కృష్ణ

దేశంలో ప్రస్తుతం ఎక్కడా ప్రత్యేక హోదాకు అవకాశమే లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 22: ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే కాదు భారతదేశంలో ఏ రాష్ట్రానికి కూడా ప్రస్థుతం ప్రత్యేక హోదా అవకాశమే లేదని కేంద్ర మంత్రి రావు ఇంద్రజిత్‌సింగ్ యాదవ్ స్పష్టం చేశారు. అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు లాకా వెంగళరావు యాదవ్ నిర్వహించే యాదవ మహాసభ కార్యక్రమంలో పాల్గొనే నిమిత్తం అదివారం నగరానికి చేరుకున్న మంత్రి తొలుత బిజెపి రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమ్ముల శ్యాంకిషోర్, ఎంపి గోకరాజు గంగరాజు అధికార ప్రతినిధి ఉప్పలపాటి శ్రీనివాస రాజు, మీడియా ప్రతినిధి దిలీప్ తదితరులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా ఏ కార్యక్రమంలో పాల్గొనటానికి వెళ్లినా ముందుగా పార్టీ కార్యాలయాన్ని సందర్శించాలనేది పార్టీ అధిష్టాన నిర్ణయమని అన్నారు. ఇక్కడి కార్యాలయం పనితీరు భేషుగ్గా ఉందన్నారు. ఎపికి ప్రత్యేక హోదా విషయమై ప్రస్తావించగా కేంద్రం ఎటూ ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది కదా అన్నారు. ఒక వేళ అనూహ్య పరిస్థితుల్లో ఏ రాష్ట్రానికైనా ప్రత్యేక హోదా ఇవ్వాల్సి వస్తే ముందుగా ఆ హోదా ఎపికే దక్కుతుందన్నారు.

జల్లికట్టు ఉద్యమ స్ఫూర్తితో
హోదా కోసం పోరు
* వేదిక రాజకీయాలకతీతంగా కృష్ణాతీరం.. లేదా విశాఖ బీచ్
* ఎపి ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి నేతలు

విజయవాడ, జనవరి 22: ఆంధ్రుల చిరకాల వాంఛ ప్రత్యేక హోదా కోసం పొరుగునున్న తమిళనాడులో తాజాగా చోటుచేసుకున్న జల్లికట్టు ఉద్యమ స్ఫూర్తితో కేంద్రంతో తాడో పేడో తేల్చుకునేలా ఉద్యమాన్ని చేపట్టాల్సిన సమయం ఆసన్నమైందంటూ ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి నేతలు పిలుపునిచ్చారు. రాజకీయాలకతీతంగా కృష్ణాతీరం లేదా విశాఖ బీచ్‌లో ఇక ప్రత్యక్ష పోరు సాగించడానికి త్వరలోనే కార్యాచరణను రూపొందించుకోవాల్సి వుందన్నారు. తాజాగా వీరాభిమానుల నుంచి రూ.200 కోట్లు కొట్టేసిన ఖైదీ చిరంజీవి, శాతకర్ణి బాలకృష్ణ ప్రజల రుణం తీర్చుకోటానికై తమిళ నటులు కమలహాసన్, రజనీకాంత్ వంటివారిని చూసైనా సిగ్గు తెచ్చుకుని పోరుబాట పట్టాలన్నారు. తమ స్వార్ధ వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాలు మినహా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక్కసారైనా ప్రధాని నరేంద్రమోదీతో మాట్లాడే దమ్ము, ధైర్యం లేని పిరికిపందలు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, సిఎం చంద్రబాబునాయుడు అంటూ చరిత్రలో ముద్దాయిలుగా నిలుస్తారో లేదో తక్షణం వారిరువురూ తేల్చుకోవాల్సి వుందన్నారు. తమ ఉద్యమంలోకి పవన్ కల్యాణ్‌ను సైతం స్వాగతిస్తున్నామన్నారు. జల్లికట్టు ఉద్యమానికి సుప్రీం తీర్పును కూడా పక్కనబెట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగి రావటాన్ని యువత గుర్తెరగాలన్నారు. ఆదివారం నాడిక్కడ ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో దుగ్గరాజుపట్నంలో ఓడరేవు ఏర్పాటుకు ఏమైనా సమస్యలుంటే రామాయపట్నంలో చేపట్టాలనే ప్రజా ఉద్యమం పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఎలాంటి స్పందన లేదంటూ తమిళనాడులో కొల్లిచల్‌లో మూడో ఓడరేవు నిర్మాణానికి ప్రధాని మోదీ తాజాగా రూ.25వేల కోట్లు కేటాయించారని అన్నారు. అసలు విభజన చట్టంలోనే పోలవరానికి జాతీయ హోదా ఉంటే చంద్రబాబు మాత్రం ప్యాకేజీ కింద ఏదో సాధించానంటూ వంచిస్తున్నారని అన్నారు. అసలు ఈ ప్యాకేజీకి చట్టబద్దత చట్టుబండలు లేవన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తికి రూ.32వేల కోట్లు అవసరమైతే కేంద్రం రూ.1900 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుంటే 2018 నాటికి ఎలా పూర్తి కాగలదన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్రలోని వెనుకబడిన ఏడు జిల్లాల అభివృద్ధికి రూ.29వేల కోట్లను 8 శాతం వడ్డీతో చేపట్టాలని ప్రభుత్వం అంచనాలు రూపొందిస్తుంటే కేంద్రం రూ.1050 కోట్లు ముష్టి విదిల్చిందన్నారు. రూ.16వేల కోట్ల లోటు బడ్జెట్‌ను సరిచేయాల్సి వుంటే కేవలం రూ.4వేల కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుందని ఈ మొత్తాలు వడ్డీ చెల్లింపుకు కూడా సరిపోవన్నారు. సమితి ప్రధాన కార్యదర్శి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర విభజన చట్టం ఆమోదం పొందే సమయంలో నాటి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పాత్ర లేదా.. ప్రత్యేక హోదా పదేళ్లు కావాలని కోరలేదా అన్నారు. అయితే విభజన చట్టంలోని అంశాల అమలుకు ఆ నాయుడు ఈ నాయుడు ఎందుకు పోరాడటం లేదని ప్రశ్నించారు. బుందేల్‌ఖండ్ తరహాలో వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నిధులిస్తామంటూ జిల్లాకు రూ.50 కోట్లు చొప్పున ముష్టి విదులుస్తారా అన్నారు. వైకాపా అనుబంధ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.గౌతంరెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక హోదా పోరాటంలో ప్రతిపక్ష నేత జగన్ ముందుండగలరని అవసరమైతే చంద్రబాబు వెనుక కూడా నిలుస్తారని అన్నారు. సమావేశంలో సమితి సలహాదారు ఎఎన్‌యు విశ్రాంత వైస్‌ఛాన్సలర్ వియన్నారావు, సిపిఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ తదితరులు పాల్గొన్నారు.