కృష్ణ

తుఫాన్ హెచ్చరికలతో ఆందోళన చెందుతున్న రైతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూచిపూడి, అక్టోబర్ 14: ప్రకృతిపై విశ్వాసం కొరవడిన పలువురు రైతులు సకాలంలో ఖరీఫ్ వరి సాగు చేయకపోవటంతో మొవ్వ మండలంలో 1990 హెక్టార్ల వ్యవసాయ భూమిలో వరి నాట్లు వేయకపోవటంతో బీడువారాయి. మండలంలోని 11076 హెక్టార్లలో వరి సాగు చేయాల్సి ఉండగా 9 వేల 186 హెక్టార్లలో మాత్రమే ఈ ఏడాది ఖరీఫ్ వరి సాగు చేసినట్లు ఎడిఎ ఎం శ్రీనివాసరావు తెలిపారు. 372 హెక్టార్లకు గాను 330 హెక్టార్లలో చెరకు, 57 హెక్టార్లకు 35.6 హెక్టార్లలో పసుపు, 16 హెక్టార్లకు నాలుగు హెక్టార్లలో మొక్కజొన్న, 14 హెక్టార్లలో మినుము సాగవుతోందని శుక్రవారం తెలిపారు. గత ఏడాది కన్నా ఈ ఏడాది వర్షపాతం తక్కువైనా సాధారణ వర్షపాతం కన్నా అధికంగానే వర్షాలు కురిశాయి. జూన్‌లో 90మి.మీ గాను 306 మి.మీ, జూలైన 193.5 మి.మీకు 155, ఆగస్టులో 186.4 మి.మీకు గాను 122.4, సెప్టెంబరులో 138మి.మీ గాను 162.4మి.మీ వర్షం కురిసింది. అక్టోబరులో ఇప్పటివరకు 108మి.మీ వర్షం కురిసింది. అదే సమయంలో జూన్‌లో విడుదల చేయాల్సిన కృష్ణా జలాలు సకాలంలో విడుదల చేయటంలో ప్రభుత్వం విఫలమవటంతో సాగునీటి కొరతపై ఆందోళన చెందిన పలువురు రైతులు వరి సాగు పట్ల అనుమానపడ్డారు. సెప్టెంబరు నెలలో అటు వర్షాలతో పాటు కృష్ణా జలాలు విడుదల కావటంతో ఎదురుగా నీరు సిద్ధంగా ఉన్నా వినియోగించుకునే అవకాశం లేక పలువురు రైతులు ఆవేదన చెందుతున్నారు. మొవ్వ మండలంలోని కూచిపూడి, భట్లపెనుమర్రు, నిడుమోలు, వీరాయలంక తదితర ప్రాంతాలలో బోర్ల కింద సాగు చేసిన ఖరీఫ్ వరి పైరు కంకులు పాలుపోసుకునే దశలో ఉన్నాయి. అదే సమయంలో అయ్యంకి, పద్దారాయుడుతోట, కాజ, భట్లపెనుమర్రు తదితర గ్రామాల్లో సాగునీరు చివరి ప్రాంతాలకు అందకపోవటంతో 1990 హెక్టార్లు బీడువారాయి. ప్రకృతిపై నమ్మకం ఉన్న రైతుల వ్యవసాయ భూములు కళకళలాడుతుండగా, విశ్వాసం లేని రైతుల పొలాలు బీడుగా దర్శనమిస్తున్నాయి. ఏది ఏమైనా ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో భారీ తుఫాన్లు ఉన్నాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలు రైతులకు ఆందోళనకు గురి చేస్తున్నాయి.

