కృష్ణ

టిడిపి రాష్ట్ర కార్యవర్గంలో జిల్లాకు పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, సెప్టెంబర్ 23: తెలుగుదేశం పార్టీ జాతీయ, రాష్ట్ర నూతన కార్యవర్గంలో పెద్దపీట వేశారు. నారా లోకేష్ ప్రధాన కార్యదర్శిగా ఏర్పాటైన జాతీయ కార్యవర్గంలో ఉపాధ్యక్షుడిగా మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడు కొనకళ్ల నారాయణరావు నియమితులయ్యారు. కళా వెంకట్రావ్ అధ్యక్షుడిగా ఏర్పాటైన నూతన కార్యవర్గంలో మన జిల్లాకు సంబంధించి 11 మంది ప్రాతినిధ్యం వహించనున్నారు. వీరిలో ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ, ఇరువురు కార్పొరేషన్ చైర్మన్‌లు ఉన్నారు. ప్రధాన పదవుల్లో మన జిల్లా నేతలకు స్థానం లభించింది. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి మంత్రి పదవి కోసం ఎదురు చూస్తున్న పెడన నియోజకవర్గ శాసనసభ్యుడు, పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ చైర్మన్ కాగిత వెంకట్రావ్‌ను నూతన కార్యవర్గంలో ఉపాధ్యక్షుడిగా నియమించారు. గత పాలకవర్గంలో కార్యదర్శిగా కొనసాగిన కాగితను నూతన కార్యవర్గంలో ఉపాధ్యక్షుడిగా తీసుకున్నారు. పామర్రు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ అయిన వర్ల రామయ్యను ప్రధాన కార్యదర్శిగా నియమించారు. కార్యదర్శులుగా నలుగురికి అవకాశం లభించింది. పెడన పురపాలక సంఘం మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావుతో పాటు మైలవరంకు చెందిన కోమటి సుధాకర్, విజయవాడ ఈస్ట్ నియోజకవర్గానికి చెందిన జి వెంకట నారాయణ ప్రసాద్, విజయవాడ వెస్ట్ నుండి షబానా కాటూన్ నియమితులయ్యారు. రాష్ట్ర టిడిపి కార్యాలయ స్పోక్స్ పర్సన్‌లుగా పెనమలూరు నియోజకవర్గానికి చెందిన శాసనమండలి సభ్యుడు యలమంచలి బాబూ రాజేంద్ర ప్రసాద్, విజయవాడ నగర పాలక సంస్థ మాజీ మేయర్ పంచుమర్తి అనూరాధకు అవకాశం లభించింది. కార్య నిర్వాహక కార్యదర్శులుగా నందిగామ నియోజకవర్గానికి చెందిన కిలారు రాజేష్‌తో పాటు కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ, గతంలో టిడిపి జిల్లా అధ్యక్ష పదవిని ఆశించి భంగపడ్డ పెనమలూరు నియోజకవర్గానికి చెందిన గొట్టిపాటి వెంకట రామకృష్ణ ప్రసాద్‌ను నియమించారు.

15వ వార్డులో ‘ఇంటింటికి తెలుగుదేశం’
మచిలీపట్నం (కోనేరుసెంటర్), సెప్టెంబర్ 23: ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా శనివారం స్థానిక 15వ వార్డులో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర విస్తృతంగా పర్యటించారు. తొలుత జగన్నాధపురం సెంటరులోని దివంగత ఎన్టీ రామారావు విగ్రహానికి పూల మాలలు వేసి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. వార్డులోని అన్ని ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించిన మంత్రి ప్రజల నుండి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, టిడిపి పట్టణ అధ్యక్షుడు ఇలియాస్ పాషా, తెలుగు మహిళ పట్టణ అధ్యక్షురాలు లంకిశెట్టి వనజ, పార్టీ సీనియర్ నాయకుడు చిలంకుర్తి తాతయ్య, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ తలారి సోమశేఖర్, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ వంకా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

పందుల తరలింపునకు చర్యలు
మైలవరం, సెప్టెంబర్ 23: మైలవరం పట్టణంలో విచ్చలవిడిగా సంచరిస్తున్న పందుల నిర్మూలనపై పంచాయితీ పాలకవర్గం దృష్టి సారించింది. పగలు, రాత్రి తేడా లేకుండా విచ్చలవిడిగా సంచరిస్తున్న పందుల విషయమై ప్రజలనుండి వచ్చిన ఫిర్యాదులను పురస్కరించుకుని పాలకవర్గం సంబంధిత పందుల యజమానులకు నోటీసులు జారీ చేసింది. ఐనప్పటికీ యజమానులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించటంతో పాలకవర్గం స్వయంగా పంచాయితీ సిబ్బందిని రంగంలో దింపి పందులను పట్టుకుని దూరంలోని అడవులలో వదిలే కార్యక్రమాన్ని చేపట్టింది. శనివారం మొదలైన ఈకార్యక్రమాన్ని మైలవరం పట్టణంలో పందులు సంచరిస్తున్నంతకాలం కొనసాగుతోందని కార్యదర్శి రఫి తెలిపారు. పందుల యజమానులు ఇప్పటికైనా గ్రహించి తమ పందులను జాగ్రత్త చేసుకోవాలని ఆయన సూచించారు.

కలాస్‌మాలపల్లిలో కొనసాగుతున్న వైద్య శిబిరం
తోట్లవల్లూరు, సెప్టెంబర్ 23: తోట్లవల్లూరు శివారు కలాస్‌మాలపల్లిలో ప్రత్యేక వైద్య శిబిరం కొనసాగుతోంది. కమ్యూనిటిహాలు వద్ద ఎఎన్‌ఎంలు జ్వరాల బాధితులను పరిక్షించి మందులు అందజేస్తున్నారు. శనివారం ఎంపిహెచ్‌ఈఓ ఎవి సుబ్బారావు, ఎఎన్‌ఎం ఎం రోహిణి ఇంటింటికి తిరిగి జ్వరాలపై సర్వే చేశారు. గతంలో వచ్చిన జ్వరాల బాధితులు ఉన్నారని, కొత్తగా జ్వరాలు రావటం తగ్గిందని సుబ్బారావు తెలిపారు. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు.