కృష్ణ

అన్నదాతలకు అల్ప‘పీడ’నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తోట్లవల్లూరు, నవంబర్ 30: వాతావరణంలో మార్పులు వరి రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. పంటలను కోసిన రైతులు పనలను నూర్పిడి చేసుకుని ధాన్యాన్ని ఇంటికి చేర్చుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఆదరాబాదరాగా.. ఉరుకులు..పరుగుల మీద పనులు పూర్తి చేస్తున్నారు. ఇటీవల కొన్నిరోజుల క్రితం కురిసిన వర్షాలకు పంటలు కొంతమేర తడవటంతో రైతులు అవస్థలపాలయ్యారు. కొంత మంది రైతులు వరిచేలు కోసి పనలపై ఉంచారు. కోసిన వరిచేలు నాలుగైదు రోజుల తర్వాత కుప్ప వేయడమో లేదా నూర్పిడి చేయడమో చేస్తామన్న తరుణంలో అల్పపీడనం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. వాతావరణ మేఘావృతం కావడంతో పనలపై ఉన్న పంటలను కుప్పలు వేసేందుకు రైతులు ఉరుకులు..పరుగులు పెడుతున్నారు. ఆదివారం రాత్రి ఉన్న చినుకులు పడటంతో రైతుల గుండెల్లో రైళ్లు పరుగెత్తాయి. దీంతో సోమవారం కొంత మంది రైతులు ఉరుకులు..పరుగులతో మండలంలోని పలు గ్రామాల్లో వరి మిషన్‌లు తీసుకు వచ్చి కోయించి ధాన్యాన్ని ట్రాక్టర్లు ద్వారా ఇంటికి జారవేసి వారి ఖాళీ ప్రదేశాలలో ఆరబోసి పరజాలు కప్పుతున్నారు. వరికోత కొయాలంటే కూలీలు ఎకరానికి రూ.4వేలు నుంచి రూ.4500లు తీసుకుంటున్నారు. మళ్ళీ కుప్ప వేయించటానికి ఎకరానికి రూ.2వేలు తీసుకుంటున్నారు. అదే వరి మిషన్‌తో కొతకోస్తే గంటకు రూ.2200లు తీసుకుంటున్నారు. ఎకరం వరి కొయటానికి గంటన్నర సమయం పడుతోంది. అదే నేల వాలిన వరి కోయాలంకే రూ.2400లు తీసుకుంటున్నారు. దానికి రెండు గంటలు సమయం పడుతోందని రైతులు తెలిపారు. కొంత మంది రైతులు వరిపంటను మిషన్‌తో కొయించి రోడ్లపైనే గుట్టలుగా ఆరబోశారు. ఇదే అదునుగా కూలీల కొరతతో కూలిరేట్లు అమాంతంగా పెరిగాయి. మండలంలోని వల్లూరుపాలెం, గరికపర్రు తదితర గ్రామాల్లో 50 శాతం కోతలు పూర్తి అయ్యాయి. రెండు రోజులుగా వాతావరణ మార్పులతో కూలిరేట్లుకు డిమాండ్ పెరిగింది. మగవారికి రూ.400 నుంచి రూ.500లు, మహిళా కూలీలకు రూ.300 నుంచి రూ.350 వరకు ఉండే కూలీ రేటు ప్రస్తుతం మగవారికి రూ.700లు, మహిళలకు రూ.500 వరకు డిమాండ్ చేస్తున్నారు. తొలకరి సాగు ప్రారంభంలో వర్షాభావ పరిస్థితులు, పంట చేతికందే సమయంలో అకాల వర్షాల వల్ల రైతులకు పెట్టుబడి తడిసిమోపెడయ్యింది. ఇప్పుడు కూలిరేటు పెరిగి రైతులు నానా అవస్థలు పడుతున్నారు. బస్తా ధాన్యం రూ.1050 ఉండగా, కూలి రూ.700 చెల్లిస్తే తమకు మిగిలేదేముంటుందని, పెట్టుబడి కూడా రాదని రైతులు వాపోతున్నారు. నష్టాల్లో ఉన్న రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

