కృష్ణ

జీవనశైలిలో మార్పుల ద్వారా దీర్ఘకాలిక రోగాల నివారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడివాడ: అవగాహన లోపంతో జీవనశైలి వ్యాధులైన క్యాన్సర్, మధుమేహం, గుండె జబ్బులు, పక్షవాతం తదితర వ్యాధుల బారినపడి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని, జీవనశైలిలో మార్పుల ద్వారా దీర్ఘకాలిక రోగాలను నివారించుకోవచ్చని కేంద్ర ఆయుష్ శాఖామంత్రి శ్రీపాదనాయక్ చెప్పారు. మంగళవారం స్థానిక రైల్వేస్టేషన్ రోడ్డులోని ఇందిరాగ్రాండ్ హోటల్ కాన్ఫరెన్స్ హాల్లో హోమియోపతి, యోగా అనుసంధానంతో నిర్వహించే జీవనశైలి వ్యాధుల నివారణ, నియంత్రణ కార్యక్రమాన్ని ఆయన జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కేంద్ర మంత్రి శ్రీపాదనాయక్ మాట్లాడుతూ ముఖ్యంగా డయాబెటిక్, క్యాన్సర్, గుండె జబ్బుల పట్ల అవగాహన లోపంతో యువత ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. ఆయుర్వేద వైద్యం మాదిరి హోమియో వైద్యంలో కూడా నూతన పోకడలు వచ్చాయన్నారు. తక్కువ ఖర్చుతో హోమియో చికిత్సతో అనేక దీర్ఘకాలిక వ్యాధులకు నివారణ లభిస్తోందన్నారు. అన్ని వయస్సుల వారు హోమియో వైద్యానికి ప్రాధాన్యమివ్వాలన్నారు. హోమియోపతితో యోగాను మిళితం చేస్తే జీవనశైలి వ్యాధులు రాకుండా జాగ్రత్తపడవచ్చన్నారు. ఇందుకు అవసరమైన అవగాహనకు చికిత్సా కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు వ్యాధిగ్రస్థులను గుర్తించేందుకు ప్రయోగాత్మకంగా దేశంలో పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రెండు జిల్లాలను ఎంపిక చేశామన్నారు. కృష్ణాజిల్లాలో ఎంపిక చేసిన గుడివాడలోని ఈ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఈ కార్యక్రమం ద్వారా మంచి ఫలితాలు వస్తే దేశవ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేయడం జరుగుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైద్యపరంగా తోడ్పాటునందిస్తానన్నారు. గుడివాడలోని గురురాజు ప్రభుత్వ హోమియో కళాశాలలో పిజి విభాగాన్ని ప్రారంభించడానికి అనుమతులు ఇస్తామన్నారు. వైద్య సంస్థల అభివృద్ధికి 10శాతం అదనంగా బడ్జెట్‌ను కేటాయిస్తామన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు మరిన్ని వైద్యసంస్థలు వచ్చేలా కృషి చేస్తామని కేంద్ర మంత్రి శ్రీపాదనాయక్ చెప్పారు.
రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖా మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్టవ్య్రాప్తంగా ఏరియా ఆసుపత్రుల్లో 61 రకాల వ్యాధులకు, కమ్యూనిటీ హెల్త్‌సెంటర్లలో 41రకాల వ్యాధులకు, పిహెచ్‌సీల్లో 19 రకాల వ్యాధులకు ఉచిత వైద్యపరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకున్నామన్నారు. ప్రతి ఆసుపత్రిలో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తామన్నారు. త్వరలో ఎక్స్‌రే సేవలను కూడా ఉచితంగా అందిస్తామన్నారు. వైద్యపరమైన సంస్థలను రాష్ట్ర విభజనతో కోల్పోయామని, భవిష్యత్తులో వైద్యపరమైన సేవలకు అవసరమైన మరిన్ని సంస్థలను రాష్ట్రానికి మంజూరు చేయాలని కేంద్ర మంత్రి శ్రీపాదనాయక్ దృష్టికి తెచ్చామన్నారు. బందరు ఎంపి కొనకళ్ళ నారాయణ మాట్లాడుతూ హోమియో వైద్యం ద్వారా రోగనివారణ పొందడంతో పాటు ఆరోగ్యవంతంగా ఉండవచ్చన్నారు. సిసిఆర్‌హెచ్ డైరెక్టర్ జనరల్ ఆర్‌కె మాన్‌చంద్, ఆయుష్ మంత్రిత్వశాఖ సలహాదారు డాక్టర్ మనోజ్, జిహెచ్‌ఎం స్పెషల్ డిప్యూటి డైరెక్టర్ జనరల్ బిడి అధాని, మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు తదితరులు మాట్లాడారు. ముందుగా హోమియో వైద్య పితామహుడు డాక్టర్ హానిమన్ చిత్రపటానికి కేంద్ర మంత్రి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో హోమియో రీసెర్చ్ సెంటర్ ఇన్‌ఛార్జి డాక్టర్ చింతా రవీందర్, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని తదితరులు పాల్గొన్నారు.

