తూర్పుగోదావరి

ఫ్యాన్ జోరుకు సై‘కిల్’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: ఫ్యాన్ గాలి హోరుకు అధికార తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి కకావికలయ్యాయి. తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న కృష్ణాజిల్లాలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. జిల్లాలోని రెండు పార్లమెంటు స్థానాలను చెరొకటి పంచుకున్నాయ. 16 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అన్నట్టుగా వైసీపీ అభ్యర్థులు విజయభావుట ఎగుర వేశారు. జిల్లాలో విజయవాడ తూర్పు, గన్నవరం నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ గెలుపొందింది. వైసీపీ అభ్యర్థుల చేతుల్లో తెదేపా అభ్యర్థులు ఘోర పరాజితులయ్యారు. ప్రధాన పార్టీల గెలుపు ఓటములను ప్రభావితం చేస్తుందనుకున్న జనసేన కూటమి అనుకున్న స్థాయిలో ప్రభావం చూపలేదు. పెడన నియోజకవర్గంలో తొలి రౌండులో జనసేన అభ్యర్థి అంకెం లక్ష్మీ శ్రీనివాస్ రెండవ స్థానంలో నిలిచి కార్యకర్తల్లో ఉత్సాహం నింపినప్పటికీ ఆ తర్వాత జరిగిన రౌండ్లలో మూడవ స్థానానికే పరిమితమయ్యారు. ఇదే పరిస్థితి అన్ని నియోజకవర్గాల్లో కొనసాగింది. ఒకటి రెండు రౌండ్లలో మాత్రమే జనసేన రెండవ స్థానంలో నిలవగా చిట్ట చివరికి మూడవ స్థానానికే పరిమితమైంది. విజయవాడ పార్లమెంట్ సభ్యుడిగా తొలిసారిగా ఎన్నికల బరిలో నిలిచిన ప్రముఖ వ్యాపారవేత్త పొట్లూరి వీర ప్రసాద్‌పై - సమీప ఫ్రత్యర్థి అయిన కేశినేని శ్రీనివాస్‌పై విజయం సాధించారు. మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడిగా వైఎస్‌ఆర్ సీపీ తరఫున పోటీ చేసిన తెనాలి మాజీ ఎంపీ వల్లభనేని బాలశౌరి సమీప ప్రత్యర్థి కొనకళ్ల నారాయణరావుపై 57వేల 581 ఓట్ల మెజార్టీతో జయకేతనం ఎగుర వేశారు. సిట్టింగ్ ఎంపీలతో పాటు అమాత్యులు సైతం ఇంటి ముఖం పట్టక తప్పలేదు. జిల్లా కేంద్రం మచిలీపట్నం సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి కొల్లు రవీంద్ర సమీప ప్రత్యర్థి పేర్ని వెంకట్రామయ్య (నాని) చేతిలో ఓడిపోయారు. అలాగే ఓటమి ఎరుగని వీరుడిగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సైతం ఓటమి రుచి చూడక తప్పలేదు. మొత్తం 29 రౌండ్లకు గాను తొలి రౌండ్‌లో మాత్రమే 27 ఓట్ల అధిక్యతను దేవినేని కనబర్చారు. ఆ తర్వాత జరిగిన ప్రతి రౌండ్‌లోనూ వైకాపా అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ అధిక్యత ప్రదర్శించి సునాయాస విజయాన్ని అందుకున్నారు. గత ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎక్సైజ్ శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న కెఎస్ జవహర్ ఈ విడత తన సొంత నియోజకవర్గమైన తిరువూరు నుండి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. జిల్లాలోని 16 అసెంబ్లీ స్థానాల విషయానికొస్తే విజయవాడ తూర్పు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి వైసీపీకి చెందిన బొప్పన భవకుమార్‌పై మెజార్టీతో విజయాన్ని అందుకున్నారు. గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ 728 ఓట్ల అధిక్యతతో గెలుపొందారు. గన్నవరం నియోజకవర్గ ఓట్ల లెక్కింపు తొలి నుండి ఉత్కంఠకు గురి చేసింది. మొత్తం 25 రౌండ్లకు గాను 13 రౌండ్లలో వైకాపా అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావ్ అధిక్యత ప్రదర్శించారు. మిగిలిన రౌండ్లలో అనూహ్యంగా వంశీ అధిక్యతను ప్రదర్శించారు. ఈ నియోజకవర్గానికి సంబంధించి లెక్కింపులో మూడు ఇవిఎంలు తెరుచుకోలేదు. ఆ మూడు ఇవీఎంలకు సంబంధించి వీవీ ప్యాట్స్‌లోని స్లిప్పుల లెక్కించి ఫలితం ప్రకటించేందుకు రిటర్నింగ్ అధికారి నిర్ణయించారు. ఇకపోతే మిగిలిన 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ప్రతి రౌండ్‌లోనూ అధిక్యత ప్రదర్శిస్తూ విజయాన్ని అందుకున్నారు. కొన్ని రౌండ్లలో ప్రధాన పార్టీల నడుమ నువ్వా.. నేనా.. అన్నట్టు పోటీ నెలకొన్నప్పటికీ అంతిమంగా వైకాపా అభ్యర్థులనే విజయం వరించింది. వైకాపా హవా కొనసాగుతుండటంతో మిగిలిన పార్టీల అభ్యర్థులకు చెందిన అనుయాయులు మెల్లిమెల్లిగా కౌంటింగ్ కేంద్రాల నుండి జారుకున్నారు. ఒకానొక దశలో అభ్యర్ధులే నిరాశసక్తతతో కౌంటింగ్ కేంద్రాలను వీడటం గమనార్హం. ఓటర్లు ఇచ్చిన అనూహ్య ఫలితానికి వైకాపా శ్రేణులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ వీచిన ఫ్యాన్ గాలికి అధికార పక్షానికి సమీప భవిష్యత్తు కోలుకోలేని దెబ్బ తగలగా అనుకోని అతిథిగా అనూహ్య విజయాన్ని వైకాపా సొంతం చేసుకుంది.

