కృష్ణ

ఇసుకాసురులపై విజిలెన్స్ కొరడా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం, సెప్టెంబర్ 12: ఇసుకను అక్రమంగా తరలిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ హెచ్చరించారు. ఆంధ్ర రాష్ట్రం నుండి ఇసుకను లారీల ద్వారా రహస్యంగా తెలంగాణ రాష్ట్రానికి తరలిస్తుండగా చాకచక్యంగా వలపన్ని పట్టుకున్న సంఘటన సంచలనమైంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఆయన మంగళవారం ఉదయం స్థానిక పోలీస్ స్టేషన్‌లో మీడియాకు వివరించారు. పేదవాడి సొంతింటి కలను నిజం చేయాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఇసుకను ఉచితంగా అందించటానికి నిర్ణయిస్తే దానిని కొందరు అక్రమార్కులు రకరకాల అక్రమ మార్గాల ద్వారా అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారని దీనిని దృష్టిలో ఉంచుకుని తమ శాఖ నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈనేపథ్యంలో గుంటూరు జిల్లా రాయపూడి ఇసుక రీచ్ నుండి గుంటూరు జిల్లాకు చెందిన, లారీలు, ఖమ్మం జిల్లాకు చెందిన లారీలు వెరశి మొత్తం ఐదు లారీల ద్వారా ఇసుకను తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం పట్టణానికి అక్రమంగా తరలిస్తుండగా సమాచారం అందుకున్న తమ సిఐ ఎస్‌కే అబ్దుల్ నబీ, జియాలజిస్ట్ బాలాజీ నాయక్‌తోపాటు మైలవరం సిఐ రామచంద్రరావు, ఎస్‌ఐ రామకృష్ణ మైలవరం మండలం మొర్సుమిల్లి వద్ద వలపన్ని పట్టుకున్నారు. ఒక్కొక్క లారీలో పాతిక టన్నుల ఇసుకను లోడ్ చేసి తరలిస్తున్నట్లు తెలిపారు. అక్రమంగా తరలిస్తున్న ఇసుక రెండు లక్షల రూపాయల పైబడి ఉంటుందని పేర్కొన్నారు. పట్టుకున్న లారీలను సీజ్ చేసి సంబంధిత యజమానులపై వాల్టా చట్టం కింద కేసులు నమోదు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. వీరిపై ఇంతకుముందు కూడా ఇటువంటి కేసులున్నట్లైతే వారిపై రౌడీషీట్ తెరుస్తామని తెలిపారు. పేదలకు ఉచితంగా ఇసుకను అందించాలన్న ప్రభుత్వ లక్ష్యం కొందరు అక్రమార్కుల కారణంగా నీరుగారి పోతుందని దీనిపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందన్నారు. ఇటీవల జిల్లాలోని చాట్రాయి మండలంలో సైతం ఇసుకను అక్రమంగా తరలిస్తుండగా ఐదు లారీలను సీజ్ చేసినట్లు తెలిపారు. పేదలకు ఉచితంగా అందాల్సిన ఇసుకను అక్రమార్కులు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో విజిలెన్స్ సీఐ నబీ, మైలవరం ఎస్‌ఐ రామకృష్ణ, సిఐ రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

యూరియా రూ.295 మంచి అమ్మితే కఠిన చర్యలు
* జాయింట్ కలెక్టర్(2) మార్కండేయులు
తోట్లవల్లూరు, సెప్టెంబర్ 12: ప్రైవేటు వ్యాపారులు గాని, సహకార సంఘాల్లో గాని ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్(2) మార్కండేయులు హెచ్చరించారు. మండలంలోని రొయ్యూరు, వల్లూరుపాలెం, నార్తువల్లూరు పిఎసిఎస్‌లు, వల్లూరుపాలెం ఎరువుల దుకాణంలో మంగళవారం జాయింట్ కలెక్టర్(2) తనిఖీలు నిర్వహించారు. జిల్లాలో యూరియా విక్రయంలో వ్యాపారులు రైతులను దోపిడి చేస్తున్నట్టు ఆరోపణలు రావటంతో కలెక్టర్ లక్ష్మీకాంతం ఆదేశాల మేరకు తనిఖీలు చేస్తున్నట్టు మార్కండేయులు తెలిపారు. తనిఖీ చేసిన మూడు పిఎసిఎస్‌లు, ప్రైవేటు దుకాణంలో రైతులను విచారించగా ఎలాంటి ఫిర్యాదులు రాలేదని జేసీ(2) అన్నారు. రూ.295కి మించి అమ్మితే అధికారులకు తెలియజేయాలని ఆయన రైతులకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో తహశీల్దార్ జి భద్రు, మండల వ్యవసాయాధికారి జివి శివప్రసాద్ ఉన్నారు.

