కృష్ణ

రైతుకు క‘న్నీటి’ కష్టాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, ఆగస్టు 25: డెల్టా రైతులను నీటి కష్టాలు వెంటాడుతున్నాయి. సీజన్ ఏదైనా వారికీ అగచాట్లు తప్పడం లేదు. మూడు పంటలు పండాల్సిన పంట భూములు బీడువారుతున్నాయి. దేశానికి పట్టెడన్నం పెట్టే అన్నదాత పస్తులతో అలమటించాల్సి వస్తోంది. పాలకులు మాత్రం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నామంటూ ఊకదంపుడు ఉపన్యాసాలకు మాత్రమే పరిమితమవుతున్నారు. సాగు సమయంలో రైతులు ఎదుర్కొనే సమస్యలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. సాగు చేసేందుకు అవసరమైన నీటిని సకాలంలో విడుదల చేయడంలో పూర్తిగా విఫలమవుతున్నారు. ప్రకృతి కూడా రైతుల పాలిట శాపంగా పరిణమించింది. సకాలంలో వర్షాలు పడక పోవటంతో రైతులు తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో అదునుకు పడాల్సిన వర్షాలు అంతకముందే పడటం వల్ల రైతులకు ఒరిగిందేమీ కనిపించడం లేదు. జూన్‌లో అత్యధిక వర్షపాతం నమోదైనా జూలై, ఆగస్టు నెలల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఫలితంగా వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి పోసిన నారుమడులు ఎండిపోతున్నాయి. జూన్‌లో 98 మి.మీలు సగటు కాగా, 270.7 మి.మీల అత్యధిక వర్షపాతం నమోదైంది. దీంతో సంబరపడ్డ రైతులు ఒక్కసారిగా ఖరీఫ్ సాగుకు ఉపక్రమించారు. వేలాది ఎకరాల్లో వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి నారుమడులు పోశారు. మరికొందరు రైతులు వెద పద్ధతిన సాగు చేసేందుకు విత్తనాలు జల్లారు. తర్వాత వర్షాలు ముఖం చాటేశాయి. జూలైలో 210.6 మి.మీల సాధారణ వర్షపాతం నమోదుకావాల్సి ఉండగా కేవలం 96.7 మి.మీలు మాత్రమే కురిసింది. ఆగస్టులో 169.7 మి.మీలు కురవాల్సి ఉండగా 26.4 మి.మీల వర్షపాతం నమోదై రైతులను తీవ్రంగా కలవరపర్చింది. ఈ తరుణంలో వరుణదేవుడి కరుణ కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. వర్షాలు పడాలంటూ పలు గ్రామాల్లో వరుణ యాగాలు చేస్తున్నారు. ఇటీవల జరిగిన కృష్ణా పుష్కరాల్లో చల్లపల్లి మండలం రాముడుపాలెం గ్రామంలో అఖిల భారత నారా లోకేష్ యువసేన ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు వరుణ యాగం నిర్వహించారు. తాజాగా బుధవారం పశ్చిమ కృష్ణా నందిగామ శివారు అనాసాగరంలో గ్రామదేవతకు జలాభిషేకం చేశారు. ఇలా చాలాప్రాంతాల్లో వరుణదేవుడి కరుణ కోసం ప్రత్యేకంగా పూజలు చేస్తున్నారు. ప్రస్తుతం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందన్న వాతావరణ శాఖ ప్రకటన రైతులకు కొంత ఊరటనిచ్చింది. అల్పపీడనం ఏర్పడినా నారుమడులను బతికించేంత వర్షం కురవలేదు. చెదురుమదురు వర్షాలు పుడమితల్లిని ఏమాత్రం సస్యశ్యామలం చేయలేకపోతున్నాయి. రికార్డు స్థాయిలో వర్షాలు పడితే గానీ ఖరీఫ్ రైతులు గట్టెక్కే పరిస్థితి కనిపించడం లేదు. లేని పరిస్థితుల్లో ఆత్మహత్యలే శరణ్యమంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు.