కృష్ణ

బోట్ రేసింగ్‌కు అసాధారణ భద్రత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం): దేశంలో రెండోసారి జరుగుతున్న అంతర్జాతీయ ఎఫ్ 1 హెచ్ 2ఓ-2018 బోట్ రేసింగ్ పోటీలకు అసాధారణ భద్రత ఏర్పాట్లు చేసినట్లు నగర పోలీసు కమిషనర్ సిహెచ్ ద్వారకా తిరుమలరావు చెప్పారు. గతంలో తొలిసారిగా ముంబయిలో 2004లో తొలిసారి బోట్ రేసింగ్ నిర్వహించారన్నారు. రెండోసారి మన రాష్ట్ర రాజధానిలో శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న ఈ పోటీలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోలీసుశాఖా పరంగా భద్రత, రక్షణ ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. కమిషనరేట్‌లో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సుమారు వెయ్యి మంది పోలీసు బలగాలు పటిష్ట బందోబస్తు భద్రత విధుల్లో పాల్గొంటున్నాయన్నారు. నగరం నుంచి 400 మంది సిబ్బందితోపాటు ఇతర జిల్లాల నుంచి అదనంగా 600 మందిని కేటాయించామన్నారు. అదేవిధంగా సీసీ కెమేరాల పర్యవేక్షణలో నిరంతర నిఘా ఉంటుందన్నారు. ఈ ఈవెంట్‌ను నిరంతరం సీసీ కెమేరాల పహరాలో 24/7 భద్రత నడుమ నిర్వహిస్తున్నామన్నారు. బందోబస్తుకు సంబంధించి 15 లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ సెక్టార్లుగా విభజించారు. సాధారణ ప్రజల సందర్శనార్థం దుర్గాఘాట్ సమీపంలోని కొత్తగా నిర్మిస్తున్న కనకదుర్గ ఫ్లై ఓవర్ కింద భాగంలో సుమారు ఐదువేల మంది వీక్షించే విధంగా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. భవానీ ఘాట్‌లో కూడా కొత్తగా నిర్మిస్తున్న జెట్టి సమీపాన మరో ఐదు వేలమంది వీక్షించేలా కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పాస్‌లు కలిగిన వారికి బెరంపార్కు, పున్నమి ఘాట్లలో సుమారు రెండువేల మంది వీక్షించేలా తగిన ఏర్పాట్లు చేశామన్నారు. ఆన్‌లైన్ ద్వారా ఏడు వేల రూపాయలు చెల్లించి టిక్కెట్ కొన్నవారికి భవానీ ఐలాండ్ నుంచి వీక్షించేందుకు భవానీ తగిన ఏర్పాట్లు చేశామన్నారు. భవానీ ఘాట్ పక్కన కొత్తగా ఏర్పాటు చేసిన జెట్టి నుంచి ప్రత్యేక బోట్‌లలో భవానీ ఐలాండ్‌కు తీసుకుని వెళ్ళేందుకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. పున్నమీ ఘాట్ పరిసరాల్లో విఐపి పాస్‌లు కలిగి ఉన్న కార్లకు మాత్రమే పార్కింగ్ సదుపాయం ఉంటుందన్నారు. ఇతర వీఐపీలకు భవానీపురం దర్గా వెనుక ఉన్న ఖాళీ ప్రదేశంలో ఏర్పాటు చేశామన్నారు. అదేవిధంగా వెంకటేశ్వర ఫౌండ్రి రోడ్డులోని ఖాళీ ప్రదేశంలో, సాధారణ పార్కింగ్‌లను భవానీపురం లారీ స్టాండు, స్వాతి థియేటర్ నుంచి శివాలయం సెంటర్ వరకు ఉన్న రోడ్డు మార్జిన్‌లో పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇదిలావుండగా భద్రత దృష్ట్యా ప్రకాశం బ్యారేజీపై ఎలాంటి సందర్శకులను వీక్షించేందుకు అనుమతించడం లేదన్నారు. అత్యవసరం దృష్ట్యా అంబులెన్స్, అగ్నిమాపక వాహనాలను ముఖ్యమైన కూడళ్ల వద్ద అందుబాటులో ఉంచామన్నారు. భద్రత దృష్ట్యా వివిధ ప్రదేశాల్లో సీసీ కెమేరాలు ఏర్పాటు చేసినట్లు సీపీ చెప్పారు. విలేఖరుల సమావేశంలో ట్రాఫిక్ డీసీపీ చంద్రశేఖరరెడ్డి, అడ్మిన్ డీసీపీ జె బ్రహ్మారెడ్డి, క్రైం డీసీపీ బి రాజకుమారి, లా అండ్ ఆర్డర్ డీసీపీ వి అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.

