కృష్ణ

నవ్యాంధ్ర అభివృద్ధిలో ఓడరేవుల పాత్ర కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటమట, నవంబర్ 29: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తరువాత నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధిలో పోర్టుల పాత్ర కీలంగా మారనున్నాయని ఎ.పి.కస్టమ్స్ కమిషనర్ ఎస్.ఖాదర్ రెహమాన్ తెలిపారు. మంగళవారం విజయవాడలో భారత పరిశ్రమ సమాఖ్య (సిఐఐ) ఆధ్వర్యంలో ‘ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఓడరేవుల పాత్ర’ అంశంపై జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ ఓడరేవుల అభివృద్ధితోనే రాష్ట్రం బ్రహ్మాండమైన లాజిస్టిక్ హబ్‌గా అభివృద్ధి చెందుతుందన్నారు. కొత్త ఓడరేవుల నిర్మాణం, తీర ప్రాంతాల్లో వౌలిక సదుపాయాల కల్పన, హార్బర్ల ఏర్పాటు, బీచ్ కారిడార్ అభివృద్ధి వంటివి సాగరమాల ప్రాజెక్ట్‌లో జరగాలన్నారు. పోర్టుల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర సహకారం అందిపుచ్చుకోవాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో వివిధ పోర్టుల నుంచి రోడ్డు, రైలు మార్గాలను ఇతర ప్రాంతాలతో అనుసంధానం చేయాలన్నారు. పోర్టుల ఆధారిత వృద్ధిని, ఆర్థికాభివృద్ధి కారకాల్లో ఒకటిగా అత్యధిక వృద్ధి సాధించగల రంగంగా ప్రభుత్వం గుర్తించడం అభినందనీయమన్నారు. రాష్ట్ర పోర్టుల డైరెక్టర్ వి.ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ ఎ.పి.ప్రభుత్వం పోర్టుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని అన్నారు. సాగరమాల పథకంలో రాష్ట్రం ప్రధాన భాగస్వామి కానున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐఐ చైర్మన్ జి.ఎస్.శివకుమార్, కృష్ణపట్నం పోర్టు కంపెనీ సిఇఓ అనిల్ యెండ్లూరి, ఎపిఎస్‌ఆర్‌టిసి వైస్ చైర్మన్ ఎం.మాలకొండయ్య, కృష్ణపట్నం పోర్టు కస్టమ్స్ డిప్యూటీ కమిషనర్ ఎం.శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

3 నుంచి 9వ తేదీ వరకు
నగరంలో సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్షలు
- ఏర్పాట్లు పర్యవేక్షించిన కలెక్టర్ బాబు ఎ
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, నవంబర్ 29: సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బాబు ఎ అధికారులను ఆదేశించారు. నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయ వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో మంగళవారం జిల్లా కలెక్టర్ బాబు ఎ ఇన్విజిలేటర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించే సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్షకు 100 మంది విద్యార్థులు నగరంలోని లయోలా కళాశాల కేంద్రంగా రాయనున్నారన్నారు. డిసెంబర్ 3వ తేదీ నుండి 9వ తేదీ వరకు నిర్వహించే ఈ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేయాలని కళాశాల యాజమాన్యాన్ని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. డిసెంబర్ 3న ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు పేపర్-1, డిసెంబర్ 5వ తేదీ పేపర్-2, మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు పేపర్ 3, డిసెంబర్ 6వ తేదీ ఉదయం పేపర్ 4, పేపర్ 5, డిసెంబర్ 7వ తేదీ పేపర్-ఎలో ఇండియన్ ల్యాంగ్వేజీ, మధ్యాహ్నం పేపర్ బిలో ఇంగ్లీషు, డిసెంబర్ 9న ఆప్షనల్ పేపర్-1 నిర్వహిస్తారన్నారు. మొబైల్ ఫోన్లను, ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా కేంద్రంలోకి అనుమతించకూడదని, ఇన్విజిలేటర్లు నిబంధనలు పాటించాలని, పరీక్షా కేంద్రాలలో వౌలిక వసతులు, వెలుతురు సక్రమంగా ఉండేలా చూలన్నారు. అవసరమైన మందులతో ప్రాథమిక చికిత్సా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. పరీక్షలు సజావుగా, సక్రమంగా, లోటుపాట్లు లేకుండా నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో అర్బన్ తహశీల్దార్ ఆర్.శివరావు, ఇన్విజిలేటర్లు పాల్గొన్నారు.