పోలీసులు కొట్టారన్న అవమానంతో వ్యక్తి ఆత్మాహుతి
చాట్రాయి, అక్టోబర్ 14: చోరీ చేశాడన్న పోలీసులు వేధింపులతో అవమాన భారాన్ని భరించలేక ఒక వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన చాట్రాయిలో జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 10 వ తేదీ సోమవారం అర్ధరాత్రి చాట్రాయిలోని నాయుడు శ్రీనివాసరావు అలియాస్ రాజు కిరాణ షాపులో చోరీ జరిగింది. చోరీపై నాయుడు శ్రీనివాసరావు పోలీసులకు పిర్యాదు చేశారు. చోరీ జరిగిన సమయంలో ఆ పరిసరాల్లో ఉన్న చుండూరు మాణిక్యాలరావు, తేళ్ళూరి చిట్టిబాబును పోలీసులు అదుపులోకి తీసుకుని వారిని విచారించి అనంతరం వదలి వేశారు. చుండూరు మాణిక్యాలరావు గతంలో ఎటువంటి నేరాలు చేయలేదు. తనను పోలీసులు కొట్టారన్న అవమానంతో గురువారం ఉదయం కిరోసిన్ పోసుకుని నిప్పు అంటించుకున్నాడు. చివరి దశలో కొంతమంది యువకులు సెల్‌ఫోన్‌లో మరణ వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. తన చావుకు పోలీసులే కారణమంటూ మృతుడు చుండూరు మాణిక్యాలరావు చెప్తూ మృతి చెందాడు. మాణిక్యాలరావును వెంటనే నూజివీడు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్సకు విజయవాడ తరలిస్తుండగా శుక్రవారం ఉదయం మృతి చెందాడు. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు, దళిత సంఘాలు శుక్రవారం ఉదయం ఆందోళన చేశాయి. దళిత సంఘాలు చేస్తున్న ఆందోళనతో పోలీసులు గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మాణిక్యాలరావు మృతికి కారకులైన పోలీసులను తక్షణం సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న డిఎస్‌పి వి శ్రీనివాసరావు, సిఐ కిషోర్‌బాబు, కుటుంబ సభ్యులు, దళిత నేతలతో చర్చలు జరిపారు. బాధితులకు న్యాయం చేస్తామని, దోషులను శిక్షిస్తామని డిఎస్‌పి శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. దీంతో వీరు ఆందోళన విరమించారు.

సర్వేకు హాజరుకాని సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, అక్టోబర్ 14: ప్రజాసాధికారిత సర్వే కోసం విధులకు హాజరుకాని సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తప్పవని కలెక్టర్ బాబు.ఎ తెలిపారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రజాసాధికారిత సర్వే కోసం ఎంపిక చేయబడిన వివిధ శాఖల సిబ్బందికి శుక్రవారం ప్రత్యేక శిక్షణను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాసాధికారిత సర్వే ద్వారా ప్రజలకు పారదర్శకతతో కూడిన పరిపాలనను అందించడం లక్ష్యంగా సర్వేను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు. నిజమైన లబ్దిదారులను గుర్తించి వారందరికీ ప్రభుత్వపరంగా అందించే సంక్షేమ ఫలాలను అందించడానికే సర్వేను పెద్దఎత్తున చేపట్టడం జరిగిందన్నారు. ప్రపంచ బ్యాంకు బృందం ఇటీవల జిల్లాలో పర్యటించి ప్రజాసాధికారిత సర్వే తీరును పరిశీలించి ప్రపంచంలోనే ఇటువంటి పారదర్శకతతో కూడిన సర్వే ఎక్కడా నిర్వహించలేదని పేర్కొన్నారన్నారు. రాష్ట్ర నిర్మాణంలో ప్రజాసాధికరిత సర్వే ప్రాముఖ్యత దృష్ట్యా ఇప్పటివరకు 3కోట్ల 70 లక్షల 50వేల మందికి చెందిన ఒక కోటీ 17 లక్షల 74వేల మంది కుటుంబాల వివరాలను నమోదు చేయగలిగామన్నారు. జిల్లాలో ఇంకా 19 లక్షల జనాభా వివరాలను సేకరించాల్సి వుందని మున్సిపాలిటీల ప్రాంతంలోనే 11 లక్షలు చేయాల్సి వుండగా, నగరంలోనే 8 లక్షలకు పైగా వున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఇందుకోసం అన్ని శాఖల పరిధిలో సిబ్బందిని విధుల కోసం నియమించామని, కొన్ని శాఖల అధికారులు సిబ్బందిని రిలీవ్ చేయకపోవడం తమ దృష్టికి వచ్చిందన్నారు. వెంటనే అధికారులు సంబంధిత మున్సిపల్‌శాఖ నోడల్ అధికారికి రిపోర్ట్ చేయాలన్నారు. రాబోయే 10 రోజుల్లో సర్వేను పూర్తిచేసేలాగా ప్రతిరోజూ కనీసం 20 ఇళ్ల వివరాల సర్వే చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్ జి.వీరపాండియన్ మాట్లాడుతూ నగరంలో 8 నుంచి 9 లక్షల వ్యక్తుల వివరాల సర్వేను పూర్తిచేయాల్సి వుంటుందన్నారు. నగరంలో కృష్ణా పుష్కరాలు, దసరా మహోత్సవాలు నిర్వహణ కారణంగా సర్వేలో వెనుకబడి వున్నామని, జిల్లాలోనే రూపొందించిన ప్రజాసాధికారిత సర్వేను అధికారులు, సిబ్బంది మనస్సు పెట్టి పనిచేయడం ద్వారా త్వరితగతిన పూర్తి చేసుకుందామని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా నోడల్ అధికారి జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు, సబ్ కలెక్టర్ లక్ష్మీషా, విఎంసి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

