కృష్ణ

అగ్రకులాల మధ్య చిచ్చుపెడుతున్న సీఎం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవనిగడ్డ: ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి అధికారం కోసం అగ్రకులాల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని రాజ్యసభ సభ్యుడు, బీజేపీ రాష్ట్ర పరిశీలకుడు మురళీధరన్ అన్నారు. పామర్రు, అవనిగడ్డ నియోజకవర్గాల బూత్ కన్వీనర్లు, కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. పోలీసుల అండతో ప్రతిపక్షాలపై భౌతికదాడులు చేయిస్తున్నారని, రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని విమర్శిస్తూ బాబు ఓటమికి ఇదే కారణాలు అవుతాయని మురళీధరన్ అన్నారు. ఇప్పటికైనా ప్రజలు ఆలోచన చేయటం ద్వారా మరోసారి బాబుకు అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని, ప్రజలను తినిపారేస్తాడని, నిలువునా దోపిడీ చేస్తాడని ఆరోపించారు. కేంద్రం దాదాపు లక్షలాది కోట్ల రూపాయల నిధులు ఇవ్వగా 50శాతం నిధులు చంద్రబాబుతో సహాయ ఆయా పార్టీల ఎంపీలు, మంత్రులు కాంట్రాక్టర్లుగా వ్యవహరించి దోపిడీ చేశారని ఆరోపించారు. కార్యక్రమంలో భోగాది చంద్రశేఖర్, జివి నాగరాయులు, రమాదేవి, చిట్టా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

ఎస్పీ త్రిపాఠికి అభినందనలు

ఆంధ్రభూమి బ్యూరో
మచిలీపట్నం, జనవరి 23: సెలక్షన్ గ్రేడ్ ఐపీఎస్‌గా పదోన్నతి పొందిన జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సర్వశ్రేష్ఠ త్రిపాఠికి బుధవారం అభినందనలు వెల్లువెత్తాయి. జిల్లా పోలీసు కార్యాలయంలో పలువురు పోలీసు అధికారులు ఎస్పీ త్రిపాఠిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. గుంటూరు జిల్లా ఎస్పీగా పని చేస్తూ జిల్లాకు బదిలీపై వచ్చిన ఎస్పీ త్రిపాఠి గడిచిన యేడాదిన్నరగా శాంతిభద్రతల పరిరక్షణకు చేస్తున్న కృషిని పలువురు ప్రశంసించారు. ప్రతి సోమ, శనివారాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాదివస్ ద్వారా వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారన్నారు. ఎస్పీ త్రిపాఠిని కలిసి అభినందనలు తెలిపిన వారిలో బందరు డీఎస్పీ యండీ మొహ్మద్ బాషా, ఎఆర్ డీఎస్పీ నారాయణరావు, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ఉమామహేశ్వరరావు, గుడివాడ డీఎస్పీ మహేష్, నందిగామ డీఎస్పీ చంద్రబోస్, అవనిగడ్డ డీఎస్పీ పోతురాజు, స్పెషల్ బ్రాంచ్ సీఐ కిషోర్ బాబు, తాలుకా సీఐ బిబి రవి కుమార్, ఆర్‌పేట సీఐ వాసవి, ఇనగుదురు సీఐ అబ్దుల్ నబీ, ఆర్‌ఐలు కృష్ణంరాజు, శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.

