కృష్ణ

మైనార్టీల సంక్షేమానికి 751 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, ఆగస్టు 25: రాష్ట్రంలో మైనార్టీల సంక్షేమానికి ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.751 కోట్లు కేటాయించినట్లు రాష్ట్ర సమాచార, ఐటి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి చెప్పారు. గురువారం బిసి సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, బందరు పార్లమెంటు సభ్యులు కొనకళ్ళ నారాయణరావుతో కలిసి ముస్లిం కమ్యూనిటీ హాల్స్‌ను ఆయన ప్రారంభించారు. తొలుత రూ.6లక్షల ఎంపి నిధులతో స్థానిక 29వ వార్డు బీబీ ఆస్తానా రోడ్డులో, రూ.10లక్షల ఎంపి నిధులతో 31వ వార్డులోని రాజుపేట షాదీఖానా పక్కన నిర్మించిన ముస్లిం కమ్యూనిటీ హాళ్లను రఘునాథరెడ్డి ప్రారంభించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేసిందన్నారు. రాష్ట్రంలో 65,770 ఎకరాల వక్ఫ్ భూములు ఉన్నాయని, గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల 30వేల ఎకరాలు అన్యాక్రాంతం అయ్యాయన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వక్ఫ్ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకున్నామన్నారు. 5వేల ఎకరాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. వక్ఫ్ ఆస్తులపై వచ్చే ఆదాయం మైనార్టీల సంక్షేమానికి ఖర్చు చేస్తామన్నారు. మైనార్టీలు విద్యాపరంగా అభివృద్ధి చెందేందుకు అధిక ప్రాధాన్యతనిచ్చి రూ.260కోట్లకు పైగా స్కాలర్‌షిప్‌లను పంపిణీ చేస్తున్నామన్నారు. రూ.63కోట్ల కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ నిధులతో మైనార్టీ గురుకుల, ఉర్దూ, వృత్తివిద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా 7,500 మసీదుల మరమ్మతుల కోసం ఆర్థిక సహాయం కింద గత ఏడాది రూ.2.50 కోట్లు అందించగా ఈ ఏడాది రూ.3.50 కోట్లు అందిస్తున్నట్లు తెలిపారు. మచిలీపట్నంలో మరో షాదీఖానా నిర్మించేందుకు రూ.50 లక్షలు మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ మసీదులు, దర్గాల అభివృద్ధి కోసం బందరు నియోజకవర్గంలో ఈ ఏడాది రూ.25వేలు చొప్పున 26 మసీదులకు ఆర్థిక సహాయం అందించామన్నారు. పట్టణంలో 15వేల మందికి ఇళ్ళ స్థలాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. తొలుత ఆయా కమ్యూనిటీ హాళ్ల ముస్లిం కమిటీలు మంత్రులను ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో ఎంపి కొనకళ్ళ నారాయణరావు, మాజీ మంత్రి నడకుదుటి నరసింహారావు, మున్సిపల్ ఛైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్, మార్కెట్ యార్డు ఛైర్మన్ గోపు సత్యనారాయణ, టిడిపి జిల్లా అధ్యక్షులు బచ్చుల అర్జునుడు, పట్టణ అధ్యక్షులు ఇలియాస్ పాషా, కొనకళ్ళ జగన్నాథరావు, గొర్రెపాటి గోపీచంద్, తలారి సోమశేఖర్, సయ్యద్ ఖాజా, తదితరులు పాల్గొన్నారు.