నోట్ల రద్దుతో సంక్షోభంలో రవాణా రంగం
పటమట, నవంబర్ 29: మూలిగే నక్కపై తాటికాయ పడిన చందంగా సంక్షోభంలో ఉన్న రవాణా రంగం నోట్ల రద్దుతో మరింత సంక్షోభంలోకి కూరుకుపోయిందని ఆంధ్రపదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వై.వి. ఈశ్వరరావు తెలిపారు. బెంజి సర్కిల్ వద్ద ఉన్న చంద్రబాబునాయుడు కాలనీలోని ఎ.పి.లారీ ఓనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో మంగళవారం ఉదయం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆకస్మికంగా 500, 1000 రూపాయల నోట్లు రద్దు చేయటం వలన రవాణా రంగం దుర్భరంగా మారిందన్నారు. రాష్ట్రంలో 8 లక్షలు లారీలు ఉండగా ఒక్క కృష్ణా జిల్లాలోనే 3 లక్షలు లారీలు ఉన్నాయన్నారు. ఈ రంగంపై ఆధారపడిన లక్షలాది మంది కార్మికుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. నోట్ల రద్దు సంక్షోభం నుండి కాస్తయినా బయటపడాలంటే ఐఓసి, హెచ్‌పిసి, బిపిసి ఆయిల్ కంపెనీల బంకుల్లో చెల్లుబాటు అయ్యే విధంగా కామన్ ఫ్యూయల్ కార్డు విడుదల చేయాలని కోరారు. దేశంలో అన్ని టోల్‌ప్లాజాలో ఉపయోగపడే విధంగా ఒక ప్రీ పెయిడ్ కార్డు జారీ చేయాలని అన్నారు. నిర్ణీత వ్యవధిలో జిఎస్‌టి అమలుచేసి బోర్డర్ చెక్‌పోస్టులను తొలిగించాలని డిమాండ్ చేశారు. కుదేలైన రవాణా రంగం నిలిబడాలంటే తాత్కలికంగా నగదు విత్ డ్రాయింగ్ పరిమితిని కరెంటు ఖాతా నుండి 5 లక్షలు, సేవింగ్స్ ఖాతా నుండి 3 లక్షలు పెంచాలని కోరారు. రవాణా వాహనాలకు చెల్లించాల్సిన నెలవారి అపరాధ రుసుం లేకుండా 3 నెలలు పొడిగించాలని పేర్కొన్నారు. డీజిల్ రేటు అన్ని రాష్ట్రాల్లో ఒకేలా ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. దేశంలో వాహనాల రిజిస్ట్రేషన్ సర్ట్ఫికెట్లన్నిటినీ సెంట్రలైజ్ చేయాలని అన్నారు. అర్.సి. ఆన్‌లైన్ పక్రియ, ఫ్యూయల్ కార్డులు, టోల్ ఫ్రీ పెయిడ్ కార్డులు జారీ పక్రియను డిసెంబర్ 16లోపు పూర్తి చేసి డిసెంబర్ ఆఖరు నాటికి జాతీయ రహదారులపై టోల్ ఫీజులు మినహాయింపు ఇవ్వాలని కోరారు. దేశంలో టూరిజం అభివృద్ధికి బస్సులకు, ట్యాక్సీలకు, మాక్సి క్యాబులకు లారీలకు ఇచ్చినట్లుఆలిండియా పర్మిట్లు జారీ చేయాలని అన్నారు. రవాణా వాహనాలకు జివిడబ్లుపై 10 శాతం మార్జిన్ అమలు చేసి, ఓవర్ లోడ్‌కు రుసుం వసూలు చేయాలని, టోల్‌ప్లాజాల వద్ద అదనపు లోడు తప్పనిసరిగా చేయాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.వి.రమేష్, సెక్రటరీ ఎస్.రమేష్, ఎన్.కృష్ణ, డి.శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మొబైల్ యాప్, వెబ్ అప్లికేషన్లలో విఎంసి ఇంజనీరింగ్ పనులు
విఎంసి కమిషనర్ వీరపాండియన్