పంటకాల్వలోకి ఆర్టీసీ బస్సు బోల్తా
* తప్పిన పెనుప్రమాదం
అవనిగడ్డ, ఫిబ్రవరి 16: మండల పరిధిలోని రామచంద్రపురం గ్రామం వద్ద పంటకాల్వలో మంగళవారం ఆర్టీసీ బస్సు బోల్తాపడింది. 16 మంది ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అవనిగడ్డ డిపోకు చెందిన బస్సు పాలకాయతిప్ప - అవనిగడ్డకు షటిల్‌గా తిరుగుతూ ఉంటుంది. మంగళవారం పాలకాయతిప్ప నుండి తిరిగి అవనిగడ్డకు వస్తుండగా ఉదయం 11గంటల సమయంలో పంటకాల్వలోకి దూసుకుపోయింది. ఎదురుగా వేగంగా వస్తున్న బస్సును తప్పించే ప్రయత్నంలో కాల్వలోకి ఒరిగిపోయింది. ప్రయాణికులు బస్సు అద్దాలు పగులగొట్టి బయటకు చేరుకున్నారు. స్వల్పంగా గాయపడిన వారిని అవనిగడ్డ ప్రభుత్వ వైద్యశాలకు తరలించి ప్రాథమిక చికిత్స చేశారు. ఎస్‌ఐ వెంకట్ కుమార్ విచారణ నిర్వహించారు.

ప్చ్.. కార్పొరేషన్ మూన్నాళ్ల ముచ్చటే!
* జీవో.268కు సవరణ చేసిన ప్రభుత్వం
* పాలకవర్గ పదవీకాలం ముగిశాకే కార్పొరేషన్
ఆంధ్రభూమి బ్యూరో
మచిలీపట్నం, ఫిబ్రవరి 16: మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ప్రకటన మూన్నాళ్ల ముచ్చటగా మారింది. దేశంలోనే రెండవ పురపాలక సంఘంగా ఏర్పడిన మచిలీపట్నంకు కార్పొరేషన్ హోదా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్ 9న జీవో నెం.268ను జారీ చేసింది. అస్పష్టంగా జారీ అయిన 268 జీవోకు ప్రభుత్వం సవరణ చేసింది. ప్రస్తుత పాలకవర్గ పదవీకాలం ముగిసేవరకు మున్సిపాల్టీగానే కొనసాగుతుందని తెలియజేస్తూ సోమవారం రాత్రి జీవో నెం.35లో రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. దీంతో కార్పొరేషన్ ప్రకటన మూన్నాళ్ల ముచ్చటగా మారిందన్న వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి. గతంలో ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.268లో స్పష్టత లేకపోవటంతో ప్రస్తుత పాలకవర్గంలో గందరగోళం నెలకొంది. మున్సిపాల్టీ కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ కావటంతో తాము కూడా మేయర్, కార్పొరేటర్లుగా అప్‌గ్రేడ్ అయినట్టేనని పాలకవర్గ సభ్యులు సంబరపడ్డారు. ప్లెక్సీలు, బ్యానర్లలో తమ పేర్ల కింద మేయర్, కార్పొరేటర్‌గా రాయించుకున్నారు. సభలు, సమావేశాల్లో కూడా ఆ హోదాలతోనే పిలవబడ్డారు. ఇదిలావుంటే కార్పొరేషన్ ప్రకటనను ప్రతిపక్ష వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ప్రస్తుత పాలకవర్గం ఉండగా మున్సిపాల్టీని కార్పొరేషన్ చేయడం అసాధ్యమని వాదించింది. ఏ చట్టం ఆధారంగా కార్పొరేషన్ చేశారో ఆ చట్టంలోనే ప్రస్తుత పాలకవర్గం రద్దవుతుందని ఉందనే విషయాన్ని గమనించాలని అధికార పార్టీ నేతలకు వైకాపా నాయకులు సూచించారు. ఈ విమర్శలతో పాలకవర్గం కూడా సందిగ్ధంలో పడింది. గత ఏడాది డిసెంబర్ 30న అత్యవసర సమావేశం నిర్వహించారు. అయితే సమావేశం ప్రారంభమైన రెండు నిముషాలకే కార్పొరేషన్‌కు సంబంధించి స్పష్టత లేదని, స్పష్టత వచ్చిన తర్వాత సమావేశం నిర్వహిస్తామని చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్ ప్రకటించి వాయిదా వేశారు. అప్పటి నుండి నేటివరకు (నెలా 17రోజులు) కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించలేదు. దీంతో పట్టణంలో అభివృద్ధి స్తంభించింది. సమస్యలపై చర్చించేందుకు అవకాశం లేకుండాపోయింది. చిట్టచివరకు కార్పొరేషన్‌పై ప్రభుత్వం స్పష్టత ఇవ్వటం పాలకవర్గాన్ని నిరాశపర్చినా కొంత ఊరటనిచ్చింది.

