ల పర్యవేక్షణలో యతీంద్ర సేవా సమితి సభ్యులు వేలాది మంది భక్తులకు అన్నసమారాధన నిర్వహించారు. భక్తులనుద్దేశించి గురుదేవులు అనుగ్రహభాషణ చేశారు. ఈ సందర్భంగా ఆశ్రమంలోని శ్రీ అభయ వీరాంజనేయ స్వామివారికి పలువురు భక్తులు గజ వడమాలలు సమర్పించారు.

అధికారులు ప్రజలకు జవాబుదారిగా ఉండాలి
కృత్తివెన్ను, మే 25: ప్రభుత్వ అధికారులు ప్రజలకు జావాబుదారిగా ఉండాలని జెడ్పీటిసి ఒడుగు తులసీరావు అన్నారు. గురువారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిపి వలవల సత్యనారాయణ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జెడ్పీటిసి తులసీరావు మాట్లాడుతూ మత్స్యశాఖ ద్వారా అమలు చేసే పథకాలు ప్రజలకు చేరటం లేదని, ప్రచార లోపం జరుగుతుందన్నారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో ఎంత అభివృద్ధి చేసినా అధికారుల వైఫల్యాల వల్లే అభివృద్ధి కనిపించటం లేదన్నారు. ఎంపిడిఓ ఐవి సత్యవతి మత్స్యశాఖ అధికారుల పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. వేట నిషేధం ఉన్నా మత్స్యకారులు వేటకు వెళుతున్నారా.. లేదా అనే అంశాలపై వారి పర్యవేక్షణ లేదన్నారు. మత్స్యకారులు ఎంత మంది ఉన్నారు అనే విషయంలో మత్స్యశాఖ అధికారులు సరైన సమాచారం ఇవ్వటం లేదన్నారు. ఎంపిపి వలవల సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ఇంకుడు గుంటలను ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం వివిధ శాఖల అధికారులు తమ పని తీరును వివరించారు. జూన్ మొదటి వారంలో పంట కాలువలకు మంచినీరు విడుదల అవుతుందని, అధికారులు మంచినీటి చెరువులు నింపేందుకు తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఆరు సంవత్సరాలుగా మండలంలో వెలుగు ఏపిఎంగా పని చేసి ముదినేపల్లికి బదిలీపై వెళ్లిన ఎం కనకబాబును ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపిపి తమ్ము మురళీ, ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారిణి హజరత్తమ్మ, స్వచ్ఛ్భారత్ జిల్లా కో-ఆర్డినేటర్ అనూష, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

ప్రత్యేక హోదా ఇవ్వకుండా
రాష్ట్రంలో కమలం వికసించబోదు
విజయవాడ, మే 25: విభజన ద్వారా అన్ని రంగాల్లో వెనుకబడి అతలాకుతలమవుతున్న రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా తల నేలపై ఉంచి తపస్సు చేసినా రాష్ట్రంలో కమలం వికసించకపోగా మరింతగా వాడిపోవటం ఖాయమని జనసేన నేత పోతిన వెంకటమహేష్ హెచ్చరించారు. జనసేన ఆధ్వర్యంలో ధర్నాచౌక్‌లో గురువారం జరిగిన ధర్నాలో ఆయన మాట్లాడారు. వెనుకబడిన జిల్లాల్లో కరవు, వలసలు, రైతు ఆత్మహత్యలు వంటి తీవ్ర సమస్యలు, పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించక పోవటం, ఇతర సమస్యలపై దృష్టి సారించకుండా ఈ రాష్ట్రంలో అమిత్‌షా కాదుకదా నేరుగా ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించినా ఫలితం ఉండబోదన్నారు. పోలింగ్ కేంద్రాల స్థాయిలో ప్రచారం ఎలా ఉన్నప్పటికీ వచ్చే ఎన్నికల్లో ఆ స్థాయి నుంచే బిజెపికి ప్రజలు తగిన బుద్ధిచెపుతారని అన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మించిన పరాజయాన్ని చవిచూడాల్సి వస్తుందన్నారు.
రాష్ట్రంలో జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ ఒక్కరే ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నారన్నారు. ఇందుకోసం ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు వ్యూహరచన చేస్తున్నారన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం పవన్‌కళ్యాణ్ నేతృత్వంలో ఎలాంటి పోరాటాలకైనా తామంతా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ప్రత్యేక హోదా, లోటు బడ్జెట్, కడపలో ఉక్కు కర్మాగారం, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి, పోలవరం ప్రాజెక్టు, రైల్వేజోన్, రాజధాని నిర్మాణం వంటి అంశాలపై తక్షణం బిజెపి దృష్టి సారించాలని, లేనిపక్షంలో జనసేన రోడ్డెక్కుతుందని చెప్పారు. ముఖ్యమంత్రి ఇంట విందుకెళ్లిన అమిత్‌షా ఒక్కసారి గుంటూరు మిర్చియార్డును సందర్శించి రైతుల అరణ్య రోదనను ఆలకిస్తే బాగుండేదన్నారు. క్వింటాకు 5వేల రూపాయల మద్దతు ధర చెల్లిస్తామన్న కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు హామీ మూడు వారాలు దాటినా కార్యరూపం దాల్చలేదని వెంకటమహేష్ నిరసన తెలిపారు. ధర్నాలో జనసేన కార్యకర్తలు దాసు గోవిందు, ప్రదీప్, సాయి కనకారావు, సంజీవరావు, మారుతి, రజనీకాంత్, గిరి, హరీష్, తదితరులు పాల్గొన్నారు.

