కృష్ణ

తప్పని భంగపాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, మార్చి 6: ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ టిక్కెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేసిన సీనియర్ రాజకీయ నాయకులకు భంగపాటు తప్పలేదు. ఎమ్మెల్సీ టిక్కెట్‌కు జిల్లాలో తీవ్రమైన పోటీ నెలకొంది. ప్రస్తుతం టిక్కెట్‌ను కైవసం చేసుకున్న టిడిపి జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడుతో పాటు రాష్ట్ర హౌసింగ్ బోర్డు చైర్మన్ వర్ల రామయ్య, కైకలూరు మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ, పెనమలూరు నియోజకవర్గానికి చెందిన టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న గొట్టిపాటి రామకృష్ణ ఎమ్మెల్సీ టికెట్ కోసం తీవ్రమైన ప్రయత్నాలు చేశారు. విజయవాడ వెస్ట్ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే నాగూల్ మీరా కూడా తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ ఆయనకు రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తానని అధినేత చంద్రబాబు హామీ ఇచ్చినట్టు తెలిసింది. టిక్కెట్ ఆశించి భంగపాటుకు గురైన జయమంగళ, వర్ల, గొట్టిపాటి వర్గాలు తీవ్ర నిరాశ, నిస్పృహలకు గురయ్యారు. జయమంగళ వెంకట రమణ గత సాధారణ ఎన్నికల్లో టిడిపి-బిజెపి పొత్తుల కారణంగా కైకలూరు అసెంబ్లీ టిక్కెట్‌ను అధిష్ఠానం ఆదేశం మేరకు త్యాగం చేశారు. ఆ స్థానాన్ని బిజెపికి చెందిన డా. కామినేని శ్రీనివాస్‌కు ఇవ్వగా ఆయన విజయానికి జయమంగళ తీవ్రమైన కృషి చేసి విజయాన్ని అందించి పెట్టారు. ఆ సమయంలోనే జయమంగళ త్యాగాన్ని వృథా కానివ్వమని, ఎమ్మెల్సీ టిక్కెట్ ఇస్తామని అధిష్ఠానం హామీ ఇచ్చింది. ఇదే విషయాన్ని ఆయన ప్రతి సమావేశంలోనూ పార్టీ పెద్దల దృష్టికి తీసుకు వచ్చారు. ఇటీవల కాలంలో జయమంగళకు పార్టీలో ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది. దీంతో జయమంగళ తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ప్రతి సమావేశంలోనూ తన ఆవేదనను వెళ్లగక్కారు. ఈ విడత అయినా ఎమ్మెల్సీగా అవకాశం వస్తుందని ఆశించగా భంగపాటు తప్పలేదు. రాష్ట్ర హౌసింగ్ బోర్డు చైర్మన్‌గా వ్యవహరిస్తున్న వర్ల రామయ్య గత ఎన్నికల్లో పామర్రు నియోజకవర్గం నుండి పోటీ చేసి వైసిపి అభ్యర్థి ఉప్పులేటి కల్పన చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఆయనకు హౌసింగ్ బోర్డు చైర్మన్ పదవిని కట్టబెట్టారు. ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాల్లో నేపథ్యంలో వైసిపి ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన తెలుగుదేశం పంచన చేరారు. దీంతో రానున్న ఎన్నికల్లో వర్లకు ఎమ్మెల్యే టిక్కెట్ కేటాయింపుపై స్పష్టత కరువైంది. సిట్టింగ్ ఎమ్మెల్యే కల్పనకు అవకాశం ఇస్తే తన పరిస్థితి ఏమిటని, తనకు ఎమ్మెల్సీ టిక్కెట్ ఇవ్వాలని వర్ల రామయ్య అధిష్ఠానాన్ని కోరారు. ఆయన్ని బుజ్జగించేందుకు అధిష్ఠానం ఎమ్మెల్సీ టిక్కెట్ కేటాయింపుపై హామీ ఇచ్చింది. ఇదే కోవలో పెనమలూరు నియోజకవర్గానికి చెందిన టిడిపి రాష్ట్ర కార్యదర్శి గొట్టిపాటి రామకృష్ణ కూడా చేరారు. ఈయన కూడా గత సాధారణ ఎన్నికల్లో పెనమలూరు స్థానం ఆశించగా ఆ అవకాశం బోడే ప్రసాద్‌కు దక్కింది. న్యాయవాది అయిన రామకృష్ణ జిల్లాలో పార్టీకి న్యాయ సలహాదారుడిగా పనిచేశారు. ప్రతిపక్షంలో ఉన్న తొమ్మిదేళ్లలో న్యాయపరంగా పార్టీకి ఎన్నో సేవలు అందించారు. ఈయన కూడా ఎమ్మెల్సీ పదవికై తీవ్రంగా పోటీ పడ్డారు. చిట్ట చివరకు ఆ పదవి యాదవ సామాజిక వర్గానికి చెందిన బచ్చుల అర్జునుడును వరించింది.