శరవేగంగా అభివృద్ధి పనులు
* మంత్రి ఉమ
16జికెఆర్‌పిహెచ్ 4:వాటర్ ప్లాంటును ప్రారంభిస్తున్న మంత్రి ఉమ
జి.కొండూరు, ఫిబ్రవరి 16: కోడూరు గ్రామంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని రాష్ట్ర జలవనరులు శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు. ఆయన మంగళవారం కోడూరులో 7.5 లక్షల రూపాయల వ్యయంతో ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం కింద ఏర్పాటు చేసిన మినిరల్ వాటర్ ప్లాంటును ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రి ఉమ మాట్లాడుతూ కోడూరులో కోటి రూపాయల వరకూ పించన్లు పంపిణీ చేస్తున్నామన్నారు. 35 లక్షల వ్యయంతో గ్రావెల్, సిమెంట్ రహదారులను నిర్మిస్తున్నట్లు తెలిపారు. చెరువులను అభివృద్ధి, సప్లయ్ ఛానల్స్ పూడిక తీశారన్నారు. గ్రామాభివృద్ధికి విశేష కృషి చేస్తున్న సర్పంచ్ గుడిపూడి సాంబశివరావు, ఎంపిటిసి మనె్న కోటిబాబు, ఇతర నాయకులను అభినందించారు. 16,000 కోట్ల లోటుబడ్జెట్‌లో ఉన్నా, పట్టిసీమను పట్టుదలతో పూర్తిచేసి గోదావరి జలాలను తీసుకువచ్చామన్నారు. వచ్చే ఏడాదికి 8 టిఎంసిల నీళ్ళు మళ్ళించనున్నట్లు తెలిపారు. గుడ్డిగూడెం పాజెక్టుతో ఎన్‌ఎస్‌పి కాల్వల ద్వారా మైలవరం, నూజివీడు, నందిగామ ప్రాంతాలకు సాగునీటి సమస్య శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. సిఎం చంద్రబాబునాయుడు దీనిపై ప్రత్యేక దృష్టి సారించారన్నారు. ఇంత అభివృద్ధి చేస్తున్నా విపక్షాలు విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎఎంసి చైర్మన్ ధనేకుల సాంబశివరావు, గుడిపూడి సాంబశివరావు, కోటిబాబు, గుడిపూడి వెంకటేశ్వరరావు, శివశంకర్, వుయ్యూరు నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. మంత్రి ఉమ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహిళలు హారుతులు ఇచ్చి ఉమాకు ఘనస్వాగతం పలికారు. మంత్రిని సన్మానించి, జ్ఞాపికలను బహుకరించారు.

మరుగుదొడ్లు వాడనివారికి రోజూ చాక్లెట్లు!
కూచిపూడి, ఫిబ్రవరి 16: మొవ్వ మండలం కాజ గ్రామంలో నిర్మించిన మరుగుదొడ్లను వినియోగించేలా ప్రజలను చైతన్యపర్చేందుకు విద్యార్థులతో ఆయా గృహాల యజమానులకు రోజూ చాక్లెట్లు పంపిణీ చేయించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి కెఎస్ జవహర్‌రెడ్డి పాలకవర్గానికి, అధికారులకు సూచించారు. గ్రామస్తుడు మర్రివాడ కాజిరెడ్డి ఆహ్వానం మేరకు మంగళవారం జిల్లా, మండల స్థాయి అధికారులతో శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామంలో నిర్మించిన 800ల వ్యక్తిగత మరుగుదొడ్లలో 400 మరుగుదొడ్లు నిరుపయోగంగా ఉన్నాయని ఆర్‌డబ్ల్యుఎస్ జెఇ సిహెచ్ సుబ్బారావు చెప్పటంతో జవహర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను అధిగమించేందుకు సూచనలు చేశారు. గ్రామంలోని 15.72 కిలోమీటర్ల అంతర్గత రహదారుల్లో ఇప్పటివరకు 3.20 కిలోమీటర్ల అంతర్గత రహదారులను కాంక్రీట్‌తో అభివృద్ధి చేసినట్లు సర్పంచ్ మందా సుధారాణి తెలిపారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌తో మందపాలెం, కళాయిగుంట, మట్లమాలపల్లిలోని ప్రతి అంతర్గత రహదారిని వచ్చే ఆర్థిక సంవత్సరంలో 14వ ఆర్థిక సంఘం నిధులతో కాంక్రీట్‌తో నిర్మించాలని అధికారును ఆదేశించారు. ఓడిఎఫ్ పథకం ద్వారా వచ్చే ఆర్థిక సంవత్సరంలో 400 వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టాలని జెఇకి సూచించారు. గ్రామంలో మురుగునీటి సమస్యను అధిగమించేందుకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించాలని పిఆర్ అధికారులను ఆదేశించారు.
రక్షిత మంచినీటి సమస్య పరిష్కారానికి నిధుల కొరతను అధిగమించేందుకు తాను కృషి చేస్తానని జవహర్‌రెడ్డి హామీ ఇచ్చారు. డిపిఓ వి కృష్ణకుమారి, ఆర్‌డబ్ల్యుఎస్ ఇఇ పి లీలాకృష్ణ, జెఇ సిహెచ్ సుబ్బారావు, పిఆర్ డిఇ రఘురాం, ఎఇ పి చంద్రశేఖరరావు, డిఎల్‌పిఓ జె సత్యనారాయణ, ఎంపిపి కిలారపు మంగమ్మ, ఎంపిడివో వై పిచ్చిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

వ్యవసాయ ఆధారిత రంగాల
అభివృద్ధికి పెద్దపీట
* మంత్రి కొల్లు రవీంద్ర
ఆంధ్రభూమి బ్యూరో
మచిలీపట్నం, ఫిబ్రవరి 16: వ్యవసాయ ఆధారిత రంగాల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర బిసి సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. స్థానిక టౌన్‌హాలులో మంగళవారం బందరు నియోజకవర్గ స్థాయి గొర్రెలు, మేకల పెంపకందార్ల అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సులో మంత్రి కొల్లు ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ వ్యవసాయ రంగం తర్వాత అంతటి ప్రాధాన్యతా రంగాలైన పాల ఉత్పత్తి, మాంసం ఉత్పత్తి, ఎగుమతులను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పని చేస్తున్నారన్నారు. మత్స్య, పాడి పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా కులవృత్తులు, చేతివృత్తుల వారికి తగిన ప్రోత్సాహకాలు ఇచ్చి వారి ఆర్థికాభివృద్ధికి శ్రమిస్తున్నట్లు చెప్పారు. గొర్రెలు, మేకల పెంపకందార్లు సంఘాలుగా ఏర్పడి ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, సబ్సిడీ రుణాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రూ.30వేల యూనిట్ విలువతో ఐదు గొర్రెలు, పొట్టేలు యూనిట్లు అందిస్తున్నట్లు వివరించారు. దళారులను నమ్మవద్దని కోరారు. సబ్సిడీ రుణాలతో పాటు బీమా పథకాన్ని కూడా వర్తింపజేస్తున్నట్లు వివరించారు. 75శాతం సబ్సిడీతో మొక్కజొన్న విత్తనాలు, పాంథర్ గడ్డిని కేజీ రూ.2లకు సరఫరా చేస్తున్నామన్నారు. జిల్లాలో 10వేల టన్నుల గడ్డి సిద్ధంగా ఉందని మంత్రి వివరించారు. ఎంపిపి కాగిత వెంకటేశ్వరరావు, జెడ్పీటిసి లంకే నారాయణప్రసాద్, తహశీల్దార్ నారదముని, పశుసంవర్ధక శాఖ ఉప సంచాలకులు డా. పి డేవిడ్ బెనర్జీ, ఎడిలు విద్యాసాగర్, ఎం వెంకటేశ్వరరావు, కె రాంబాబు, వెటర్నరీ అసిస్టెంట్లు హిమానీరెడ్డి, బాబూరావు, ఎస్‌విఎస్ రంగారావు, గొర్రెల పెంపకందార్ల సంఘం అధ్యక్షులు పల్లపాటి చినబాబు, తదితరులు పాల్గొన్నారు.

