కృష్ణ

పూరగుట్టకు మహర్దశ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం: పూరగుట్టకు మంచిరోజులొచ్చాయి. నాలుగు దశాబ్దాలుగా గుట్ట, పిచ్చి చెట్ల మాటున దాగి ఉన్న అత్యంత విలువైన భూమి ఇంత కాలం తర్వాత బయటికొచ్చింది. దీంతో మైలవరంతో పాటు మండలంలోని పొందుగల, అనంతవరం గ్రామాల నిరుపేదల ఇళ్ళ స్థలాలకు ఇంతకాలం తర్వాత ఎట్టకేలకు మోక్షం లభించినట్లైంది. వివరాలలోకి వెళితే మైలవరంలో గత రెండు దశాబ్దాలుగా ఇళ్ళ స్థలాల కోసం నిరుపేదలు ఎదురు చూస్తున్నారు. వీరికి ఇళ్ళ స్థలాలు ఇవ్వటానికి అయ్యప్పనగర్‌లో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో 9 ఎకరాల భూమిని కొనుగోలు చేసి పేదలకు ఇళ్ళ స్థలాలు ఇవ్వటానికి రంగం సిద్ధం చేశారు. కానీ అనివార్య కారణాలతో అది నేటికీ కార్యరూపం దాల్చలేదు. ఆభూమిని పేదలకు పంపిణీ చేయటానికి ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయించింది. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చొరవ తీసుకుని పేదలకు ఇవ్వటానికి అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు. అందులో 372 మందికి ఇళ్ళ స్థలాలు ఇవ్వటానికి అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అర్హులు ఇంకా వెయ్యి మందికి పైగా ఉండటంతో అందరి నుండి డిమాండ్, అభ్యంతరాలు రావటంతో వారికి ఇళ్ళ స్థలాలు ఇవ్వటానికి అవసరమైన భూమి లేకపోవటంతో మంత్రితోపాటు అధికారులకు సమస్య జటిలమైంది. ఈక్రమంలో సుమారు రెండు మాసాల క్రితం ఒక సమావేశంలో మంత్రి ఉమ మాట్లాడుతూ ప్రభుత్వ భూములు ఏవైనా ఉంటే బయటికి లాగండి, పేదలకు పంపిణీ చేయాలని ఇచ్చిన ఆదేశాల మేరకు మైలవరం వీఆర్వో పిట్టా దేవప్రియుడు మంత్రి ఆదేశాలపైనే తీవ్రంగా దృష్టి సారించారు. రెండు మూడు రోజులుగా రెవెన్యూ రికార్డులన్నీ పరిశీలించి రికార్డుల ప్రకారం భూమిని వేటాడారు. దీంతో నాలుగు దశాబ్దాలుగా గుట్ట, చెట్ల మాటున ఉన్న 84 ఎకరాల అత్యంత విలువైన పూరగుట్ట భూమి బయటికొచ్చింది. అందులో 24 ఎకరాలలో మామిడి తోట ఉండగా మిగిలిన భూమి పడావుగా పడి ఉంది. ఇందులో కొందరు భూస్వాములు తమకు అవకాశం ఉన్నంత వరకూ అక్రమంగా కలుపుకుని సాగు చేసుకుని అనుభవిస్తున్నారు. ఏది ఏమైనా మంత్రి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్ళటంతో ఆయన స్పందిస్తూ ఇనే్నళ్ళుగా ఇంతటి విలువైన భూమి ఇక్కడ దాగి ఉందా అంటూ ఆశ్చర్యపోయారు. వెంటనే ఈ భూమిని నిరుపేదలకు పంపిణీ చేయటానికి అవసరమైన ప్రతిపాదనలు తయారు చేయాలని తహశీల్దార్ ప్రతాప పుల్లయ్యను ఆదేశించారు. అంతేగాక ఇటీవల మైలవరంలో మీకోసం కార్యక్రమానికి వచ్చిన జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతంను కూడా ఆప్రాంతానికి తీసుకెళ్ళి మంత్రి ఉమ చూపించి ఒప్పించారు. దీంతో పూరగుట్టకు మహర్దశ పట్టుకుంది. మంత్రి ఆదేశాల మేరకు చెట్లు, పుట్టలతో అడవికి మాదిరిగా ఉన్న స్థలాన్ని సుందరంగా తయారు చేయించారు. ఆ భూమిలోని 30 ఎకరాలలో 1070 మందికి ఇళ్ళ స్థలాలు ఇవ్వటానికి లేఅవుట్ వేయించారు. దీంతో ఇళ్ళ స్థలాల కోసం ఏళ్ళ తరబడి ఎదురు చూస్తున్న నిరుపేదలకు ఆశ ఏర్పడింది. అతి త్వరలోనే వీటిని పేదలకు పంపిణీ చేయాలని మంత్రి ఉమ రెవెన్యూ అధికారుల వెంటాడుతున్నారు. మైలవరానికి మూడు కిలోమీటర్ల దూరంలో అడవీ ప్రాంతం మాదిరిగా ఈ భూమిని మైలవరానికి మరో మణిహారంగా తయారు చేయటానికి మంత్రి ఉమ దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. అనుకున్నదే తడవుగా ఆ ప్రాంతానికి వెళ్ళటానికి ఇరుకుగా ఉన్న మట్టిరోడ్డును తారురోడ్డుగా మార్చటానికి అవసరమైన రెండు కోట్ల రూపాయల నిధులను యుద్ధ ప్రాతిపదికన మంజూరు చేయించి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా ఆ ప్రాంతానికి వెళ్ళేందుకు అవసరమైన విద్యుత్ సరఫరాను ఏర్పాటు చేయటానికి విద్యుత్ అధికారులతో మాట్లాడి 100 స్తంభాలను మంజూరు చేయించి ఎల్‌ఈడీ లైట్లను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. మరో వైపు ఫ్లోరైడ్ రహిత కృష్ణా జలాలను ఆ ప్రాంతానికి అందించేందుకు వెంటనే పైప్‌లైన్ విస్తరించాలని ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులను అదేశించారు. దీంతో పూరగుట్టకు మహర్దశ పట్టుకుంది. మరో విశేషమేమంటే పూరగుట్టకు ఆనుకుని అమరావతి ఔటర్ రింగ్ రోడ్‌కు సీఆర్డీఏ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దీంతో ఈ ప్రాంతానికి మరింత ప్రత్యేకత ఏర్పడింది. ఇక్కడి ఇళ్ళ స్థలాలపై ప్రతిపక్ష నేతలు కొంత ఆటంకం సృష్టించటానికి ప్రయత్నించినా మంత్రి ఉమ మాత్రం లెక్కచేయకుండా పేదలకు ఇళ్ళ స్థలాలు ఇవ్వాలన్న సంకల్పంతోనే అధికారులను ఉరుకులు పెట్టిస్తున్నారు. ఇదే జరిగితే మైలవరంలో ఇళ్ళ స్థలాలు కావాలన్న నిరుపేదలు ఇక మిగిలి ఉండరనేది సత్యం.