కృష్ణ

కోర్టులో న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గన్నవరం, మార్చి 24: కోర్టులో తనకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని నగిరి ఎమ్మెల్యే ఆర్‌కె రోజా ఆశాభావం వ్యక్తం చేశారు. శుక్రవారం రోజా స్థానిక జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరయ్యారు. గతనెలలో పలువురు పోలీస్ ఉన్నత అధికారులపై ప్రైవేట్ కేసు వేసిన రోజా నేడు కోర్టు వాయిదాకు హాజరుకాగా న్యాయమూర్తి ఏప్రిల్ 12వ తేదీకి వాయిదా వేసినట్లు ఆమె చెప్పారు. అదేరోజు స్టేట్‌మెంట్ రికార్డు చేస్తామని చెప్పినట్లు తెలిపారు. 12వ తేదీన నా వాదన వినేందుకు న్యాయమూర్తి అంగీకరించారన్నారు. కోర్టులో న్యాయం జరుగుతుందన్న నమ్మకం తనకు ఉందన్నారు. తప్పు చేసినవారు ఎంతటి వారైనా కోర్టు దండిస్తుందనే నమ్మకం ఉందన్నారు. ఎమ్మెల్యే, సెలబ్రెటీనైన తననే పోలీసులు ఇంతటి భయభ్రాంతులకు గురిచేసి, కిడ్నాప్ చేసినట్లు రోజా చెప్పారు. సామాన్యులకు ఇటువంటి సంఘటన పునరావృతం కారాదనే ఉద్దేశ్యంతో తాను కోర్టును ఆశ్రయించినట్లు వైకాపా ఎమ్మెల్యే ఆర్‌కె రోజా స్పష్టం చేశారు.

‘మద్యం’ టెండర్లకు నోటిఫికేషన్
* గెజిట్‌లో 343 దుకాణాలు
* నేటి నుండి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరణ
* 31న మచిలీపట్నంలో లాటరీ

మచిలీపట్నం, మార్చి 24: సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు జిల్లాలోని మద్యం దుకాణాల టెండర్లకు శుక్రవారం గెజిట్ నోటిఫికేషన్ వెలువడింది. జిల్లాలో మొత్తం 343 మద్యం దుకాణాల టెండర్లకు జిల్లా కలెక్టర్ బాబు.ఎ గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేశారు. మచిలీపట్నం ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలో 175 దుకాణాలు, విజయవాడ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలో 168 దుకాణాలకు టెండర్లు ఆహ్వానించనున్నారు. సంబంధిత దుకాణాలకు ఈ నెల 25వతేదీ నుండి 30వతేదీ సాయంత్రం 5గంటల వరకు ఆన్‌లైన్‌లో ధరఖాస్తులు స్వీకరించనున్నారు. నామినేషన్ల పరిశీలన అనంతరం 31వతేదీ మధ్యాహ్నం 2గంటల నుండి జిల్లా కేంద్రం మచిలీపట్నంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో లాటరీ ద్వారా దుకాణాలను కేటాయించనున్నారు. దరఖాస్తుల పరిశీలన ఆయా ఎక్సైజ్ సూపరింటెండెంట్‌ల కార్యాలయాల్లో నిర్వహించనున్నారు. దరఖాస్తు ఫీజును కూడా ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉంటుంది. జూన్ నెలాఖరు వరకు లైసెన్సు గడువు ఉన్నప్పటికీ ఇటీవల సుప్రీం కోర్టు ఎక్సైజ్ చట్టంలో కొన్ని మార్పులు చేర్పులు చేసింది. జాతీయ రహదార్లకు 500 మీటర్ల లోపు ఉన్న మద్యం దుకాణాలను మార్చి 31వతేదీ లోపు తొలగించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో 282 మద్యం దుకాణాలు జాతీయ రహదార్లకు 500 మీటర్ల లోపు ఉన్నట్లు గుర్తించిన ఎక్సైజ్ అధికారులు సంబంధిత దుకాణదారులకు నోటీసులు ఇచ్చారు. అయితే వీరిలో 245 లైసెన్సుదారులు తమ దుకాణాలను 500 మీటర్లకు ఆవలకు మార్చుకునేందుకు ముందుకు వచ్చారు. ఈ దుకాణాలతో పాటు మిగిలిన దుకాణాలకు కూడా లాటరీ ద్వారా లైసెన్సులు మంజూరుకు దరఖాస్తులు స్వీకరించేందుకు ఎక్సైజ్ శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. నూతన ఎక్సైజ్ పాలసీ కారణంగా శ్లాబ్ ధరలు భారీగా తగ్గనున్నాయి. గతంలో ఆరు రకాల శ్లాబ్‌లు ఉండేవి. రూ.30లక్షల నుండి 65లక్షల మేర ఆయా శ్లాబ్‌లకు ధర నిర్ణయించారు. అయితే నూతన ఎక్సైజ్ పాలసీ ప్రకారం శ్లాబ్ ధరలు పతనం కానున్నాయి. మండలాన్ని ఒక యూనిట్‌గా, మున్సిపాల్టీ, నగర పంచాయతీలను ఒక యూనిట్‌గా, కార్పొరేషన్‌ను ఒక యూనిట్‌గా పరిగణించి రిజిస్ట్రేషన్ ఫీజును నిర్ణయించారు. మండలం యూనిట్‌కు రూ.50వేలు, మున్సిపాల్టీ, నగర పంచాయతీల్లో రూ.75వేలు, కార్పొరేషన్‌లో లక్ష రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజుగా నిర్ణయించారు. దరఖాస్తు ఫీజును రూ.5వేలుకు పరిమితం చేశారు.

బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లుగా చెరువులు

మైలవరం, మార్చి 24: మైలవరం నియోజకవర్గంలో దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న చెరువులను బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లుగా మార్చటానికి రంగం సిద్ధమైంది. ఎన్నోదశాబ్దాలుగా చెరువులను బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లుగా మార్చాలని రైతులు కోరుతున్న విషయం తెలిసిందే. దీనికి స్పందించిన స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సంబంధిత ఇరిగేషన్ అధికారులను సర్వేకు పంపారు. దీంతో శుక్రవారం ఇరిగేషన్ అధికారులు ఎనె్నస్పీ ఈఈ అర్జునరావు, స్పెషల్ డివిజన్ ఈఈ పి వెంకటరమణ, డిఈలు శ్యాంప్రసాద్, ఆనంద్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోమటి సుధాకర్, మంత్రి ప్రతినిధి యలమంచిలి శ్రీనివాస్, బి సుధాకర్, పలువురు రైతులు స్థానిక పార్టీ కార్యాలయంలో సమావేశమై చర్చించారు. అంతకు ముందు వీరంతా మండలంలోని వెల్వడం పడమర చెరువు, మోదుగల చెరువు, పొందుగలలోని పంగిడి చెరువు, చండ్రగూడెం చెరువు, మొర్సుమిల్లి చెరువు, రెడ్డిగూడెం మండలంలోని రంగాపురం పెద్ద చెరువులను పరిశీలించారు. ఈచెరువులను బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లుగా మార్చాలనే ప్రతిపాదనను పరిశీలించి రైతులతో చర్చించారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ ఏప్రిల్ మొదటి వారంలో ఈచెరువులకు సంబంధించిన సర్వే పనులు ప్రారంభించటం జరుగుతుందన్నారు. మొదటి వారంలో సర్వే పనులు పూర్తి చేసి ప్రతిపాదనలు సిద్ధం చేసి, అనంతరం టెండర్లను పిలుస్తారన్నారు. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆదేశాల మేరకు నియోజకవర్గంలో ఇవి కాకుండా మరో 20 చెరువులున్నాయని అవి వాటిని కూడా రిజర్వాయర్లుగా మార్చే ప్రతిపాదనలు పరిశీలించటం జరుగుతుందన్నారు. ఈచెరువులను రిజర్వాయర్లుగా మార్చటం వల్ల వర్షాలతో సంబంధం లేకుండా పంటలు పండే అవకాశం ఉందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్ళుగా తాము కన్న కలలు నిజం కాబోతున్నాయని వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.