అనుమానాస్పద స్థితిలో పూజారి మృతి
జగ్గయ్యపేట రూరల్, ఫిబ్రవరి 16: మండలంలోని గరికపాడు ఆంజనేయస్వామి ఆలయ పూజారి మేడూరి రమేష్ (50) అనుమానాస్పద స్థితిలో గర్భగుడికి ఎదురుగా ఉన్న చిన్న గదిలో గంటకు వేలాడుతూ మృతి చెందాడు. చిల్లకల్లు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అనుమంచిపల్లి గ్రామంలో నివాసం ఉండే పూజారి రమేష్ మంగళవారం ఉదయం యధావిధిగా ఆలయానికి వెళ్లి పూజలు నిర్వహించి వచ్చారని, తిరిగి 12.30గంటల సమయంలో ఆలయానికి వెళ్లిన పూజారి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అక్కడకు వెళ్లి చూడగా గంటకు ఉరివేసుకొని మృతి చెంది ఉండటంతో చిల్లకల్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఎస్‌ఐ వంశీకృష్ణ సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. పూజారి రమేష్ మృతిపై కుటుంబ సభ్యులు, బంధువులు అనుమానం వ్యక్తం చేయడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీస్ జాగిలాలతో ఆధారాలకై పరిశీలన చేశారు.

ఆర్టీసీలో కార్మిక సంఘం గుర్తింపునకు రేపు ఎన్నికలు
* ప్రశాంతంగా ముగిసిన ప్రచారం
* ఇయు, ఎన్‌ఎంయల మధ్య హోరాహోరీ పోరు

ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, ఫిబ్రవరి 16: రాష్ట్ర విభజన తర్వాత ఎపిఎస్‌ఆర్‌టిసిలో తొలిసారిగా ఈ నెల 18న జరగబోతున్న కార్మిక సంఘ గుర్తింపు ఎన్నికల్లో విజయకేతనం కోసం కొద్ది రోజులుగా హోరెత్తిన ప్రచారం మంగళవారం సాయంత్రంతో ముగిసింది. జిల్లాలోని 14 డిపోలు, పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్‌లోనూ కొద్ది రోజులుగా రంగురంగుల జెండాలు, బ్యానర్లు, ఫ్లెక్సీలు, వాల్‌పోస్టర్లు, కరపత్రాలతో వాడిగావేడిగా ప్రచారం కొనసాగింది. జిల్లాలో 6,436 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. విజయవాడ డిపోలో 657 మంది విద్యాధరపురం డిపో 575 మంది, గవర్నర్‌పేటలో 575 మంది, గవర్నర్‌పేట -2 డిపోలో 618, విద్యాధరపురం డిపోలో 734 మంది, ఆటోనగర్ డిపోలో 287 మంది పండిట్ నెహ్రూ బస్టేషన్ ఆర్‌ఎం కార్యాలయంలో 79 మంది ఇలా ఒక్క విజయవాడ నగరంలోనే 3 వేల 050 మంది ఓటర్లు ఉన్నారు. జగ్గయ్యపేటలో 371 మంది, మచిలీపట్నం 382 మంది ఓటు హక్కు కలిగి ఉన్నారు. ఈ 14 డిపోలు, ఆర్‌ఎం కార్యాలయంలోనూ 18 తేదీ ఉదయం 5 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. వెంటనే ఓట్ల ఎక్కింపు జరుగుతుంది. ప్రతి ఒక్కరూ రాష్ట్ర స్థాయి గుర్తింపు కోసం క్లాస్-3 (తెల్ల బ్యాలెట్), జిల్లాలో గుర్తింపును క్లాస్-6 (గులాబీ బ్యాలెట్‌ను) వినియోగించాల్సి ఉంది. దూర ప్రాంతాలకు వెళ్లిన డ్రైవర్లు, కండక్టర్లు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవచ్చు. ఆర్టీసీ రీజనల్ మేనేజర్ పివి రామారావు ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ ఎస్.వెంకటేశ్వరరావు, కార్మిక శాఖ అధికారులు పోలింగ్ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ఆర్టీసీలో 13 సంఘాలు రిజిస్టరై ఉన్నా వైకాపా అనుబంధ వైఎస్సార్సీ మజ్దూర్ యూనియన్, సిపిఐ అనుబంధ ఇయు, తెదే అనుబంధ కార్మిక పరిషత్, బిఎంఎస్ అనుబంధ కార్మిక సంఘ, సిపిఎం అనుబంధ స్టాప్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్, ఇక ఏ పార్టీతోనూ సంబంధం లేని ఎన్‌ఎంయు, బహుజన వర్కర్స్ యూనియన్, యునైటెడ్ వర్కర్స్ యూనియన్‌లు తలబడుతున్నాయి. ఇయు, ఎన్‌ఎంయుల మధ్య హోరాహోరీ పోరు సాగుతుంది.
కాలం చెల్లిన టర్కీ కరెన్సీ.. పైగా నకిలీ!