ఎడ్ల బండి పరుగు పందెం పోటీలు ప్రారంభం

కైకలూరు, జనవరి 23: దీపక్ నెక్స్‌జన్ ఆక్వా ఫీడ్ కంపెనీ ఆధ్వర్యంలో బుధవారం మండల పరిధిలోని గోపవరంలో రాష్ట్ర స్థాయి ఎడ్ల బండి పరుగుల పోటీలు నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి డా. కామినేని శ్రీనివాస్, ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు(బాబు) పోటీలను ప్రారంభించారు. ఈ పోటీల్లో పలు జిల్లాలు నుండి సీనియర్ విభాగంలో ఐదు ఎడ్ల జతలు, జూనియర్ విభాగంలో 14 ఎడ్ల జతలు పాల్గొన్నాయి. ఎమ్మెల్యే శ్రీనివాస్ ఎడ్ల బండ్ల వెంట మోటారు సైకిల్‌పై వెళ్లి తిలకించారు. గుర్రంపై స్వారీ చేసి ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నింపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్‌రావు, వైకాపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి దూలం నాగేశ్వరరావు, ఎఎంసీ చైర్మన్ తలరి వెంకట స్వామి, జెడ్పీటీసీ బొమ్మనబోయిన విజయలక్ష్మి, మాజీ ఎఎంసీ చైర్మన్‌లు సామర్ల శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు. సీనియర్స్‌లో తూర్పు గోదావరి జిల్లా ఆర్‌బి కొత్తూరు గ్రామానికి చెందిన చుండ్రు సత్యనారాయణ ఎడ్ల జత ప్రథమ బహుమతిని, జూనియర్ విభాగంలో తూర్పుగోదావరి జిల్లా ఆర్‌బి కొత్తూరుకు చెందిన మనె్నం సత్యనారాయణ ఎడ్ల జత ప్రథమ స్థానంలో నిలిచాయి. ఎడ్ల పందాల్లో బాహుబలి సినిమాలో నటించిన ఎద్దులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తొలుత ఎడ్ల పందాలకు ఎమ్మెల్యే శ్రీనివాస్ బాహుబలి ఎద్దుల బండిపై ర్యాలీగా వెళ్లారు.

ఇళ్ల స్థలాలపై వాగ్వాదం

మైలవరం, జనవరి 23: ఇళ్ళ స్థలాల పంపిణీకి సంబంధించిన అంశంపై స్థానిక మండల పరిషత్ సమావేశంలో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. మైలవరం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం బుధవారం ఎంపిపి బాణావతు లక్ష్మి అధ్యక్షతన జరిగింది. ఈసమావేశంలో వైకాపాకు చెందిన మైలవరం-1 ఎంపిటిసి షేక్ అబ్దుల్ రహీమ్ మాట్లాడుతూ పేదలకు ఇళ్ళ స్థలాలు ఇంత వరకూ ఎందుకు ఇవ్వలేదని మండిపడ్డారు. పూరగుట్టలో ఇళ్ళ స్థలాల పంపిణీకి సంబంధించి రెవెన్యూ అధికారులు వ్యవహరిస్తున్న తీరు ఆక్షేపణీయమన్నారు. దీనిపై తహశీల్దార్ సమాదానం చెప్పకుండా సమావేశానికి రాకుండా ఎందుకున్నారని ప్రశ్నించారు. దీనిపై ఏఎంసి చైర్మన్ ఉయ్యూరు నరశింహారావు స్పందిస్తూ తహశీల్దార్‌కు విజయవాడలో మీటింగ్ ఉన్నందున రాలేకపోయారని త్వరలోనే ఇళ్ళ స్థలాలు ఇవ్వటానికి మంత్రి ఉమ కృషి చేస్తున్నారని తెలిపారు. అదేవిధంగా స్థానిక బాలికోన్నత పాఠశాలలో 750 మంది విద్యార్థినిలు చదువుతుంటే అక్కడ కనీసం టాయిలెట్స్ కూడా లేవని అధికారులు ఏం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎంఇఓ రత్నశ్యాంబాబు స్పందిస్తూ ఇటీవల వరకూ ఉన్న భవనం శిధిలమవటంతో నూతన భవనాలను నిర్మించి పిల్లలను అక్కడికి పంపటం జరిగిందని, త్వరలోనే వారికి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించటం జరుగుతుందన్నారు. ఇటీవల కాలంలో మైలవరంలో నిర్మించిన సిసి రోడ్లకు ఎటువంటి అనుమతులు లేవని దీనిపై పంచాయితీరాజ్ అధికారులు సమాదానం చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై పంచాయితీరాజ్ ఏడీ రాజశేఖర్ మాట్లాడుతూ ఉన్నతాధికారుల సూచనల మేరకు పూర్తి వివరాలు అందిస్తానని హామీ ఇచ్చారు. ఎంపిపి లక్ష్మి, జడ్పీటిసి రాము మాట్లాడుతూ ప్రభుత్వ పధకాలను ప్రజలు సద్వినియోగం చేసుకునేలా ఎంపిటిసిలు ఆయా గ్రామాల్లో కృషి చేయాలన్నారు. అదేవిధంగా సమస్యలేవైనా ఉంటా సంబంధిత అధికారుల దృష్టికి తెచ్చి పరిష్కరించాలన్నారు. ఇంకా ఈకార్యక్రమంలో ఎంపిడిఓ నాగేశ్వరరావు, పలు శాఖల అధికారులు, సిబ్బంది, ఎంపిటిసిలు పాల్గొన్నారు.