కృష్ణ

మైలవరానికి మరో దిగుమతి నేత!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం: మైలవరం నియోజకవర్గ రాజకీయ తెరపైకి మరో దిగుమతి నేత రంగ ప్రవేశం చేశారు. 1999 ఎన్నికలలో ఉయ్యూరుకు చెందిన వడ్డే శోభనాద్రీశ్వరరావు మైలవరం నుండి తెలుగుదేశం అభ్యర్థిగా విజయం సాధించి వ్యవసాయ శాఖ మంత్రిగా పని చేశారు. 2004లో వడ్డే మళ్ళీ పోటీ చేసి చనమోలు వెంకట్రావ్ చేతిలో ఓడిపోయి నియోజకవర్గాన్ని వదలి సొంతూరుకు వెళ్ళిపోయారు. 2009లో నందిగామకు చెందిన దేవినేని ఉమామహేశ్వరరావు తెలుగుదేశం అభ్యర్థిగా మైలవరంలో పోటీ చేసి విజయం సాధించారు. 2014 ఆయనే ఇక్కడ పోటీచేసి గెలిచి జలవనరుల శాఖ మంత్రిగా ప్రస్తుత ప్రభుత్వంలో పనిచేస్తున్నారు. తాజాగా నందిగామ నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం నేత, పారిశ్రామికవేత్త వసంత కృష్ణప్రసాద్(కేపీ) ఇటీవల జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకుని మైలవరం నియోజకవర్గ పార్టీ సమన్వయకర్తగా తాజాగా నియమించబడ్డారు. గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున నందిగామలో పోటీ చేసిన కృష్ణప్రసాద్ టీడీపీ అభ్యర్థి దేవినేని ఉమామహేశ్వరరావుపై ఓటమి పాలై తాజాగా మైలవరం నియోజకవర్గంలో మళ్ళీ ఆయనపైనే పోటీ చేసి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటి వరకూ ఇక్కడ పార్టీలో పనిచేసిన వైసీపీ మైలవరం నియోజకవర్గ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే జోగిరమేష్‌ను తప్పించి కేపీకి పార్టీ పగ్గాలను పార్టీ హైకమాండ్ అప్పగించింది. జోగిని పెడన నియోజకవర్గ పార్టీ అదనపు సమన్వయకర్తగా నియమించింది. అనతి కాలంలోనే చోటు చేసుకున్న ఈ అనూహ్య పరిణామాలతో పార్టీలో గందరగోళం ఏర్పడింది. 2014 అసెంబ్లీ ఎన్నికలలో అనూహ్యంగా వైసీపీ తరపున ఇక్కడ పోటీచేసిన బీసీ సామాజికవర్గానికి చెందిన జోగిరమేష్ స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యే దేవినేని ఉమపై ఆరు వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓటమి చెందిన విషయం తెలిసిందే. అప్పటి నుండి పార్టీ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటూ పార్టీని గ్రామస్థాయిలో బలోపేతం చేసుకుంటున్నారు. ఎన్నికలకు ఇంకా ఏడాది గడువున్న తరుణంలో జోగికి అధిష్టానం గట్టి షాక్ ఇచ్చింది. సర్వే రిపోర్టులు జోగి అనుకూలంగా ఉన్నప్పటికీ ఆర్థికంగా జోగిరమేష్ మంత్రి ఉమపై సరితూగడని ఉమకు ధీటైన వ్యక్తి పారిశ్రామికవేత్త కెపి అని అధిష్టానం భావించి చకచకా పావులు కదిపింది. మైలవరం నియోజకవర్గంలో జగన్ పాదయాత్ర జరుగుతున్న సమయంలోనే నిర్ణయాలు మారిపోయాయి. దీనికంతటికీ కారణం ఎంపీ వైవి సుబ్బారెడ్డేనని పార్టీ నేతలు, కార్యకర్తలు చెబుతున్నారు. జగన్ మైలవరం నియోజకవర్గంలో పర్యటిస్తూ కందులపాడు అడ్డరోడ్డు వద్ద రాత్రి బసచేసే వరకూ జోగి వైపే మొగ్గుచూపిన జగన్ రాత్రికి, రాత్రే నిర్ణయాలు మార్చుకున్నట్లు చెబుతున్నారు. సుబ్బారెడ్డి శిబిరానికి వచ్చి జగన్‌తో మంతనాలు జరిపి మనసు మార్చినట్లు చెబుతున్నారు. అప్పటి నుండి జోగిని పెడన వెళ్ళాల్సిందిగా జగన్ కొత్త రాగం మొదలు పెట్టటంతో జోగి వర్గం ఖంగుతింది. ఈ పరిణామాలతో నియోజకవర్గ బీసీలలో అసంతృప్తులు ఒక్కసారిగా చెలరేగాయి. ఇదే క్రమంలో నియోజకవర్గంలోని రెడ్డి, కమ్మ సామాజికవర్గాలు జగన్ నిర్ణయాన్ని స్వాగతించాయి. విశేషమేమంటే గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్నికలకు ఏడాది ముందు వరకూ నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్న మాజీ ఎమ్మెల్యే జ్యేష్ఠరమేష్‌ను తప్పించి జోగిరమేష్‌ను అనూహ్యంగా తెరపైకి తెచ్చి సమన్వయకర్త బాధ్యతలు అప్పగించటంలో సుబ్బారెడ్డే కీలక పాత్ర పోషించారు. తాజాగా ఎన్నికలకు ఏడాది ముందు అదే సీన్ రిపీట్ అయింది. వసంతకృష్ణప్రసాద్‌ను స్వాగతించే రెండు సామాజికవర్గాలు ఇటీవల మండలంలోని పుల్లూరులో వైసీపీకి చెందిన ఒక నాయకుడి ఇంట్లో జరిగిన వివాహ కార్యక్రమానికి ఆ వర్గం వారు ఆహ్వానించగా కేపీ ఇక్కడికి వచ్చి ఏకంగా మండలాల వారీగా పార్టీ నేతల ఇళ్ళకు స్వయంగా వెళ్ళి పరిచయాలు చేసుకున్నారు. దీనిపై బీసీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్టీలో చేరకుండానే, ఆయనకు ఎటువంటి బాధ్యతలు అప్పగించకుండానే పరిచయ కార్యక్రమాలు ఏమిటని మైలవరం మండల పార్టీ అధ్యక్షులు పామర్తి శ్రీనివాసరావు, జి కొండూరు ఎంపీపీ తిరుపతిరావు, జి కొండూరు మండల పార్టీ అధ్యక్షులు జక్రధరరావు, ఇంకా బీసీ నేతలు పార్టీ జిల్లా నాయకులపై, స్థానిక పైన పేర్కొన్న రెండు సామాజికవర్గ నేతలపై మండిపడ్డారు. బీసీలు ఓట్లు వేయటానికే పనికొస్తారా, ఎమ్మెల్యేలు కాకూడదా, ఎందుకు జోగిని కాదని మరో ప్రాంతం నుండి నేతలను దిగుమతి చేసుకుంటున్నారు, ఎందుకు వారికి ఇక్కడ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ప్రశ్నించారు. తమను కాదని అగ్రకులాల వారిని తెచ్చి మాపై రుద్దటానికి ప్రయత్నిస్తున్నారని బీసీల ఓట్లు లేకుండా ఎలా గెలుస్తారో చూస్తామంటూ సవాల్ విసిరారు. డబ్బే అన్ని సందర్భాలలో ప్రధానం కాదని నిరూపిస్తామని వారు హెచ్చరికలు జారీ చేశారు. జరుగుతున్న ఈ పరిణామాలపై పార్టీ కార్యకర్తలలో అయోమయం నెలకొంది. నందిగామ నుండి దిగుమతి అయిన కృష్ణ ప్రసాద్ ఆ రెండు సామాజికవర్గ నేతలతోనే పరిచయాలు పెంచుకుంటూ తన రాజకీయ రథాన్ని కదిలిస్తున్నారు. దీంతో బీసీలలో మరింత ఆగ్రహాలు వెల్లువెత్తుతున్నాయి. ఆఖరి దశలో తమకు మొండిచేయి చూపుతారా అంటూ వారు మండిపడుతున్నారు. మరో వైపు వైసీపీలో జరుగుతున్న అభ్యర్థుల మార్పును, కుల రాజకీయాలను ఆసక్తిగా గమనిస్తూ తమకు అనుకూలంగా మలుచుకునేందుకు టీడీపీ శ్రేణులు కసరత్తు చేస్తున్నారు. జోగిరమేష్ కన్నా కెపి అయితే తమ నేత దేవినేని ఉమ విజయం మరింత సులువవుతుందని ఆ పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరోవైపు రాజకీయాలలో అపర చాణుక్యుడైన మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వీటినేమీ పట్టించుకోకుండా తనపని తాను చేసుకుపోతున్నారు. వైసీపీలో జరుగుతున్న ఈ పరిణామాలతో మైలవరం నియోజకవర్గ రాజకీయం క్రమంగా వేడెక్కుతోంది. మైలవరం నియోజకవర్గంలో రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులు దాదాపు ఖరారు కావటంతో ఏడాదికి ముందే ఎత్తులు, పైఎత్తులతో ఎన్నికల వేడి ప్రారంభమైందనే చెప్పాలి.