కృష్ణ

జిల్లా అభివృద్ధికి పటిష్ఠమైన ప్రణాళిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, ఏప్రిల్ 21: పటిష్ఠమైన ప్రణాళికలతో జిల్లాను అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళతానని శుక్రవారం జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన బాలయ్య నాయుడు లక్ష్మీకాంతం అన్నారు. జిల్లా కేంద్రం మచిలీపట్నం కలెక్టరేట్‌లో సాయంత్రం 5గంటల 5నిమిషాలకు బాధ్యతలు స్వీకరించిన ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. జిల్లా నైసర్గిక, భౌగోళిక స్థితిగతులు, ఆర్థిక, సామాజిక పరిస్థితులను బేరీజు వేసుకుని చక్కటి ప్రణాళికలతో జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తానన్నారు. ఇప్పటికే వృద్ధి రేటులో జిల్లా గణనీయమైన అభివృద్ధి సాధించిందని దీన్ని కొనసాగించేందుకు శక్తివంచన లేకుండా పని చేస్తానన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్‌కు అనుకూలంగా 2022 నాటికి రాష్ట్రాన్ని మూడు ముఖ్యమైన రాష్ట్రాల సరసన నిలబెట్టడంతో పాటు 2029 నాటికి భారతదేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తామన్నారు. 2050 నాటికి ప్రపంచంలోనే అగ్రగామి దేశాల్లో రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్థానానికి తీసుకువెళతామన్నారు. అవకాశాలను అందిపుచ్చుకుంటూ జిల్లా అభివృద్ధికి దోహదపడతానని పేర్కొన్నారు. వ్యవసాయం, పారిశ్రామిక, సేవా రంగాల్లో నూరు శాతం ఫలితాలు సాధించిన నాడే జిల్లా అన్ని విధాలా అభివృద్ధి సాధిస్తుందన్నారు. రాజధాని ప్రాంతమైన కృష్ణాజిల్లాలో అభివృద్ధి శరవేగంగా జరుగుతుందన్నారు. ఇందు తన వంతు కృషి ఉంటుందన్నారు. బందరు ఓడరేవు, గన్నవరం విమానాశ్రయం విస్తరణ, దుర్గ గుడి, బెంజి సర్కిల్ ఫ్లై ఓవర్ బ్రిడ్జిలు తదితర మేజర్ ప్రాజెక్టులను సత్వరం పూర్తయ్యేలా కృషి చేస్తానన్నారు. 970 గ్రామ పంచాయతీలకు గాను ఇప్పటికే 480 గ్రామ పంచాయతీలను బహిరంగ మల విసర్జన రహిత గ్రామాలుగా ప్రకటించడం జరిగిందన్నారు. రానున్న రెండు నెలల్లో నూరు శాతం గ్రామాలను ప్రకటించే విధంగా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను వేగవంతం చేస్తామన్నారు. నీటి సంరక్షణ ఉద్యమంలో భాగంగా ప్రతి శివారు గ్రామానికి మంచినీటి వసతి కల్పించి నీటి ఎద్దడి లేకుండా చూస్తామన్నారు. అలాగే పశువుల దాహార్తిని తీర్చేందుకు నీటి తొట్టెల నిర్మాణానికి చర్యలు తీసుకుంటానన్నారు. రానున్న మూడు నెలలు నీరు-ప్రగతి కార్యక్రమంపై దృష్టి సారించనున్నట్లు కలెక్టర్ లక్ష్మీకాంతం వివరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు, జిల్లా పోలీసు సూపరింటెండెంట్ విజయకుమార్, దుర్గగుడి ఇఓ సూర్యకుమారి తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌గా లక్ష్మీకాంతం బాధ్యతల స్వీకరణ
* ఘన స్వాగతం పలికిన జిల్లా యంత్రాంగం

