కృష్ణ

రైతు సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంకిపాడు: రైతు సమస్యలను పరిష్కరించటంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జలవనరుల శాఖ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. మండలంలోని గొడవర్రు గ్రామంలో మంగళవారం మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌తో కలిసి ఆయన పర్యటించారు. రహదారిపై ఆరబెట్టిన ధాన్యాన్ని పరిశీలించి, రైతులకు ధాన్యం విక్రయంలో ఎదురవుతున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ తమది రాజన్నరాజ్యం, రైతు పక్షపాత ప్రభుత్వమంటూ ముఖ్యమంత్రి మొదలు స్థానిక శాసనసభ్యుడి వరకు ప్రకటనలు చేస్తున్నారన్నారు. రైతు పండించిన చివరి గింజ వరకు కొంటామని ఆర్భాటపు ప్రకటనలు చేస్తున్నారు కానీ ఆచరణలో మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా జరుగుతోందని విమర్శించారు. అరకొరగా ధాన్యం కొనుగోళ్లు చేసినా రైతులకు ప్రభుత్వం ఇంతవరకు ఖాతాల్లో సొమ్ము జమ చేయలేదన్నారు. రెండో పంట పెట్టుబడికి రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. ఎరుపు రకం (హైబ్రీడ్ క్రాస్) సాగు చేసిన వారి పరిస్థితి దారుణంగా ఉందన్నారు. 10రోజుల నుంచి కల్లాల్లో ధాన్యం పెట్టుకొని ఎదురుచూపులు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు పండించిన పంట ప్రభుత్వం కొనకుండా దళారులకు అప్పచెప్పిందని విమర్శించారు. గ్రామాల్లో రైతుల పంటను అమ్ముకోటానికి పడుతున్న ఇబ్బందులు బూతుల మంత్రి కొడాలి నానికి కనుపించటం లేదా అని ప్రశ్నించారు. కౌలు రైతులు, రైతులు ధాన్యం అమ్మకంలో ఎదుర్కొంటున్న సమస్యలపై మంత్రి కొడాలి నాని బహిరంగ చర్చకు రావాలని ఉమా సవాలు విసిరారు. బోడే ప్రసాద్ మాట్లాడుతూ ఆరుగాలం శ్రమించి పండించిన పంట రహదారిపై పోసుకొని ఎదురుచూడాల్సిన దుస్థితి ప్రభుత్వం కల్పించిందన్నారు. రైస్‌మిల్లు నిర్వాహకులు ధాన్యం ఎడ్లబళ్లు, ట్రాక్టర్‌పై తీసుకొస్తే కొటనటం లేదని, లారీలో తెస్తేనే కొంటామని తిప్పి పంపిస్తున్నారన్నారు. 20రోజులుగా ధాన్యం కల్లాల్లో ఉంచి ఆకాశం వంక చూస్తూ వర్షం పడితే పంట ఎక్కడ నాశనం అవుతుందోనని కంటి మీద కునుకు లేకుండా రైతులు కాపలా కాస్తున్నారన్నారు. సంచులు లేక ఇబ్బందులు పడుతున్నారని, తేమ 13శాతం ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనటం లేదని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దునిద్ర మాని రైతు పండించిన పంటను కొనాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యుడు గొంధి శివరామకృష్ణ, పార్టీ నాయకులు అనుమోలు ప్రభాకర్‌రావు, అనే్న రామారావు, మాదు వెంకటేశ్వరరావు, నాగేశ్వరరావు, యలమంచలి సాంబశివరావు పాల్గొన్నారు.