వెటర్నరీ పాథాలజీ కాంగ్రెస్-2015 జాతీయస్థాయి సదస్సు
గన్నవరం, నవంబర్ 30: పశువులు, పక్షులు, చేపలకు వచ్చే వ్యాధుల నిర్ధారణలో వస్తున్న నూతన ఆవిష్కరణలపై చర్చించడానికి గన్నవరం ఎన్టీఆర్ వెటర్నరీ కళాశాలలో వెటర్నరీ పాథాలజీ కాంగ్రెస్-2015 జాతీయస్థాయి 32వ సదస్సు నిర్వహిస్తున్నట్లు సదస్సు కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ వేమూరి రమాదేవి తెలిపారు. స్థానిక వెటర్నరీ కళాశాలలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ డిసెంబర్ 3,4,5 తేదీల్లో మూడురోజులపాటు జరిగే ఈ సదస్సులో దేశ, విదేశాలకు చెందిన 300 మంది శాస్తవ్రేత్తలు పాల్గొని పరిశోధనా పత్రాలు సమర్పిస్తారని ఆమె చెప్పారు. పశువులు, పక్షులు, చేపలకు, కోళ్లకు వచ్చే వివిధ రకాల వ్యాధుల నిర్ధారణలో వస్తున్న నూతన ఆవిష్కరణలు, సమస్యల గూర్చి, సుదీర్ఘ చర్చ సదస్సు ప్రధాన లక్ష్యం అన్నారు. అందులో కీలక భూమిక పోషిస్తున్న పాథాలజీ విభాగ శాస్తవ్రేత్తలు ఈ రంగంలో ఎదురయ్యే ప్రధాన సమస్యలు, పోషించాల్సిన పాత్ర గురించి సదస్సులో చర్చిస్తామన్నారు. వ్యాధుల లక్షణాలు, వ్యాధికారక క్రిముల్లో జరిగే పరివర్తనలు, కొత్తగా రూపాంతరం చెంది, తీవ్రమైన వ్యాధులుగా మారడం జరుగుతుందన్నారు. గన్నవరం వెటర్నరీ కళాశాల డీన్ సదస్సు ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ కావూరి సదాశివరావు మాట్లాడుతూ డిసెంబరు 3వ తేదీ 9 గంటలకు విజయవాడ హోటల్ కేలో తిరుపతి శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ మన్మోహన్‌సింగ్ ప్రారంభిస్తారని చెప్పారు. 4,5 తేదీల్లో గన్నవరం వెటర్నరీ కళాశాలలో జాతీయస్థాయి సదస్సు జరుగుతుందన్నారు. డాక్టర్ రవికుమార్, డాక్టర్ అన్నపూర్ణ, డాక్టర్ సతీష్ తదితరులు పాల్గొన్నారు.

పిచ్చికుక్క దాడిలో 15 మందికి తీవ్రగాయాలు
జగ్గయ్యపేట, నవంబర్ 30: పట్టణంలోని పదవ వార్డులో సోమవారం వీధి కుక్క స్వైర విహారం చేసి సుమారు 18 మందిని గాయపర్చింది. కాగితాల బజారు, రామాలయం వీధి, మార్కండేయ బజారు తదితర ప్రాంతాల్లో ఉదయం 10గంటల ప్రాంతంలో వీధిలో అడుకుంటున్న చిన్నారులను కరవడం ప్రారంభించిన పిచ్చి కుక్క అక్కడివారు తరుముతుండటంతో సుమారు మూడు నాలుగు వీధుల్లో కనిపించిన వారందరినీ కరిచింది. సుమారు 18 మందికి తీవ్ర, స్వల్ప గాయాలు అయ్యాయి. బాధితులు 12 మంది ప్రభుత్వ వైద్యశాలకు రాగా యాంటీ రాబిన్ వ్యాక్సిన్ ఇచ్చినట్లు డాక్టర్ వెంకటేశ్వరరావు తెలిపారు. విషయం తెలియగానే చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు గాయపడిన సత్య కౌండిన్యను పరామర్శించారు. కుక్కదాడి వార్త పట్టణంలో వ్యాపించడంతో పలు వార్డులో ప్రజలు భయ బ్రాంతులయ్యారు.
కాలువలో పడి వ్యవసాయ కూలీ మృతి
గుడ్లవల్లేరు, నవంబర్ 30: బహిర్భూమికి వెళ్ళిన వ్యవసాయ కూలీ ప్రమాదవశాత్తు కాలు జారి కాలువలో పడి మృతి చెందిన సంఘటన ఇది. పోలీసుల సమాచారం మేరకు పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం మంచిలి గ్రామానికి చెందిన గూడూరు మార్కండేయులు (30) నిల్వ కూలీగా ఇటీవల అంగలూరు గ్రామానికి వచ్చాడు. ఆదివారం మధ్యాహ్నం బహిర్భూమికి వెళుతున్నట్లు సహచర కూలీలకు చెప్పి వెళ్ళి ప్రమాదవవాత్తు కాలు జారి కాలువలో పడిపోయాడు. దీనిపై గాలింపు చర్యలు చేపట్టగా సోమవారం సాయంత్రం పాలకోడూరు కాలువలో మార్కండేయులు మృతదేహం లభించిందని ఎఎస్‌ఐ సుబ్బారావు తెలిపారు.
చిరుజల్లులకు నిలిచిన వరి కోతలు
కూచిపూడి, నవంబర్ 30: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో సోమవారం చిరు జల్లులు పడ్డాయి. వరి పంట రక్షణకు అన్నదాతలు ప్రాధాన్యతనిచ్చారు. వర్షం కారణంగా వరి కోతలు పలు గ్రామాల్లో వాయిదా వేశారు. యంత్రాలు బురదలో కూరుకుపోతాయని అందువల్ల కోతలు నిలిపి వేశారు. దాదాపు 48 గంటలు వర్షం కురుస్తుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలకు అనుగుణంగా నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కూడా తేలికపాటి వర్షాలు కురిసాయి. అధిక వ్యయ ప్రయాసలతో సాగు చేసి పండించిన పంట ఇటీవల కురిసిన వర్షాలకు నేలవాలటంతో దిగుబడులు తగ్గుతాయని దిగాలు పడుతున్న రైతులకు ఈ వర్షాలు గోరుచుట్టుపై రోకటి పోటు అన్న చందంగా తయారయ్యాయి. పచ్చిగా ఉన్న వరి పనలను సైతం యుద్ధ ప్రాతిపదికన కుప్పలు వేయసాగారు. చెదురు మదురు వర్షంతో నిలిచిపోతే సరి లేదా 2011 డిసెంబర్ నాటి పరిస్థితులు ఎదురయ్యే ప్రమాదం ఉంటుందని రైతులు వాపోతున్నారు.