విజయవాడ (క్రైం), ఫిబ్రవరి 16: రాజధాని నగర ప్రతిష్టను ప్రపంచ దేశాల్లో ఇనుమడింప చేస్తూ ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంటే.. మరోవైపు అదే స్థాయిలో మాఫియా నేర ప్రపంచం కూడా నగరంలో క్రమేణా విస్తరిస్తోంది. మోసాలకు, సైబర్ నేరాలకు, వైట్ కాలర్ నేరాలకు కొదవే లేని నగరంలో దొంగనోట్ల వ్యవహారం కొత్తేమీ కాదు. అయితే తాజాగా విదేశీ కరెన్సీని చలామణి చేసే ఓ ముఠా తెర మీదకు వచ్చింది. పైగా ఈ ముఠాకు జిల్లాకు చెందిన ఓ న్యాయవాది భార్య నేతృత్వం వహిస్తున్నట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలను బెజవాడ బార్ అసోసియేషన్ కొట్టిపారేస్తోంది. కాలం చెల్లిన టర్టీ కరెన్సీ నోట్లకు నకిలీ తయారుచేసి వాటిని లక్షల్లో విక్రయించేందుకు బకరాల కోసం వెతుకుతున్న ఈ ముఠాను సమాచారం మేరకు టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న ఐదుగురు వ్యక్తులతో మరో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. వీరిలో ఓ మహిళ న్యాయవాది భార్య కావడంతో అనధికారికంగా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారంటూ బార్ అసోసియేషన్ సోమవారం గవర్నర్‌పేట పోలీస్టేషన్ ఎదుట ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. దీంతో సదరు ఇద్దరు మహిళలను ప్రస్తుతానికి విడిచిపెట్టిన పోలీసులు అదుపులో ఉన్న ఐదుగురు నిందితులను మాత్రం అరెస్టు చేసి మంగళవారం కోర్టులో హాజరుపరిచారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. టాస్క్ఫోర్స్ ఎసిపి ప్రసాద్ నేతృత్వంలో ఎస్‌ఐ శ్రీనివాస్ సిబ్బంది మచిలీపట్నంకు చెందిన కారు డ్రైవర్ ఎండి మున్నా (25), కూరగాయల వ్యాపారి షేక్ జలీల్ అహ్మద్ (30), చుట్టుగుంటకు చెందిన షేక్ ఖాజావలి (35), హైదరాబాద్ వౌలాలికి చెందిన విశ్వనాధపల్లి శ్రీకాంత్ (46), ఈయన విలేఖరిగా చలామణి అవుతున్నట్లు పోలీసులు తెలిపారు. అదేవిధంగా హైదరాబాద్‌కు చెందిన కారు డ్రైవర్ బెల్లంకొండ యశ్వంత్ (23)తోపాటు తిరువూరుకు చెందిన రవీంద్ర అనే న్యాయవాది భార్య లక్ష్మీ మల్లేశ్వరీ, ఈమె సోదరి మైలవరానికి చెందిన లక్ష్మీ రాజ్యంను కొద్ది రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నారు. టర్కీ దేశానికి చెందిన ఐదు లక్షల రూపాయల నోట్లను కలర్ జిరాక్స్ తీసి వాటి నకిలీలను మార్కెట్‌లో విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ పోలీసుల అభియోగం. ఈ నోట్లను టర్కీ దేశం 2014లో నిషేధించిందని, అవి ఇప్పుడు చెల్లుబాటు కావడం లేదని, అయితే వీరు ఒక్కో నోటును 10 లక్షలకు అమ్మకానికి పెట్టగా.. కొనుగోలు చేసేవారు వీటిని 25 నుంచి 30 లక్షల వరకు అమ్ముకోవచ్చంటూ ప్రచారం చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. నిందితులు ఏడుగురిని గవర్నర్‌పేట పోలీసులకు అప్పగించగా.. దర్యాప్తు చేపట్టారు. అనధికారికంగా మహిళలను అదుపులోకి తీసుకున్నారంటూ సెర్చ్ వారెంట్లతో భర్త రవీంద్ర, బార్ ప్రతినిధి బృందం ఆందోళనకు దిగగా మహిళలను వదిలేశారు. మిగిలిన నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న 27 నోట్లను సీజ్ చేసి మంగళవారం అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.
* బార్ అసోసియేషన్ ఖండన
టర్కీ నకిలీ కరెన్సీ నోట్ల వ్యవహారంతో తమ న్యాయవాది రవీంద్ర భార్య, ఆమె సోదరికి ఎలాంటి సంబంధం లేదని బెజవాడ బార్ అసోసియేషన్ ఖండించింది. బార్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశం బార్ అధ్యక్షుడు మాట్లాడుతూ అభియోగం మేరకు తమవారు న్యాయ విచారణకు సహకరిస్తారని, అనధికారికంగా పోలీసులు రోజులపాటు అదుపులోకి తీసుకుని ప్రశ్నించడం చట్ట విరుద్ధమన్నారు. విలేఖరుల సమావేశంలో న్యాయవాది రవీంద్ర ఆయన భార్య లక్ష్మీ మల్లేశ్వరీ, సీనియర్ న్యాయవాదులు చలసాని అజయ్‌కుమార్, సుంకర రాజేంద్రప్రసాద్, మట్టా జయకర్, ప్రధాన కార్యదర్శి జయమ్మ తదితరులు పాల్గొన్నారు.

