కృష్ణ

యోగాతో ఆరోగ్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: ఆరోగ్య ప్రాప్తి కోసం యోగ సాధన ఒక్కటే మార్గమని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, పార్లమెంట్ సభ్యుడు కొనకళ్ల నారాయణరావు, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు అన్నారు. జిల్లా అధికార యంత్రాంగం తరఫున గురువారం జిల్లా పోలీసు పెరేడ్ గ్రౌండ్స్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మంత్రి రవీంద్ర, ఎంపీ నారాయణరావు, ఎమ్మెల్సీ అర్జునుడుతో పాటు జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ కె విజయకృష్ణన్, అడిషనల్ పోలీసు సూపరింటెండెంట్ సోమంచి సాయికృష్ణ ముఖ్య అతిథులుగా పాల్గొని యోగాసనాలు వేశారు. నేటి ఆధునిక ప్రపంచంలో యోగాకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడిందన్నారు. సంపూర్ణ ఆరోగ్యవంతుల్ని చేయటంతో పాటు సుదీర్ఘ రుగ్మతులను పారదోలడంలో యోగ ప్రధాన భూమిక పోషిస్తోందన్నారు. యోగా ద్వారా మానసిక ప్రశాంతత, శారీరక ధృడత్వం ఏర్పడుతుందన్నారు. సూర్యోదయం, సూర్యాస్తమ సమయాల్లో చేసే యోగా వల్ల అద్భుత ఫలితాలు లభిస్తాయన్నారు. ప్రాచీన కాలం నాటి యోగా పట్ల అలసత్వం ప్రదర్శించడం సరి కాదన్నారు. అనంతరం యోగా గురువు గురునాధ బాబు దంపతులను అతిథులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బాబా ప్రసాద్, డీఆర్‌ఓ అంబేద్కర్, జిల్లా సర్వశిక్షాభియాన్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ప్రసాద్, జిల్లా కో-ఆపరేటీవ్ ఆఫీసర్ ఆనందబాబు, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ఉమామహేశ్వరరావు, బందరు డీఎస్పీ యండి మహబూబ్ బాషా, డీటీసీ డీఎస్పీ రమణమూర్తి, ఎఆర్ డీఎస్పీ నారాయణరావు, ట్రైనీ డెప్యూటీ కలెక్టర్ ఖాజావలీ, తహశీల్దార్ నారదముని తదితరులు పాల్గొన్నారు.

కలిసొచ్చిన ‘పట్టిసీమ’

మచిలీపట్నం, జూన్ 21: తొలకరి వర్షాలతో పాటు ముందస్తు సాగునీటి విడుదలతో డెల్టా రైతాంగం సాగుకు సమాయత్తమవుతోంది. గడిచిన నాలుగేళ్లుగా పట్టిసీమ ద్వారా విడుదలవుతున్న గోదావరి జలాలతో సాగు చేస్తున్న రైతులు ఒకింత ఆనందదాయకంగా ఉన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా తొలి రెండు సంవత్సరాల్లో అంతంత మాత్రంగా ఖరీఫ్ సాగు జరిగినా గత యేడాది పుష్కలంగా నీటి విడుదల జరగటంతో ఖరీఫ్ సాగు ఆశాజనకంగా మారింది. సారవంతమైన గోదావరి జలాలతో దిగుబడులు కూడా లాభదాయకంగా వచ్చాయి. దీంతో రైతుల్లో ఆనందోత్సాహాలు వ్యక్తమయ్యాయి. మళ్లీ అదే స్థాయిలో పట్టిసీమ నుండి నీటి విడుదల జరగటంతో రెట్టించిన ఉత్సాహంతో రైతులు సాగుకు సిద్ధమవుతున్నారు. బుధవారం ప్రకాశం బ్యారేజీ నుండి విడుదలైన గోదావరి జలాలు శివారు ప్రాంతాలకు రావడానికి మరో వారం రోజులు పట్టే అవకాశం ఉంది. దీంతో ఈ లోపు తమ పంట పొలాలను సాగుకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. దుక్కులు దున్నటంతో పాటు పంట బోదెలను పటిష్ఠపర్చే పనిలో నిమగ్నమయ్యారు. ఈ ఏడాది వాతావరణం కూడా ఖరీఫ్ సాగుకు అనుకూలంగా మారింది. జూన్ నెల మొదటి వారంలోనే తొలకరి వర్షాలు పలకరించాయి. సాగునీటి విడుదల కూడా గత ఏడాది కన్నా వారం రోజుల ముందే విడుదల కావటంతో రైతులకు అంతా శుభప్రదంగా మారింది. రైతులు కూడా సాగుకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు. సాగుకు అవసరమయ్యే పెట్టుబడులు సమకూర్చుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఈ ఏడాది 3.23లక్షల హెక్టార్లలో ఖరీఫ్ సాగు జరగనుంది. అత్యధికంగా వరి పంటను 2.40లక్షల హెక్టార్లలో సాగు చేయనున్నారు. మిగితా విస్తీర్ణంలో వివిధ రకాల పంటలను రైతులు సాగు చేయనున్నట్లు వ్యవసాయ శాఖాధికారులు అంచనాలు వేశారు. ఆ దిశగానే రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు సబ్సిడీ ధరలకు అందించేందుకు వ్యవసాయ శాఖ సిద్ధమైంది. తొలి దశలో 7వేల 300 క్వింటాళ్ల వరి విత్తనాలు, 150 క్వింటాళ్ల మినుము, 20 క్వింటాళ్ల పెసర, మరో 20 క్వింటాళ్ల కంది విత్తనాలను పంపిణీ చేసేందుకు అందుబాటులోకి తీసుకు వచ్చారు. మొత్తం మీద తొలకరి వర్షాలు, ముందస్తు సాగునీటి విడుదల ఖరీఫ్ సాగు పట్ల రైతుల్లో కొంగొత్త ఆశలను చిగురింప చేస్తోంది.