సిఎంకు కలెక్టర్ సాదర స్వాగతం
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, మే 25: నగరంలోని ఎ కనె్వన్షన్ సెంటర్‌లో 2 రోజులు నిర్వహిస్తున్న జిల్లా కలెక్టర్ల సమావేశంలో పా ల్గొనేందుకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు కలెక్టర్ బి లక్ష్మీకాంతం పుష్పగుచ్ఛంతో సాదర స్వాగతం పలికి సమావేశ మందిరానికి తోడ్కొని వెళ్లారు. సమావేశానికి రాష్ట్రంలోని వివి ధ జిల్లాల నుంచి వచ్చిన మంత్రులు, ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించామని ఆయన ముఖ్యమంత్రికి వివరించారు.

అబద్ధాలు మానకపోతే
తెలుగు ప్రజలే తరిమికొడతారు
విజయవాడ (కార్పొరేషన్), మే 25: విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకపోగా, ఇస్తామన్న నిధులు ఇవ్వక అన్నీ చేశామంటూ అబద్ధాలాడుతున్న బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా వైఖరి మారకుంటే తెలుగు ప్రజలే తరిమికొడతారని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ హెచ్చరించా రు. అమిత్‌షా నగరానికి వచ్చిన సందర్భంగా బుధవారం ఉదయం ఎపిసిసి కార్యాలయం వద్ద మహిళా కాంగ్రెస్ నేతృత్వంలో బిజెపి దిష్టిబొమ్మను దహనం చేసిన సందర్భంగా పద్మశ్రీ మాట్లాడారు. విభజన హామీలను అమలుచేయడంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను మోసం చే సిందని, విభజన చట్టంలోని అంశాలే కాక మరిన్ని అభివృద్ధి చర్యలను చేపడతామని హామీలిచ్చిన బిజెపి పెద్దలు చట్ట ప్రకారం ఇవ్వాల్సిన నిధులను కూ డా ఇవ్వలేదని విమర్శించారు. బిజెపి నాయకులకు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రా నికి కేంద్రం కేటాయించిన, విడుదల చేసిన నిధులు, చేసిన అభివృద్ధిపై తక్షణమే శే్వతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నల్లధనాన్ని అరికడతానంటూ పెద్దనోట్లు రద్దు చేసిన ప్రధా ని మోదీ ప్రజాధనాన్ని బ్యాంకుల్లో జమ చేసుకున్నారే కానీ ప్రజల ఖాతా లో జమ చేస్తానన్న నగదు మాత్రం వేయలేదని ఎద్దేవా చేశారు. గత ఎన్నికల సభలో తిరుపతి వెంకన్న సాక్షిగా ఎపికి 15ఏళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని, రైల్వే జోన్, వెనుకబడిన జి ల్లాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ, రాజధాని అభివృద్ధికి, కడప స్టీల్ ప్లాంట్, విశాఖ, తిరుపతి, విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయాల అభివృద్ధితో పాటు ఎపిలో 3 నగరాలను స్మార్ట్‌సిటీలుగా అభివృద్ధి చేయడం, తదితర హామీల అమలులో ప్రజలకు జరిగిన ప్రయోజనమేమిటో స్పష్టం చేయాలన్నారు. ఇకనైనా ఎపికి కేంద్రం తరఫున ఇచ్చిన హామీలతో పాటు విభజన చట్టంలోని అన్ని అంశాలను అమలుచేయాలని, లేనిపక్షంలో ప్రజలు తగిన గుణపాఠం చెప్పకతప్పదని పద్మశ్రీ హెచ్చరించారు. కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు కుర్షిదా, కార్యదర్శులు ప్రమీలా గాంధీ, దుర్గా, గుంటూరు జిల్లా అధ్యక్షురాలు మల్లికా, తదితరులు పాల్గొన్నారు.
1