గుడివాడలో నాల్గోసారి కొడాలి ఘనవిజయం
గుడివాడ, మే 23: గుడివాడ అసెంబ్లీకి వరుసగా నాల్గవ సారి ఎమ్మెల్యేగా కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) ఘనవిజయాన్ని సాధించారు. గత మూడుసార్లు వచ్చిన మెజార్టీని దాటి 19,479ఓట్ల భారీ ఆధిక్యతను ప్రదర్శించారు. గురువారం మచిలీపట్నంలోని కృష్ణా యూనివర్సిటీలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను నిర్వహించారు. మొత్తం 20రౌండ్‌ల పాటు సాగిన కౌంటింగ్‌లో ఎమ్మెల్యే కొడాలి నాని మొదటి నుండి తన ప్రత్యర్థి, టీడీపీ అభ్యర్థి దేవినేని అవినాష్‌పై ఆధిక్యాన్ని కనబరుస్తూ సత్తా చాటారు. మొత్తం కౌంటింగ్ ప్రక్రియలో నాలుగు ఈవీఎంలు మొరాయించాయి. వీటిని చివరిలో లెక్కించాలని నిర్ణయించి తర్వాతి రౌండ్‌లను ప్రారంభించాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారిణి జీవీ సత్యవాణి నిర్ణయించారు. అయితే ఎమ్మెల్యే కొడాలి నాని భారీ మెజార్టీతో గెలుపొందడంతో చివరిలో లెక్కించాల్సిన ఈవీఎంలను లెక్కించేందుకు ప్రయత్నించారు. అయితే వీటిలో రెండు ఈవీఎంలు మాత్రమే పనిచేశాయి. కాగా గతంలో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెల్చినప్పటికీ అధికార పార్టీలో లేకపోవడంతో అభిమానులు నిరాశ చెందుతూ వచ్చారు. ఈ ఎన్నికల్లో మరోసారి గెలుపొందడంతో పాటు వైసీపీ అధికారంలోకి రావడంతో అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. నామినేషన్ల ప్రక్రియ నుండి ఎమ్మెల్యే కొడాలి నాని తనదైన శైలిలో ప్రచారంలో ముందుకు దూసుకుపోతూ నియోజకవర్గంలో తన పట్టును మరింత పెంచుకున్నారు. కాగా గుడివాడ అసెంబ్లీ ఎన్నికల్లో 12మంది అభ్యర్థులు పోటీపడగా వీరిలో ప్రధానంగా దేవినేని, కొడాలి నానిల మధ్యే పోటీ సాగింది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ పార్టీల అభ్యర్థులు నామమాత్రపు పోటీకే పరిమితమయ్యారు. నియోజకవర్గంలో 2,08,305ఓట్లు ఉండగా వీటిలో 1,67,058ఓట్లు పోలయ్యాయి. ఈ ఓట్లలో వైసీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే కొడాలి నానికి 88,195ఓట్లు, టీడీపీ అభ్యర్థి దేవినేని అవినాష్‌కు 68,792ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి శిష్ట్లా దత్తాత్రేయులుకు 1366ఓట్లు, బీజేపీ అభ్యిర్థి గుత్తికొండ శ్రీరాజబాబుకు 785ఓట్లు, ప్రజాశాంతి పార్టీ అభ్యర్థి కొడాలి వెంకటేశ్వరరావుకు 235ఓట్లు, పిరమిడ్ అభ్యర్థిని గుండపనేని రాజకుమారికి 165ఓట్లు, స్వతంత్ర అభ్యర్థులు గుండాబత్తిన అంబేద్కర్‌కు 143ఓట్లు, గేదెల అవినాష్‌కు 304ఓట్లు, అహ్మద్‌నూర్‌కు 103ఓట్లు, మద్దాల ఇస్సాక్‌కు 484ఓట్లు, వడ్డాది నాగరాజుకు 106ఓట్లు, బోయిన శ్రీశివ వెంకట సత్యనారాయణకు 162 ఓట్లు, నోటాకు 3,156ఓట్లు లభించాయి. మరో 354ఓట్లు చెల్లలేదు. అనంతరం ఎమ్మెల్యేగా ఎన్నికైన కొడాలి నానికి ఎన్నికల రిటర్నింగ్ అధికారిణి జీవీ సత్యవాణి ధృవీకరణ పత్రాన్ని అందజేశారు.