కృష్ణ

చెరకు ధరల్లో ఎటువంటి వ్యత్యాసం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చల్లపల్లి, డిసెంబర్ 5: చెరకు ధరల్లో వ్యత్యాసం ఉందని జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని కెసీపీ సీఓఓ జి వెంకటేశ్వరరావు రైతులకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సూచన మేరకు హనుమాన్ జంక్షన్‌లోని డెల్టా షుగర్స్ ఏరియా చెరకును స్వీకరించాలని కెసీపీ యాజమాన్యం నిర్ణయించినట్లు తెలిపారు. లక్ష్మీపురం ఏరియా చెరకు ఉత్పత్తిదారులకు ప్రస్తుతం క్రషింగ్ సీజన్‌కు ప్రకటించిన ధర కంటే డెల్టా షుగర్స్ నుండి లక్ష్మీపురం కెసీపీకి వచ్చే చెరకు పంటకు తమ యాజమాన్యం అధిక ధర చెల్లించనున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. 2017-18 సీజన్‌కు సంబంధించి తాము ప్రకటించిన రాయితీలు ఎకరాకు 35 టన్నుల దిగుబడి చొప్పున ప్రతి టన్నుకు రూ.330లు ఇవ్వడం జరుగుతుందన్నారు. లక్ష్మీపురంలో ప్రకటించిన ధర రూ.2.700లు, రాయితీతో కలిపి ఈ సీజన్‌కు చెరకు టన్నుకు రూ.3.300లు లక్ష్మీపురం ఏరియా రైతులకు లభిస్తుందన్నారు.

ఫైబర్ గ్రిడ్ కేబుల్ చోరీ కేసులో ముగ్గురు అరెస్టు
చల్లపల్లి, డిసెంబర్ 5: ఫైబర్ గ్రిడ్ కేబుల్ చోరీ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు అవనిగడ్డ డీఎస్పీ వి పోతురాజు తెలిపారు. నిందితులను మంగళవారం చల్లపల్లి పోలీసు స్టేషన్‌లో మీడియా ముందు హాజరుపర్చారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ టెర్రా సాఫ్ట్‌వేర్ ప్రైవేట్ లిమిటెడ్ ఇటీవల లక్ష్మీపురం విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద 32 కేబుల్ డ్రమ్ములను నిల్వ చేసింది. ఘంటసాల మండలం పాపవినాశనం గ్రామానికి చెందిన బుర్రె చినబాబు అదే కంపెనీలో సూపర్‌వైజర్‌గా పని చేస్తున్నాడు. గత నెల 20వతేదీన 12 డ్రమ్ముల కేబుల్ వైరు చోరీకి గురి అవ్వగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. అదే కంపెనీలో పని చేస్తున్న మోపిదేవి మండలం పెదకళ్లేపల్లి గ్రామానికి చెందిన కడవకొల్లు శివ నాగరాజు, అతని మిత్రుడు ఆటో డ్రైవర్ అరజా బాల గంగాధరరావు (్ఫణి)లను విచారించగా తాము ఎనిమిది కేబుల్ డ్రమ్ములను చోరీ చేసినట్లు అంగీకరించారు. మిగిలిన డ్రమ్ముల గురించి విచారణ వేగవంతం చేయటంతో వాటిని ఫిర్యాదుదారుడైన బుర్రె చినబాబు తమతో కలిసి అపహరించి తన ఇంటి సమీపంలోని గడ్డివాములో దాచి పెట్టారని ఇరువురు నిందితులు తెలిపారు. దీంతో చినబాబును కూడా అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ పోతురాజు తెలిపారు. రూ.2.4లక్షలు విలువ చేసే 14 కేబుల్ డ్రమ్ములను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. పోలీసులకు తప్పుడు సమాచారం అందించి కేసును తప్పుదారి పట్టించినందుకు చినబాబుపై అదనంగా ఐపీసీ సెక్షన్ 109, 182 కింద మరో కేసు నమోదు చేశామన్నారు. ఈ సమావేశంలో చల్లపల్లి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ జనార్ధనరావు, ఎస్‌ఐ చంద్రశేఖర్, ఎఎస్‌ఐ వి వెంకటేశ్వర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

నేడు కాపుల రిజర్వేషన్ల సాధనపై విజయోత్సవ సభ
మచిలీపట్నం (కోనేరుసెంటర్), డిసెంబర్ 5: దశాబ్దాలుగా దగాపడుతూ వచ్చిన కాపులను బీసీల్లో చేరుస్తూ ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించడం ఆనందదాయకమని మార్కెట్ యార్డు చైర్మన్ చిలంకుర్తి తాతయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ పంచపర్వాల కాశీ విశ్వనాథం (చంటి) అన్నారు. కాపుల స్థితిగతులపై మంజునాథ కమిషన్‌తో పూర్తి స్థాయి అధ్యయనం చేయించి బీసీల్లో చేరుస్తూ చారిత్రక నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు బుధవారం సాయంత్రం స్థానిక సువర్ణ కల్యాణ మండపంలో కృతజ్ఞతాభినందన సభను ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. మంగళవారం ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాపుల కోసం వెయ్యి కోట్లతో కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆర్థికంగా ఆదుకోవటంతో పాటు నేడు బీసీల్లో చేరుస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి యావత్తు కాపులంతా తెలుగుదేశం పక్షాన నిలుస్తున్నారని తెలిపారు. ఈ సభలో కాపులంతా పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ సమావేశంలో టీడీపీ కాపు నాయకులు గోపు సత్యనారాయణ, కుంచే దుర్గా ప్రసాద్, లంకిశెట్టి నీరజ, తదితరులు పాల్గొన్నారు.