విజయవాడ (కార్పొరేషన్) నవంబర్ 29: విఎంసి ఇంజనీరింగ్ విభాగం చేపట్టిన వివిధ అభివృద్ధి పనులన్నింటినీ మొబైల్ యాప్‌తోపాటు విఎంసి వెబ్ అప్లికేషన్‌కు అనుసంధానం చేయాలని విఎంసి కమిషనర్ వీరపాండియన్ పేర్కొన్నారు. మంగళవారం ఉదయం కమిషనర్ తన చాంబర్‌లో విఎంసి ఇంజనీరింగ్ విభాగ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇంజనీరింగ్ పనులను ఈ గవర్నెన్స్ ద్వారా అన్‌లైన్ చేయటానికి వర్క్ మేనేజ్‌మెంట్ మాడ్యూల్ అమలు చేయాలన్నారు. టెండర్ ప్రక్రియ దగ్గర నుంచి కాంట్రాక్టర్, బిల్లుల చెల్లింపులు తదితర విషయాలన్నీ ఆన్‌లైన్‌లో పొందుపర్చాలన్నారు. ఈ ప్రక్రియపై హైదరాబాద్ నుంచి లీడ్ విన్నర్ కార్పొరేషన్ ప్రతినిధులు విఎంసి అధికారులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. ఈ విధానం అమలు చేయడం వలన అధికారులు, కాంట్రాక్టర్ల మధ్య పారదర్శకతను చాటడమే కాకుండా నగర ప్రజలు కూడా పూర్తి సమాచారాన్ని తెలుసుకోగలుగుతారన్నారు. ఈ సమావేశంలో విఎంసి సిఇ ఇన్‌చార్జ్ ఎంఎ షుకూర్, ఇఇ గోవిందరావు, అమృత్ ఎక్స్‌పట్స్ దిలీప్ చక్రవర్తి, చిరంజీవి, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

నగదు రహిత చెల్పింపులపై అవగాహన కల్పించండి
* వీడియో కాన్ఫరెన్స్‌లో సిఎం చంద్రబాబు
* జిల్లాలో విస్తృతంగా రూపే కార్డుల పంపిణీ
* కలెక్టర్ బాబు
బెంజిసర్కిల్, నవంబర్ 29: రాష్ట్రంలో నగదు రహిత చెల్లింపులపై ప్రజలకు క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. మంగళవారం నగరంలోని కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లాల వారీగా నగదు లావాదేవీలు, పెద్ద నోట్ల రద్దు అంశాలపై సమీక్షించారు. అన్ని వాణిజ్య వాపార లావాదేవీలు పోస్ మిషన్లు ద్వారానే నిర్వహించాలని కలెక్టర్లకు సూచించారు. జిల్లా కలెక్టర్ బాబు నగరంలోని క్యాంపు కార్యాలయం నుండి మాట్లాడుతూ జిల్లాలో నిర్వహించిన నగదు రహిత చెల్లింపులపై 2165 చౌకధర దుకాణాల డీలర్లకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. 11 లక్షల 88 వేల రేషన్ కార్డులు ఉన్నాయని, వీటిలో 10 లక్షల 66 వేల రేషన్ కార్డులు ఆధార్, ఎన్‌పిసిఐతో అనుసంధానమై ఉన్నాయన్నారు. వీటిలో 9 లక్షల కార్డుదారులు నగదు రహిత లావాదేవీలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన సిఎం దృష్టికి తీసుకు వచ్చారు. వాణిజ్య శాఖ అధికారులతో సమావేశం నిర్వహించామని, జిల్లాలో 31 వేల వ్యాపార సంస్థల ద్వారా పాస్ మిషన్లు ఏర్పాటు చేసేందుకు కమర్షియల్ టాక్స్, రెవె, బ్యాంక్ కమిటీ సభ్యులు 60 టీములుగా పర్యటించి పాస్ మిషన్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ బాబు సిఎంకు తెలిపారు.