బోట్‌రేస్‌కు వీఎంసీ పకడ్బందీ ఏర్పాట్లు
* రూపుమారిన స్థానిక రహదారులు
* పరిశీలించిన కమిషనర్ నివాస్
విజయవాడ (కార్పొరేషన్), నవంబర్ 15: తొలిసారిగా కృష్ణానదిలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ ఎఫ్1హెచ్ 20 బోట్ రేసింగ్ చాంపియన్ షిప్ పోటీలకు వీఎంసీ తరఫున ఏర్పాట్లు పూర్తి చేసింది. శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు జరిగే ఈ ప్రతిష్టాత్మక పోటీలకు విచ్చేసే లక్షలాది మంది ప్రజల సౌకర్యార్థం రహదారులను సిద్ధం చేయడంతోపాటు వాటిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. పున్నమీ ఘాట్‌కు వెళ్లే కెనాల్ రోడ్డు కనకదుర్గ ఫ్లై ఓవర్ దిగువన విద్యుత్ దీపాలంకరణలతోపాటు 7 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన గ్రీనరీతో అంతర్జాతీయ పోటీలకు పచ్చతోరణంగా తీర్చిదిద్దారు. పోటీలకు విచ్చేసే అంతర్జాతీయ క్రీడాకారులు, అతిథులు, ఆహ్వానితులతోపాటు పోటీలను వీక్షించే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అవసరమైన వౌలిక సదుపాయాలను కూడా వీఎంసీ అందుబాటులోకి తీసుకువచ్చింది. శుక్రవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రారంభించనున్న ఈ పోటీల ఏర్పాట్లపై గురువారం వీఎంసీ కమిషనర్ జే నివాస్ ఆయా ప్రాంతాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి పోటీలు జరిగే పున్నమీ ఘాట్ వరకూ అన్ని రహదారులను ఎల్లవేళలా పరిశుభ్రంగా ఉంచాలన్నారు. అలాగే పోటీలను వీక్షించేందుకు విచ్చేసే ప్రేక్షకుల సౌకర్యార్థ ఘాట్ పరిసరాలను 12 జోన్లుగా విభజించి కేటగిరీల వారీగా సిట్టింగ్‌లను ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. తాగునీటి సరఫరా, మరుగుదొడ్ల సౌకర్యాలను కూడా విస్తృతంగా చేపట్టాలన్నారు. కేవలం రేస్‌లలో పాల్గొనే బోట్లనే కాకుండా ప్రేక్షకులకు కనువిందు చేసే విధంగా ఏర్పాటు చేస్తున్న మ్యూజికల్ షో ప్రాంగణాన్ని కమిషనర్ పరిశీలించారు. సీఎం చంద్రబాబు విచ్చేసే రోడ్డు పల్లంగా ఉండటాన్ని గుర్తించి తక్షణమే రబ్బీస్‌తో మెరక చేయడంతోపాటు చదునుగా ఉంచాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. సీఎం వచ్చే మార్గంలోకి ఇతరులు ఎవ్వరూ రాకుండా చుట్టూ కర్టెన్స్, బారికేడ్లను ఏర్పాటు చేయాలన్నారు. తదుపరి వాటర్ వర్క్స్ నుంచి పున్నమీ ఘాట్ వరకూ గల ప్రధాన రహదారుల వెంబడి, కనకదుర్గా బ్రిడ్జి దిగువన జరుగుతున్న గ్రీనరీ పనులను పరిశీంచిన నివాస్ టైల్స్, మార్బుల్స్, గ్రీనరీ పనులు ఇంకా పూర్తికాకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తూ సత్వరమే పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. దుమ్ము, ధూళి లేకుండా పరిసరాలన్నింటినీ శుభ్రం చేయాలన్నారు. మొక్కల మధ్య ఖాళీగా ఉన్న స్థలంలో ఎర్రమట్టి నింపి లాన్ గ్రాస్ ఏర్పాటు చేయాలన్నారు.