కృష్ణ

పులకించిన సాగరతీరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, ఫిబ్రవరి 10: భక్తజన సందోహంతో సాగర తీరం పులకించింది. మాఘ శుద్ధ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం సాగర తీరం భక్తులతో పోటెత్తింది. జిల్లా కేంద్రం మచిలీపట్నం శివారు మంగినపూడి బీచ్‌తో పాటు కోడూరు మండలం హంసలదీవి సాగర సంగమం భక్తజన సందోహంతో కోలాహలంగా మారింది. జిల్లా నలుమూలల నుండే కాకుండా రాష్ట్ర నలుమూలల నుండి వేలాది మంది భక్తులు ఆయా సాగర తీరాలకు పవిత్ర సింధూ స్నానాలకు తరలివచ్చారు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అన్ని వయస్సుల వారు, అన్ని మతాల వారు భక్తిశ్రద్ధలతో సముద్ర స్నానాలు ఆచరించి కృష్ణమ్మ ఒడిలో పునీతులయ్యారు. గురువారం అర్ధరాత్రే వేలాది మంది భక్తులు హంసలదీవి చేరుకున్నారు. అనంతరం కృష్ణమ్మ సాగరుడిలో ఐక్యమయ్యే అతిపవిత్ర స్థలమైన హంసలదీవి సాగర సంగమానికి చేరుకుని వేకువజామున సుందరమైన సూర్యోదయ వేళ పుణ్య స్నానాలు ఆచరించారు. సాగరుడి చెంతన ఉన్న కృష్ణమ్మ పాదాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి తమ భక్తిప్రపత్తులు చాటుకున్నారు. అనంతరం సాగర సంగమంలో పవిత్ర పుణ్య స్నానాలు ఆచరించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆర్టీసి ప్రత్యేక సర్వీసులను నడిపింది. ఇటీవల కాలంలో కృష్ణానది కరకట్ట మీదుగా విజయవాడ నుండి అవనిగడ్డకు మినీ సర్వీసులను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సర్వీసులకు ప్రయాణికుల నుండి మంచి ఆదరణ లభించింది. సింధూ స్నానాలను పురస్కరించుకుని ప్రస్తుతం ఉన్న సర్వీసులకు అదనంగా మరో ఐదు సర్వీసులను ఆర్టీసి శుక్రవారం నడిపింది. అలాగే అవనిగడ్డ నుండి హంసలదీవి వరకు సుమారు 25 సర్వీసులతో భక్తులను చేరవేశారు. దీంతో ప్రైవేట్ వాహనాల జోరుకు బ్రేక్‌లు పడ్డాయి. అలాగే సముద్ర స్నానాలకు విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా బందరు ఆర్డీవో పి సాయిబాబు, డివిజనల్ పంచాయతీ అధికారి సత్యనారాయణ నేతృత్వంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. డాల్ఫిన్ భవనం నుండి వృద్ధులు, వికలాంగుల కోసం ప్రత్యేక వాహనాలను నడిపారు. మహిళలు సముద్ర స్నానాల అనంతరం దుస్తులు మార్చుకునేందుకు తాత్కాలిక డ్రెస్సింగ్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. అలాగే మంచినీటి సౌకర్యాన్ని కల్పించారు. సముద్రం పోటు మీద ఉన్న నేపథ్యంలో భక్తులు లోపల వరకు వెళ్లకుండా కట్టడి చేసేందుకు బారికేడ్లు ఏర్పాట్లు చేశారు. అలాగే బోట్లతో, గజ ఈతగాళ్లు సముద్రంలో పహరా కాశారు. సాగర సంగమంలో సుమారు 40 నుండి 50వేల మంది వరకు భక్తులు పుణ్య స్నానాలు ఆచరించినట్టు అధికార వర్గాల సమాచారం. అలాగే మంగినపూడి బీచ్‌లో 25 నుండి 30వేల మంది పైబడి పుణ్య స్నానాలు ఆచరించారు. ఎంపిడివో జివి సూర్యనారాయణ పర్యవేక్షణలో పంచాయతీ రాజ్, ఆర్‌డబ్ల్యుయస్, ఫిషరీస్, వైద్య ఆరోగ్య శాఖాధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

కాన్పులన్నీ ప్రభుత్వ వైద్యశాలలోనే జరగాలి
* వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ శామ్యూల్
మైలవరం, ఫిబ్రవరి 10: కాన్పులన్నీ ప్రభుత్వ వైద్యశాలలోనే జరిగే విధంగా వైద్యసిబ్బంది చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ శామ్యూల్ ఆనందకుమార్ ఆదేశించారు. నులిపురుగు నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఆయన స్థానిక వైద్య విధాన పరిషత్‌ను ఆకస్మికంగా సందర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నులిపురుగు నివారణ మందును అందరికీ సక్రమంగా పంపిణీ చేయాలన్నారు. ముఖ్యంగా అంగన్‌వాడీ సిబ్బంది ద్వారా దీని పంపిణీ జరగాలన్నారు. స్థానిక ఆసుపత్రిని పరిశీలించి సిబ్బంది పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. సిబ్బంది పనితీరు బాగోలేదన్నారు. ఆసుపత్రిలో రోగుల సంఖ్య లేకపోవటాన్ని ఆయన తప్పుబట్టారు. ముఖ్యంగా రక్తనమూనాల సేకరణపై అసంతృప్తిని వ్యక్తంచేశారు. సిబ్బంది అంకితభావంతో వ్యవహరిస్తూ ఎప్పటికప్పుడు రక్తనమూనాలు సేకరించి అదేరోజు రిపోర్టును అందించాలని ఆదేశించారు. అదేవిధంగా గర్భిణుల నమోదు, మాత శిశు మరణాల నిరోధానికి సిబ్బంది పనిచేయాలన్నారు. ప్రతి కాన్పూ ఆసుపత్రిలోనే జరిగే విధంగా సిబ్బంది చర్యలు తీసుకోవాలన్నారు. రోగులకు అవసరమైన మందులు అందించాలన్నారు. విలేఖర్లు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ నియామకంతో తమకు సంబంధం లేదన్నారు. దీనికి సంబంధించి ఏదైనా అర్జీ వస్తే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవటం జరుగుతుందన్నారు. ఆసుపత్రి అభివృద్ధికి సంబంధించి సిబ్బందికి ఆయన పలు సూచనలు, సలహాలు అందించారు. ఈకార్యక్రమంలో ఇన్‌చార్జ్ డీసిఎస్ సహనం, సిబ్బంది పాల్గొన్నారు.