కృష్ణ

అడుగంటుతున్న భూగర్భ జలాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తోట్లవల్లూరు, ఏప్రిల్ 28: బంగారు పంటలు పండే లంక భూముల్లో భూగర్భ జలాల మట్టం తీవ్రంగా పడిపోతోంది. పచ్చని పంటలతో కళకళలాడే లంక పొలాల్లో నీరందక పంటలు వాడిపోయే పరిస్థితి ఉత్పన్నమవుతోంది. చెరకు పిలకలు, కొన్ని రకాల పంటలు వాడిపోతున్న దృశ్యాలు లంకల్లో కనిపిస్తున్నాయి. మండలంలోని కృష్ణానదీ పాయల మధ్య సుమారు 8,500 ఎకరాల పంట భూములున్నాయి. ఈ భూముల్లోని పంటలకు బోర్ల నీరే ఆధారం. లంక భూముల్లో భూగర్భ జలాలు నానాటికీ పడిపోతుండటం అన్నదాతలను ఆందోళన పరుస్తోంది. చుట్టూ ఉన్న పాయల్లో నిబంధనలకు తిలోదకాల్చి ఇసుకను అడ్డగోలుగా తవ్వేయటం, గత ఏడాది వరదలు రాకపోవటం భూగర్భ జలాలు పడిపోవటానికి కారణాలని పలువురు రైతులు అంటున్నారు. మొన్నటి వరకు బోర్లలో నిండుగా వచ్చే నీరు కొన్నిరోజులుగా సన్నధారగా మారిపోయిందని చెపుతున్నారు. లంక భూముల్లో పూర్తిగా బోర్లపైనే వ్యవసాయం ఆధారపడి ఉంది. వర్షాకాలంలో కురిసే వానలు తప్పితే మిగతా కాలమంతా పంటలను బోర్ల నీటితోనే పండించుకుంటారు. 365 రోజులు వివిధ రకాల పంటలను రైతులు పండిస్తారు. దీంతో బోర్ల నీటి వాడకం అధికంగా ఉంటుంది. ఇపుడు మారుతున్న పరిస్థితులు రైతులను కలవర పరుస్తున్నాయి. గతంలో మోటార్లను భూమిపై అమర్చి షెడ్లు కట్టేవారు. అయితే భూగర్భ జలాలు తగ్గిపోయి మోటార్లకు నీరందకపోవటంతో 15 నుంచి 20 అడుగుల లోతున గొయ్యితవ్వి అందులోకి సిమెంటు వరలు దింపి మోటారుని అమరుస్తున్నారు. 20 అడుగుల లోతుకి మోటారుని దించితేనే బోరుకి నీరందుతోందని లంక రైతులు చెపుతున్నారు. భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయనటానికి ఇదే నిదర్శనమని పేర్కొంటున్నారు. ఇక చాలామంది రైతులు రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఖర్చుపెట్టి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని 150 నుంచి 200 అడుగుల లోతు బోరు వేయించి అందులోకి సబ్‌మెర్సిబుల్ మోటారుని వేయిస్తున్నారు. దీంతో మామూలు మోటార్లకు కాలం చెల్లుతోంది. ఇదిలావుంటే గ్రామాల్లోనూ భూగర్భ జలాలు సమస్య ముందుకొస్తోంది. మంచినీటి చేతిపంపులు నీరురాక నిరుపయోగంగా మారుతున్నాయి. దాంతో గ్రామ పంచాయతీలు సరఫరా చేసే రక్షిత మంచినీటి కోసమే ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. పూర్వం నుంచి ఉన్న బావుల్లో చూస్తే నీరు అడుగంటిన దృశ్యం కనిపిస్తోంది. రైతులు బిందు సేద్యం, స్ప్రింక్లర్ పద్ధతులు పాటిస్తే నీటి కొరతను అధికమించవచ్చని పలువురు సూచిస్తున్నారు. ప్రస్తుతం రైతులు బోరుని ఇష్టారాజ్యంగా వదిలేస్తున్నారు. దీంతో పొలమంతా నీరుపారి చాలావరకు వృథా అవుతోంది. అలాకాకుండా బిందు, తుంపర్ల సేద్యం అయితే నీరు వృథా కాదు. మామూలుగా ఒక ఎకరాకు పెట్టే నీటితో బిందు, తుంపర్ల సేద్యంలో రెండు, మూడు ఎకరాల్లోని పంటలకు సమృద్ధిగా నీరందించవచ్చు. ఇక్కడి రైతులు ఈ పద్ధతులు పాటించేందుకు వ్యవసాయ శాఖాధికారులు సదస్సులు నిర్వహించి అవగాహన కల్పించాలి. గతంలో బిందు సేద్యానికి ఇచ్చిన పరికరాలను చాలామంది రైతులు వినియోగంచకుండా మూలన పడేశారు. అందువల్ల అధికారులు బిందు సేద్యం అమలుకు పటిష్ఠమైన చర్యలు తీసుకోవటం అవసరం.