కృష్ణ

‘స్థానిక’ పోరు లేనట్టే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, మార్చి 20: గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయ వేడిని రాజేసే స్థానిక సంస్థల ఎన్నికలపై నీలి నీడలు అలుముకుంటున్నాయి. మరో ఐదు నెలల్లో స్థానిక సంస్థల పాలకవర్గాల పదవీ కాలాలు ముగుస్తున్న నేపథ్యంలో స్థానిక సంస్థల పోరుకు రాజకీయ పార్టీలు ఇప్పటి నుండే సంసిద్ధమవుతున్నాయి. ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి సంశయానికి గురి చేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా..? లేదా..? అనే అంశంపై మీమాంశ నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికలతో ఆయా రాజకీయ పార్టీల భవితవ్యం ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు అడుగు వేసే పరిస్థితి ఏ మాత్రం కనిపించడం లేదు. స్థానిక సంస్థల పాలకవర్గాల గడువు జులై నెలతో ముగియనున్నాయి. ఈ క్రమంలో స్థానిక పోరు ఉంటుందని ఆశించిన రాజకీయ పార్టీలు, ఆశావహులకు నిరాశే మిగిలేలా కనిపిస్తోంది. ప్రస్తుతం కొనసాగుతున్న స్థానిక సంస్థల పాలకవర్గాల్లో అధికార తెలుగుదేశం పార్టీదే పై చెయ్యిలో ఉన్నారు. జిల్లాలో 49 మండలాలకు గాను మొత్తం 970 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో 120 మేజర్ గ్రామ పంచాయతీలుగా కొనసాగుతున్నాయి. పార్టీ గుర్తులు లేకపోయినా 80 శాతం మంది అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన వారు స్థానిక సంస్థల్లో పాలకులుగా వ్యవహరిస్తున్నారు. సహజంగా నిర్ణీత సమయంలో ఎన్నికలు నిర్వహించాలంటే ఇప్పటి నుండే ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. అయితే ఇప్పటి వరకు ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చేయకపోవటంతో ఎన్నికలు లేనట్టుగానే సంకేతాలు ప్రజల్లోకి వెళుతున్నాయి. సాధారణ ఎన్నికల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అధికార తెలుగుదేశం పార్టీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ప్రత్యేక హోదా అంశంపై ఇప్పటి వరకు మిత్రపక్షంగా ఎన్డీఎ నుండి వైదొలిగిన తెలుగుదేశం పార్టీ కేంద్రంపై యుద్ధానికి సిద్ధమైంది. ప్రతిపక్షాలు సైతం ప్రత్యేక హోదా అంశాన్ని ప్రచార అస్త్రంగా మలుచుకుని ప్రభుత్వంపై ఎదురు దాడికి దిగుతున్నారు. ఈ పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలపై తెలుగుదేశం పార్టీ ఏ మాత్రం దృష్టి సారించలేని పరిస్థితి ప్రస్పుటంగా కనిపిస్తోంది. బీజేపీపై ఢీ అంటే ఢీ అంటూ రానున్న సాధారణ ఎన్నికల్లో పోటీ చేస్తే కొంత మేర ప్రజల సానుభూతి పొందే అవకాశం ఉంది. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు వెళితే ఎంతో కొంత పార్టీకి లాభం చేకూరుతుందని, ఆ భావనతోనే స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు జిల్లాకు చెందిన ఓ ప్రజా ప్రతినిధి తెలియచేశారు. పంచాయతీ పాలకవర్గాల పదవీ కాలం ముగిసిన తర్వాత ప్రత్యేక అధికారుల పాలన తీసుకురానున్నట్టు సమాచారం. ప్రస్తుత పంచాయతీ పాలకవర్గాలు బాధ్యతల స్వీకరణకు ముందు ప్రత్యేక అధికారుల పాలనే సాగింది. బీసీ రిజర్వేషన్లు ఖరారు కాకపోవటంతో 2011వ సంవత్సరంలో నిర్వహించాల్సిన ఎన్నికలను అప్పటి ప్రభుత్వం వాయిదా వేసి ప్రత్యేక అధికారులను నియమించింది. 2011 నుండి 2013 జులై వరకు ప్రత్యేక అధికారుల పాలనే సాగింది. మళ్లీ ప్రత్యేక అధికారుల పాలన సాగించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుందామని స్థానికంగా ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న ఆశావహుల్లో నిరాశ నిస్పృహలు వ్యక్తమవుతున్నాయి.

సాంకేతిక వనరులను సద్వినియోగం చేసుకోండి
మైలవరం, మార్చి 20: కృష్ణా మిల్క్ యూనియన్ ఆధ్వర్యంలో అమలయ్యే సాంకేతిక వనరులను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సంస్థ చైర్మన్ మండవ జానకిరామయ్య అన్నారు. స్థానిక మారుతీ కల్యాణ మండపంలో కృష్ణా మిల్క్ యూనియన్, జాతీయ పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు చెందిన పాల ఉత్పత్తిదారులకు కృష్ణా మిల్క్ యూనియన్ ఆధ్వర్యంలో అనేక సాంకేతిక వనరులు అందిస్తున్నట్లు తెలిపారు. పాల ఉత్పత్తిదారులు పరిశుభ్రమైన పాల ఉత్పిత్తికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. పశువులకు ప్రాధమిక దశలో ఉన్నటువంటి పొదుగువాపు నిర్ధారణ దాని నివారణ, ఆయుర్వేద వైద్య విధానం ద్వారా పొదుగు వాపు నివారణ, ఏలికపాముల నివారణ, పశువులకు ఇన్సూరెన్స్ సౌకర్యం, నూతన పశుగ్రాసాలు, వాటి సాగు గురించి వివరించారు. సమతుల్య పోషకాహార పధకంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే దాసరి వెంకట బాలవర్థనరావు, కృష్ణామిల్క్ యూనిట్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ టి బాబూరావు, జిల్లా పాలకవర్గ సభ్యులు పి కొండలరావు, నెక్కళపు వాణిశ్రీ, పి స్వర్ణ కుమారి, సంస్థ జనరల్ మేనేజర్ ఎన్ జగన్మోహనరావు, డైరెక్ట్ రూట్స్ మేనేజర్ కె ప్రసాద్, ఐసిఐసిఐ బ్యాంక్ మేనేజర్ రామకృష్ణ, స్థానిక యూనియన్ బ్యాంక్ మేనేజర్ నరశింహారావు, ఉద్యానవన శాఖాధికారి ఎన్ అశోక్, సూపర్‌వైజర్స్‌తోపాటు ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన సుమారు 350 మంది పాల ఉత్పత్తిదారులు పాల్గొన్నారు.