రాజకీయ అనుబంధం లేని ఏకైక కార్మిక సంఘం
ఎన్‌ఎంయు ఒక్కటే
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, ఫిబ్రవరి 16: ఆర్టీసీ చరిత్రలో 1962 నుంచి కూడా ఏ రాజకీయ పార్టీ పంచన చేరకుండా స్వయంశక్తితో కార్మికుల శ్రేయస్సు కోసం ముందుకు సాగుతున్న కార్మిక సంఘం నేషనల్ మజ్దూర్ యూనియన్ ఒక్కటి మాత్రమేనని ఆ సంఘం నాయకులు వెల్లడించారు. ఈనెల 18వ తేదీ జరుగనున్న కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో భాగంగా పాత బస్టేషన్‌లో మంగళవారం సాయంత్రం జరిగిన బ్రహ్మాండమైన బహిరంగ సభలో రాష్ట్ర నాయకులు మాట్లాడారు. ఎలాంటి రాజకీయ పార్టీల వత్తిళ్లు, ప్రలోభాలు లేకుండా కార్మికుల శ్రేయస్సు కోసం సంస్థ పరిరక్షణ కోసం మొదటి నుంచీ పోరాడుతూ వస్తున్న సంఘం ఎన్‌ఎంయు ఒక్కటేనన్నారు. ఇప్పటివరకు 14సార్లు ఎన్నికలు జరుగ్గా అత్యధికంగా 9సార్లు అదీ ఏ ఒక్క సంఘంతోనూ పొత్తు లేకుండా విజయకేతనం ఎగురవేసిన సంస్ధ తమదేనన్నారు. 54 హామీలతో తాము మొదటే తమ ఎన్నికల ప్రణాళికను విడుదల చేసామని రాష్ట్రంలో గుర్తింపు సాధిస్తే హామీల అమలు కోసం పోరాడగలమన్నారు. 2012 డిసెంబర్ 22న జరిగిన ఎన్నికల్లో తెలంగాణ మజ్దూర్ యూనియన్‌తో పొత్తుపెట్టుకుని నాలుగు ఎన్నికల తర్వాత తొలిసారిగా రాష్ట్రంలో గుర్తింపు సాధించిన ఎంప్లారుూస్ యూనియన్ అసమర్ధత వలన యాజమాన్యం డ్రైవర్‌ను కండక్టర్ల విధులు నిర్వర్తించాలనే నిబంధనను ప్రవేశపెట్టి డ్రైవర్‌పై ప్రత్యక్షంగా పనిభారం పెంచి పరోక్షంగా కండక్టర్ల వ్యవస్థను నిర్వీర్యం చేసిందంటూ తాము గుర్తింపు సాధిస్తే ఆ ఇయు ఒప్పందాన్ని రద్దుపర్చి కార్మికుల ఉద్యోగ భద్రతకు పోరాడతామన్నారు. రీజనల్ అధ్యక్షులు ఎం.ప్రసాద్ అధ్యక్షతన జరిగని ఈ సభలో చైర్మన్ ఆర్‌వివిఎస్‌వి ప్రసాద్, రాష్ట్ర ముఖ్య ఉపాధ్యక్షులు డిఎస్‌పి రావు, ఉపాధ్యక్షులు దుర్గాప్రసాద్, ప్రధాన కార్యదర్శి వై.శ్రీనివాసరావు, రీజనల్ కార్యదర్శి రావి సుబ్బారావు, జోనల్ అధ్యక్షుడు సుబ్రమణ్యేశ్వరరావు తదితరులు ప్రసంగించారు.

ఆన్‌లైన్‌లో భూముల వివరాలు...
మనమే ఫస్ట్!