నాసిరకం ఉల్లి అమ్మకాలను తక్షణమే ఆపాలి
మచిలీపట్నం (కోనేరుసెంటర్), అక్టోబర్ 14: మచిలీపట్నం రైతు బజార్లలో నాసిరకం ఉల్లిపాయల అమ్మకాలను తక్షణమే ఆపి నాణ్యమైన ఉల్లిపాయలను అందుబాటులో ఉంచాలని కోరుతూ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట శుక్రవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా రైతు కూలీ సంఘం జిల్లా నాయకుడు కొప్పినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలోని రైతు బజార్లకు కుళ్ళిపోయిన ఉల్లిపాయలు సరఫరా చేసి అధికారులు దుకాణదారులతో అమ్మిస్తున్నారన్నారు. ఉన్నతాధికారులు ఒత్తిడి చేసి రైతుబజార్లకు ఉల్లిపాయలను పంపిస్తున్నారన్నారు. పంపిన నాసిరకం ఉల్లిపాయలు సగానికి పైగా కుళ్ళిపోయాయని, దుకాణదారులపై ఒత్తిడి తీసుకువచ్చి బలవంతంగా అమ్మించడంతో వారు నష్టపోతున్నారన్నారు. వినియోగదారులు కిలో 10కి కొనుగోలు చేస్తున్నారని, సగానికి పైగా కుళ్ళిపోతున్నాయన్నారు. రైతు బజార్లలో తక్కువ ధరకు ఉల్లిపాయలు దొరుకుతాయనుకుంటే కుళ్ళిపోయిన ఉల్లిపాయలు కొనాల్సి వస్తోందని వాపోయారు. ఉల్లిపాయలు పండించిన రైతులు మాత్రం కిలో 2కు మించి ధర లభించక నష్టాలపాలవుతున్నారన్నారు. కాని రైతు బజార్లలో ట్రాన్స్ పోర్ట్ చార్జీలు కలుపుకొని రూ.9కి ఇవ్వగా రూ.10కి అమ్ముతున్నారన్నారు. బయట మార్కెట్‌లో మొదటి రకం ఉల్లిపాయలు రూ.13 నుండి రూ.15 వరకు అమ్మకాలు జరుగుతున్నాయన్నారు. కాబట్టి ఉల్లి రైతుల నుండి ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేసి రైతు బజార్ల ద్వారా ఉల్లిపాయలను అందుబాటులో ఉంచాలని కోరారు.
పేరోల్ ప్యాకేజీ విధానంలో జీతభత్యాలు చెల్లింపు
మచిలీపట్నం (కోనేరుసెంటర్), అక్టోబర్ 14: పేరోల్ ప్యాకేజి విధానంలోనే ఈ నెల నుండి ఉద్యోగుల జీతభత్యాలు చెల్లిస్తామని జిల్లా ఖజానా ఉప సంచాలకుడు ఎన్ నాగేశ్వరరావు స్పష్టం చేశారు. శుక్రవారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో డిడిఓలు, వారి ప్రతినిధులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన విధానంలో డిడిఓల విలువైన సమయంతో పాటు గణనీయంగా కాగిత వాడకం తగ్గుతుందన్నారు. ఇప్పటివరకు హెచ్‌ఆర్‌ఎంఎస్ విధానంలో జీతభత్యాలు తయారుచేసి వాటికి షెడ్యూల్స్ బ్యాంక్ అకౌంట్ వివరాలు ఇచ్చేవారన్నారు. ఇకపై వీటి అవసరం ఉండదన్నారు. నూతన పేరోల్ విధానంలో ఒక ఉద్యోగి జీతభత్యాల నుండి తగ్గించే జిపిఎఫ్, ఎపిజిఎల్‌ఐ తదితర మొత్తాలు షెడ్యూల్స్‌తో నిమిత్తం లేకుండా నేరుగా వారి ఖాతాలలో ఆన్‌లైన్ ద్వారా జమ అవుతాయన్నారు. ఈ విధానం వల్ల మిస్సింగ్ క్రెడిట్స్ సమస్య తలెత్తదన్నారు. ఏ ఉద్యోగీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పైలెట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలో మొదటి దఫాగా విజయనగరం జిల్లా తెర్లాం, గుంటూరు జిల్లా సత్తెనపల్లి, కడప జిల్లా పలమనూరు, కృష్ణా జిల్లా కైకలూరు సబ్ ట్రజరీ కార్యాలయాలలో చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతమైందన్నారు. ప్రస్తుతం కృష్ణా జిల్లా ట్రజరీ పరిధిలోని మచిలీపట్నం, పెడన, గూడూరు మండలాల్లో అక్టోబర్ జీతాలను పేరోల్ విధానం ద్వారా ఇస్తామన్నారు. ప్రతి డిడిఓ ఆన్‌లైన్ రికన్సలేషన్ జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. కైకలూరు ఉప ఖజానా కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న జ్యోతీశ్వరరావు నూతన పేరోల్ విధానంపై డిడిఓలు, వారి ప్రతినిధులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎటిఓలు, ఎస్‌టిఓలు, ఖజానా శాఖ సిబ్బంది, డిడిఓలు పాల్గొన్నారు.

