కృష్ణ

బందరులో క్రీడా సంబరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, ఫిబ్రవరి 16: జిల్లా కేంద్రం మచిలీపట్నం హిందూ కళాశాల వేదికగా నవ్యాంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా నిర్వహిస్తున్న అఖిల భారత అంతర్ విశ్వవిద్యాలయాల విలువిద్య ఛాంపియన్‌షిప్ పోటీలు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. జిల్లాకే తలమానికంగా మారిన కృష్ణా విశ్వవిద్యాలయం ఈ పోటీలకు అతిథ్యమిచ్చింది. ఇప్పటికే నాలుగు సార్లు దక్షిణ మండల అంతర్ విశ్వవిద్యాలయాల పోటీలు నిర్వహించి కృష్ణా వర్సిటీ తన సత్తాను నలుదిశలా చాటింది. ఈ సంవత్సరం తొలిసారి అఖిల భారత అంతర్ విశ్వ విద్యాలయాల ఆర్చరి ఛాంపియన్ షిప్ పోటీలను నిర్వహించి జాతీయ స్థాయి క్రీడా పోటీలకు నవ్యాంధ్రప్రదేశ్‌ను వేదికగా మలిచింది. కృష్ణా విశ్వవిద్యాలయం స్థాపించిన ఆరేళ్లల్లోనే నాలుగు సార్లు దక్షిణ మండల స్థాయి పోటీలు నిర్వహించి నేడు అఖిల భారత అంతర్ విశ్వవిద్యాలయాల పోటీలు నిర్వహిస్తూ తన ఖ్యాతిని మరింత ఇనుమడింప చేసుకుంటోంది. టోర్నీల నిర్వహణలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని విశ్వవిద్యాలయం సంపాదించుకుంది. గత రెండు రోజులుగా హిందూ కళాశాలలో ఆర్చరీ పోటీలు ఎంతో ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగుతున్నాయి. దేశ వ్యాప్తంగా 98 విశ్వవిద్యాలయాల నుండి వెయ్యి మంది పైబడి క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొని తమ ప్రతిభా ప్రావీణ్యాన్ని కనబరుస్తున్నారు. తమ తమ విశ్వవిద్యాలయాలకు పతకం తీసుకురావటంతో పాటు ప్రపంచ స్థాయి అంతర్ విశ్వ విద్యాలయాల ఆర్చరీ పోటీల్లో పాల్గొనే భారత జట్టులో స్థానమే లక్ష్యంగా విల్లంబులను ఎక్కుపెడుతున్నారు. తొలిసారిగా మచిలీపట్నంలో నిర్వహిస్తున్న ఈ పోటీలను తిలకించేందుకు పలు విద్యాలయాల నుండి విద్యార్థులు, క్రీడాభిమానులు పెద్దఎత్తున తరలి వస్తున్నారు. దీంతో హిందూ కళాశాల క్రీడా మైదానం కోలాహలంగా మారింది. ఆంధ్రప్రదేశ్ ఆర్చరి అసోసియేషన్‌తో పాటు భారత ఆర్చరీ అసోసియేషన్ ప్రతినిధులు పోటీల నిర్వహణ సక్రమంగా జరిగేలా పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా విజయవాడకు చెందిన ఓల్గా ఆర్చరీ అకాడమీ కార్యదర్శి చెరుకూరి సత్యనారాయణ, రాష్ట్ర ఆర్చరీ సంఘం కోశాధికారి బొమ్మదేవర శ్రవణకుమార్, జిల్లా కోశాధికారి ప్రేమ్‌కుమార్, అకాడమీ కోచ్ చంద్రశేఖర్ లాగూరి, ప్రముఖ అంతర్జాతీయ క్రీడాకారిణి డా. మండవ రిషిత, కృష్ణా విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలల వ్యాయామ విద్య సంచాలకులు పోటీలను అణుక్షణం పర్యవేక్షిస్తున్నారు.