పేదల సంక్షేమమే టిడిపి ధ్యేయం
* ఎమ్మెల్యే కాగిత
కృత్తివెన్ను, సెప్టెంబర్ 12: పేదల సంక్షేమమే తెలుగుదేశం పార్టీ ధ్యేయమని పెడన శాసనసభ్యుడు కాగిత వెంకట్రావ్ అన్నారు. మండల పరిధిలోని చెరుకుమిల్లి, మునిపెడ, ఎండపల్లి గ్రామాలలో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత పేదలకు పక్కా గృహాలు, పెన్షన్‌లు, రుణమాఫీ లాంటి ఎన్నో పథకాలను అమలు చేస్తున్నదన్నారు. రానున్న కాలంలో పేద ప్రజలకు సుపరిపాలన అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బూరగడ్డ వేదవ్యాస్, యువ నేత కాగిత కృష్ణప్రసాద్, ఎంపిపి వలవల సత్యనారాయణ, జెడ్పీటిసి ఒడుగు తులసీరావు, బిసి కార్పొరేషన్ డైరెక్టర్ బొల్లా వెంకన్న, మాజీ ఎఎంసి చైర్మన్ ఇల్లూరి సురేష్, డిసి చైర్మన్ నిక్కంటి విజయ భాస్కరరావు, పిన్నింటి రత్తయ్య, చంద్రాల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

అంగన్‌వాడీ హెల్పర్ల ధర్నా
కలిదిండి, సెప్టెంబర్ 12: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్‌వాడీ హెల్పర్స్ మంగళవారం 2వ రోజు స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఐసిడిఎస్‌ను ప్రైవేటీకరణ ప్రయత్నాలను ప్రభుత్వం విరమించుకోవాలని, అంగన్‌వాడీలకు వెంటనే పాత బకాయిలు విడుదల చేయాలని, పెన్షన్‌తో కూడిన రిటైర్‌మెంట్ బెనిఫిట్స్‌ను కల్పించాలని డిమాండ్ చేశారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహశీల్దార్‌కు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు డివిజన్ ఉపాధ్యక్షుడు డిటి మూర్తి చైతన్య, మండల కార్యదర్శి ఎస్‌కె అబిదా బేగం, అంగన్‌వాడీ హెల్పర్‌లు శ్యామల, గౌరీ, వెంకట నరసమ్మ, సుగుణమమ్మ, కృష్ణవేణి, ఎస్‌కె నజీరా, విక్టోరియా, మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

స్వచ్ఛ విద్యాలయ పక్షోత్సవాలు
కూచిపూడి, సెప్టెంబర్ 12: స్వచ్ఛ విద్యాలయ పక్షోత్సవాలలో భాగంగా మంగళవారం స్థానిక శ్రీ సిద్ధేంద్ర జెడ్పీ ఓరియంటల్ పాఠశాలలో స్కూల్ కాంప్లెక్స్ పరిధిలోని బార్లపూడి, పెదపూడి, చినముత్తేవి, కూచిపూడి గ్రామాలలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్వచ్ఛ భారత్‌పై వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. అనంతరం విజేతలైన విద్యార్థులకు బహుమతులు అంద చేశారు. హెచ్‌ఎం కొల్లి సత్య జగదీశ్వరరావు పర్యవేక్షణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాగోలు రమేష్‌బాబు, లలిత, శ్రీనివాసరావు, సుధాకరరావు, సిఆర్‌పి సమర్పణరావు పాల్గొన్నారు.