మచిలీపట్నం, ఏప్రిల్ 21: కృష్ణా జిల్లా కొత్త కలెక్టర్‌గా బాలయ్య నాయుడు లక్ష్మీకాంతం శుక్రవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల జరిగిన ఐఎఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా అనంతపురం జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పని చేస్తున్న లక్ష్మీకాంతంను జిల్లా కలెక్టర్‌గా ప్రభుత్వం బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు కలెక్టర్‌గా వ్యవహరించిన బాబు.ఎను బదిలీ చేసినా ఇంకా పోస్టింగ్ ఇవ్వలేదు. శుక్రవారం కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించేందుకు కలెక్టరేట్‌కు వచ్చిన లక్ష్మీకాంతంకు జిల్లా అధికార యంత్రాంగం ఘన స్వాగతం పలికింది. జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు, కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య సుంకరి రామకృష్ణారావు, విజయవాడ దుర్గ గుడి కార్యనిర్వహణాధికారిణి సూర్యకుమారి, మచిలీపట్నం అర్బన్ డెవలప్‌మెంట్ అధారిటీ వైస్ చైర్మన్ వేణుగోపాలరెడ్డి, జిల్లా పోలీసు సూపరింటెండెంట్ జి విజయ్ కుమార్, విజయవాడ ఎక్సైజ్ డెప్యూటీ కమిషనర్ సత్యప్రసాద్, విజయవాడ ఎక్సైజ్ ఇఎస్ మురళీధర్, బందరు ఆర్డీవో సాయిబాబు, జెడ్పీ ఇన్‌ఛార్జ్ సిఇఓ ఎన్‌వివి సత్యనారాయణ, సోషల్ వెల్ఫేర్ జెడి ప్రసాద్, డిఇఓ ఎ సుబ్బారెడ్డి, బిసి వెల్ఫేర్ డిడి యుగంధర్, డియస్‌ఓ నాగేశ్వరరావు, డియంఅండ్‌హెచ్ డా. కామేశ్వర ప్రసాద్, వికలాంగుల సంక్షేమ శాఖ ఎడి నారాయణరావు, బిసి కార్పొరేషన్ ఇడి పెంతోజీరావు, డియల్‌పిఓ సత్యనారాయణ, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జయకుమార్, డ్వామా పిడి రాజగోపాల్, హౌసింగ్ పిడి శరత్ కుమార్, రెవెన్యూ సర్వీసెస్ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్, కలెక్టరేట్ యూనిట్ అధ్యక్షుడు కె విక్టర్ పాల్ తదితరులు కలెక్టర్‌ను కలిసి అభినందనలు తెలిపిన వారిలో ఉన్నారు.

నేడు బందరుకు గవర్నర్ నరసింహన్ రాక
* ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ లక్ష్మీకాంతం

మచిలీపట్నం, ఏప్రిల్ 21: గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ శనివారం జిల్లా కేంద్రం మచిలీపట్నం రానున్నారు. కృష్ణా విశ్వవిద్యాలయంలో నిర్వహించనున్న విశ్వవిద్యాలయం చతుర్ధ స్నాతకోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. తెలుగు భాషా, సంస్కృతిక వికాసానికి కృషి చేస్తున్న శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌కు విశ్వ విద్యాలయం తరఫున గౌరవ డాక్టరేట్‌ను గవర్నర్ ప్రదానం చేయనున్నారు. అలాగే తొమ్మిది మంది పిహెచ్‌డి విద్యార్థులకు, వివిధ అంశాల్లో ప్రతిభకనబర్చిన నలుగురికి గోల్డ్ మెడల్స్‌ను అందించనున్నారు. గవర్నర్ పర్యటన ఏర్పాట్లను శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ బి లక్ష్మీకాంతం పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు, జిల్లా పోలీసు సూపరింటెండెంట్ జి విజయ్ కుమార్, ఆర్డీవో సాయిబాబు గవర్నర్ పర్యటన ఏర్పాట్లను కలెక్టర్‌కు వివరించారు. గవర్నర్ నరసింహన్ శనివారం ఉదయం 8.20ని.లకు హైదరాబాద్ నుండి విమానంలో బయలుదేరి 9.15ని.లకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. 9.25ని.లకు అక్కడి నుండి బయలుదేరి 9.55ని.లకు కృష్ణా విశ్వ విద్యాలయానికి చేరుకుంటారు. 11గంటల నుండి 12.40ని.ల వరకు విశ్వ విద్యాలయం స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొని మధ్యాహ్నం 1.20ని.లకు విశ్వ విద్యాలయం నుండి హెలికాఫ్టర్‌లో బయలుదేరి 1.50ని.లకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. 2.50ని.లకు విమానంలో బయలుదేరి హైదరాబాద్ వెళతారు.