‘మడ’ మాస్టర్ ప్లాన్‌కు
కన్సల్టెన్సీలను ఆహ్వానించాం
* మంత్రి కొల్లు రవీంద్ర

మచిలీపట్నం, ఫిబ్రవరి 16: మచిలీపట్నం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (మడ) మాష్టర్ ప్లాన్ తయారీకి కన్సల్టెంట్లను ఆహ్వానించినట్లు రాష్ట్ర బిసి సంక్షేమం, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మండల పరిధిలోని తవిసిపూడి, మంగినపూడి గ్రామాల్లో గురువారం గ్రామసభలు నిర్వహించారు. ఓడరేవు నిర్మాణానికి ల్యాండ్ పూలింగ్‌లో భూములు ఇచ్చే రైతులకు ప్రభుత్వం అమలు చేయనున్న ప్యాకేజీపై రైతులకు అవగాహన కల్పించారు. తవిసిపూడి గ్రామంలో సుమారు 20 మంది సన్న, చిన్నకారు రైతులు, మంగినపూడి గ్రామంలో మెండు భానుమూర్తి అనే రైతు సుమారు 25 ఎకరాల భూమిని పూలింగ్ ద్వారా ప్రభుత్వానికి ఇచ్చేందుకు అంగీకార పత్రాలను మంత్రి రవీంద్ర, మడ వైస్ చైర్మన్ ఎం వేణుగోపాలరెడ్డిలకు అందజేశారు. వీరిని మంత్రి రవీంద్ర అభినందించారు. ఓడరేవు నిర్మాణానికి భూములను త్యాగం చేసిన రైతులను అన్ని విధాలా అభివృద్ధి పర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. మెరుగైన ప్యాకేజీతో పాటు ప్రభుత్వపరంగా అన్ని సదుపాయాలు కల్పించడం జరుగుతుందన్నారు. ఓడరేవు నిర్మాణంతో బందరుకు మహర్దశ పట్టనుందన్నారు. ఇప్పటికే మడ మాస్టర్ ప్లాన్ తయారీకి కన్సల్టెంన్సీలను ఆహ్వానించినట్లు తెలిపారు. విశాఖ-చెన్నై కారిడార్‌లో ఇండస్ట్రీయల్ నోడ్ కింద కేంద్ర ప్రభుత్వం మచిలీపట్నంను గుర్తించిందన్నారు. దీని వల్ల ఈ ప్రాంతానికి సుమారు రూ.3వేల కోట్ల మేర పెట్టుబడులు రానున్నాయన్నారు. సాగరమాల ప్రాజెక్టు కింద రహదారులు, జాతీయ రహదారుల అభివృద్ధి, కొత్త రైల్వే లైన్ల ఏర్పాటుకు మరో రూ.2వేలు కోట్ల పెట్టుబడులు వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు గొర్రెపాటి గోపిచంద్, కుంచే నాని, ఎంపిటిసి గరట రాజు, తహశీల్దార్ బి నారదముని తదితరులు పాల్గొన్నారు.
విజయ బ్యాంక్‌లో రోల్డ్ ‘గోల్డ్’మాల్
* బంగారు అభరణాలంటూ రూ.26లక్షలు మింగిన అప్రైజర్
* పోలీసులకు ఫిర్యాదు చేసిన బ్యాంక్ మేనేజర్

మచిలీపట్నం, ఫిబ్రవరి 16: జిల్లా కేంద్రం మచిలీపట్నంలోని మరో ప్రైవేట్ బ్యాంక్‌లో బంగారు కుంభకోణం వెలుగు చూసింది. గతంలో కెనరా బ్యాంక్‌లో బంగారు అభరణాల స్థానంలో రోల్డు గోల్డు అభరణాలు పెట్టి కోట్లలో బ్యాంక్ సొమ్మును ఆరగించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే విజయ బ్యాంక్ గోల్డ్ అప్రైజర్ శివకోటి వెంకట సంతోష్ కుమార్ ఇదే తరహా కుంభకోణానికి పాల్పడ్డాడు. బంగారు అభరణాలంటూ బ్యాంక్ అధికారులను నమ్మించి సుమారు రూ.26లక్షల మేర బ్యాంక్ నుండి రుణం తీసుకున్నాడు. బ్యాంక్‌లో మొత్తం 1421 గోల్డ్ లోన్ అకౌంట్లు ఉండగా అనుమానం వచ్చిన బ్యాంక్ మేనేజర్ రాజేశ్వరి గురువారం 566 ఖాతాలను తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో 15 ఖాతాల్లో బంగారు అభరణాలకు బదులుగా రోల్డ్ గోల్డ్ అభరణాలు ఉన్నట్లు గుర్తించి ఆర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. మేనేజర్ ఫిర్యాదు మేరకు గోల్డ్ అప్రైజర్ సంతోష్ కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ బాషా తెలిపారు.