కృష్ణ

పోర్టు కలను సాకారం చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, నవంబర్ 19: కోస్తా తీర ప్రాంత వాసుల చిరకాల వాంఛ బందరు ఓడరేవును సాకారం చేస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ఆదివారం స్థానిక రెవెన్యూ కల్యాణ మండపంలో పోర్టుపై చర్చాగోష్ఠి నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఓడరేవు నిర్మాణం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధితో ఉన్నారన్నారు. గత ఎన్నికల్లో కోనేరుసెంటరు సాక్షిగా చంద్రబాబు నాయుడు ఇచ్చిన వాగ్ధానం మేరకు పోర్టును నిర్మించి తీరుతామన్నారు. ఎన్ని దుష్ట శక్తులు పోర్టుకు అడ్డుపడినా నిర్మాణాన్ని మాత్రం ఎవ్వరూ ఆపలేరన్నారు. మరో నెల రోజుల్లో భూసమీకరణ ప్రక్రియను పూర్తి చేయటంతో పాటు 2018 డిసెంబర్ నాటికి బందరు తీరానికి ఓడను తీసుకువస్తామన్న స్పష్టం చేశారు. ఇప్పటికే పోర్టు నిర్మాణానికి అవసరమైన 5వేల ఎకరాల్లో 3వేల ప్రభుత్వ, అసైన్డ్ భూములను సమీకరించడం జరిగిందన్నారు. 2వేల పట్టా భూములకు సంబంధించి 750 ఎకరాలు సమీకరించామన్నారు. మిగిలిన భూములను కూడా నెల రోజుల్లో సమీకరించి ల్యాండ్ ప్యాకేజీని అమలు చేస్తామన్నారు. రూ.6వేల నుండి 7వేల కోట్లతో పోర్టు నిర్మాణానికి 14 బెర్త్‌లు నిర్మించనున్నట్లు తెలిపారు. తీరం వెంబడి 15 కిలో మీటర్ల పొడవున 60 అడుగుల లోతు డ్రజ్జింగ్ చేయాల్సి ఉందన్నారు. డ్రజ్జింగ్ కోసం రూ.2వేల కోట్లు ఖర్చు అవుతుందని తెలిపారు. తెలంగాణ నుండి బందరు పోర్టుకు 10లక్షల టన్నుల ఎగుమతులు, దిగుమతులు జరిగే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర న్యాయ, క్రీడ, యువజన సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ తరతరాలుగా ఎదురు చూస్తున్న బందరు పోర్టు నిర్మాణానికి అన్ని వర్గాల సహకారం తీసుకుంటున్నట్లు చెప్పారు. పోర్టు కోసం భూములిచ్చే రైతులకు అమరావతి తరహా ప్యాకేజీని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందన్నారు. కొంత మంది రైతులు ప్యాకేజీపై అవగాహన లేక భూసమీకరణకు ముందుకు రావడం లేదన్నారు. ప్యాకేజీ వల్ల కలిగే లబ్ధిని ప్రతి రైతుకు సవివరంగా వివరిస్తామన్నారు. ఇప్పటికే గ్రామాల్లో రైతులతో ముఖాముఖి నిర్వహించామన్నారు. రానున్న రోజుల్లో కూడా రైతులతో మమేకమై పోర్టు కల సాకారం అయ్యేందుకు శాయశక్తులా కృషి చేస్తానన్నారు. పార్లమెంట్ సభ్యుడు కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ బందరు అభివృద్ధికి పోర్టు తప్ప మరో మార్గం లేదని ప్రజలంతా గ్రహించాలన్నారు. చిలకలపూడి రైల్వే స్టేషన్ నుండి బీచ్ రోడ్డుకు ఇరువైపులా టౌన్ షిప్ ఏర్పాటు చేసి భూములిచ్చిన రైతులకు అక్కడ ఫ్లాట్లు కేటాయిస్తామన్నారు. భూసేకరణ కంటే భూసమీకరణ వల్లే రైతులకు లాభదాయకంగా ఉంటుందన్నారు. ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మాట్లాడుతూ పోర్టుతో పాటు అనుబంధ పరిశ్రమల స్థాపన కోసమే 33వేల ఎకరాల సమీకరణకు ప్రభుత్వం పూనుకుందన్నారు. ఇందులో 14వేల ఎకరాలు మాత్రమే పట్టా భూములు ఉన్నాయన్నారు. మిగిలినదంతా ప్రభుత్వ, అసైన్డ్ భూములేనన్నారు. ముడ వైస్ చైర్మన్ వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ రైతుల అనుమానాలు నివృత్తి చేస్తూ భూములిచ్చిన రైతులకు లీజు మొత్తాన్ని 10 యేళ్ల పాటు అందించడంతో పాటు ఏడాదంతా ఉపాధి హామీలో పనులు కల్పిస్తారన్నారు. రైతు కూలీలకు పెన్షన్ అందిస్తారని, స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి శిక్షణా కార్యక్రమాలను త్వరలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, జెడ్పీటీసీ లంకే నారాయణ ప్రసాద్, ఎఎంసీ చైర్మన్ చిలంకుర్తి తాతయ్య, టీడీపీ నాయకులు గొర్రిపాటి గోపిచంద్, కొనకళ్ల జగన్నాధరావు (బుల్లయ్య), బూరగడ్డ రమేష్ నాయుడు, కుంచే దుర్గా ప్రసాద్, వాలిశెట్టి తిరుమలరావు, ఇలియాస్ పాషా, సిటీ కేబుల్ యండీ కొల్లు శ్రీనివాస్, మచిలీపట్నం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కోగంటి సాయిమోహన్, వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు, రైతులు పాల్గొన్నారు.