కృష్ణ

ముమ్మరంగా పోర్టు భూముల కొనుగోళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: బందరు ఓడరేవు నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. పోర్టు నిర్మాణానికి అవసరమైన భూముల కొనుగోళ్ల ప్రక్రియ ఊపందుకుంది. గడిచిన మూడు రోజుల్లో 45.03 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా ముడ అధికారులు కొనుగోలు చేశారు. ఇందుకు సంబంధించి మొత్తం 14 మంది రైతుల బ్యాంక్ ఎకౌంట్‌కు ఎకరానికి రూ.25లక్షలు చొప్పున రూ.11కోట్ల 25లక్షల 75వేలు మొత్తాన్ని జమ చేశారు. పోర్టు ప్రతిపాదిత గ్రామాల్లో బడా రైతులే లక్ష్యంగా ముడ అధికారులు పావులు కదుపుతున్నారు. అధిక శాతం భూములు ఉన్న రైతులతో 24 గంటలూ సంప్రదింపులు జరిపి వారి నుండి భూముల కొనుగోళ్లకు శ్రమిస్తున్నారు. అలాగే ఈ ప్రాంతంలో భూములు ఉండి ఇతర ప్రాంతాల్లో ఉంటున్న వారిని కూడా ముడ అధికారులు గుర్తించి వారి నుండి కూడా భూముల కొనుగోళ్లకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే బుధవారం పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ కోకా శేషుబాబు కుటుంబ సభ్యుల భూములను కొనుగోలు చేశారు. శేషుబాబు సతీమణి శశికళ పేరిట ఉన్న 1.88 ఎకరాలతో పాటు ఇతర కుటుంబ సభ్యులకు సంబంధించి మరో 4.5 ఎకరాల భూములను కొనుగోలు చేసి వారికి పరిహారం అందచేశారు. మూడు రోజుల క్రితం పోర్టు భూముల కొనుగోళ్లను ముడ అధికారులు ప్రారంభించారు. మూడు రోజుల్లోనే రైతుల నుండి అనూహ్య స్పందన రావడం విశేషం. మరో పక్క పోర్టుకు భూములు ఇచ్చే రైతులకు స్టాంప్ డ్యూటీ మినహాయిస్తూ జీవో నెం. 565ని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. ఈ జీవో వల్ల రైతులపై పన్ను భారం తప్పింది. రిజిస్ట్రేషన్ శాఖకు ఎటువంటి స్టాంప్ డ్యూటీ చెల్లించకుండా నేరుగా తమ భూములను ముడ పేరిట రిజిస్ట్రేషన్ చేసే వెసులుబాటు కలిగింది. దీని వల్ల రైతులు మరింత ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. పోర్టు నిర్మాణానికి 1500 ఎకరాల పట్టా భూములను సేకరించాల్సి ఉంది. 60 రోజుల్లో పూర్తి స్థాయిలో రైతుల నుండి భూములు కొనుగోలు చేసేందుకు అవసరమైన అన్ని చర్యలను ముడ అధికారులు చేపట్టారు. పక్కా ప్రణాళిక ప్రకారం కొనుగోళ్ల ప్రక్రియ నిర్వహిస్తున్నారు. రిజిస్ట్రేషన్ సమయంలో కొనుగోళ్లకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రత్యేక విభాగాన్ని సైతం ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక విభాగంలో కేవలం పోర్టుకు సంబంధించిన భూముల రిజిస్ట్రేషన్లను మాత్రమే చేయనున్నారు. భూములు ఇచ్చే ప్రతి రైతుని ముడ అధికారులు ఘనంగా సత్కరించి వారికి కృతజ్ఞతలు తెలియచేస్తూ కొత్త సంప్రదాయానికి తెర లేపారు.