సీఎం ఆరెఫ్ చెక్కుల పంపిణీ

మైలవరం, అక్టోబర్ 14: ముఖ్యమంత్రి ఆర్థిక సహాయ నిధి నుండి 18,60,660 రూపాయల నిధులు మంజూరైనట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వెల్లడించారు. శుక్రవారం ఆయన తన కార్యాలయంలో లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం అని ఆయన స్పష్టం చేశారు. ఈసందర్భంగా ఆయన నియోజకవర్గంలోని రెడ్డిగూడెం మండలానికి చెందిన 9మంది లబ్ధిదారులకు 3,74,470 రూపాయల విలువగల చెక్కులు, ఇబ్రహీంపట్నం మండలానికి చెందిన ఐదుగురు లబ్ధిదారులకు 2,16,080 రూపాయల విలువగల చెక్కులు, మైలవరం మండలానికి చెందిన ముగ్గురు లబ్దిదారులకు 1,31,120 రూపాయల విలువగల చెక్కులను, జి కొండూరు మండలానికి చెందిన నలుగురు లబ్ధిదారులకు 1,35,000 రూపాయల విలువగల చెక్కులను పంపిణీ చేశారు. అంతేగాక జిల్లాలో పలు మండలాలకు చెందిన లబ్ధిదారులకు వెరశి 18,60,660 రూపాయల నిధులను పంపిణీ చేసినట్లు తెలిపారు.

ప్రజల హృదయాల్లో పద్మశ్రీ.. వాణిశ్రీ
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, అక్టోబర్ 14: నవలా నాయకి, కళాభినేత్రి వాణిశ్రీకి ఇప్పటివరకూ పద్మశ్రీ పురస్కారం ప్రకటించకపోయినా ఆమె ఔన్నత్యమేమీ తరగలేదని, తన అద్వితీయ నటనతో తెలుగువారి గుండెల్లో ఆమెకు అంతకుమించిన గౌరవం దక్కిందని శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. మహానటి సావిత్రి కళాపీఠం ఆధ్వర్యంలో గాంధీనగర్‌లోని శ్రీరామ ఫంక్షన్ ప్యాలెస్‌లో శుక్రవారం జరిగిన ఆత్మీయ సత్కార వేడుకకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఇటీవల జరిగిన కృష్ణా పుష్కర వేడుకల్లో వినిపించిన ‘కృష్ణవేణీ.. తెలుగింటి విరిబోణీ.. పాట విన్న ప్రతి ఒక్కరికీ కళాభినేత్రి గుర్తుకు రాక మానదన్నారు. రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ మాజీ ఛైర్మన్ తుర్లపాటి కుటుంబరావు మాట్లాడుతూ మహానటి సావిత్రి వారసురాలిగా కీర్తి గడించిన వాణిశ్రీ నటించిన ఆనాటి చిత్రాలు నవలల ఆధారంగా రూపొందించినవేనని గుర్తుచేశారు. ప్రముఖ పారిశ్రామికవేత్త కోగం టి సత్యనారాయణ మాట్లాడుతూ తన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దుర్గా కళా మందిర్‌లో వాణిశ్రీ నటించిన ఎన్నో చిత్రాలు ప్రదర్శితం కావటాన్ని గుర్తుచేశారు. ప్రముఖ జ్యోతిష్య శాస్తవ్రేత్త తల్లాప్రగడ శ్రీనివాసరెడ్డి, బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చోడిశెట్టి మన్మథరావు మాట్లాడుతూ వాణిశ్రీ లాంటి నటీమణి తెలుగువారు కావడం తెలుగు ప్రేక్షకులకు గర్వకారణమన్నారు. కళాపీఠం గౌరవాధ్యక్షుడు, కళాకిరీటి డాక్టర్ ప్రబల శ్రీనివాస్, తదితరులు మాట్లాడారు. సావిత్రి పేరుతో నిర్వహిస్తున్న తమ కళాపీఠం ఆమె వారసురాలైన వాణిశ్రీని నవ్యాంధ్రప్రదేశ్ రాజధానిలో సత్కరించడం తమ కు, సంస్థకు మరింత పేరుప్రఖ్యాతులు తెస్తుందన్నారు.
