కృష్ణ

భారీ వర్షానికి స్తంభించిన జనజీవనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవనిగడ్డ, మే 19: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వల్ల అవనిగడ్డలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పల్లపు ప్రాంతాల్లో నీళ్లు నిలిచిపోయాయి. జాలర్లు సముద్రంలో వేటకు వెళ్ళవద్దని రెవెన్యూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంతవాసులను అప్రమత్తం చేశారు. అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మండల పరిధిలో ఆరు ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నట్లు సమాచారం. ఇప్పటికే ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు తీరప్రాంత గ్రామాలకు తరలివెళ్లగా ప్రభుత్వ వైద్యశాలలో వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. పలుచోట్ల బలమైన గాలులకు విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. అరటి తోటలు కూలిపోగా మామిడికాయలు రాలిపోయి తీవ్ర నష్టం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కృత్తివెన్నులో..
కృత్తివెన్ను : వాయుగుండం వల్ల కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం స్తంభించింది. భారీ వర్షాల కారణంగా కృత్తివెన్ను మండలంలో రెండు పునరావాస కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. చినగొల్లపాలెం బిసి హాస్టల్‌లో, నిడమర్రు పంచాయతీ శివారు ఒర్లగొందితిప్ప వద్ద పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి తీరప్రాంత ప్రజలను తరలించారు. భోజనంతో పాటు అన్నిరకాల వసతులు కల్పించారు. ఇంతేరులో అధికారులు పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసినప్పటికీ గ్రామస్తులు తరలి వచ్చేందుకు అయిష్టత చూపారు. మండల ప్రత్యేక అధికారి ఎన్‌వి సత్యనారాయణ, తహశీల్దార్ మధుసూదనరావు, ఎంపిడివో ఐవి సత్యవతి, జడ్‌పిటిసి ఒడుగు తులసీరావు మండలంలో నెలకొన్న పరిస్థితులను సమీక్షించారు. ఎన్డీఆర్‌ఎఫ్ బృంద సభ్యులు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. ఈదురుగాలుల వల్ల విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పెదగొల్లపాలెం బీచ్ 20 మీటర్లు ముందుకొచ్చి కొద్దిసేపటికి వెనక్కి వెళ్లిపోయినా అక్కడి ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
లోతట్టు కాలనీల్లో నీరు
బంటుమిల్లి : రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలో పలు గ్రామాల్లో లోతట్టు కాలనీలు ముంపునకు గురయ్యాయి. సుమారు 20కి పైగా విద్యుత్ స్తంభాలు విరిగిపోగా అనేక గ్రామాల్లో వైర్లు తెగిపడ్డాయి. వర్షాలకు ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. పెదతుమ్మిడి, చోరంపూడి, మల్లంపూడి, నాగన్నచెరువు, ముంజులూరు, కంచడం, తదితర గ్రామాల్లో విద్యుత్ అంతరాయాన్ని తొలగించేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. శుక్రవారం నాటికి గ్రామాల వారీగా విద్యుత్ సరఫరా చేయనున్నట్లు ఎడిఎ భాస్కరరావు, బంటుమిల్లి ఎఇ భానుప్రకాష్ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు తహశీల్దార్ విజయ శేఖరరావు లోతట్టు గ్రామాల్లో పర్యటించారు. మండల ప్రత్యేకాధికారి తారకేశ్వరరావు, ఎంపిడివో కళావతి, మండల పరిషత్ ప్రత్యేక సలహాదారు పాలడుగుల వీర వెంకటేశ్వరరావు ఎప్పటికప్పుడు పరిస్థితులను ఆరా తీస్తున్నారు.
తోట్లవల్లూరులో ..
తోట్లవల్లూరు : బుధవారం సాయంత్రం నుంచి గురువారం సాయంత్రం వరకు 97.4 మి.మీల వర్షపాతం నమోదయిందని తహశీల్దార్ జి భద్రు తెలిపారు. ఈ వర్షానికి మండలంలోని పలు గ్రామాలు జలమయమయ్యాయి. రహదారుల్లో నీరు నిలిచి రాకపోకలకు ఇబ్బందిగా మారింది. స్థానిక సినిమా హాలు రోడ్డు, సాయిబాబా ఆలయం రోడ్డు, భద్రిరాజుపాలెంలో రైస్‌మిల్లు రోడ్డు, పాఠశాల రోడ్డు జలమయంగా మారాయి. చాలా గ్రామాల్లో కచ్చా డ్రైన్లు సక్రమంగా లేక మురుగు సమస్య ఏర్పడిందని ప్రజలు వాపోతున్నారు. రెండు రోజులుగా ఎడతెరిపిని వానతో జనజీవనం స్తంభించింది.
తుపాను హెచ్చరికల నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాల మేరకు తహశీల్దార్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్టు భద్రు తెలిపారు. కంట్రోల్ రూమ్‌లో 24 గంటలు అప్రమత్తంగా ఉంటున్నట్టు తెలిపారు. అన్ని గ్రామాల్లో విఆర్‌ఓలను అప్రమత్తం చేశామన్నారు. ఐలూరులో ఒక ఎద్దు మృతి మినహా ఎలాంటి నష్టం జరగలేదని తెలిపారు. ఎక్కడైనా ఎలాంటి విపత్తు ఎదురైనా 0866-2804239 నెంబర్‌కి కాల్ చేయాలని ప్రజలకు ఆయన సూచించారు.