వారంలో ఒక్క రోజన్నా సీట్లో కూర్చోలేరా..?
* గుడివాడ ఆర్డీవో, నందివాడ తహశీల్దార్‌పై జెసి మండిపాటు

మచిలీపట్నం, మార్చి 6: వారంలో ఒక రోజైనా మీమీ స్థానాల్లో కూర్చోలేకపోతున్నారు..? ఇంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తారా..? ప్రజా సమస్యల పరిష్కారానికి వారంలో ఒక రోజు కూడా కేటాయించలేకపోతున్నారా..? అంటూ జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు అధికారులపై మండిపడ్డారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ‘మీకోసం’లో ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన జెసి చంద్రుడు గుడివాడ ఆర్డీవో చక్రపాణి, నందివాడ తహశీల్దార్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇలపర్రు దళిత భూముల సమస్యపై అర్జీ ఇచ్చేందుకు సిపిఎం జిల్లా కార్యదర్శి ఆర్ రఘు, మరికొంత మంది దళితులు జెసిని కలిశారు. ఈ సమయంలో జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నందివాడ తహశీల్దార్‌ను పిలిచారు. ఆ సమయంలో తహశీల్దార్ లైన్‌లోకి రాకపోవటంతో గుడివాడ ఆర్డీవో రెస్పాన్స్ కావాలంటూ ఆదేశించారు. ఆ సమయంలో ఆర్డీవో చక్రపాణి కార్యాలయం తన సీటులో లేకపోవడం, జెసి పిలిచిన తర్వాత రావటంతో జెసి తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. మీకోసం జరుగుతున్న సమయంలో కార్యాలయంలో లేకుండా ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. ఆర్డీవో చక్రపాణి బయట అర్జీలు తీసుకుంటున్నాని సమాధానం ఇవ్వగా జెసి మరింత ఆగ్రహానికి గురయ్యారు. బయట అర్జీలు తీసుకోవడం ఏమిటని, కార్యాలయంలో ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఆ తర్వాత లైన్‌లోకి వచ్చిన నందివాడ తహశీల్దార్ బిఎస్‌ఎన్‌ఎల్ సిగ్నల్స్ సరిగ్గా లేకపోవటంతో లైన్‌లోకి రాలేకపోయానని చెప్పారు. ఈ సమాధానంపై కూడా జెసి మండిపడ్డారు. నీ కార్యాలయానే్న నువ్వు సరిగ్గా నడపలేనప్పుడు ప్రజల సమస్యలు ఎలా పరిష్కరిస్తావని ప్రశ్నించారు. చిన్న చిన్న సమస్యలను కూడా పరిష్కరించుకోలేకపోతున్నారా అంటూ తహశీల్దార్‌ను నిలదీసినంత పని చేశారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ ప్రతి సోమవారం నిర్వహించే మీకోసంకు ఎంపిడివో, తహశీల్దార్లతో పాటు అన్ని శాఖల అధికారులు విధిగా హాజరు కావాలని ఆదేశించారు. కుంటిసాకులు చెబితే సహించేది లేదని హెచ్చరించారు. తొలుత మీకోసం, జన్మభూమి అర్జీలపై సమీక్షించారు. గృహ నిర్మాణ శాఖలో అత్యధిక అర్జీలు పెండింగ్‌లో ఉండటంతో సంబంధిత అధికారిపై మండిపడ్డారు. స్పెషల్ డ్రైవ్ పెట్టి అర్జీలన్నింటినీ పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మడ వైస్ చైర్మన్ వేణుగోపాలరెడ్డి, డిఆర్‌ఓ రంగయ్య, డిఇఓ సుబ్బారెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఇడి సత్యనారాయణ, సిపిఓ రత్నబాబు, డిఆర్‌డిఎ పిడి చంద్రశేఖరరాజు, జెడ్పీ సిఇఓ దామోదర నాయుడు, బందరు ఆర్డీవో సాయిబాబు తదితరులు పాల్గొన్నారు.