పురస్కారాల ప్రదానం
ప్రతి ఏటా మహానటి సావిత్రి జాతీయ పురస్కారాలను ప్రదానం చేస్తున్న కళాపీఠం 2014, 15, 16 సంవత్సరాలకు గాను డాక్టర్ మిరియాల ప్రసన్నలక్ష్మి, దామోదర గణపతి, నడిపల్లి రవికుమార్‌లకు నిర్వాహకులు వాణిశ్రీ చేతుల మీదుగా పురస్కారాలను అందజేశారు. గోళ్ల నారాయణరావు, సభాధ్యక్షతన జరిగిన ఈ వేడుకలలో ఏర్పాటు చేసిన చిన్నారి గుర్రం లాలినిధికి కళాపీఠం నూతనంగా ప్రారంభించిన అమరావతి పురస్కారం ప్రదానం చేశారు. ఘంటసాల పవన్‌కుమార్ శిష్యబృందం చేసిన నృత్య ప్రదర్శన ప్రేక్షకులను అలరించింది. సభా కార్యక్రమం ఏర్పాటు చేసిన వేదిక చాలకపోవడంతో చాలా మంది నిలబడే కార్యక్రమాన్ని తిలకించారు. వాణిశ్రీని ఘనంగా సత్కరించినందులకు గాను వక్తలు ప్రబల శ్రీనివాస్, విజయలక్ష్మిని అభినందించారు.

స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డుల అభివృద్ధికి అందరూ సహకరించాలి
బెంజిసర్కిల్, అక్టోబర్ 14: జిల్లాలోని గ్రామాలను స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డులుగా తీర్చిదిద్దేందుకు అందరూ సహకరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు పిలుపునిచ్చారు. దీనిలో భాగంగా భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ తమ వంతు సహకారం అందించడం అభినందనీయమన్నారు. చాట్రాయిమండలం కోటపాడు గ్రా మంలో వౌలిక వసతుల అభివృద్ధికి కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ ఫండ్ గా భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ అధికారులు పది లక్షల 75 వేల రూపాయల చెక్కును శుక్రవారం నగరంలోని తన ఛాంబర్‌లో ఆయనకు అందజేశారు. ఈసందర్భంగా జెసి చంద్రుడు మాట్లాడుతూ చాట్రాయి మండలం కోటపాడు గ్రామంలో మంచినీటి పైప్‌లైన్ల అభివృద్ధికి, గ్రామంలో ఎల్‌ఇడి బల్బు లు ఏర్పాటుకు, పాఠశాలల భవనాల నిర్మాణాలకు ఈ నిధులను వినియోగించడం జరుగుతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామాలలో వౌలిక సదుపాయలను అభివృద్ధి చేసి పట్టణాలు, నగరాలకు ధీటుగా స్మార్ట్ విలే జ్, స్మార్ట్ వార్డులు తీర్చిదిద్దేందుకు చేస్తున్న ప్రయత్నంలో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ సిఎస్‌ఆర్ ఫండ్ అం దించడం హర్షణీయమన్నారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని మరింత మంది దాతలు ముందుకు వచ్చి గ్రామాలలో వౌలిక వసతులు అభివృద్ధికి సహకా రం అందించాలని కోరారు. ఈ సందర్భంగా భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ కార్పొరేషన్ పరిధిలో సియన్‌జి ఫిల్లిం గ్ కేంద్రాల ఏర్పాటుకు వారు ఎదుర్కొంటున్న సమస్యలను జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకు రాగా వాటిని త్వరలోనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈకార్యక్రమంలో సబ్ కలెక్టర్ లక్ష్మీశా, భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ కుమార్, ప్రాజెక్టు సీనియర్ మేనేజర్ జిఎ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.