* జెసి గంథం చంద్రుడికి అభినందనలు

ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, ఫిబ్రవరి 16: ఇ-క్రాప్‌లో ఖరీఫ్‌కు సంబంధించిన 17 లక్షల 29 వేల ఎకరాల పంటల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడం ద్వారా రాష్ట్రంలోనే కృష్ణా జిల్లా ప్రథమంగా నిలవటం పట్ల రాష్ట్ర భూ పరిపాలన ప్రధాన కమిషనర్ అనీల్‌చంద్ర పునీట జిల్లా జాయింట్ కలెక్టర్ గంథం చంద్రుడును అభినందించారు. రాష్ట్ర భూ పరిపాలన ప్రధాన కమిషనర్ అనీల్ చంద్ర పునీట మంగళవారం హైదరాబాద్ నుండి ఇ-క్రాప్‌లో పంటల నమోదు, మీ ఇంటికి-మీ భూమి, మీసేవ, మీ కోసం, పెండింగ్ అర్జీలు, టైటిల్ డీడ్, పట్టాదారు పాస్ పుస్తకాలు వంటి పలు అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి జెసి గంథం చంద్రుడు మాట్లాడుతూ ఇ-క్రాప్ వెబ్‌సైట్‌లో జిల్లాకు చెందిన 17 లక్షల 30 వేల ఎకరాల ఖరీఫ్ పంట వివరాలు నమోదు చేశామని వివరించారు. ఇ-క్రాప్ నమోదులో రాష్ట్రంలోనే జిల్లా మొదటి స్థానంలో ఉండటం అభినందనీయమని ప్రధాన కమిషనర్ తెలపగా మండల తహశీల్దార్లు, వ్యవసాయ అధికారులు, రెవెన్యూ అధికారుల సమన్వయంతో గ్రామాల వారీగా పంట విస్తీర్ణం, పంటల వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేసేలా ప్రణాళికాబద్ధంగా తీసుకున్న చర్యల వలన ఇది సాధ్యమైందని, ఇదే స్ఫూర్తితో ఇ-క్రాప్‌లో రబీ పంట వివరాలు నమోదు చేసి ప్రథమ స్థానం సాధించేలా చర్యలు తీసుకుంటున్నట్లు జాయింట్ కలెక్టర్ వివరించారు. రెవెన్యూకు సంబంధించి గడువు దాటిన అన్ని పెండింగ్ దరఖాస్తులను ఈ నెల 20వ తేదీ శనివారం లోపు పరిష్కరించాలని అనీల్ చంద్ర పునీట అన్ని జిల్లా జాయింట్ కలెక్టర్లు, డిఆర్‌ఓలను ఆదేశించారు. ఈ నెల 22, 23 తేదీల్లో కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించనున్నందున అధికారులు దీనిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అన్ని పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలన్నారు. మీ ఇంటికి మీ భూమి మొదటి, రెండు దశల్లో జరిగిన కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను నూరు శాతం పరిష్కరించాలని, మీ సేవా దరఖాస్తులను ఈ నెల 20వ తేదీలోపు పరిష్కరించాలని, దీనిపై అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లు, రెవెన్యూ అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశాలు నిర్వహించి చర్యలు తీసుకోవాలని పునేట ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్‌తో పాటు డిఆర్‌ఓ సిహెచ్ రంగయ్య, రెవెన్యూ డివిజనల్ అధికారి పి.సాయిబాబు, తదితరులు పాల్గొన్నారు.

పేట్రేగిన రౌడీషీటర్!
* విద్యార్థిపై బ్లేడుతో దాడి
* నగదు, సెల్‌పోన్ చోరీ
పాయకాపురం, ఫిబ్రవరి 16: ఒక రౌడీషీటర్ మద్యం కొనేందుకు డబ్బులు లేక రోడ్డుపై వెళ్తున్న విద్యార్థిని అటకాయించి, దాడి చేసి, బ్లేడుతో గాయపరిచి నగదు, సెల్‌ఫోన్ చోరీ చేశాడు. ఈ సంఘటన అజిత్‌సింగ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బుడమేరు మధ్య కట్ట విజయదుర్గానగర్‌లో నివాసముంటున్న రామిమేకల బాల నాగేంద్రకుమార్ (19) పాలిటెక్నిక్ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి కళాశాల నుండి ఇంటికి వస్తుండగా మధ్య కట్ట దగ్గర ఉన్న రౌడీషీటర్ అద్దంకి మోహన్‌కుమార్ అలియాస్ చిన్న అటకాయించాడు. జేబులో డబ్బులు ఎంత ఉన్నాయో తీయమన్నాడు. తన దగ్గర డబ్బులు లేవని నాగేంద్రకుమార్ చెబుతున్నా వినకుండా ముఖంపై పిడిగుద్దులు గుద్దాడు. బైక్‌పై నుండి పడిపోయిన నాగేంద్రకుమార్ మూతికి గాయలయ్యాయి. అతడ్ని పైకి లేపి జేబులో ఉన్న 150, సెల్‌ఫోన్ తీసుకుని తన దగ్గర ఉన్న బ్లేడుతో నాగేంద్రకుమార్ కుడి చేతిపై దాడి చేసి, పరారయ్యాడు. బాధితుడు అజిత్‌సింగ్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.