కృష్ణ

అల్పపీడనం.. అప్రమత్తం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో మంగళవారం జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షం కురిసింది. తెల్లవారు జాము నుండి రాత్రి పొద్దుపోయే వరకు జిల్లా అంతటా మోస్తరు నుండి భారీ వర్షాలు పడ్డాయి. ఫలితంగా జన జీవనం అస్తవ్యస్తంగా మారింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు తోడు తీవ్రంగా వీచిన చలి గాలులతో వృద్ధులు, చిన్నారులు ఇబ్బందికర వాతావరణాన్ని ఎదుర్కొన్నారు. పట్టణాలు, నగరాల్లో డ్రైనేజీ వ్యవస్థ దెబ్బతినటంతో వర్షపునీరు పారక రోడ్ల మీదకు వచ్చింది. ప్రధాన రహదార్లతో పాటు అంతర్గత రహదార్లు సైతం వర్షపు నీటితో నిండిపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు లోతట్టు ప్రాంతాల్లో నివాస గృహాల్లోకి వర్షపునీరు చేరటంతో ప్రజలు నానా యాతన పడుతున్నారు. అల్పపీడనం కారణంగా జిల్లాలో 22.0 మి.మీల సరాసరి వర్షపాతం నమోదైంది. ఈ వర్షపాతం సోమవారం ఉదయం 8.30 గం.ల నుండి మంగళవారం ఉదయం 8.30 గం.ల వరకు నమోదైనట్లు వాతావరణ శాఖాధికారులు తెలిపారు. మంగళవారం ఉదయం 8.30 గం.ల తర్వాత రెట్టింపు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అత్యధికంగా సముద్ర తీర ప్రాంత మండలమైన నాగాయలంకలో 84.2మి.మీలు చొప్పున వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా తిరువూరు, జగ్గయ్యపేట మండలాల్లో 0.2మి.మీలు చొప్పున వర్షపాతం నమోదైంది. సముద్ర తీర ప్రాంత మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది. చల్లపల్లిలో 68.6, మచిలీపట్నంలో 52.6, అవనిగడ్డలో 48.6, ఘంటసాలలో 68.2, బంటుమిల్లిలో 36.4, కృత్తివెన్నులో 26.4మి.మీలు చొప్పున వర్షపాతం నమోదైంది. ఇదిలా ఉండగా మెట్ట ప్రాంతమైన వత్సవాయి, పెనుగంచిప్రోలు, గంపలగూడెం, చాట్రాయి, ఎ.కొండూరు మండలాల్లో ఎటువంటి వర్షపాతం నమోదు కాలేదు. అధిక వర్షాలకు అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అధిక వర్షాల వల్ల ఎటువంటి విపత్కర పరిస్థితులు తలెత్తినా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగాన్ని జిల్లా కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్ సిద్ధం చేశారు. కలెక్టరేట్‌తో పాటు విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయం, మచిలీపట్నం రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. కలెక్టరేట్‌లో 08672-252572, మచిలీపట్నం రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో 08672-252486, విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో 0866-2574454 నెంబర్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకు వచ్చారు. అధిక వర్షాల వల్ల ఎవరైనా ఇబ్బందులకు గురైతే తక్షణమే కంట్రోల్ రూమ్‌లకు సమాచారం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్ విజ్ఞప్తి చేశారు. కలెక్టర్ ఆదేశాలతో తీర ప్రాంత మండలాల్లో సైతం ఆయా మండల తహశీల్దార్లు కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. రానున్న 24 గంటల పాటు అల్పపీడన ప్రభావంతో భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో అందుకు అనుగుణంగా అధికార యంత్రాంగం సిద్ధమైంది. తీర ప్రాంతాల్లో 45 నుండి 50 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో మత్స్యకారులెవ్వరూ సముద్రంలో వేటకు వెళ్లవద్దని మత్స్యశాఖాధికారులు కోరారు. ఇప్పటికే సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు తిరిగి రావాలని సంకేతాలు పంపారు. అలాగే లోతట్టు ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా అధికారులు పునరావాస కేంద్రాలను గుర్తించారు. పరిస్థితులను బట్టి లోతట్టు వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు రవాణా సదుపాయాన్ని సిద్ధం చేస్తున్నారు. పునరావాస కేంద్రాల్లో భోజన వసతితో పాటు ప్రాథమిక వైద్య సేవలు అందించనున్నారు.